పౌలు విగ్రహాలను పూజించే కాలాలను “జ్ఞానం లేని” కాలాలన్నాడని గమనించండి. రోమీయులకు 1:21-23; యెషయా 44:9, యెషయా 44:18, యెషయా 44:20 చూడండి. ఏథెన్సులో కొన్ని దేవాలయాలు వాస్తుశాస్త్ర సంబంధంగా చాలా ఘనమైనవి, వైభవం గలవి. కొన్ని విగ్రహాల రూపాలు శిల్పశాస్త్ర సంబంధంగా అందమైనవి, గొప్పగా ఎంచబడినవి. కానీ పౌలుకూ ప్రభువుకూ అదంతా ఏథెన్సువారి అజ్ఞానాన్ని సూచించే రుజువు. వారి తత్వశాస్త్రమంతా ఎవరినీ నిజ దేవుణ్ణి గురించిన జ్ఞానంలోకి నడిపించలేక పోయింది గనుక అది జ్ఞానంగా కనిపించిన అజ్ఞానమే (1 కోరింథీయులకు 1:19-25 చూడండి). పౌలు ప్రసంగం వింటున్నవారికి ఇలాంటి మాటలు సంతోషాన్ని కలిగించి ఉండేవి కావు గాని మొదటినుంచి పౌలు పెట్టుకొన్న గమ్యం ఇప్పుడు చేరాడు – ఏథెన్సువారు పశ్చాత్తాపపడాలని అతని ఉద్దేశం. పశ్చాత్తాపం గురించి మత్తయి 3:2, మత్తయి 3:8; లూకా 13:1-5 నోట్స్ చూడండి. అందరూ పశ్చాత్తాపపడాలి – తత్వజ్ఞానులంతా, వేదాంతం ఎరిగిన వారంతా, మతస్థులంతా, విగ్రహపూజ చేసేవారంతా, విద్యా వంతులంతా, శాస్త్రజ్ఞులంతా, అధికారులంతా, సామాన్యులంతా, అంతటా ఉన్నవారంతా పశ్చాత్తాపపడాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. ఎందుకంటే మనుషులంతా పాపులు (రోమీయులకు 3:23), అందరికీ పాపవిముక్తి అవసరం, ఆయన అందరికీ పాపవిముక్తి ప్రసాదించాలని కోరుతున్నాడు (యోహాను 3:16; 1 తిమోతికి 2:4-5; 2 పేతురు 3:9). పశ్చాత్తాపం లేకపోతే పాపవిముక్తి పొందడం అసాధ్యం.