Contact us for any Support 8898 318 318

Revelation - ప్రకటన గ్రంథము 11

1. మరియు ఒకడు చేతికఱ్ఱవంటి కొలకఱ్ఱ నాకిచ్చినీవు లేచి దేవుని ఆలయమును బలిపీఠమును కొలతవేసి, ఆలయములో పూజించువారిని లెక్కపెట్టుము.
యెహేజ్కేలు 40:3, యెహేజ్కేలు 40:47, జెకర్యా 2:1-2

1. ఒక దేవదూత ఒక కొలత బద్ద లాంటిది నాకిచ్చి ఈ విధంగా అన్నాడు: వెళ్ళు, దేవుని మందిరాన్ని, బలిపీఠాన్ని కొలత వేయి. ఎంతమంది ప్రజలు ఆరాధిస్తున్నారో కూడ లెక్కపెట్టు.

2. ఆలయ మునకు వెలుపటి ఆవరణమును కొలతవేయక విడిచి పెట్టుము; అది అన్యులకియ్యబడెను, వారు నలువది రెండు నెలలు పరిశుద్ధపట్టణమును కాలితో త్రొక్కుదురు.
కీర్తనలు 79:1, యెషయా 63:18, దానియేలు 8:13, జెకర్యా 12:3

2. కాని వెలుపలి ఆవర్ణం, యూదులుకాని వాళ్ళకివ్వబడింది. కనుక దాన్ని కొలత వేయకుండా వదిలేయి. వాళ్ళు నలభైరెండు నెలలు దాకా ఈ పవిత్ర నగరాన్ని త్రొక్కుతూ నడుస్తారు.

3. నేను నా యిద్దరు సాక్షులకు అధికారము ఇచ్చెదను; వారు గోనెపట్ట ధరించుకొని వెయ్యిన్ని రెండువందల అరువది దినములు ప్రవచింతురు.

3. నేను నా యిరువురి సాక్షులకు శక్తినిస్తాను. వాళ్ళు గోనె పట్ట కట్టుకొని పన్నెండువందల అరువది దినాల దాకా దైవ సందేశం చెబుతారు.

4. వీరు భూలోకమునకు ప్రభువైన వాని యెదుట నిలుచుచున్న రెండు ఒలీవచెట్లును దీపస్తంభములునై యున్నారు.
జెకర్యా 4:2-3, జెకర్యా 4:11, జెకర్యా 4:14

4. రెండు ఒలీవ వృక్షాలు, రెండు దీపస్తంభాలు ఆ సాక్షులు. ఇవి ఈ భూమిని పాలించే దేవుని సమక్షంలో ఉన్నాయి.

5. ఎవడైనను వారికి హాని చేయ నుద్దేశించినయెడల వారి నోటనుండి అగ్ని బయలు వెడలి వారి శత్రువులను దహించివేయును గనుక ఎవడైనను వారికి హానిచేయ నుద్దేశించినయెడల ఆలాగున వాడు చంపబడవలెను.
2 సమూయేలు 22:9, 2 రాజులు 1:10, కీర్తనలు 97:3, యిర్మియా 5:14

5. వారికి హాని కలిగించాలని ఎవరైనా ప్రయత్నం చేస్తే వాళ్ళ నోళ్ళనుండి మంటలు వచ్చి, తమ శత్రువుల్ని మ్రింగివేస్తాయి. వారికి హాని తలపెట్టిన వాళ్ళు ఈ విధంగా మరణిస్తారు.

6. తాము ప్రవచింపు దినములు వర్షము కురువ కుండ ఆకాశమును మూయుటకు వారికి అధికారము కలదు. మరియు వారికిష్టమైనప్పుడెల్ల నీళ్లు రక్తముగా చేయుటకును, నానావిధములైన తెగుళ్లతో భూమిని బాధించుటకును వారికి అధికారము కలదు.
నిర్గామకాండము 7:17, నిర్గామకాండము 7:19, 1 సమూయేలు 4:8, 1 రాజులు 17:1

6. తాము దేవుని సందేశం బోధించే కాలంలో వర్షం కురియకుండా చేయటానికి వాళ్ళు ఆకాశాన్ని మూసి వేస్తారు. వాళ్ళకా శక్తి ఉంది. అంతేకాక, నీళ్ళను రక్తంగా మార్చగల శక్తి కూడా వాళ్ళకు ఉంది. రకరకాల తెగుళ్ళను తమకు యిష్టం వచ్చినప్పుడు ప్రపంచంలో వ్యాపింప చేయగల శక్తి కూడా వాళ్ళకు ఉంది.

7. వారు సాక్ష్యము చెప్పుట ముగింపగానే అగాధములోనుండి వచ్చు క్రూరమృగము వారితో యుద్ధముచేసి జయించి వారిని చంపును.
దానియేలు 7:3, దానియేలు 7:7, దానియేలు 7:21

7. వాళ్ళు తమ సందేశం చెప్పటం ముగించాక, మృగం పాతాళంనుండి మీదికి వచ్చి, వాళ్ళతో యుద్ధం చేసి వాళ్ళను ఓడించి చంపి వేస్తుంది.

8. వారి శవములు ఆ మహాపట్టణపు సంత వీధిలో పడియుండును; వానికి ఉపమానరూపముగా సొదొమ అనియు ఐగుప్తు అనియు పేరు; అచ్చట వారి ప్రభువుకూడ సిలువవేయబడెను.
యెషయా 1:10

8. వాళ్ళ దేహాలు మహానగరపు వీధుల్లో పడి ఉంటాయి. ఈ మహానగరం సొదొమతో, ఈజిప్టుతో పోల్చబడింది. ఇక్కడ ప్రభువు సిలువకు వేయబడ్డాడు.

9. మరియు ప్రజలకును, వంశములకును, ఆ యా భాషలు మాటలాడువారికిని, జనము లకును సంబంధించినవారు మూడు దినములన్నర వారి శవము లను చూచుచు వారి శవములను సమాధిలో పెట్టనియ్యరు.

9. మూడున్నర రోజులు ప్రతీ దేశానికి, ప్రతీ జాతికి, ప్రతీ భాషకు, ప్రతీ గుంపుకు చెందిన ప్రజలు, ఆ శవాలను చూస్తారు. వాళ్ళు వాటిని సమాధి చేయటానికి నిరాకరిస్తారు.

10. ఈ యిద్దరు ప్రవక్తలు భూనివాసులను బాధించినందున భూనివాసులు వారి గతి చూచి సంతోషించుచు, ఉత్స హించుచు, ఒకనికొకడు కట్నములు పంపుకొందురు.
యెహేజ్కేలు 37:5-10

10. ఈ యిరువురు ప్రవక్తలు భూమ్మీద నివసిస్తున్న వాళ్ళకు కష్టాలు కలిగించారు. కనుక ప్రజలు ఆ ప్రవక్తలు మరణించటం చూసి ఆనందించారు. పరస్పరం కానుకలు పంపుకున్నారు. వేడుకలు చేసుకొన్నారు.

11. అయితే ఆ మూడుదినములన్నరయైన పిమ్మట దేవునియొద్ద నుండి జీవాత్మ వచ్చి వారిలో ప్రవేశించెను గనుక వారు పాదములు ఊని నిలిచిరి; వారిని చూచిన వారికి మిగుల భయము కలిగెను.
యెహేజ్కేలు 37:5-10

11. కాని మూడున్నర రోజుల తర్వాత దేవుడు ప్రవక్తల్లో మళ్ళీ ప్రాణం పోశాడు. వాళ్ళు లేచి నిలుచున్నారు. వీళ్ళను చూసిన ప్రజలు చాలా భయపడిపోయారు.

12. అప్పుడుఇక్కడికి ఎక్కిరండని పరలోకమునుండి గొప్ప స్వరము తమతో చెప్పుట వారు విని, మేఘారూఢులై పరలోకమునకు ఆరోహణమైరి; వారు పోవుచుండగా వారి శత్రువులు వారిని చూచిరి
2 రాజులు 2:11

12. అప్పుడు పరలోకంనుండి ఒక స్వరం బిగ్గరగా, ‘మీదికి రండి’ అని అనటం వాళ్ళు విన్నారు. శత్రువులు చూస్తుండగా, వాళ్ళు ఒక మేఘం మీద పరలోకానికి వెళ్ళిపోయారు.

13. ఆ గడియలోనే గొప్ప భూకంపము కలిగినందున ఆ పట్టణములో పదియవ భాగము కూలిపోయెను. ఆ భూకంపమువలన ఏడువేలమంది చచ్చిరి. మిగిలినవారు భయాక్రాంతులై పరలోకపు దేవుని మహిమపరచిరి.
యెహోషువ 7:19, యెహేజ్కేలు 38:19-20, దానియేలు 2:19

13. అదే క్షణంలో ఒక పెద్ద భూకంపం వచ్చింది. పట్టణంలో పదవ భాగం నాశనమైపోయింది. భూకంపంవల్ల సుమారు ఏడువేల మంది మరణించారు. బ్రతికున్న వాళ్ళు చాలా భయపడిపోయి పరలోకంలో ఉన్న దేవుణ్ణి స్తుతించారు.

14. రెండవ శ్రమ గతించెను; ఇదిగో మూడవ శ్రమ త్వరగా వచ్చుచున్నది.

14. రెండవ శ్రమ ముగిసింది. మూడవ శ్రమ త్వరలో జరుగనుంది.

15. ఏడవ దూత బూర ఊదినప్పుడు పరలోకములో గొప్ప శబ్దములు పుట్టెను. ఆ శబ్దములుఈ లోక రాజ్యము మన ప్రభువు రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యము నాయెను; ఆయన యుగయుగముల వరకు ఏలు ననెను.
నిర్గామకాండము 15:18, కీర్తనలు 10:16, కీర్తనలు 22:28, దానియేలు 2:44, దానియేలు 7:14, ఓబద్యా 1:21, జెకర్యా 14:9

15. ఏడవ దేవదూత తన బూర ఊదాడు. పరలోకం నుండి అనేక స్వరాలు యిలా బిగ్గరగా అనటం వినిపించింది: “ప్రపంచం మన ప్రభువు రాజ్యంగా మారింది. ఆయన క్రీస్తు రాజ్యంగా మారింది. ఆయన చిరకాలం రాజ్యం చేస్తాడు.”

16. అంతట దేవునియెదుట సింహాసనాసీనులగు ఆ యిరువది నలుగురు పెద్దలు సాష్టాంగపడి దేవునికి నమ స్కారముచేసి

16. దేవుని సమక్షంలో సింహాసనాలపై కూర్చొన్న యిరువది నాలుగుమంది పెద్దలు సాష్టాంగపడ్డారు.

17. వర్తమానభూతకాలములలో ఉండు దేవుడవైన ప్రభువా, సర్వాధికారీ, నీవు నీ మహాబలమును స్వీకరించి యేలుచున్నావు గనుక మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము.
నిర్గామకాండము 3:14, యెషయా 12:4, ఆమోసు 4:13

17. వాళ్ళు దేవుణ్ణి పూజిస్తూ ఈ విధంగా అన్నారు: “ప్రభూ! సర్వ శక్తివంతుడవైన దైవమా! నీవు ప్రస్తుతం ఉన్నావు. గతంలో ఉన్నావు. నీ గొప్పశక్తిని ఉపయోగించి మళ్ళీ పాలించటం మొదలుపెట్టావు. కనుక నీకు మా కృతజ్ఞతలు!

18. జనములు కోప గించినందున నీకు కోపము వచ్చెను. మృతులు తీర్పు పొందుటకును, నీ దాసులగు ప్రవక్తలకును పరిశుద్ధులకును, నీ నామమునకు భయపడువారికిని తగిన ఫలమునిచ్చుటకును, గొప్పవారేమి కొద్దివారేమి భూమిని నశింపజేయు వారిని నశింపజేయుటకును సమయము వచ్చియున్నదని చెప్పిరి.
కీర్తనలు 2:1, కీర్తనలు 46:6, కీర్తనలు 99:1, కీర్తనలు 115:13, దానియేలు 9:6, దానియేలు 9:10, ఆమోసు 3:7, జెకర్యా 1:6

18. దేశాలు ఆగ్రహం చెందాయి. ఇప్పుడు నీకు ఆగ్రహం వచ్చింది. చనిపోయిన వాళ్ళపై తీర్పు చెప్పే సమయం వచ్చింది. నీ సేవకులైన ప్రవక్తలకు ప్రతిఫలం యిచ్చే సమయం వచ్చింది. నీ పవిత్రులకు, నీ నామాన్ని గౌరవించే వాళ్ళకు, సామాన్యులకు పెద్దలకు, అందరికి ప్రతిఫలం యిచ్చే కాలం వచ్చింది. భూమిని నాశనం చేసే వాళ్ళను నాశనం చేసే కాలం వచ్చింది.”

19. మరియు పరలోకమందు దేవుని ఆలయము తెరవ బడగా దేవుని నిబంధనమందసము ఆయన ఆలయములో కనబడెను. అప్పుడు మెరుపులును ధ్వనులును ఉరుములును భూకంపమును గొప్ప వడగండ్లును పుట్టెను.
నిర్గామకాండము 9:24, నిర్గామకాండము 19:16, 1 రాజులు 8:1, 1 రాజులు 8:6, 2 దినవృత్తాంతములు 5:7, యెహేజ్కేలు 1:13

19. అప్పుడు పరలోకంలో ఉన్న దేవుని మందిరం తెరువబడింది. ఆ మందిరంలో ఉన్న ఆయన పరిశుద్ధమైన ఒడంబడిక మందసం కనిపించింది. అప్పుడు మెరుపులు, గర్జనలు, ఉరుములు, భూకంపము, పెద్ద వడగండ్ల వాన వచ్చాయి.