కీర్తన-143. తాను పాపాత్ముణ్ణనీ, అందుకు తన పైకి వచ్చే దేవుని శిక్షను తప్పించుకొనే మార్గమే లేదని ఎరిగిన కీర్తనకారుడు దేవుని క్షమాపణ, విడుదల కోసం తనను తాను దేవుని కృపకు అప్పగించుకుంటున్నాడు.
143:1-12 యెహోవా, నా ప్రార్థన ఆలకింపుము. ముందు కీర్తనలాగే ఈ కీర్తన కూడా కష్టాలలో మునిగి తేలుతూ తన సహనపు అంతానికి వచ్చానని అనుకొంటున్న విశ్వాసిని గురించి వివరిస్తుంది. (వ.3-4,7; 104:29తో పోల్చండి). దేవుడు తనమీదికి వచ్చిన మహా పరీక్షనుండి తనను విడిపించి తనను పునరుద్ధరిస్తాడన్న ఆశ తప్ప తనకు మిగిలిందేమీ లేదనుకొంటున్నాడు (వ.10-11; దీనికి ముందు నోట్సు చూడండి).
143:2 కీర్తనకారుడు ప్రార్ధిస్తున్నప్పుడు అతనికి తనలో ఉన్న పాపాలన్నీ గుర్తుకొచ్చాయి. మనుషుల్లో పాపం లేనివారు ఎవరూ లేరని అందరి పక్షాన అతడు ఒప్పుకొంటున్నాడు (సజీవులలో ఒకడును... నీతిమంతుడుగా ఎంచబడడు), నిబంధనా పూర్వకమైన సంబంధం యెహోవా క్షమించడానికి చూపించే సంసిద్ధత మీద నిలిచి ఉంటుంది కాబట్టి ఇది యెహోవా నుండి అనుకూలమైన స్పందనకు ఆధారమవుతుంది. (130:3-4; యోబు 4:17; 9:2; 25:4; రోమా 3:20; గలతీ 2:16).
143:4 కీర్తనకారున్ని శత్రువులు తరుముతున్నందువలన, అతడు శారీరకంగా అలసట చెందాడు, ఆత్మలో క్రుంగిపోయాడు (142:3).
148:5-6 బహుశా దేవుడు సమస్త సృష్టినీ చేసి దానినంతటినీ నిర్వహిస్తుండడం గురించి చేతుల పని అనే మాటలు సూచిస్తుండవచ్చు (8:6; 19:1; 28:5; 102:26; యెషయా 5:12). దేవుడు పూర్వకాలంలో చేసినవాటన్నిటినీ దావీదు గుర్తుకు తెచ్చుకుంటూ, తనకు దేవుని పట్ల ఉన్న ప్రగాఢమైన ఆశను తెలియజేస్తున్నాడు.
143:7 పాతాళం అనే పదం సూచించినట్టుగానే సమాధి కూడా మృత్యువునే సూచిస్తుంది (30:3; 88:3-4; యెషయా 14:11).
143:10 తన బలహీనతలో (వ.2), దావీదు ఒక విషయాన్ని గుర్తిస్తున్నాడు. తానున్న పరిస్థితుల్లో దేవుని నుండి నేర్చుకోవలసిన (నేర్పుము) అవసరత ఉంది. అంతేగాక దేవుడు నడిపించునట్లుగా అతడు జీవించాలి.
143:11 దావీదు ప్రార్ధనకు ప్రధానమైన ఆధారం యెహోవా నైతికస్వభావం.
143:12 దేవుడు తన కృపను బట్టి తన శత్రువులను సంహరింపుమని కీర్తనకారుడు ప్రార్థిస్తున్నాడు.