Esther - ఎస్తేరు 8 | View All

1. ఆ దినమున రాజైన అహష్వేరోషు యూదులకు శత్రువుడైన హామాను ఇంటిని రాణియైన ఎస్తేరున కిచ్చెను ఎస్తేరు మొర్దెకై తనకు ఏమి కావలెనో రాజునకు తెలియ జేసినమీదట అతడు రాజు సన్నిధికి రాగా

1. అదే రోజున అహష్వేరోషు మహారాజు యూదులకు శత్రువైన హామానుకు చెందిన చర స్థిరాస్తులున్నింటినీ ఎస్తేరు మహారాణికి దత్తం చేశాడు. మొర్దెకై తనకు బంధువన్న విషయాన్ని ఎస్తేరు మహారాజుకి చెప్పింది. అప్పుడు మొర్దెకై మహారాజు దర్శనానికి వచ్చాడు.

2. రాజు హామాను చేతిలోనుండి తీసికొనిన తన ఉంగరమును మొర్దెకైకి ఇచ్చెను. ఎస్తేరు మొర్దెకైని హామాను ఇంటిమీద అధికారిగా ఉంచెను.

2. మహారాజు తన రాజముద్రికను హామానునుంచి వెనక్కి తెప్పించి, తన వేలికి పెట్టుకున్నాడు. మహారాజు ఆ ఉంగరాన్ని మొర్దెకైకి ఇచ్చాడు. అప్పుడింక ఎస్తేర హామానుకి చెందిన ఆస్తులన్నింటి అజమాయిషీనీ మొర్దెకైకి అప్పగించింది.

3. మరియఎస్తేరు రాజు ఎదుట మనవి చేసికొని, అతని పాదములమీద పడి, అగాగీయుడైన హామాను చేసిన కీడును అతడు యూదులకు విరోధ ముగా తలంచిన యోచనను వ్యర్థపరచుడని కన్నీళ్లతో అతని వేడుకొనగా

3. తర్వాత ఎస్తేరు మహారాజుతో మళ్లీ మాట్లాడింది. ఆమె రోదిస్తూ మహారాజు పాదాలపైపడి, అగాగీయుడైన హామాను దుష్ట పథకాన్ని రద్దు చేయవలసిందిగా మహారాజును వేడుకుంది. యూదులను హింసించేందుకు హామాను పన్నిన దుష్ట పథకం అది.

4. రాజు బంగారు దండమును ఎస్తేరు తట్టు చాపెను. ఎస్తేరు లేచి రాజు ఎదుట నిలిచి

4. మహారాజు తన బంగారు రాజదండంతో ఎస్తేరును తాకాడు. ఎస్తేరు లేచి, మహారాజు ముందు నిలబడింది.

5. రాజవైన తమకు సమ్మతియైన యెడలను,తమ దృష్టికి నేను దయపొందిన దాననై రాజవైన తమ యెదుట ఈ సంగతి యుక్తముగా తోచిన యెడలను, తమ దృష్టికి నేను ఇంపైన దాననైనయెడలను, రాజవైన తమ సకల సంస్థానములలో నుండు యూదులను నాశనముచేయవలెనని హమ్మెదాతా కుమారుడైన అగాగీయుడగు హామాను వ్రాయించిన తాకీదులచొప్పున జరుగకుండునట్లు వాటిని రద్దుచేయుటకు ఆజ్ఞ ఇయ్యుడి.

5. అప్పుడు ఎస్తేరు మహారాజుతో ఇలా విన్నవించుకుంది: “మహారాజా, మీకు నేనంటే ఇష్టంవుంటే, తమ దయవుంటే, నా కోసం ఇలా చెయ్యండి. ఇది మంచి ఊహ అను కుంటేనే ఈ పని చేయండి. నేను తమకి ప్రీతిపాత్రురాలినైతే, హామాను పంపిన ఆజ్ఞను రద్దుచేస్తూ ఒక శాసనం చేయండి. అగాగీయుడైన హామాను మహారాజా వారి సామంత దేశాలన్నింటిలోని యూదులందరినీ సమూలంగా నాశనం చేయమని తాఖీదులు జారీచేశాడు.

6. నా జనులమీదికి రాబోవు కీడును, నా వంశముయొక్క నాశనమును చూచి నేను ఏలాగు సహింప గలనని మనవిచేయగా

6. నా ప్రజలు ఇలాంటి ఘోరమైన విపత్తులకు గురికావడం నేను సహించలేను. నా కుటుంబ సభ్యులు హతమార్చ బడటం నేను భరించలేను. అందుకే, మహారాజావారిని ఈ ఘోరాన్ని ఆపు చెయ్యవలసిందిగా అర్థిస్తున్నాను. “

7. రాజైన అహష్వేరోషు రాణియైన ఎస్తేరునకును యూదుడైన మొర్దెకైకిని ఈలాగు సెల విచ్చెనుహామాను ఇంటిని ఎస్తేరున కిచ్చియున్నాను; అతడు యూదులను హతముచేయుటకు ప్రయత్నించి నందున అతడు ఉరికొయ్యమీద ఉరితీయబడెను.

7. అహష్వేరోషు మహారాజు ఎస్తేరు మహారాణికీ, యూదుడైన మొర్దెకైకీ ఇలా సమాధానమిచ్చాడు, “హామాను యూదులకు శత్రువు కనుకనే వాని అస్తిని ఎస్తేరుకి ఇచ్చాను. నా స్తెనికులు వాడిని ఉరికంబాని కెక్కించి, ఉరిదీశారు.

8. అయితే రాజుపేరట వ్రాయబడి రాజు ఉంగరముతో ముద్రింపబడిన తాకీదును ఏ మానవుడును మార్చజాలడు; కాగా మీకిష్టమైనట్లు మీరు రాజునైన నా పేరట యూదుల పక్షమున తాకీదు వ్రాయించి రాజు ఉంగరముతో దాని ముద్రించుడి.

8. ఇప్పుడిక మహారాజు ఆజ్ఞ మేరకు మరో ఆజ్ఞాపత్రం వ్రాయండి. మీకు సర్వోత్తమమని తోచిన పద్ధతిలో, యూదులకు తోడ్పడే విధంగా శాసనాన్ని వ్రాయండి. తర్వాత దానిమీద రాజముద్రికతో ముద్రవేసి మూసెయ్యండి. మహారాజు ఆజ్ఞ మేరకు వ్రాయబడి, దానిమీద రాజముద్రిక గుర్తువేయ బడిన ఏ ఆధికారిక ఆజ్ఞాపత్రాన్ని రద్దుచేయ సాధ్యం కాదు.”

9. సీవాను అను మూడవ నెలలో ఇరువది మూడవ దిన మందు రాజుయొక్క వ్రాతగాండ్రు పిలువబడిరి; మొర్దెకై ఆజ్ఞాపించిన ప్రకారమంతయు యూదులకును, హిందూ దేశము మొదలుకొని కూషుదేశమువరకు వ్యాపించియున్న నూట ఇరువది యేడు సంస్థానములలోనున్న అధిపతులకును అధికారులకును, ఆయా సంస్థానములకును దాని దాని వ్రాతనుబట్టియు దాని దాని భాషనుబట్టియు తాకీదులు వ్రాయబడెను.

9. మహారాజు వెంటనే లేఖకులను పిలువనంపించాడు. మూడవ నెల, అనగా సీవాను నెల 23వ రోజున యీ ఘటన జరిగింది. లేఖకులు మొర్దెకై ఆజ్ఞలన్నింటినీ వ్రాశారు. అవి యూదులకీ, సామంత రాజులకీ, రాజ్యాధిపతులకీ, 127 దేశాల అధికారులకీ పంప బడ్డాయి. ఆ దేశాలు భారత దేశంనుంచి ఇథియోపియాదాకా విస్తరించి వున్నాయి. ఆ ఆజ్ఞాపత్రాలు ఆయా దేశాల భాషల్లో వ్రాయబడ్డాయి. ఆవి ఆయా ప్రజాబృందాల భాషల్లోకి అనువదించబడ్డాయి. కాగా ఆ ఆజ్ఞాపత్రాలు యూదులకు వాళ్ల సోంత భాషలో, సోంతలిపిలో వ్రాయబడ్డాయి.

10. రాజైన అహష్వేరోషు పేరట తాకీదులు మొర్దెకై వ్రాయించి రాజు ఉంగరముతో ముద్రించి గుఱ్ఱములమీద, అనగా రాజనగరుపనికి పెంచ బడిన బీజాశ్వములమీద అంచెగాండ్ర నెక్కించి ఆ తాకీ దులను వారిచేత పంపెను.

10. మొర్దెకై ఆ ఆజ్ఞలను అహష్వేరోషు మహారాజు ఆమోదంతో వ్రాశాడు. తర్వాత అతను వాటిమీద రాజముద్రికతో ముద్ర వేయించాడు. అప్పుడిక, మొర్దెకై అశ్వారూఢులైన వార్తాహరుల ద్వారా వాటిని పంపించాడు. మహారాజు అశ్వశాలలోని గుర్రాలు అవి.

11. రాజైన అహష్వేరోషు యొక్క సంస్థానములన్నిటిలో ఒక్క దినమందే, అనగా అదారు అను పండ్రెండవ నెల పదమూడవ దినమందే ప్రతి పట్టణమునందుండు యూదులు కూడుకొని, తమ ప్రాణములు కాపాడుకొనుటకు ఆ యా ప్రదేశములలో నుండి తమకు విరోధులగు జనుల సైనికులనందరిని, శిశు వులను స్త్రీలను కూడ, సంహరించి హతముచేసి నిర్మూల పరచి

11. ఆ లేఖల్లోని మహారాజు ఉత్తరువు ఇలా సాగింది: పతి ఒక్క నగరంలోని యూదులూ తమ, ప్రాణ రక్షణ కోసం ఒకచోట గుమిగూడేహక్కు కలిగున్నారు. తమ స్త్రీలపైనా, తమ బిడ్డలపైనా ఏ జాతీయులకు చెందిన ఏ సైన్యాన్నయినా సరే నాశనం చేసే, హత మార్చే, పూర్తిగా రూపు మాపే హక్కు వాళ్లకివుంది. యూదులకు తమ శత్రువుల ఆస్తిని వశంచేసుకొనే హక్కూ, నాశనం చేసే హక్కూపున్నాయి.

12. వారి వస్తువులను కొల్లపెట్టుటకు రాజు యూదులకు సెలవిచ్చెనని దానియందు వ్రాయబడెను.

12. యూదులకు ఈ హక్కు ఒక్క రోజే వుంటుంది. ఆ రోజు అదారు అనబడే 12వ నెల 13వ రోజు. అహష్వేరోషు సామ్రాజ్యంలోని దేశాలన్నింట్లోనూ యూదులకు హక్కు దాఖలు చేయబడింది.

13. మరియు ఈ తాకీదుకు ప్రతులు వ్రాయించి ఆ యా సంస్థానముల లోని జనులకందరికి పంపించవలెననియు,యూదులు తమ శత్రువులమీద పగతీర్చుకొనుటకు ఒకానొక దినమందు సిద్ధముగా ఉండవలెననియు ఆజ్ఞ ఇయ్యబడెను.

13. మహారాజు ఆజ్ఞాపత్రపు ప్రతి ఒకటి బయటికి పంపబడింది. అదొక శాసనం అయింది. అది అన్ని సామంత దేశాల్లోనూ శాసనం అయింది. సామ్రాజ్యంలో నివసించే ప్రతి ఒక జాతి ప్రజలకీ ఈ శసనం చాటబడింది. యూదులు ప్రత్యేకమైన ఈ రోజున సర్వసన్నద్ధంగా ఉండేందుకు వీలుగా వాళ్లీపని చేశారు. యూదులు తమ శత్రువులకు బదులు దెబ్బ కొట్టేందుకు ఆ రోజున అనుమతింపబడతారు.

14. రాజ నగరు పనికి పెంచబడిన బీజాశ్వములమీద నెక్కిన అంచె గాండ్రు రాజు మాటవలన ప్రేరేపింప బడి అతివేగముగా బయలుదేరిరి. ఆ తాకీదు షూషను కోటలో ఇయ్యబడెను.

14. వార్తాహరులు మహారాజావారి గుర్రాలమీద వేగంగా సాగిపోయారు. మహారాజు ఆ గుర్రాల రౌతులను వేగంగా వెళ్లమని ఆదేశించాడు. ఆ ఆజ్ఞ రాజధాని అయిన షూషను నగరానికి కూడా వర్తింప జేయబడింది.

15. అప్పుడు మొర్దెకై ఊదావర్ణమును తెలుపువర్ణ మునుగల రాజవస్త్రమును బంగారపు పెద్దకిరీటమును అవిసె నారతో చేయబడిన ధూమ్రవర్ణముగల వస్త్రములను ధరించుకొనినవాడై రాజుసముఖమునుండి బయలుదేరెను; అందునిమిత్తము షూషను పట్టణము ఆనందించి సంతోష మొందెను.

15. మొర్దకై మహారాజు సమక్షం నుంచి బయల్దేరాడు. అతను మహారాజు సమర్పించిన నీలం, తెలుపు, ప్రత్యేక దుస్తులు, ఒకపెద్ద బంగారు కిరీటం ధరించాడు. అతని పైవస్త్రం ఊదా రంగులోపుంది. అది చాలా మంచి ఉన్నితో నేసినది. ఆ రోజున షూషను నగరంలో ప్రత్యేకమైన ఒక ఉత్సవం జరుగుతోంది.

16. మరియు యూదులకు క్షేమమును ఆనందమును సంతుష్టియు ఘనతయు కలిగెను.

16. అది యూదులకు ప్రత్యేకించి ఆనంద దాయకమైన రోజుగా, అందరికీ సంతోషానంద భరితమైన రోజుగా పరిణమించింది.

17. రాజుచేసిన తీర్మానమును అతని చట్టమును వచ్చిన ప్రతి సంస్థానమందును ప్రతి పట్టణమందును యూదులకు ఆనందమును సంతోష మును కలిగెను, అది శుభదినమని విందుచేసికొనిరి. మరియు దేశజనులలో యూదులయెడల భయముకలిగెను కనుక అనేకులు యూదుల మతము అవలంబించిరి.

17. మహారాజు ఆజ్ఞ చేరిన ప్రతి దేశంలోనూ, ప్రతి నగరంలోనూ, యూదుల్లో ఆనందో త్సాహాలు వెల్లివిరిశాయి. యూదులు విందులు, వేడుకలు చేసుకున్నారు. ఇతర జాతులకు చెందిన చాలామంది సామాన్య ప్రజలకు యూదులంటే భయంకలిగి, వాళ్లు యూదా మతం పుచ్చుకున్నారు.Shortcut Links
ఎస్తేరు - Esther : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |