Revelation - ప్రకటన గ్రంథము 11 - గ్రంథ విశ్లేషణ

1. మరియు ఒకడు చేతికఱ్ఱవంటి కొలకఱ్ఱ నాకిచ్చినీవు లేచి దేవుని ఆలయమును బలిపీఠమును కొలతవేసి, ఆలయములో పూజించువారిని లెక్కపెట్టుము.
యెహేజ్కేలు 40:3, యెహేజ్కేలు 40:47, జెకర్యా 2:1-2

“ఆలయం”– పరలోకంలో ఉండేది కాదు (ప్రకటన గ్రంథం 7:15) గాని ఈ లోకంలో ఉండేది. అది ఉన్న స్థలం జెరుసలం (వ 8). అది దేవునికి అంకితమైన యూద ఆలయం గనుక అది దేవుని ఆలయం. దాని బయటి ఆవరణం మాత్రమే యూదులు కాని జనాల వశంలో ఉండడం అనేది లోపలి భాగంలో ఆరాధించేవారు యూదులని సూచిస్తుంది. ప్రస్తుతం జెరుసలంలో యూద దేవాలయం లేదు, యోహాను ఈ గ్రంథాన్ని రాసినప్పుడు దేవాలయం లేదు. క్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు ఉన్న దేవాలయం క్రీ.శ. 70లో నాశనానికి గురైంది (మత్తయి 24:2; లూకా 19:41-44). కాబట్టి యోహానుకు ఇవ్వబడిన ఈ సందేశం ఈ యుగాంతం కాక ముందు జెరుసలంలో కొత్త దేవాలయాన్ని కట్టడం జరుగుతుందని సూచిస్తున్నట్టు ఉంది. మత్తయి 24:15; 2 థెస్సలొనికయులకు 2:4 కూడా చూడండి. “కొలతలు తీసుకొని”– ఇలా చేయడం దేన్ని సూచిస్తుందంటే ఒక స్థలాన్ని నాశనం కోసం గానీ సంరక్షణ కోసం గానీ ప్రత్యేకించడం. 2 రాజులు 21:13; యెషయా 34:11; విలాపవాక్యములు 2:8; జెకర్యా 2:1-5 పోల్చి చూడండి.

2. ఆలయ మునకు వెలుపటి ఆవరణమును కొలతవేయక విడిచి పెట్టుము; అది అన్యులకియ్యబడెను, వారు నలువది రెండు నెలలు పరిశుద్ధపట్టణమును కాలితో త్రొక్కుదురు.
కీర్తనలు 79:1, యెషయా 63:18, దానియేలు 8:13, జెకర్యా 12:3

“నలభై రెండు నెలలు”– ప్రకటన గ్రంథం 13:5. ఇదే సమయాన్ని 1260 రోజులు (వ 3; ప్రకటన గ్రంథం 12:6), “కాలం, కాలాలు, సగం కాలం” (ప్రకటన గ్రంథం 12:14 – ఇది మూడున్నర సంవత్సరాలు అనిపిస్తుంది), “ఒక్క ఘడియ” (ప్రకటన గ్రంథం 17:12) అని చెప్పడం జరిగింది. ఈ సమయం స్వల్పమైనది, మితమైనది అని తేటగా కనిపిస్తున్నది. ఈ 42 నెలలు అక్షరాలా 42 నెలలు కాదని అనుకోవడానికి బైబిలంతట్లో ఏ కారణమూ ఈ రచయితకు కనబడడం లేదు. దానియేలు 7:25; దానియేలు 9:27; దానియేలు 12:7 కూడా చూడండి. “యూదులు కాని జనాలకు...నగరాన్ని కాళ్ళక్రింద త్రొక్కుతారు”– ఈ నోట్స్ రాసిన సమయంలో జెరుసలం యూదుల వశంలో ఉంది. కొన్ని ఏళ్లనుంచి అలా ఉంది. అయితే దీన్ని బట్టి చూస్తే ఈ యుగాంత కాలంలో ఇతర జనాలు జెరుసలంను వశపరచుకొంటారని అనుకోవాలి. జెకర్యా 14:2 పోల్చి చూడండి.

3. నేను నా యిద్దరు సాక్షులకు అధికారము ఇచ్చెదను; వారు గోనెపట్ట ధరించుకొని వెయ్యిన్ని రెండువందల అరువది దినములు ప్రవచింతురు.

“ఇద్దరు సాక్షులు”– వీరు ఈ యుగాంత కాలంలో మహా బాధ కాలంలో క్రీస్తును గురించి సాక్ష్యం చెప్పబోయే యూదుల గుంపుకు సూచనగా ఉన్నారని కొందరు వ్యాఖ్యాతలు అన్నారు. “రెండు దీప స్తంభాలు” అనే మాటనుబట్టి ఈ ఇద్దరూ సాక్ష్యం చెప్పే సంఘాలకు సూచనగా ఉన్నారని కొందరి అభిప్రాయం (ప్రకటన గ్రంథం 1:20 పోల్చి చూడండి). మరి కొందరైతే వారు ఇద్దరు వ్యక్తులై ఉంటారని చెప్పారు. వ 5-12లో వారిని గురించి రాసిన మాటలను బట్టి చూస్తే బహుశా ఈ ఆఖరు అభిప్రాయం సరైనదని అనిపిస్తుంది. వారు మోషే, ఏలీయాలు అని కొందరు వ్యాఖ్యాన కర్తలు నేర్పారు (పర్వతంపై క్రీస్తుకు దివ్యమైన మార్పు కలిగినప్పుడు ఈ ఇద్దరు కలిసి వచ్చి కనిపించారు – మత్తయి 17:3). మోషే లోకానికి తిరిగి వచ్చి చనిపోతాడని బైబిలులో ఎక్కడా లేదు. ఏలీయాను గురించి (అతడు చనిపోలేదు – 2 రాజులు 2:11) మలాకీ 4:5; మత్తయి 17:11 చూడండి. ఏలీయా తప్ప మానవ చరిత్రలో చనిపోకుండా పరలోకానికి వెళ్ళినవాడు ఒక్కడే – హనోకు (హెబ్రీయులకు 11:5).

4. వీరు భూలోకమునకు ప్రభువైన వాని యెదుట నిలుచుచున్న రెండు ఒలీవచెట్లును దీపస్తంభములునై యున్నారు.
జెకర్యా 4:2-3, జెకర్యా 4:11, జెకర్యా 4:14

“రెండు ఆలీవ్ చెట్లూ”– జెకర్యా 4:3-14. “రెండు దీప స్తంభాలు”– ఆ ఏడు దీపస్తంభాలు ఆ ఏడు సంఘాలు. ఈ రెండు దీప స్తంభాలు ఇద్దరు వ్యక్తులను గానీ, సాక్ష్యం చెప్పే రెండు గుంపులను గానీ సూచించవచ్చు.

5. ఎవడైనను వారికి హాని చేయ నుద్దేశించినయెడల వారి నోటనుండి అగ్ని బయలు వెడలి వారి శత్రువులను దహించివేయును గనుక ఎవడైనను వారికి హానిచేయ నుద్దేశించినయెడల ఆలాగున వాడు చంపబడవలెను.
2 సమూయేలు 22:9, 2 రాజులు 1:10, కీర్తనలు 97:3, యిర్మియా 5:14

“నోటినుంచి మంటలు వచ్చి”– ఈ మంటలు ఒక చిహ్నంగా ఉందని స్పష్టమే. అయితే అవి దేనికి చిహ్నం? 2 రాజులు 1:9-12 పోల్చి చూడండి. వారు మాట్లాడితే చాలు, వారి సంరక్షణ కోసం దేవుడు చర్య తీసుకొంటాడు. చెప్పేది వారు, మంటలు పంపేది దేవుడు. “శత్రువులను మ్రింగివేశాయి”– ఈ ఇద్దరు సాక్షులు ఈ యుగంలోని క్రీస్తు సంఘాలలో వేటికీ సూచనగా లేరని దీన్నిబట్టి కనిపిస్తున్నది. ఈ యుగం సంఘాల పని తమ శత్రువులను నాశనం చేయడం కాదు.

6. తాము ప్రవచింపు దినములు వర్షము కురువ కుండ ఆకాశమును మూయుటకు వారికి అధికారము కలదు. మరియు వారికిష్టమైనప్పుడెల్ల నీళ్లు రక్తముగా చేయుటకును, నానావిధములైన తెగుళ్లతో భూమిని బాధించుటకును వారికి అధికారము కలదు.
నిర్గామకాండము 7:17, నిర్గామకాండము 7:19, 1 సమూయేలు 4:8, 1 రాజులు 17:1

“ఆకాశాన్ని మూసివేసే అధికారం”– 1 రాజులు 17:1; యాకోబు 5:17 పోల్చి చూడండి. “రక్తంగా...ఈతి బాధల”– నిర్గామకాండము 7:20; నిర్గామకాండము 8:5-6, నిర్గామకాండము 8:16; మొ।।. చరిత్రలో ఇలాంటివి అక్షరాలా జరిగాయి. రాబోయే కాలంలో ఇవి అక్షరాలా మళ్ళీ జరగవని అనుకోవడానికి బైబిలులో ఏ కారణమైనా ఉందా?

7. వారు సాక్ష్యము చెప్పుట ముగింపగానే అగాధములోనుండి వచ్చు క్రూరమృగము వారితో యుద్ధముచేసి జయించి వారిని చంపును.
దానియేలు 7:3, దానియేలు 7:7, దానియేలు 7:21

“సాక్ష్యం పూర్తిగా”– దేవుడు వారి పనికోసం ప్రత్యేకమైన సమయాన్ని నియమిస్తాడు. ఆ పని పూర్తి అయ్యేవరకు వారిని కాపాడుతాడు. ఒకప్పుడు ఈ దేశంలో దేవుని సేవకుడొకడు ఇలా అన్నాడు: “నేను చేయాలని దేవుడు నియమించిన పని ఇంకా ఉంటే నేను ఇప్పుడు చనిపోలేను.” “క్రూరమృగం”– ప్రకటన గ్రంథం 13:1-8; ప్రకటన గ్రంథం 17:3, ప్రకటన గ్రంథం 17:7-11 చూడండి. 2 థెస్సలొనికయులకు 2:3-4; 1 యోహాను 2:18 పోల్చి చూడండి. “అగాధం”– ప్రకటన గ్రంథం 9:1 నోట్. “అగాధంలో నుంచి పైకి వచ్చే” అనేది క్రూర మృగం చనిపోయినవారి లోకంనుంచి వస్తాడని సూచిస్తున్నది. ప్రకటన గ్రంథం 13:3; ప్రకటన గ్రంథం 17:8 కూడా చూడండి. “చంపుతుంది”– ప్రకటన గ్రంథం 13:7 పోల్చి చూడండి. క్రీస్తు విరోధికి చాలా శక్తి, బలప్రభావాలు ఉంటాయి. దేవుని ప్రజలలో చాలామందిని చంపేందుకు అతనికి అనుమతి ఇవ్వబడుతుంది. అయితే అప్పుడు కూడా ప్రపంచాన్ని దేవుడు తన వశంలో ఉంచుకొంటాడు. జరగబోయే దానంతట్లోనూ జ్ఞానం గల ఉద్దేశం ఆయనకు ఉంటుంది.

8. వారి శవములు ఆ మహాపట్టణపు సంత వీధిలో పడియుండును; వానికి ఉపమానరూపముగా సొదొమ అనియు ఐగుప్తు అనియు పేరు; అచ్చట వారి ప్రభువుకూడ సిలువవేయబడెను.
యెషయా 1:10

ఆ “మహా నగరం” జెరుసలం అని ఈ వచనం స్పష్టంగా తెలియజేస్తున్నది. యేసుప్రభువు సిలువ మరణం పొందినది జెరుసలంలోనే. అంతేగాక యెషయా 1:8-10 లో జెరుసలంను అలంకార భాషలో సొదొమ అనడం కనిపిస్తుంది. బైబిల్లో ఈజిప్ట్ అలంకార భాషలో ఆత్మ సంబంధమైన బానిసత్వాన్ని సూచిస్తుంది. జెరుసలం ఇలాంటి బానిసత్వానికి చిహ్నంగా ఉంది. గలతియులకు 4:25 చూడండి.

9. మరియు ప్రజలకును, వంశములకును, ఆ యా భాషలు మాటలాడువారికిని, జనము లకును సంబంధించినవారు మూడు దినములన్నర వారి శవము లను చూచుచు వారి శవములను సమాధిలో పెట్టనియ్యరు.

అంత కొద్ది కాలంలో అంతమంది ప్రజలు వారి మృత దేహాల్ని చూడడం ఎలా? టెలివిజన్ ఉన్న ఈ రోజుల్లో ఇలాంటిది కష్టమేముంది? “మృత దేహాలు”, “సమాధి” అనే మాటలు ఈ ఇద్దరు సాక్షులు ఇద్దరు వ్యక్తులని సూచిస్తున్నట్టు ఉంది.

10. ఈ యిద్దరు ప్రవక్తలు భూనివాసులను బాధించినందున భూనివాసులు వారి గతి చూచి సంతోషించుచు, ఉత్స హించుచు, ఒకనికొకడు కట్నములు పంపుకొందురు.
యెహేజ్కేలు 37:5-10

మానవకోటి స్వభావ సిద్ధంగా ఎలా ఉందో ఇందులో చూడండి. దేవుని ప్రవక్తల మరణమంటే వారికి శుభవార్తగా అనిపిస్తుంది. మనుషులు మొత్తంమీద దేవుని సత్యమంటే ఇష్టపడరు. దేవుని సత్యం వారిని బాధిస్తుంది. ఎందుకంటే వారికి దాని ప్రకారం నడవడానికి మనసు లేదు. ఇకనుంచి దాన్ని విననక్కర లేదంటే వారికి ఉపశమనమే కలుగుతుంది. యోహాను 3:19-20; రోమీయులకు 8:5-8; Acts,7,54, అపో. కార్యములు 7:57 పోల్చి చూడండి.

11. అయితే ఆ మూడుదినములన్నరయైన పిమ్మట దేవునియొద్ద నుండి జీవాత్మ వచ్చి వారిలో ప్రవేశించెను గనుక వారు పాదములు ఊని నిలిచిరి; వారిని చూచిన వారికి మిగుల భయము కలిగెను.
యెహేజ్కేలు 37:5-10

ఈ వచనంలోని మాటలు పునరుత్థానాన్ని అంటే చనిపోయినవారు సజీవంగా లేవడం అనే విషయాన్ని స్పష్టంగా సూచిస్తున్నట్టు ఉంది. “హడలిపోయారు”– దయ్యాలకు అనుగుణమైన దుర్మార్గుల సంబరం దీర్ఘ కాలం ఉండదు (యోబు 20:5 చూడండి).

12. అప్పుడుఇక్కడికి ఎక్కిరండని పరలోకమునుండి గొప్ప స్వరము తమతో చెప్పుట వారు విని, మేఘారూఢులై పరలోకమునకు ఆరోహణమైరి; వారు పోవుచుండగా వారి శత్రువులు వారిని చూచిరి
2 రాజులు 2:11

ఇది కూడా అసలైన సంఘటనను, అంటే చనిపోయి తిరిగి బ్రతికినవారు పైకి వెళ్ళడం అనే సంగతిని తేటగా సూచిస్తున్నట్టు ఉంది. “మేఘం”– అపో. కార్యములు 1:9 పోల్చి చూడండి.

13. ఆ గడియలోనే గొప్ప భూకంపము కలిగినందున ఆ పట్టణములో పదియవ భాగము కూలిపోయెను. ఆ భూకంపమువలన ఏడువేలమంది చచ్చిరి. మిగిలినవారు భయాక్రాంతులై పరలోకపు దేవుని మహిమపరచిరి.
యెహోషువ 7:19, యెహేజ్కేలు 38:19-20, దానియేలు 2:19

ఈ భూకంపం 7,000 మందిని మాత్రమే చంపుతుందనే విషయం, ఆ “నగరం” (వ 2,8) జెరుసలం అని ఒక సూచనగా ఉంది. ఆ భూకంపం ప్రపంచ వ్యాప్తంగా ఉండబోయే విపత్తు కాదు గాని స్థానికమైనదే. దానివల్ల మంచి ఫలితం ఒకటి కలుగుతుంది (ప్రకటన గ్రంథం 16:9, ప్రకటన గ్రంథం 16:11 కూ దీనికీ ఉన్న తేడా చూడండి).

14. రెండవ శ్రమ గతించెను; ఇదిగో మూడవ శ్రమ త్వరగా వచ్చుచున్నది.

“రెండో విపత్తు”– అంటే ఆరో బూర ఊదితే జరిగే సంఘటనలు. ప్రకటన గ్రంథం 8:13; ప్రకటన గ్రంథం 9:12 చూడండి. “మూడో...వస్తూ ఉంది”– కథలో ప్రకటన గ్రంథం 10:1 తో ఆరంభమైన అంతరాయం, ఆరో బూరకూ ఏడో బూరకూ నడుమ ఉన్న మాటలు అయిపొయ్యాయి. ఏడో బూర ఊదే సమయం వచ్చింది. ఈ ఏడో బూర ఊదడంలోనుంచి ఏడు కోప పాత్రలు వస్తాయి. అవే మూడో (ఆఖరు కూడా) విపత్తు.

15. ఏడవ దూత బూర ఊదినప్పుడు పరలోకములో గొప్ప శబ్దములు పుట్టెను. ఆ శబ్దములుఈ లోక రాజ్యము మన ప్రభువు రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యము నాయెను; ఆయన యుగయుగముల వరకు ఏలు ననెను.
నిర్గామకాండము 15:18, కీర్తనలు 10:16, కీర్తనలు 22:28, దానియేలు 2:44, దానియేలు 7:14, ఓబద్యా 1:21, జెకర్యా 14:9

ఏడో బూర ఈ బూరల వరుసలో చివరిది, ఈ గ్రంథంలో చివరిది, ఆ మాటకొస్తే ఈ యుగంలో చివరిది. మత్తయి 24:30-31; 1 కోరింథీయులకు 15:51-52; 1 థెస్సలొనికయులకు 4:16. ముందు అధ్యాయాల్లో వెల్లడి అయిన విషయాలనూ తరువాతి వచనాల్లో వెల్లడి అయిన విషయాలనూ బట్టి చూస్తే ఈ బూరను ఊదడం మహా బాధ కాలం తరువాత, క్రీస్తువిరోధి బయలుదేరిన తరువాత జరుగుతుంది. “పలికాయి”– ఈ మాటలు పలికేవారు క్రీస్తు రెండో రాకడ సమయంలో నిలుస్తూ ఏడో బూర కింద జరిగే ఇతర సంఘటనలను దాటిపోయి ఆఖరి సంఘటన గురించే మాట్లాడుతున్నట్టు ఉంది. లేదా, రాబోయే క్రీస్తు రాకడ గురించి భూతకాలం వాడుకొంటూ మాట్లాడుతున్నారు (యెషయా 53వ అధ్యాయాన్ని, యెషయా 55:10-11 నోట్ చూడండి). “భూలోక రాజ్యం”– దుర్మార్గులు (అదృష్ట దుష్టశక్తులు కూడా) ఈ లోకంపై చేస్తున్న పరిపాలన అన్నమాట. మత్తయి 4:8-9; యోహాను 14:30; 2 కోరింథీయులకు 4:4; ఎఫెసీయులకు 2:2; ఎఫెసీయులకు 6:12; 1 యోహాను 5:19 చూడండి. “అభిషిక్తుని రాజ్యాలు అయ్యాయి”– ప్రకటన గ్రంథం 19:15-16; మత్తయి 6:10; మత్తయి 13:40-43; మత్తయి 19:28; మత్తయి 25:31; లూకా 1:32-33; అపో. కార్యములు 1:6-7; కీర్తనలు 2:1-12; యెషయా 11:1-9; దానియేలు 2:44-45 చూడండి. ప్రకటన గ్రంథంలోని ముఖ్యాంశాలలో ఒకటి ఇది. దేవుడు తన రాజ్యాన్ని భూమి మీద బహిరంగంగా స్థాపిస్తాడు. ఇతర పరిపాలనంతటినీ అధికారాన్నంతటినీ నాశనం చేసే విధానం, భూలోకాన్ని పరిపాలించడానికి క్రీస్తు రావడం ఈ గ్రంథంలో తేటతెల్లంగా కనిపిస్తున్నాయి. దేవుని రాజ్యం గురించి నోట్ మత్తయి 4:17. “శాశ్వతంగా”– యెషయా 9:7; దానియేలు 7:14, దానియేలు 7:27. క్రీస్తు పరిపాలన రెండు భాగాలుగా విభజించబడి ఉంటుందని కనబడుతున్నది. ప్రకటన గ్రంథం 20:4, ప్రకటన గ్రంథం 20:6; 1 కోరింథీయులకు 15:24-25 చూడండి. వెయ్యేళ్ళ పరిపాలన శాశ్వత పరిపాలనకు ఆరంభం మాత్రమే.

16. అంతట దేవునియెదుట సింహాసనాసీనులగు ఆ యిరువది నలుగురు పెద్దలు సాష్టాంగపడి దేవునికి నమ స్కారముచేసి

“పెద్దలు”– ప్రకటన గ్రంథం 4:4

17. వర్తమానభూతకాలములలో ఉండు దేవుడవైన ప్రభువా, సర్వాధికారీ, నీవు నీ మహాబలమును స్వీకరించి యేలుచున్నావు గనుక మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము.
నిర్గామకాండము 3:14, యెషయా 12:4, ఆమోసు 4:13

“పూర్వముండి ప్రస్తుతమున్నవాడా”– ప్రకటన గ్రంథం 1:4, ప్రకటన గ్రంథం 1:8; ప్రకటన గ్రంథం 4:8 కూ దీనికీ తేడా గమనించండి. ఏడో బూర తరువాత ఆయన ఇంకా భవిష్యత్తులో వచ్చేవాడు కాదు. ఎందుకంటే అప్పుడు వచ్చి ఉంటాడు. ఏడో బూర రోజులలో (10:7) 19:11-16లో ఉన్న సంఘటన ఇమిడి ఉంది. “కృతజ్ఞతలు”– అది గొప్ప కృతజ్ఞతలు అర్పించడానికి కారణం అవుతుంది – లోకంలో పాపం పరిపాలన తీరిపోతుంది. అప్పటినుంచి క్రీస్తు ఏలుతాడు. కృతజ్ఞతార్పణ గురించిన నోట్స్ లేవీయకాండము 7:12-13; కీర్తనలు 7:17; కీర్తనలు 50:14-15; కీర్తనలు 56:12; ఎఫెసీయులకు 5:20; 1 థెస్సలొనికయులకు 5:18.

18. జనములు కోప గించినందున నీకు కోపము వచ్చెను. మృతులు తీర్పు పొందుటకును, నీ దాసులగు ప్రవక్తలకును పరిశుద్ధులకును, నీ నామమునకు భయపడువారికిని తగిన ఫలమునిచ్చుటకును, గొప్పవారేమి కొద్దివారేమి భూమిని నశింపజేయు వారిని నశింపజేయుటకును సమయము వచ్చియున్నదని చెప్పిరి.
కీర్తనలు 2:1, కీర్తనలు 46:6, కీర్తనలు 99:1, కీర్తనలు 115:13, దానియేలు 9:6, దానియేలు 9:10, ఆమోసు 3:7, జెకర్యా 1:6

“కోపగించాయి”– జనాలమధ్య ఒక జాతికి విరోధంగా మరో జాతికి, దేవునికీ ఆయన ప్రజలకూ విరోధంగా సైతాను రేపే కోపం ఇది. ప్రకటన గ్రంథం 12:12 చూడండి. ఈ కోపం క్రీస్తువిరోధి పరిపాలన కాలంలో పూర్తిగా కనిపిస్తుంది – ప్రకటన గ్రంథం 6:4, ప్రకటన గ్రంథం 6:10; ప్రకటన గ్రంథం 13:7; ప్రకటన గ్రంథం 16:9, ప్రకటన గ్రంథం 16:11; ప్రకటన గ్రంథం 19:19. “నీ కోపం వచ్చింది”– ప్రకటన గ్రంథం 6:17; ప్రకటన గ్రంథం 14:19; ప్రకటన గ్రంథం 15:1, ప్రకటన గ్రంథం 15:7; ప్రకటన గ్రంథం 16:19; ప్రకటన గ్రంథం 19:15; కీర్తనలు 2:4-5. 16వ అధ్యాయంలోని కోప పాత్రలన్నీ ఈ ఏడో బూర సమయంలో ఉంటాయి. అవి కుమ్మరించబడినట్టే ఈ పెద్దలు మాట్లాడుతున్నారు. “చనిపోయినవారికి తీర్పు తీర్చే సమయం”– ఇక్కడ చనిపోయినవారు అనే పదానికి అర్థం ఏమిటో దానిగురించి మూడు అభిప్రాయాలు ఉన్నాయి. ఒకటి, వీరు పాప విముక్తి లేకుండా చనిపోయినవారు. రెండోది, పాపాలలో చచ్చినవారై (ఎఫెసీయులకు 2:1) లోకంలో ఇంకా జీవిస్తున్న అవిశ్వాసులు. మూడోది, క్రీస్తులో నమ్మకముంచి చనిపోయినవారు. మొదటి అభిప్రాయం అసంభవం. 20వ అధ్యాయాన్ని బట్టి చూస్తే క్రీస్తు వెయ్యేళ్ళ పరిపాలన తరువాత పాపవిముక్తి లేకుండా చనిపోయినవారికి తీర్పు జరుగుతుందని అనుకోవాలి (ప్రకటన గ్రంథం 20:7-15). రెండో అభిప్రాయం అసాధ్యం కాకపోయినా ఈ సందర్భంలో అసంభవం. మూడో అభిప్రాయం సరైనదని అనిపిస్తుంది. “భయభక్తులున్న”– హెబ్రీయులకు 12:28; 2 కోరింథీయులకు 7:1; ఆదికాండము 20:11; కీర్తనలు 34:11-14; కీర్తనలు 111:10; సామెతలు 1:7. “బహుమతులు ఇచ్చే సమయము”– యేసుప్రభువు తాను లోకానికి తిరిగి వచ్చిన తరువాత తన సేవకులకు బహుమతులిస్తాడు, గాని అంతకు ముందు కాదు. – ప్రకటన గ్రంథం 22:12; మత్తయి 16:27; మత్తయి 25:19-21; లూకా 19:15-17. “భూమిని నాశనం చేసేవారిని”– పాపులకు ఒక కొత్త పేరు. దేవుడు మంచిదిగా చేసినదాన్ని వారు నాశనం చేస్తారు.

19. మరియు పరలోకమందు దేవుని ఆలయము తెరవ బడగా దేవుని నిబంధనమందసము ఆయన ఆలయములో కనబడెను. అప్పుడు మెరుపులును ధ్వనులును ఉరుములును భూకంపమును గొప్ప వడగండ్లును పుట్టెను.
నిర్గామకాండము 9:24, నిర్గామకాండము 19:16, 1 రాజులు 8:1, 1 రాజులు 8:6, 2 దినవృత్తాంతములు 5:7, యెహేజ్కేలు 1:13

“ఆలయం”– ప్రకటన గ్రంథం 7:15; ప్రకటన గ్రంథం 16:1. “ఒడంబడిక పెట్టె”– నిర్గామకాండము 25:10-22; హెబ్రీయులకు 9:4. ఈ లోకంలోని ఒడంబడిక మందసం పరలోకంలోని నిజ మందసానికి సూచన (హెబ్రీయులకు 8:1-2, హెబ్రీయులకు 8:5). ఒడంబడిక పెట్టె దేవుడు సీనాయి పర్వతం దగ్గర ఇస్రాయేల్ జాతితో చేసిన ఒడంబడికను సూచించేది (నిర్గామకాండము 25:15; ద్వితియోపదేశకాండము 10:1-5). ఇక్కడ పరలోకంలోని ఒడంబడిక పెట్టె గురించిన మాట మనల్ని ఇస్రాయేల్ గురించీ ఆలోచించేలా చెయ్యదా? తరువాతి అధ్యాయంలో దేవుడు ఈ యుగాంతంలో ఇస్రాయేల్ జాతి పట్ల తన విశ్వసనీయతను ప్రదర్శించే సంగతి కనిపిస్తున్నట్టు ఉంది. “వడగండ్లు”– ప్రకటన గ్రంథం 4:5; ప్రకటన గ్రంథం 8:5; ప్రకటన గ్రంథం 16:18 పోల్చి చూడండి.