Hebrews - హెబ్రీయులకు 11 | View All

1. విశ్వాసమనునది నిరీక్షింపబడువాటియొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి యున్నవనుటకు రుజువునై యున్నది.

1. ఆశించినవి తప్పక లభిస్తాయని నమ్మటం, మనకు కనిపించనివాటిని ఉన్నాయని నమ్మటం. ఇదే విశ్వాసం.

2. దానినిబట్టియే పెద్దలు సాక్ష్యముపొందిరి.

2. మన పూర్వీకుల్లో యిలాంటి విశ్వాసముంది కనుకనే దేవుడు వాళ్ళను మెచ్చుకొన్నాడు.

3. ప్రపంచములు దేవుని వాక్యమువలన నిర్మాణమైనవనియు, అందునుబట్టి దృశ్యమైనది కనబడెడు పదార్థములచే నిర్మింప బడలేదనియు విశ్వాసముచేత గ్రహించుకొనుచున్నాము.
ఆదికాండము 1:1, ద్వితీయోపదేశకాండము 32:18, కీర్తనల గ్రంథము 33:6, కీర్తనల గ్రంథము 33:9

3. దేవుడు ఆజ్ఞాపించటం వల్ల ఈ ప్రపంచం సృష్టింపబడిందని మనము విశ్వశిస్తున్నాము. అంటే. కనిపించని వాటితో కనిపించేది సృష్టింపబడిందన్న మాట.

4. విశ్వాసమునుబట్టి హేబెలకయీనుకంటె శ్రేష్ఠమైన బలి దేవునికి అర్పించెను. దేవుడతని అర్పణలనుగూర్చి సాక్ష్యమిచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమునుబట్టి నీతి మంతుడని సాక్ష్యము పొందెను. అతడు మృతినొందియు ఆ విశ్వాసముద్వారా మాటలాడుచున్నాడు.
ఆదికాండము 4:4

4. హేబెలుకు దేవుని పట్ల విశ్వాసముంది గనుకనే అతడు కయీను అర్పించిన బలికన్నా విలువైన బలిని దేవునికి అర్పించాడు. హేబెలు అర్పించిన బలిని దేవుడు మెచ్చుకొని అతణ్ణి నీతిమంతునిగా పరిగణించాడు. అందుకే హేబెలు మరణించినా అతనిలో ఉన్న విశ్వాసం ద్వారా యింకా మాట్లాడుతునే ఉన్నాడు.

5. విశ్వాసమునుబట్టి హనోకు మరణము చూడకుండునట్లు కొని పోబడెను; అతడు కొనిపోబడకమునుపు దేవునికి ఇష్టుడై యుండెనని సాక్ష్యము పొందెను; కాగా దేవుడతని కొని పోయెను గనుక అతడు కనబడలేదు.
ఆదికాండము 5:24

5. హనోకు దేవుణ్ణి విశ్వసించాడు కాబట్టే దేవుడతణ్ణి సజీవంగా పరలోకానికి తీసుకు వెళ్ళాడు. ఆ కారణంగానే అతడు ఎవ్వరికీ కనపడలేదు. పరలోకానికి వెళ్ళకముందు అతడు దేవుణ్ణి సంతోషపరచినందుకు దేవుడు అతణ్ణి మెచ్చుకొన్నాడు.

6. విశ్వాసములేకుండ దేవునికి ఇష్టుడైయుండుట అసాధ్యము; దేవునియొద్దకు వచ్చువాడు ఆయన యున్నాడనియు, తన్ను వెదకువారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా.

6. విశ్వాసం లేకుండా దేవుణ్ణి ఆనందపరచటం అసంభవం. దేవుని దగ్గరకు రావాలను కొన్నవాడు ఆయనున్నాడని, అడిగిన వాళ్ళకు ప్రతిఫలం యిస్తాడని విశ్వసించాలి.

7. విశ్వాస మునుబట్టి నోవహు అదివరకు చూడని సంగతులనుగూర్చి దేవునిచేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై, తన యింటివారి రక్షణకొరకు ఒక ఓడను సిద్ధముచేసెను; అందువలన అతడు లోకముమీద నేరస్థాపనచేసి విశ్వాస మునుబట్టి కలుగు నీతికి వారసుడాయెను.
ఆదికాండము 6:13-22, ఆదికాండము 7:1

7. నోవహు దేవుణ్ణి విశ్వసించినందువల్ల దేవుడతనికి,’ప్రళయం రాబోతున్నది’ అని ముందే చెప్పాడు. అతనిలో భయ భక్తులుండటంవల్ల అతడు దేవుని మాట విని, తన కుటుంబాన్ని రక్షించటానికి ఒక ఓడను నిర్మించాడు. అతనిలో ఉన్న విశ్వాసము ప్రపంచం తప్పు చేసిందని నిరూపించింది. ఆ విశ్వాసం మూలంగా అతడు నీతిమంతుడయ్యాడు.

8. అబ్రాహాము పిలువ బడినప్పుడు విశ్వాసమునుబట్టి ఆ పిలుపునకు లోబడి, తాను స్వాస్థ్యముగా పొందనైయున్న ప్రదేశమునకు బయలువెళ్లెను. మరియు ఎక్కడికి వెళ్లవలెనో అది ఎరుగక బయల
ఆదికాండము 12:1

8. అబ్రాహాములో విశ్వాసముంది కనుక అతడు దేవుడు చెప్పిన దేశానికి, తానెక్కడికి వెళ్తున్నది తనకు తెలియక పోయినా విధేయతతో వెళ్ళాడు. ఆ తర్వాత దేవుడతనికి ఆ దేశాన్ని అతని పేరిట యిచ్చాడు.

9. విశ్వాసమునుబట్టి అతడును, అతనితో ఆ వాగ్దానమునకు సమానవారసులైన ఇస్సాకు యాకోబు అనువారును, గుడారములలో నివసించుచు, అన్యుల దేశ ములో ఉన్నట్టుగా వాగ్దత్తదేశములో పరవాసులైరి.
ఆదికాండము 23:4, ఆదికాండము 26:3, ఆదికాండము 35:12, ఆదికాండము 35:27

9. విశ్వాసముంది కనుకనే అతడు దేవుడు చూపిన దేశంలో ఒక పరదేశీయునిగా నివసించాడు. దేవుడు వాగ్దానం చేసిన వాటిల్లో తనతో సహా వారసులైన ఇస్సాకు మరియు యాకోబులతో కలిసి గుడారాల్లో నివసించాడు.

10. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై యున్నాడో, పునాదులుగల ఆ పట్టణముకొరకు అబ్రాహాము ఎదురుచూచుచుండెను.

10. దేవుడు తన నమూన ప్రకారం శాశ్వతమైన పునాదులు వేసి నిర్మించిన పట్టణం కోసం అబ్రాహాము ఎదురు చూస్తూ ఉండేవాడు.

11. విశ్వాసమునుబట్టి శారాయు వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడని యెంచు కొనెను గనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తిపొందెను.
ఆదికాండము 17:19, ఆదికాండము 18:11-14, ఆదికాండము 21:2

11. శారా వృద్ధురాలు, పైగా గొడ్రాలు. అబ్రాహాం వృద్ధుడయినా, దేవుడు చేసిన వాగ్దానాన్ని విశ్వసించి నందువల్ల అబ్రాహాము తండ్రి కాగలిగాడు.

12. అందుచేత మృతతుల్యుడైన ఆ యొకనినుండి, సంఖ్యకు ఆకాశనక్షత్రములవలెను, సముద్రతీరమందలి లెక్కింప శక్యముకాని యిసుకవలెను సంతానము కలిగెను.
ఆదికాండము 15:5, ఆదికాండము 32:12, నిర్గమకాండము 32:13, ద్వితీయోపదేశకాండము 1:10, ద్వితీయోపదేశకాండము 10:22

12. చనిపోవటానికి సిద్ధంగా ఉన్న అబ్రాహాముకు ఆకాశంలో ఉన్న నక్షత్రాల్లా, సముద్ర తీరానవుండే యిసుక రేణువల్లా లెక్కలేనంత మంది వారసులు కలిగారు.

13. వీరందరు ఆ వాగ్దానముల ఫలము అనుభవింపక పోయినను, దూరమునుండి చూచి వందనముచేసి, తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై యున్నామని ఒప్పకొని, విశ్వాసముగలవారై మృతినొందిరి.
ఆదికాండము 47:9, 1 దినవృత్తాంతములు 29:15, కీర్తనల గ్రంథము 39:12, ఆదికాండము 23:4, ఆదికాండము 26:3, ఆదికాండము 35:12, ఆదికాండము 35:27

13. వీళ్ళందరు దేవుణ్ణి విశ్వసిస్తూ జీవించి, మరణించారు. దేవుడు వాగ్దానం చేసినవి వాళ్ళకు లభించలేదు. వాళ్ళు అవి రావటం దూరం నుండి చూసి ఆహ్వానించారు. ఈ భూమ్మీద తాము పరదేశీయుల్లా జీవిస్తున్నట్లు వాళ్ళు అంగీకరించారు.

14. ఈలాగు చెప్పువారు తమ స్వదేశమును వెదకుచున్నామని విశద పరచుచున్నారు కారా?

14. వాళ్ళు మాట్లాడిన తీరు చూస్తే వాళ్ళు తమ స్వదేశానికోసం వెతుకు తూండేవాళ్ళని అనిపిస్తుంది.

15. వారు ఏదేశమునుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకమందుంచుకొన్నయెడల మరల వెళ్లుటకు వారికి వీలు కలిగియుండును.

15. ఒక వేళ వాళ్ళు తాము వదలివచ్చిన దేశాన్ని గురించి ఆలోచిస్తున్నట్లయితే తమ దేశానికి తిరిగి వెళ్ళే అవకాశం వాళ్ళకు ఉండింది.

16. అయితే వారు మరి శ్రేష్ఠమైన దేశమును, అనగా పరలోకసంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడనని అనిపించుకొనుటకు దేవుడు వారినిగూర్చి సిగ్గుపడడు; ఏలయనగా ఆయన వారికొరకు ఒక పట్టణము సిద్ధపరచియున్నాడు.
నిర్గమకాండము 3:6, నిర్గమకాండము 3:15, నిర్గమకాండము 4:5

16. కాని వాళ్ళుయింకా గొప్ప దేశానికి, అంటే పరలోకానికి వెళ్ళాలని ఆశించారు. అందువల్ల దేవుడు యితర్లు తనను ‘వాళ్ళ దేవుడు’ అని పిలిచినందుకు సిగ్గుపడలేదు. పైగా తన వాళ్ళ కోసం ఒక పట్టణం నిర్మించాడు.

17. అబ్రాహాము శోధింపబడి విశ్వాసమునుబట్టి ఇస్సా కును బలిగా అర్పించెను.
ఆదికాండము 22:1-10

17. [This verse may not be a part of this translation]

18. ఎవడు ఆ వాగ్దానములు సంతోషముతో అంగీకరించెనో,ఇస్సాకువలననైనది నీ సంతానమనబడును అని యెవనితో చెప్పబడెనో, ఆ అబ్రాహాము, మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని యెంచినవాడై,
ఆదికాండము 21:12

18. [This verse may not be a part of this translation]

19. తన యేకకుమారుని అర్పించి, ఉపమానరూపముగా అతనిని మృతులలోనుండి మరల పొందెను.

19. దేవుడు చనిపోయిన వాళ్ళను బ్రతికించగలడని అబ్రాహాముకు తెలుసు. ఒక విధంగా చూస్తే దేవుడు ఇస్సాకును బ్రతికించి అబ్రాహాముకు ఇచ్చాడనే చెప్పుకోవచ్చు.

20. విశ్వాసమునుబట్టి ఇస్సాకు జరుగబోవు సంగతుల విషయమై యాకోబును ఏశావును ఆశీర్వదించెను.
ఆదికాండము 27:27-40, ఆదికాండము 27:30-40

20. ఇస్సాకు దేవుణ్ణి విశ్వసించాడు కాబట్టి, యాకోబును, ఏశావును వాళ్ళ భవిష్యత్తు ప్రకారం దీవించాడు.

21. విశ్వాసమునుబట్టి యాకోబు అవసానకాలమందు యోసేపు కుమారులలో ఒక్కొక్కని ఆశీర్వదించి తన చేతికఱ్ఱ మొదలుమీద ఆనుకొని దేవునికి నమస్కారము చేసెను.
ఆదికాండము 47:31, ఆదికాండము 48:15-16

21. దేవుణ్ణి విశ్వసించాడు కాబట్టి యాకోబు, తాను మరణించే ముందు యోసేపు కుమారుల్ని దీవించ గలిగాడు. అంతేకాక తన చేతి కఱ్ఱపై వ్రాలి దేవుణ్ణి ప్రార్థించాడు.

22. యోసేపు తనకు అవసానకాలము సమీపించినప్పడు విశ్వాసమునుబట్టి ఇశ్రాయేలు కుమారుల నిర్గమనమునుగూర్చి ప్రశంసించి తన శల్యములను గూర్చి వారికి ఆజ్ఞాపించెను.
ఆదికాండము 50:24-25, నిర్గమకాండము 13:19

22. యోసేపు దేవుణ్ణి విశ్వసించాడు కాబట్టి తాను చినిపోయేముందు ఇశ్రాయేలు ప్రజలు ఈజిప్టు దేశం నుండి వెళ్ళిపోతారని ముందుగానే చెప్పగలిగాడు. అంతే కాక, అప్పుడు తన ఎముకల్ని ఏమి చెయ్యాలో వాళ్ళకు చెప్పాడు.

23. మోషే పుట్టినప్పుడు అతని తలిదండ్రులు ఆ శిశువు సుందరుడై యుండుట చూచి, విశ్వాసమునుబట్టి రాజాజ్ఞకు భయపడక, మూడు మాసములు అతని దాచిపెట్టిరి.
నిర్గమకాండము 1:22, నిర్గమకాండము 2:2

23. మోషే తల్లి తండ్రులకు దేవుని పట్ల విశ్వాసముంది గనుక, మోషే జన్మించాక అతడు సాధారణమైన శిశువు కాడని గ్రహించగలిగారు. తద్వారా వాళ్ళు రాజశాసనానికి భయపడకుండా అతణ్ణి మూడు నెలల దాకా దాచివుంచారు.

24. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమునుబట్టి ఐగుప్తు ధనముకంటె క్రీస్తువిషయమైన నింద గొప్ప భాగ్యమని యెంచుకొని,
ఆదికాండము 4:10, నిర్గమకాండము 2:11

24. మోషే దేవుణ్ణి విశ్వసించాడు కాబట్టే, అతడు పెద్దవాడైన తర్వాత ఫరోకుమార్తె యొక్క కుమారునిగా గుర్తింపబడటానికి నిరాకరించాడు.

25. అల్పకాలము పాప భోగము అనుభవించుటకంటె దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి,

25. పాపం ద్వారా లభించే సుఖాల్ని కొద్దికాలం అనుభవించటానికన్నా దేవుని ప్రజలతో సమానంగా కష్టాలను అనుభవించటానికి అతడు సిద్ధమయ్యాడు.

26. ఫరో కుమార్తెయొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు;ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమందు దృష్టి యుంచెను.
కీర్తనల గ్రంథము 69:9, కీర్తనల గ్రంథము 89:50-51

26. అతడు ప్రతి ఫలం కోసం ఎదురు చూస్తూ ఉండేవాడు కనుక, ఈజిప్టులోని ఐశ్వర్యానికన్నా క్రీస్తు కొరకు అవమానం భరించటం ఉత్తమమని భావించాడు.

27. విశ్వాసమునుబట్టి అతడు అదృశ్యుడైనవానిని చూచుచున్నట్టు స్థిరబుద్ధిగలవాడై, రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయెను.
నిర్గమకాండము 2:15, నిర్గమకాండము 10:28-29, నిర్గమకాండము 12:51

27. మోషే దేవుణ్ణి విశ్వసించాడు కనుక, అతడు రాజు యొక్క ఆగ్రహానికి భయపడకుండా ఈజిప్టు దేశాన్ని వదలి వెళ్ళి పోయాడు. అదృశ్యంగా ఉన్నవాణ్ణి చూసినట్లు అతడు భావించటంవల్ల అతని పట్టుదల పెరిగింది.

28. తొలిచూలు పిల్లలను నాశనము చేయువాడు ఇశ్రాయేలీయులను ముట్టకుండు నిమిత్తము అతడు విశ్వాసమునుబట్టి పస్కాను, రక్తప్రోక్షణ ఆచారమును ఆచరించెను.
నిర్గమకాండము 12:21-29

28. అతడు దేవుణ్ణి విశ్వసించటం మూలంగానే పస్కా పండుగను, రక్తాన్ని ద్వారాలపై ప్రోక్షించాలనే ఆచారాన్ని నియమించాడు. మృత్యు దూత ఇశ్రాయేలు ప్రజల మొదటి సంతానాన్ని తాకరాదని ఈ ఆచారం నియమించాడు.

29. విశ్వాసమునుబట్టి వారు పొడి నేలమీద నడిచినట్లు ఎఱ్ఱసముద్రములో బడి నడచిపోయిరి. ఐగుప్తీయులు ఆలాగు చేయజూచి మునిగిపోయిరి.
నిర్గమకాండము 14:21-31

29. దేవుణ్ణి విశ్వసించినందుకే ప్రజలు ఎఱ్ఱ సముద్రంలో ఏర్పడిన ఆరిన నేల మీద నడిచారు. కాని ఈజిప్టు దేశస్థులు అలా చెయ్యాలని ప్రయత్నించి సముద్రంలో మునిగి పొయ్యారు.

30. విశ్వాసమునుబట్టి యేడు దినములవరకు ప్రదక్షిణము చేయబడిన తరువాత యెరికో గోడలు కూలెను.
యెహోషువ 6:12-21

30. ప్రజలు యెరికో కోట చుట్టు ఏడు రోజులు విశ్వాసంతో తిరగటం వల్ల ఆ కోట గోడలు పడిపొయ్యాయి.

31. విశ్వాసమునుబట్టి రాహాబను వేశ్య వేగులవారిని సమాధాన ముగా చేర్చుకొనినందున అవిధేయులతోపాటు నశింపక పోయెను.
యెహోషువ 2:11-12, యెహోషువ 6:21-25

31. దేవుణ్ణి విశ్వసించటం వల్లనే, వేశ్య అయినటువంటి రాహాబు యెహూషువా పంపిన గూఢచారులకు తన యింట్లో ఆతిథ్యమిచ్చింది. ఆ కారణంగానే, అవి శ్వాసులతో సహా ఆమె మరణించలేదు.

32. ఇకను ఏమి చెప్పుదును? గిద్యోను, బారాకు, సమ్సోను, యెఫ్తా, దావీదు, సమూయేలను వారిని గూర్చియు, ప్రవక్తలనుగూర్చియు వివరించుటకు సమయము చాలదు.
న్యాయాధిపతులు 4:10-17, న్యాయాధిపతులు 11:32-33, న్యాయాధిపతులు 16:28-30, 1 సమూయేలు 7:9-12, 1 సమూయేలు 19:8

32. ఇంకేం చెప్పమంటారు? గిద్యోనును గురించి, బారాకు గురించి, సమ్సోను గురించి, యెఫ్తా గురించి, దావీదు గురించి, సమూయేలును గురించి మరియు ప్రవక్తల గురించి చెప్పటానికి నాకు వ్యవధి లేదు.

33. వారు విశ్వాసముద్వారా రాజ్యములను జయించిరి; నీతికార్యములను జరిగించిరి; వాగ్దానములను పొందిరి; సింహముల నోళ్లను మూసిరి;
న్యాయాధిపతులు 14:6-7, 1 సమూయేలు 17:34-36, దానియేలు 6:22

33. వీళ్ళు దేవుణ్ణి విశ్వసించటంవల్ల రాజ్యాలు జయించారు. న్యాయాన్ని స్థాపించారు. దేవుడు వాగ్దానం చేసిన దాన్ని పొందారు. సింహాల నోళ్ళు మూయించారు.

34. అగ్నిబలమును చల్లార్చిరి; ఖడ్గధారను తప్పించుకొనిరి; బలహీనులుగా ఉండి బలపరచబడిరి; యుద్ధములో పరాక్రమశాలులైరి; అన్యుల సేనలను పారదోలిరి.
దానియేలు 3:23-25

34. భయంకరమైన మంటల్ని ఆర్పివేశారు. కత్తి పోట్లనుండి తమను తాము రక్షించుకొన్నారు. వాళ్ళ బలహీనత బలంగా మారిపోయింది. వాళ్ళు యుద్ధాలలో గొప్ప శక్తి కనబరుస్తూ పరదేశసైన్యాలను ఓడించారు.

35. స్త్రీలు మృతులైన తమ వారిని పునరుత్థానమువలన మరల పొందిరి. కొందరైతే మరి శ్రేష్ఠమైన పునరుత్థానము పొందగోరి విడుదల పొందనొల్లక యాతనపెట్టబడిరి.
1 రాజులు 17:17-24, 2 రాజులు 4:25-37

35. దేవుణ్ణి విశ్వసించటం వల్లనే కొందరు స్త్రీలు చనిపోయిన తమ వాళ్ళను తిరిగి సజీవంగా పొందారు. కొందరు చావునుండి బ్రతికి వచ్చాక ఉత్తమ జీవితం గడపాలనే ఉద్దేశ్యముతో చిత్రహింసలనుండి విడుదల కోరలేదు.

36. మరికొందరు తిరస్కారములను కొరడాదెబ్బలను, మరి బంధకములను ఖైదును అనుభ వించిరి.
ఆదికాండము 39:20, 1 రాజులు 22:26-27, 2 దినవృత్తాంతములు 18:25-26, యిర్మియా 20:2, యిర్మియా 37:15, యిర్మియా 38:6

36. భక్తిహీనులు వీళ్ళలో కొందర్ని పరిహాసం చేస్తూ కొరడా దెబ్బలు కొట్టారు. మరి కొందర్ని సంకెళ్ళతో బంధించి చెరసాలలో వేశారు.

37. రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గముతో చంపబడిరి,గొఱ్ఱచర్మ ములను మేకచర్మములను వేసికొని, దరిద్రులైయుండి శ్రమపడి హింసపొందుచు,
2 దినవృత్తాంతములు 24:21

37. కొందర్ని రాళ్ళతో కొట్టారు; రంపంతో కోసారు; కత్తితో పొడిచి చంపారు. ఆ భక్తులు మేకల చర్మాలను, గొఱ్ఱెల చర్మాలను ధరించి అనాధలై తిరిగారు. అంతేకాక హింసను, దుష్ప్రవర్తనను సహించారు.

38. అడవులలోను కొండలమీదను గుహలలోను సొరంగములలోను తిరుగులాడుచు సంచరించిరి. అట్టివారికి ఈ లోకము యోగ్యమైనది కాదు.
1 రాజులు 18:4, 1 రాజులు 18:13

38. ఎడారుల్లో పర్వత ప్రాంతాల్లో, గుహల్లో, సొరంగాల్లో, నివసించారు. ఈ ప్రపంచం వాళ్ళకు తగిందిరాదు.

39. వీరందరు తమ విశ్వాసముద్వారా సాక్ష్యము పొందిన వారైనను. మనము లేకుండ సంపూర్ణులుకాకుండు నిమిత్తము,

39. వాళ్ళ విశ్వాసాన్ని దేవుడు మెచ్చుకొన్నాడు. కాని దేవుడు వాగ్దానం చేసింది వాళ్ళకు యింకా లభించలేదు.

40. దేవుడు మనకొరకు మరి శ్రేష్ఠమైనదానిని ముందుగా సిద్ధ పరచెను గనుక వీరు వాగ్దానఫలము అనుభవింప లేదు.

40. దేవుడు మనకివ్వటానికి ఉత్తమమైన దాన్ని దాచి ఉంచాడు. మనతో కలిసి మాత్రమే వాళ్ళకు పరిపూర్ణత కలగాలని యిలా చేసాడు.Shortcut Links
హెబ్రీయులకు - Hebrews : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |