13:1-5 పొంతి పిలాతు (3:1 నోట్సు చూడండి) ఇక్కడ ప్రస్తావించిన గలిలయులను ఎందుకు చంపాడో ఇక్కడ తెలియదు. వారి బలులనే మాటలను బట్టి ఈ సంఘటన దేవాలయ ఆవరణంలో, బహుశా పురుషులైన యూదులందరూ యెరూషలేముకు యాత్ర చేయవలసిన మతపరమైన పండుగ సమయంలోనే జరిగి ఉంటుందని సూచిస్తుంది. యెరూషలేముకు ఆగ్నేయభాగంలో ఉన్న సిలోయములోని గోపురము కూలిపోవడం వలన 18 మంది చనిపోవడం గురించి కూడా సమాచారం ఏమీ తెలియదు. అలాంటివి కేవలం కొన్ని పాపాలకు శిక్షగా మాత్రమే జరుగుతాయనే అనేకులు
భావించేవారు. అందువల్లనే గలిలయుల పాపం గురించి గోపురం కూలి మరణించిన వ్యక్తుల పాపం గురించి యేసు వారిని ప్రశ్నించాడు. యేసు ఈ అభిప్రాయాన్ని ఖండిస్తూ, ప్రతీ ఒక్కరూ మారుమనస్సు పొందాలనీ, లేదంటే ఆధ్యాత్మికంగా శాశ్వతంగా నశిస్తారనీ నొక్కి చెప్పాడు (3:2-3 నోట్సు చూడండి).
13:6-9 అంజూరపు చెట్టు తరచూ ఇశ్రాయేలు దేశానికి సూచనగా ఉపయోగించారు (మత్తయి 24:32-33; మార్కు 11:12-14). చిన్నచిన్న అంజూరపు చెట్లు నెమ్మదిగా ఫలాలను ఫలించినప్పటికీ, అవి ఎదిగి ఫలించడానికి మూడు సంవత్సరాలు చాలు. ఆ తోటమాలి అదనంగా అడిగిన సంవత్సరము ఆ చెట్లు ఫలించడానికి పొందిన చివరి అవకాశాన్ని సూచిస్తున్నాయి. లేదంటే వాటిని నరికించివేయడమే. ఆ విధంగా, ఈ ఉపమానం తీర్పుకు ముందు ఇశ్రాయేలు పొందిన ఆఖరి అవకాశాన్ని సూచిస్తుంది. వారు యేసు సందేశాన్ని అద్భుతాలనూ తృణీకరిస్తే, ఓర్పుతో సహించే కాలం ముగిసిపోయినట్లే. అయితే, ఇశ్రాయేలుకు భవిష్యత్ నిరీక్షణ నిలిచే ఉంటుంది (రోమా 11 అధ్యా.).
13:10-13 స్వస్థపరచిన సమయం విశ్రాంతి దినము. దీని గురించిన ప్రస్తావన యేసుకూ మతనాయకులకూ ఇంతకు ముందు జరిగిన వివాదాన్ని గుర్తుచేస్తుంది. (6:1-11). ఆయన స్వస్థపరచిన స్త్రీ వెన్నెముక దయ్యము (దురాత్మ) వలన వంగిపోయింది. స్వస్థపరచడంలో రెండు చర్యలున్నాయి: (1) దయ్యాన్ని వెళ్లగొట్టడం (2) వెన్నెముకను తిన్నగా చేయడం. ఇలాంటి అంగవైకల్యాలు, అనారోగ్యాలు అన్నిసార్లు దయ్యాల వలనే కలుగుతాయని ఈ వచనం సూచించట్లేదు. ఇది చాలా అరుదైన సంఘటన. క్రీస్తు అనుచరులకు ఎదురయ్యే తీవ్రతరమైన ఆధ్యాత్మిక యుద్ధానికి ఇది నిదర్శనం.
13:14-16 స్వస్థతా కార్యం విశ్రాంతిదిన సమయాన్ని ఉల్లంఘించినందుకు సమాజమందిరపు నాయకుడు ఆ స్వస్థతను తృణీకరించాడు (నిర్గమ 20:8-11 నోట్సు చూడండి). యేసు వేషధారులారా అనే బహువచనం ఉపయోగించడం అతని అభిప్రాయంతో ఏకీభవించేవారు అనేకులున్నారని చూపుతుంది. విశ్రాంతి దినాన ప్రతీ ఒక్కరూ ఏదో ఒక పనిని చేయాల్సి వస్తుందనీ, మరిముఖ్యంగా పశువులను కాయడానికి సంబంధించిన పని చేయాల్సి వస్తుందనీ చూపిస్తూ ఆయన వాళ్ల వేషధారణను బట్టబయలు చేశాడు. సుదీర్ఘకాలంగా సాతానుకు బందీగా ఉన్న ఒక యూదురాలైన స్త్రీ (అబ్రాహాము కుమార్తె) కూడా విశ్రాంతిదినాన విడిపించబడకూడదా?
13:17 సమాజమందిరపు అధికారి పక్షం వహించిన వాళ్లందరూ సిగ్గుపడిరి. ఎందుకంటే దయ్యం పట్టి, వంగిపోయిన స్త్రీపై కంటే కూడా వారు జంతువులపై ఎక్కువ కనికరం గలవారిగా అది వారిని కనపరిచింది.
13:18-21 యేసు ఆరంభించిన దేవుని రాజ్యము (ఈ లోకంలో దేవుని పరిపాలన) ఎంత ఆశ్చర్యపరిచే విధంగా విస్తరిస్తుందో- ఈ రెండు ఉపమానాలు సూచిస్తున్నాయి. యేసు పరిచర్య ద్వారా దేవుని రాజ్యం ఎంత చిన్నగా (ప్రాచీన ప్రపంచంలో అత్యంత చిన్నదైన విత్తనంగా పరిగణించబడిన ఆవగింజలాగ) ఆరంభమై ఎంత నాటకీయంగా విస్తరిస్తుందో (వృక్షము, కొమ్మలు) అనే దానిపై మొదటి ఉపమానం దృష్టి సారించింది. మూడు కుంచముల పిండిని కూడా పులిసిపోయేలా చేసే చిన్న పులిసిన ముద్దలా దేవుని రాజ్యం చివరికి భూమి యంతట విస్తరిస్తుందనే భావంతో రెండవ ఉపమానం మొదటి ఉపమానాన్ని దృఢపరుస్తుంది. పులిసిన పిండి బైబిల్లో తరచూ దుష్టత్వానికి సూచనగా ఉందనేది సత్యమే (1కొరింథీ 5:6).అయినప్పటికీ, ఈ వాక్యభాగం దానికి మినహాయింపు అని స్పష్టమవుతుంది. ఇక్కడ పులిసిన పిండి సానుకూల దృక్పథంలో ప్రస్తావించబడింది. మానవాళి పక్షంగా యేసు సందేశం, కార్యాల శక్తిని ఇది మనకు గుర్తుచేస్తుంది.
13:22-23 సిలువపై మరణించడానికి యేసు యెరూషలేముకు ప్రయాణమైపోవుచున్నాడు అనే అంశాన్ని నొక్కి చెప్పే విధంగా లూకా తన సువార్త గ్రంథాన్ని రాశాడు. రక్షణ పొందువారు కొద్దిమందేనా? అనే ప్రశ్న యేసు పరిచర్య గురించి రెండు ముఖ్య వాస్తవాలను ప్రతిబింబిస్తుండవచ్చు. (1) నిజమైన శిష్యత్వం పలురకాలైన కష్టమైన సవాళ్లతో కూడి ఉంటుందని ఆయన చేసిన ఎన్నో ఉపదేశాలు నొక్కి చెప్పాయి, (2) ప్రతీ పట్టణంలోనూ -గ్రామంలోనూ బహు జనసమూహాలు యేసు చెప్పే మాటలు వినడానికి వచ్చినా, యథార్థమైన మనస్సుతో శిష్యులుగా ఆయనను అనుసరించినవాళ్లు మాత్రం చాలా చాలా తక్కువ.
13:24-27 ఎందుకు చాలా తక్కువమందే రక్షణ పొందుతారు? అని వ.23లో అడిగిన ప్రశ్నకు ఇక్కడ యేసు చెప్పిన ఉపమానంలో జవాబు చూడవచ్చు. ప్రభువు వాళ్లకు అవకాశం ఇస్తుండగా (అంటే యేసు సువార్త ప్రకటిస్తూ ఉండగా), ప్రజలు ఇరుకు ద్వారం గుండా (యేసులో విశ్వాసం ద్వారా) ప్రవేశించకపోవడమే కారణం. యేసు సామాజిక జీవితంలో (నీ సముఖమందు మేము తిని త్రాగుచుంటిమే) బహిరంగ పరిచర్య (నీవు మా వీధులలో బోధించితివే) చేస్తున్నప్పుడు తమకు యేసు తెలుసునని అవిశ్వాసులు చెప్పవచ్చేమో కానీ రక్షకునిగా మాత్రం ప్రభువును వాళ్లు ఎరుగరు (మీరెక్కడివారో మిమ్మును ఎరుగను). క్రీస్తులో విశ్వాసం ద్వారా వాళ్లు నీతిమంతులుగా తీర్చబడలేదు. (ప్రకటించబడలేదు; రోమా 5:1) కాబట్టి వాళ్లందరూ చివరికి అక్రమము చేస్తున్నవాళ్లే!
13:28-29 యూదులు అసలైన దేవుని నిబంధన జనం అయినప్పటికీ, తమ అవిశ్వాసాన్ని బట్టి వాళ్లు పరలోకానికి రాకుండా వెళ్ళగొట్టబడతారు. విశ్వాసులైన అన్యజనులు యేసులో అందుబాటులో ఉన్న దేవుని సమాధానాన్ని అంగీకరించారు. కాబట్టి వాళ్లు సంపూర్ణ సహవాసంలో విందులో పాల్గొంటారు. దేవుని రాజ్యములో నిత్యజీవానికి సంబంధించిన ఒక విచారకరమైన సత్యమిది. చేర్చబడని యూదులలో గొప్ప వేదన (ఏడ్చుచు పండ్లు కొరకుట) ఉంటుంది.
13:30 దేవుని రాజ్యం లోక విలువల్లో అనేకమైన వాటిని తారుమారు చేస్తుంది. విశ్వాసులైన అన్యజనులు దేవుని నిబంధన ప్రజలైన ఇశ్రాయేలులో చారిత్రాత్మకంగా భాగం కానప్పటికీ వారే తండోప తండాలుగా మెస్సీయను మొదటిగా అంగీకరించిన వారుగా మారారు. దీనికి విరుద్ధంగా యూదులు దేవుని ప్రణాళికలో మొట్టమొదటివారుగా ఉన్నారు. అయితే వాళ్లలో అధికులు క్రీస్తును తృణీకరించారు కాబట్టి వాళ్లు ఆధ్యాత్మికంగా కడపటి వారయ్యారు. ఈ యుగాంతంలో అధిక సంఖ్యలో యూదులు యేసును స్వీకరిస్తారు (రోమా 11:25-27).
13:31-34 హేరోదు అంతిప (3:1 నోట్సు చూడండి) బారి నుంచి యేసును కాపాడాలనే కోరిక పరిసయ్యులకు ఉందనే విషయం సందేహాస్పదమే. అయినా సరే, వాళ్ల హెచ్చరికను యేసు పట్టించుకున్నట్లే కనిపించాడు. యేసు వాళ్ల ప్రాంతాన్ని విడిచిపెట్టాలన్నదే వాళ్ల కోరిక అయ్యుండవచ్చు. యేసు అక్కడ ఇంకా 3 రోజులు ఉన్నాడని వ. 32లో కనిపిస్తుంది. అయితే, ఆ తర్వాతి వచనంలో యెరూషలేము ప్రయాణం గురించి చేసిన ప్రస్తావన ఆయన తన పునరుత్థానం గురించి మర్మయుక్తంగా సూచించాడని తెలియచేస్తుంది. దేవుడు పంపించిన ప్రవక్తలను యెరూషలేము చంపుచు వచ్చింది. యెరూషలేము గురించీ తన మరణం గురించీ ప్రవక్తగా ఆయన చేసిన ప్రస్తావన ప్రవక్తలను చంపడంలో ఆ నగరానికి ఉన్న చరిత్రను గుర్తు చేసింది. (తన పిల్లలను రెక్కల కింద పెట్టుకొని కాపాడే కోడిలాగ) దేవుడు కరుణ చూపిస్తుంటే యెరూషలేము దాన్ని పదేపదే తృణీకరించింది. దేవుని కుమారుడైన యేసును తృణీకరించి ఆ పట్టణం మరొకసారి తన చరిత్రనే పునరావృతం చేసింది.
13:35 మీ ఇల్లు మీకు పాడుగా విడువబడుచున్నది అనే మాట "దేవుని దీవెన, భద్రతలు తొలగించబడతాయని తెలియచేస్తున్నది. దీనివల్లనే క్రీ.శ. 70 సం||లో రోమీయుల చేతిలో యెరూషలేము దేవుని తీర్పు ద్వారా నాశనానికి గురైంది. ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక అనే మాట కీర్తన 118:26 వాక్యభాగాన్ని ప్రస్తావిస్తున్నది. తర్వాత కాలంలో యేసు జయప్రవేశోత్సవ సందర్భంలో దీన్ని ప్రస్తావించారు. (లూకా 19:37-38 నోట్సు చూడండి). అయితే, ఇక్కడ ఇది క్రీస్తు రెండవ రాకడను సూచిస్తుంది (జెకర్యా 12:10; ప్రక 1:7 చూడండి).