Click to Donate & Support us or contact us for any Support 8898 318 318

Isaiah - యెషయా 32

1. ఆలకించుడి, రాజు నీతినిబట్టి రాజ్యపరిపాలన చేయును అధికారులు న్యాయమునుబట్టి యేలుదురు.
యోహాను 1:49, యోహాను 18:37, 1 కోరింథీయులకు 15:25

1. నేను చెప్పే విషయాలు విను. ఒక రాజు మంచిని పెంచే విధంగా పాలించాలి. నాయకులు ప్రజలను నడిపించేటప్పుడు వారు న్యాయమైన తీర్మానాలు చేయాలి.

2. మనుష్యుడు గాలికి మరుగైనచోటువలెను గాలివానకు చాటైన చోటువలెను ఉండును ఎండినచోట నీళ్లకాలువలవలెను అలసట పుట్టించు దేశమున గొప్పబండ నీడవలెను ఉండును.

2. ఇలా జరిగితే, అప్పుడు గాలి వాన నుండి దాగుకొనే చోటులా ఉంటాడు ఆ రాజు. అది ఎండిన భూమిలో నీటి కాలువలు ప్రవహించినట్టుగా ఉంటుంది. వేడి ప్రదేశంలో ఒక పెద్ద బండ చాటున చల్లని నీడలా ఉంటుంది అది.

3. చూచువారి కన్నులు మందముగా ఉండవు వినువారి చెవులు ఆలకించును.

3. ప్రజలు సహాయం కోసం రాజువైపు తిరుగుతారు, వారు ఆయన చెప్పే మాటలు నిజంగా వింటారు.

4. చంచలుల మనస్సు జ్ఞానము గ్రహించును నత్తివారి నాలుక స్పష్టముగా మాటలాడును.

4. ఇప్పుడు గందర గోళంలో పడిన మనుష్యులు గ్రహించగలుగుతారు. ఇప్పుడు తేటగా మాట్లాడలేని మనుష్యులు, అప్పుడు తేటగా, వేగంగా మాట్లాడగలుగుతారు.

5. మూఢుడు ఇక ఘనుడని యెంచబడడు కపటి ఉదారుడనబడడు.

5. వెర్రివాళ్లు గొప్పవాళ్లని పిలువబడరు. రహస్య పథకాలు వేసే వారిని ప్రజలు గౌరవించరు.

6. మూఢులు మూఢవాక్కులు పలుకుదురు భక్తిహీనముగా నడుచుకొందురు యెహోవానుగూర్చి కానిమాటలాడుచు ఆకలిగొనినవారి జీవనాధారము తీసికొనుచు దప్పిగొనినవారికి పానీయము లేకుండ చేయుచు హృదయపూర్వకముగా పాపము చేయుదురు.

6. తెలివి తక్కువ వాడు తెలివి తక్కువ సంగతులు చెబతాడు, అతడు చెడ్డపనులు చేయాలని తన మనసులో ఆలోచిస్తాడు. తెలివి తక్కువ వాడు తప్పు పనులు చేయాలనుకొంటాడు. తెలివి తక్కువ వాడు యెహోవాను గూర్చి చెడ్డ మాటలు చెబతాడు. తెలివి తక్కువ వాడు ఆకలితో ఉన్న వాళ్లను అన్నం తిననీయడు. తెలివి తక్కువ వాడు దప్పిగొన్న వారిని నీళ్లు తాగనివ్వడు.

7. మోసకారి సాధనములును చెడ్డవి నిరుపేదలు న్యాయవాదన చేసినను కల్లమాటలతో దీనులను నాశనముచేయుటకు వారు దురాలోచనలు చేయుదురు.

7. ఆ తెలివి తక్కువ వాడు చెడును సాధనంగా వాడుకొంటాడు. పేద ప్రజల దగ్గర్నుండి సమస్తం దోచుకొనేందుకు అతడు పథకం వేస్తాడు. ఆ తెలివి తక్కువ వాడు పేద ప్రజలను గూర్చి అబద్ధాలు చెబతాడు. వాని అబద్ధాలు పేదవారికి న్యాయం జరుగకుండా చేస్తాయి.

8. ఘనులు ఘనకార్యములు కల్పించుదురు వారు ఘనకార్యములనుబట్టి నిలుచుదురు.

8. అయితే మంచి నాయకుడు మంచి పనులు చేయాలని ఆలోచిస్తాడు. ఆ మంచి పనులే అతణ్ణి మంచి నాయకుడ్ని చేస్తాయి.

9. సుఖాసక్తిగల స్త్రీలారా, లేచి నా మాట వినుడి నిశ్చింతగానున్న కుమార్తెలారా, నా మాట వినుడి.

9. స్త్రీలు కొందరు ఇప్పుడు నెమ్మదిగా ఉన్నారు. మీరు క్షేమం అనుకొంటున్నారు. కానీ మీరు లేచి, నేను చెప్పే మాటలు వినాలి.

10. నిశ్చింతగల స్త్రీలారా, యిక ఒక సంవత్సరమునకు మీకు తొందర కలుగును ద్రాక్షపంట పోవును పండ్లు ఏరుటకు రావు.

10. స్త్రీలారా మీరు ఇప్పుడు క్షేమంగా ఉన్నాం అనుకొంటున్నారు. కానీ ఒక సంవత్సరం తర్వాత మీకు కష్టం వస్తుంది. ఎందుకంటే వచ్చే సంవత్సరం మీరు కూర్చుకొనేందుకు ద్రాక్షపండ్లు ఉండవు గనుక మీరు ద్రాక్షపండ్లు ఏరుకోరు.

11. సుఖాసక్తిగల కన్యలారా, వణకుడి నిర్విచారిణులారా, తొందరపడుడి మీ బట్టలు తీసివేసి దిగంబరులై మీ నడుమున గోనె పట్ట కట్టుకొనుడి.

11. స్త్రీలారా మీరు ఇప్పుడు నెమ్మదిగా ఉన్నారు. కానీ మీరు భయపడాలి. స్త్రీలారా, ఇప్పుడు మీరు క్షేమంగా ఉన్నాం అనుకొంటున్నారు. కానీ మీరు దిగులుపడాలి. మీ అందమైన వస్త్రాలు తీసివేసి, విచార వస్త్రాలు ధరించండి. ఆ బట్టలు మీ నడుములకు చుట్టుకోండి.

12. రమ్యమైన పొలము విషయమై ఫలభరితమైన ద్రాక్షా వల్లుల విషయమై వారు రొమ్ము కొట్టుకొందురు.

12. దుఃఖంతో నిండిన మీ రొమ్ములను ఆ దుఃఖవస్త్రాలతో కప్పుకొనండి. మీ పొలాలు ఖాళీగా ఉన్నాయి గనుక ఏడ్వండి. మీ ద్రాక్ష తోటలు ఒకప్పుడు ద్రాక్ష పండ్లు ఇచ్చాయి కానీ ఇప్పుడు అవి ఖాళీ.

13. నా జనుల భూమిలో ఆనందపురములోని ఆనందగృహములన్నిటిలో ముండ్ల తుప్పలును బలురక్కసి చెట్లును పెరుగును. పైనుండి మనమీద ఆత్మ కుమ్మరింపబడువరకు

13. నా ప్రజల భూమి కోసం ఏడ్వండి, ముళ్లకంపలు, గచ్చ పొదలు మాత్రమే అక్కడ పెరుగుతాయి గనుక ఏడ్వండి. పట్టణం కోసం, ఒకప్పుడు ఆనందంతో నిండిన అన్ని గృహాల కోసం ఏడ్వండి.

14. నగరి విడువబడును జనసమూహముగల పట్టణము విడువబడును కొండయు కాపరుల గోపురమును ఎల్లకాలము గుహ లుగా ఉండును

14. ప్రజలు రాజధాని నగరం విడిచి పెట్టేస్తారు. రాజ భవనం, గోపురాలు ఖాళీగా విడిచిపెట్టబడతాయి. ప్రజలు ఇండ్లలో నివసించరు. వారు గుహలలో నివసిస్తారు. అడవి గాడిదలు, గొర్రెలు పట్టణంలో నివసిస్తాయి. పశువులు అక్కడ గడ్డి మేయటానికి వెళ్తాయి.

15. అవి అడవిగాడిదలకు ఇష్టమైనచోట్లుగాను మందలు మేయు భూమిగాను ఉండును అరణ్యము ఫలభరితమైన భూమిగాను ఫలభరిత మైన భూమి వృక్షవనముగానుండును.

15. [This verse may not be a part of this translation]

16. అప్పుడు న్యాయము అరణ్యములో నివసించును ఫల భరితమైన భూమిలో నీతి దిగును

16. [This verse may not be a part of this translation]

17. నీతి సమాధానము కలుగజేయును నీతివలన నిత్యమును నిమ్మళము నిబ్బరము కలుగును. అప్పుడు నా జనుల విశ్రమ స్థలమునందును ఆశ్రయ స్థానములయందును సుఖకరమైన నివాసముల యందును నివసించెదరు
యాకోబు 3:18

17. ఆ మంచితనం శాంతి, భద్రతలు తెచ్చిపెడ్తుంది.

18. అయినను అరణ్యము ధ్వంసమగునప్పుడు వడగండ్లు పడును

18. అందమైన శాంతి వనంలో నా ప్రజలు నివసిస్తారు. క్షేమకరమైన గుడారాల్లో నా ప్రజలు నివసిస్తారు. నెమ్మదైన, శాంతస్థలాల్లో వారు నివసిస్తారు.

19. పట్టణము నిశ్చయముగా కూలిపోవును.

19. కానీ ఈ సంగతులు జరుగక ముందు అరణ్యం కూలిపోవాలి. ఆ పట్టణం ఓడించబడాలి.

20. సమస్త జలములయొద్దను విత్తనములు చల్లుచు ఎద్దులను గాడిదలను తిరుగనిచ్చు మీరు ధన్యులు.

20. మీలో కొంతమంది ప్రతి కాలువ దగ్గరా విత్తనాలు విత్తుతారు. మీ పశువలను, గాడిదలను మీరు స్వేచ్చగా తిరుగ నిస్తారు, తిననిస్తారు. మీరు చాలా సంతోషంగా ఉంటారు.