Mark - మార్కు సువార్త 12 | View All

1. ఆయన ఉపమానరీతిగా వారికి బోధింపనారం భించెను; ఎట్లనగాఒక మనుష్యుడు ద్రాక్షతోట నాటించి, దానిచుట్టు కంచె వేయించి, ద్రాక్షలతొట్టి తొలిపించి గోపురము కట్టించి, కాపులకు దానిని గుత్తకిచ్చి దేశాంతరముపోయెను.
యెషయా 5:1-7

2. పంటకాలమందు ఆ కాపుల నుండి ద్రాక్షతోట పండ్లలో తన భాగము తీసికొని వచ్చుటకు, కాపులయొద్దకు అతడు ఒక దాసునిపంపగా

3. వారు వాని పట్టుకొని కొట్టి, వట్టిచేతులతో పంపివేసిరి.
యెహోషువ 22:5

4. మరల అతడు మరియొక దాసుని వారియొద్దకు పంపగా, వారు వాని తల గాయముచేసి అవమానపరచిరి.

5. అతడు మరియొకని పంపగా వానిని చంపిరి. అతడింక అనేకులను పంపగా, వారు కొందరిని కొట్టిరి, కొందరిని చంపిరి.

6. ఇంకను అతనికి ప్రియ కుమారుడు ఒకడుండెను గనుకవారు తన కుమారుని సన్మానించెదరనుకొని తుదకు వారి యొద్దకు అతనిని పంపెను.

7. అయితే ఆ కాపులు ఇతడు వారసుడు; ఇతని చంపుదము రండి, అప్పుడు స్వాస్థ్యము మనదగునని తమలోతాము చెప్పుకొని

8. అతనిని పట్టుకొని చంపి, ద్రాక్షతోట వెలుపల పారవేసిరి.

9. కావున ఆ ద్రాక్షతోట యజమానుడేమి చేయును? అతడు వచ్చి, ఆ కాపులను సంహరించి, యితరులకు ఆ ద్రాక్షతోట ఇచ్చును గదా. మరియ

10. ఇల్లు కట్టువారు నిరాకరించిన రాయి మూలకు తలరాయి ఆయెను
కీర్తనల గ్రంథము 118:22-23

11. ఇది ప్రభువువలననే కలిగెను ఇది మన కన్నులకు ఆశ్చర్యము అను లేఖనము మీరు చదువలేదా? అని అడుగగా
కీర్తనల గ్రంథము 118:22-23

12. తమ్మును గూర్చి ఆ ఉపమానము చెప్పెనని వారు గ్రహించి ఆయ నను పట్టుకొనుటకు సమయము చూచుచుండిరి గాని జన సమూహమునకు భయపడి ఆయనను విడిచిపోయిరి.

13. వారు మాటలలో ఆయనను చిక్కుపరచవలెనని, పరిసయ్యులను హేరోదీయులను కొందరిని ఆయన యొద్దకు పంపిరి.

14. వారు వచ్చిబోధకుడా, నీవు సత్యవంతుడవు; నీవు ఎవనిని లక్ష్యపెట్టనివాడవని మే మెరుగుదుము; నీవు మోమోటములేనివాడవై దేవుని మార్గము సత్యముగా బోధించువాడవు. కైసరుకు పన్నిచ్చుట న్యాయమా కాదా?

15. ఇచ్చెదమా ఇయ్యకుందుమా? అని ఆయన నడిగిరి. ఆయన వారి వేషధారణను ఎరిగిమీరు నన్ను ఎందుకు శోధించుచున్నారు? ఒక దేనారము1 నా యొద్దకు తెచ్చి చూపుడని వారితో చెప్పెను.

16. వారు తెచ్చిరి, ఆయనఈ రూపమును, పై వ్రాతయు, ఎవరివని వారి నడుగగా వారుకైసరువి అనిరి.

17. అందుకు యేసుకైసరువి కైసరునకును దేవునివి దేవునికిని చెల్లించుడని వారితో చెప్పగా వారాయననుగూర్చి బహుగా ఆశ్చర్యపడిరి.

18. పునరుత్థానము లేదని చెప్పెడి సద్దూకయ్యులు ఆయన యొద్దకువచ్చి

19. బోధకుడా, తనభార్య బ్రదికియుండగా ఒకడు పిల్లలు లేక చనిపోయినయెడల వాని సహోదరుడు వాని భార్యను పెండ్లిచేసికొని తన సహోదరునికి సంతా నము కలుగజేయవలెనని మోషే మాకు వ్రాసియిచ్చెను.
ఆదికాండము 38:8, ద్వితీయోపదేశకాండము 25:5

20. ఏడుగురు సహోదరులుండిరి. మొదటివాడు ఒక స్త్రీని పెండ్లిచేసికొని సంతానములేక చనిపోయెను

21. గనుక రెండవవాడు ఆమెను పెండ్లి చేసికొనెను, వాడును సంతా నము లేక చనిపోయెను; అటువలెనే మూడవవాడును చనిపోయెను.

22. ఇట్లు ఏడుగురును సంతానములేకయే చని పోయిరి. అందరివెనుక ఆ స్త్రీయు చనిపోయెను.

23. పునరుత్థానమందు వారిలో ఎవనికి ఆమె భార్యగా ఉండును? ఆమె ఆ యేడుగురికిని భార్య ఆయెను గదా అని అడిగిరి.

24. అందుకు యేసుమీరు లేఖనములనుగాని దేవుని శక్తినిగాని యెరుగక పోవుటవలననే పొరబడు చున్నారు.

25. వారు మృతులలోనుండి లేచునప్పుడు పెండ్లిచేసికొనరు, పెండ్లికియ్యబడరు గాని పరలోక మందున్న దూతలవలె నుందురు.

26. వారు లేచెదరని మృతులనుగూర్చిన సంగతి మోషే గ్రంథమందలి పొదను గురించిన భాగములో మీరు చదువలేదా? ఆ భాగములో దేవుడునేను అబ్రాహాము దేవుడను ఇస్సాకు దేవుడను యాకోబు దేవుడనని అతనితో చెప్పెను.
నిర్గమకాండము 3:2, నిర్గమకాండము 3:6, నిర్గమకాండము 3:16

27. ఆయన సజీవుల దేవుడు గాని మృతుల దేవుడు కాడు. కావున మీరు బహుగా పొరబడు చున్నారని వారితో చెప్పెను.

28. శాస్త్రులలో ఒకడు వచ్చి, వారు తర్కించుట విని, ఆయన వారికి బాగుగా ఉత్తరమిచ్చెనని గ్రహించిఆజ్ఞ లన్నిటిలో ప్రధానమైనదేదని ఆయన నడిగెను.

29. అందుకు యేసు ప్రధానమైనది ఏదనగా ఓ ఇశ్రాయేలూ, వినుము; మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు.
ద్వితీయోపదేశకాండము 6:4-5, యెహోషువ 22:5

30. నీవు నీ పూర్ణహృదయముతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణవివేకముతోను, నీ పూర్ణబలముతోను, నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలె ననునది ప్రధానమైన ఆజ్ఞ.
యెహోషువ 22:5

31. రెండవది, నీవు నిన్నువలె నీ పొరుగువానిని ప్రేమింపవలె ననునది రెండవ ఆజ్ఞ; వీటికంటె ముఖ్యమైన ఆజ్ఞ మరే దియు లేదని అతనితో చెప్పెను
లేవీయకాండము 19:18

32. ఆ శాస్త్రిబోధకుడా, బాగుగా చెప్పితివి; ఆయన అద్వితీయుడనియు, ఆయన తప్ప వేరొకడు లేడనియు నీవు చెప్పిన మాట సత్యమే.
ద్వితీయోపదేశకాండము 4:35, 1 సమూయేలు 15:22, యెషయా 45:21

33. పూర్ణ హృదయముతోను, పూర్ణవివేకముతోను, పూర్ణ బలముతోను, ఆయనను ప్రేమించుటయు ఒకడు తన్ను వలె తన పొరుగువాని ప్రేమించుటయు సర్వాంగ హోమములన్నిటికంటెను బలులకంటెను అధికమని ఆయనతో చెప్పెను.
హోషేయ 6:6, ద్వితీయోపదేశకాండము 4:35, 1 సమూయేలు 15:22, యెషయా 45:21

34. అతడు వివేకముగా నుత్తరమిచ్చెనని యేసు గ్రహించి నీవు దేవుని రాజ్యమునకు దూరముగ లేవని అతనితో చెప్పెను. ఆ తరువాత ఎవడును ఆయనను ఏ ప్రశ్నయు అడుగ తెగింపలేదు.

35. ఒకప్పుడు యేసు దేవాలయములో బోధించుచుండగా క్రీస్తు, దావీదు కుమారుడని శాస్త్రులు చెప్పుచున్నా రేమి?

36. నేను నీ శత్రువులను నీకు పాదపీఠముగా ఉంచు వరకు నీవు నా కుడివైపున కూర్చుండుమని ప్రభువు నా ప్రభువుతో చెప్పెను అని దావీదే పరిశుద్ధాత్మవలన చెప్పెను.
కీర్తనల గ్రంథము 110:1

37. దావీదు ఆయ నను ప్రభువని చెప్పుచున్నాడే, ఆయన ఏలాగు అతని కుమారుడగునని అడిగెను. సామాన్యజనులు ఆయన మాటలు సంతోషముతో వినుచుండిరి.

38. మరియు ఆయన వారికి బోధించుచు నిట్లనెను శాస్త్రులనుగూర్చి జాగ్రత్తపడుడి. వారు నిలువు టంగీలు ధరించుకొని తిరుగుటను, సంతవీధులలో వందనములను

39. సమాజమందిరములలో అగ్రపీఠములను, విందులలో అగ్ర స్థానములను కోరుచు

40. విధవరాండ్ర యిండ్లు దిగమింగుచు, మాయవేషముగా దీర్ఘప్రార్థనలు చేయుదురు.వీరు మరి విశేషముగా శిక్ష పొందుదురనెను.

41. ఆయన కానుకపెట్టె యెదుట కూర్చుండి, జనసమూహము ఆ కానుకపెట్టెలో డబ్బులు వేయుట చూచు చుండెను. ధనవంతులైన వారనేకులు అందులో విశేషముగా సొమ్ము వేయుచుండిరి.
2 రాజులు 12:9

42. ఒక బీద విధవరాలు వచ్చి రెండు కాసులు వేయగా

43. ఆయన తన శిష్యులను పిలిచికానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటె ఈ బీద విధవరాలు ఎక్కువ వేసెనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.

44. వారందరు తమకు కలిగిన సమృద్ధిలోనుండి వేసిరి గాని, యీమె తన లేమిలో తనకు కలిగినదంతయు, అనగా తన జీవనమంతయు వేసెనని చెప్పెను.బైబిల్ అధ్యయనం - Study Bible
12:1 ఒక మనుష్యుడు ద్రాక్షతోట నాటించి అనే మాటలు యెషయా 5:1-7 వచనాల్లో పాటను గుర్తు చేస్తుంది. ఈ పాటలో ఇశ్రాయేలు ద్రాక్షతోటతో పోల్చబడింది. కాపులు అంటే ఇశ్రాయేలు నాయకులు, 

12:2-5 పంటకాలము అంటే ద్రాక్షతోట నాటిన కనీసం 5 సంవత్సరాలకు వస్తుంది (లేవీ 19:23-24). అవమానించబడిన సేవకులంటే ప్రవక్తలు అని భావం.

12:6 ఈ ఉపమానంలో ప్రియ కుమారుడు యేసు. "ప్రియమైన" అనే విశేషణం మార్కు సువార్తలో 2 సార్లు ఉపయోగించ బడింది. యేసును సూచిస్తూ ఈ రెండుసార్లూ తండ్రే మాట్లాడాడు (1:11; 9:7). 

12:7 ఇతని చంపుదము రండి అనే మాటలు యోసేపు సహోదరులు పలికినవి (ఆది 37:20).

12:8 చంపబడడానికి ముందు కుమారుడు వెలుపలికి త్రోసివేయబడ్డాడు అని మత్తయి (మత్తయి 21:39), లూకా (లూకా 20:15)లు రాశారు. పట్టుకొని, చంపి... వెలుపల పారవేసిరి అని మార్కు రాసిన క్రమాన్ని బట్టి చూస్తే వారు కుమారునికి సరైన సమాధిని కూడా ఇవ్వలేదని అర్థమవుతుంది. 

12:9. ద్రాక్షతోట (వ. 1)ను నాటి, సేవకులనూ కుమారుణ్ణి పంపిన వ్యక్తే యజమానిగా గుర్తించబడ్డాడు. యితరులకు ఆ ద్రాక్షతోట యిచ్చును అంటే రాబోయే కాలంలో అన్యజనుల మధ్య సువార్త పరిచర్యను సూచిస్తుంది. 

12:10-11 కీర్తన 118:22-23 ను ఉటంకించి యేసు ముగించాడు. ఇందులో మొదటి వచనం మరికొన్ని చోట్ల కూడా ప్రస్తావించబడింది (లూకా 20:17; అపొ.కా.4:11; రోమా 9:33; 1పేతురు 2:6-8), కేవలం మార్కు మత్తయి (మత్తయి 21:42) లు మాత్రమే కీర్తన 118:23ను చేర్చారు. ఇది చాలా బలమైన దైవికాంశాన్ని జోడిస్తుంది. మూలకు తలరాయి అంటే పునాది మూలరాయిని గానీ, స్తంభంపై భాగంలో ఉండే రాయిని గానీ లేదా ధనురాకారంలో ఉండే నడిమిరాయిని గానీ సూచిస్తుంది.

12:12 జనసమూహమునకు భయపడిన సంగతి 11:32; 14:1-2 లో కూడా ప్రస్తావించబడింది. 

12:13 పరిసయ్యులును (2:15-17 నోట్సు చూడండి), హేరోదీయులును (3:6 నోట్సు చూడండి) పంపించబడ్డారనే వాస్తవం ఆమోద పూర్వకంగా అప్పగించబడిన పనిని సూచిస్తుంది. గలిలయలో యేసుకు వ్యతిరేకంగా కుట్ర పన్నడంలో ఈ రెండు గుంపులూ ఏకమయ్యాయి (3:6). మాటలలో యేసును చిక్కుపరచ వలెనని వాళ్లు ఆశపడ్డారు.

12:14 పరిసయ్యుల హేరోదీయుల మనసులో ఉన్న పన్ను ఏమిటంటే క్రీ.శ. 6 లో యూదయ రోమా సామ్రాజ్య పరిధిలోనికి వచ్చినప్పుడు విధించబడిన రోమా తలసరి పన్ను, ఈ పన్ను తమను రోమా ప్రభుత్వానికి బానిసలని సూచిస్తుంది కాబట్టి ఈ పన్నంటే యూదులకు అసహ్యం. 

12:15 యేసు “పన్ను చెల్లించాలని” చెబితే, ఆయన రోమా సామ్రాజ్యాన్ని సమర్థించేవాడని ముద్రపడిపోతుంది, జనసమూహాలు ఆయనకు దూరమవు తారు. పన్ను చెల్లించనక్కరలేదని చెబితే పరిసయ్యులూ హేరోదీయులూ ఆయనను తిరుగుబాటుదారుడని తృణీకరిస్తారు (లూకా 20:20). యేసు ఈ సంగతులు తెలుసుకోలేనంత అమాయకుడు కాదు. ఆయన వాళ్ల వేషధారణను చూశాడు. తనను వాళ్లు శోధించుచున్నారని గ్రహించాడు. దేనారము ఒక రోజు పనికి చెల్లించే వేతనంతో సమానం (మత్తయి 20:9-10). 

12:16-17 తిబెరి కైసరు (క్రీ.శ.14-37 మధ్య కాలం) రూపమును అతని దైవత్వాన్ని గురించి తెలియచేసే పై వ్రాతయు కూడా దేనారంపై రాయబడి ఉంటుంది. ఇవ్వడం గురించి వాళ్లు యేసును అడిగారు కాబట్టి (వ.14-15), సొంతదారుతనం గురించి పాఠంతో ఆయన జవాబు చెప్పాడు. ఆ నాణెం మీద కైసరు బొమ్మ ఉంది, అందువల్ల అది కైసరుకి చెందినది. మానవ ప్రభుత్వపు చట్టబద్దతను యేసు సమర్థించాడు. అయితే ఆ అంశాన్ని మరింత పైస్థాయికి తీసుకెళ్లాడు. దేవునికి చెందినవి ఏమిటో ఆయన తెలియచేయలేదు; మానవులు దేవుని పోలికలో ఉన్నారు కాబట్టి (ఆది 1:27), ఆయన స్వరూపధారులంగా మనల్ని మనమే దేవునికి అర్పించుకోవలసిన అవసరం ఉంది. 

12:18 క్రీ.పూ. రెండవ శతాబ్దంలో మక్కబీయులు తిరుగుబాటు చేసినప్పుడు సదూకయ్యులు ఉనికిలోకి వచ్చారు. వాళ్లకు రాజకుటుంబీకులతో, యాజకవర్గాలతో సన్నిహిత సంబంధాలు ఉండేవి. మోషే రాసిన పంచకాండాలనే వాళ్లు లేఖనంగా పరిగణించేవారు. శరీర పునరుత్థానాన్నీ, భవిష్యత్తులో జరిగే తీర్పునూ, దేవదూతల ఉనికినీ, దయ్యాలనూ, ఆత్మలనూ వాళ్లు తృణీకరించేవాళ్లు, మానవ స్వతంత్రతను ఒప్పుకునేవారు. (వ.18; అపొ.కా. 23:6-8; జోసీఫస్ రచనలు). 

12:19-23 మోషే రాసిన గ్రంథాల్లో ఉన్న ఒక సంగతిని ఆధారం చేసుకుని వాళ్లు యేసును సమీపించారు. ఇది దేవర(మరిది) ధర్మం గురించిన అంశం (ద్వితీ 25:5-6). చనిపోయిన ఒక వ్యక్తి కుటుంబ వారసత్వాన్నీ, స్వాస్వాన్నీ భద్రపరచడం కోసం అతని సోదరుడు విధవరాలైన తన వదినను వివాహం చేసుకోవాలని ధర్మశాస్త్రం చెబుతుంది. దీన్ని ఆధారం చేసుకుని, పునరుత్థానం అనే సిద్ధాంతం ఎంత అవివేకంతో కూడిందో నిరూపించాలని సదూకయ్యులు ఈ సన్నివేశాన్ని సృష్టించారు. పునరుత్థానం తరువాతి జీవితం కూడా ప్రస్తుత ఈలోక జీవితం మాదిరిగానే ఉంటుందనే వారి ఊహ వారి ప్రశ్నలో కనబడుతుంది. 

12:24-27 భవిష్యత్తులో జీవితం భూమిపైన జీవితానికి భిన్నంగా ఉంటుందని యేసు ప్రకటించాడు. పరలోకంలో మనుషులు పెండ్లి చేసికొనరు, పెండ్లికియ్యబడరు. యేసు వారికి జవాబు చెప్పడానికి సదూకయ్యులు లేఖనంగా దేనినైతే అంగీకరించారో ఆ పా.ని. భాగాన్నే, మరి ముఖ్యంగా నిర్గమకాండం 3వ అధ్యాయంలో మోషే గ్రంథమందలి పొద గురించిన వాక్యభాగాన్ని ఉపయోగించాడు. దేవుడు మోషేతో మాట్లాడిన సమయానికి ఎంతో కాలం క్రితం అబ్రాహాము... ఇస్సాకు... యాకోబులు మరణించారు. అయితే దేవుడు తన్నుతాను వారి దేవుడుగా ప్రకటించుకున్నాడు. దేవుడు సజీవుల దేవుడు కానీ మృతుల దేవుడు కాదు కాబట్టి వాళ్లు సజీవులుగానే ఉన్నారని పా.ని. లేఖనం చెబుతుంది. 

12:28-40 శాస్త్రులతో యేసుకు ఎదురైన మూడు పోరాటాలను ఈ వాక్యభాగం వివరిస్తుంది. శాస్త్రులు ప్రధాన యాజకులకూ పెద్దలకూ మిత్రపక్షంగా ఉండేవారు(11:27 నోట్సు చూడండి). 

12:28 శాస్త్రులలో ఒకడు అనేమాట యేసును సవాలు చేయడానికి ఇంకా ఇతర శాస్త్రులు కొందరు అక్కడే నిలబడి ఉన్నారని తెలియచేస్తుంది (మత్తయి 22:34-35తో పోల్చండి). ఒక గుంపు కాకుండా కేవలం ఒకే వ్యక్తి దేవాలయంలో యేసును సమీపించడం ఇదే తొలిసారి. ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనదేదని అతడు తెలుసుకోవాలను కున్నాడు. మోషే రాసిన గ్రంథాల్లో 613 ఆజ్ఞలను రబ్బీలు లెక్కగట్టారు. 365 నిషిద్ధ ఆజ్ఞలనీ, 248 చేయాల్సిన ఆజ్ఞలనీ వాళ్లు వాటిని వర్గీకరించారు. అంతేకాదు, బరువైన ఆజ్ఞలు, మిక్కిలి అల్పమైన ఆజ్ఞలు అని వాటిని విభాగించారు. (మత్తయి 5:19లో “మిగుల అల్పమైన” ఆజ్ఞ). 

12:29-30 భక్తి గల యూదులు ప్రతీ ఉదయ సాయంత్రపు వేళల్లో షేమా అనే ద్వితీ 6:4-5 లేఖన భాగాన్ని వల్లించేవారు. యేసు ఈ వాక్యభాగాన్ని ప్రస్తావించాడు. దేవుడొక్కడే అనే ఏక దైవారాధనను (అద్వితీయ ప్రభువు) ఈ మాటలు దృఢంగా నొక్కి చెప్పాయి. ప్రజలు దేవునితో ప్రేమ సంబంధం కలిగి ఉండాలని గుర్తించాయి. హృదయము (ఇష్టాయిష్టాలు), ఆత్మ (ప్రాణం), వివేకము (మనస్సు), బలము (చిత్తం) మొత్తం వ్యక్తిత్వమంతటితో ఆయనను ప్రేమింపవలెనని బలంగా చెప్పాయి. 

12:31 శాస్త్రి యేసును ఒక ఆజ్ఞ కోసం అడిగాడు, అయితే యేసు అతనికి రెండు ఆజ్ఞలిచ్చాడు. దేవుని ప్రేమించాలనే మొదటి ఆజ్ఞలోనే పొరుగువారిని ప్రేమించాలనే ఆజ్ఞకు మూలం ఉంది. యేసుకు ముందు ఏ ఒక్కరూ ఈ రెండు ఆజ్ఞల్నీ కలపలేదు. (లేవీ 19:18; ద్వితీ 6:5), అయితే ఆయన అనుచరులకు అది ఒక ప్రమాణంగా మారింది (రోమా 13:8-10; గలతీ 5:14; యాకోబు 2:8-11; 1యోహాను 4:11,19-20). 

12:32-33 శాస్త్రి స్పందన, యేసు అభినందనలను కేవలం మార్కు మాత్రమే రాశాడు. యేసు చెప్పిన ప్రేమ సర్వాంగ హోమములకంటెను బలులకంటెను అధికమని ఆ శాస్త్రి గ్రహించాడు. 

1234 ఆ శాస్త్రి వివేకముగా జవాబిచ్చాడని యేసు చెప్పాడు. యేసుకు తీర్పు తీర్చడానికి వచ్చిన శాస్త్రికే యేసు తీర్పు తీర్చి పంపించాడు, ఇది భలే గమ్మత్తైన విషయం. ప్రశ్నించే వాళ్లందరినీ నోరు మూయించిన తర్వాత ఇప్పుడు యేసే ఒక ప్రశ్నను సంధించాడు (వ.35).

12:35 యేసు శాస్త్రులకు సంధించిన ప్రశ్న క్రీస్తు (1:1; 8:29) దావీదు కుమారుడనే (10:47-48 నోట్సు చూడండి) విషయంలో వారి అవగాహనకు సంబంధించింది. 2సమూ 7:12-16 లో దేవుని వాగ్దానాన్ని బట్టి యేసు కాలంలో మెస్సీయను దావీదు కుమారుడని అందరూ భావించేవాళ్లు.

12:36-37 యేసు కీర్తన 110:1 ని ఉటంకించాడు. కొ.ని.లో అతి తరచుగా (33 సార్లు) ప్రస్తావించబడిన పా.ని. వాక్యభాగం ఇదే. ఈ కీర్తనను రాసింది. దావీదనీ, పరిశుద్దాత్మ ప్రేరేపణతో దానిని రాశాడనీ యేసు ధృవీకరించాడు (2 సమూ 23:2; అపొ.కా.1:16లతో పోల్చండి), మెస్సీయను దావీదు కుమారుడగునని శాస్త్రులు గుర్తించారు (వ.35-36) కానీ, క్రీస్తు తనకు ప్రభువు అని దావీదు చెప్పాడు. కాబట్టి మెస్సీయ కేవలం దావీదు సంతానమే కాదు, ఆయన దావీదుకి ప్రభువు కూడా! 

12:38-39 మరియు ఆయన... ఇట్లనెను అనేమాట శాస్త్రులనూ పరిసయ్యు లనూ తీవ్రంగా దుయ్యబట్టిన సుదీర్ఘ భాగంలో కేవలం వ.38-40 లు ఒక సంక్షిప్తభాగం అని తెలియచేస్తుంది (మత్తయి 23; లూకా 11:37-54లతో పోల్చండి). శాస్త్రులు వేటిలో ఆనందించేవారో దానికి నాలుగు ఉదాహరణలు చెప్పి, వాళ్ల ఆడంబరత్వాన్ని యేసు ముందుగా ఖండించాడు. వాళ్లు ధరించే నిలువుటంగీలు పండుగల్లో వేసుకునే వస్త్రాలు. ప్రతీరోజూ వాటిని ధరించడం ఆడంబరమే గానీ అవసరం కాదు. సంతవీధులలో వందనములను అనే మాట శాస్త్రులు వచ్చినప్పుడు ప్రజలు లేచి నిలబడాలనే వాస్తవాన్ని ప్రస్తావిస్తుంది. సమాజమందిరములలో అగ్రపీఠములు పై కూర్చున్నవారికి బోధకులుగా ఉన్నతమైన వ్యక్తులుగా గుర్తింపు ఉండేది. విందులలో అగ్రస్థానములు గురించి లూకా 14:7-11 నోట్సు చూడండి. 

12:40 శాస్త్రుల దుర్నీతిని బట్టి వేషధారణను బట్టి యేసు వాళ్లను గద్దించాడు. విధవరాండ్రు అత్యంత దయనీయ స్థితిలో ఉండేవారు. అపహరించడం ద్వారా గానీ అక్రమంగా గానీ వాళ్లను దోచుకోవడం హేయమైన పాపం (యెషయా 1:17,23; 10:2; యిర్మీయా 7:6; యెహె 22:7; జెకర్యా 7:10). ఈ దురాశపరులైన శాస్త్రులను యేసు దొంగలు అని చెప్పాడు. వీరు మరి విశేషముగా శిక్ష పొందుదురనెను అనేమాట దేవుని అంత్యకాల తీర్పు గురించి ప్రస్తావిస్తుంది (9:42-48తో పోల్చండి). 

12:41 ఇంతకు ముందు యేసు దేవాలయంలో అన్యజనులుండే ప్రాంగణంలో ఉన్నాడు. కానుకల పెట్టె స్త్రీల ప్రాంగణంలోనే ఉండేది, స్త్రీలు మాత్రమే అక్కడికి అనుమతించబడాలని కాదు గాని స్త్రీలు దేవాలయంలో అంతవరకు రావడానికి మాత్రమే అవకాశముండేది. కానుకల పెట్టెలో బూరల రూపంలో ఉండే 13 సరుగులు (అరలు) ఉండేవి, ఆరాధించడానికి వచ్చేవాళ్లు తమ స్వేచ్ఛార్పణలను అందులో వేసేవారు. బూర ఆకారంలో ఉన్న అరలు వాటిలో పడిన నాణెల శబ్దాన్ని ఇనుమడింపజేసేవి. ధనవంతులైన వారు విశేషముగా సొమ్ము వేసినప్పుడు ఆ విషయం స్పష్టంగా తెలిసేది. 
12:42-44 రెండు కాసులు అంటే అతి తక్కువ విలువున్న రాగి నాణాలు. వీటిని లెఫ్తా అని పిలుస్తారు. ధనవంతులు వేసిన అధిక మొత్తాలకంటే విధవరాలు వేసిన కానుక ఎంతో విలువైంది. ఎందుకంటే ఆమె ఎంతో పేదరికంలో ఉన్నప్పటికీ ఆమె ఆ కానుక వేసింది. తన జీవనమంతయు అనేమాటకు ఆ తర్వాత భోజనం చేయడానికి ఆమె దగ్గర తగినంత ధనం లేదు అని చెప్పుకోవచ్చు. 


Shortcut Links
మార్కు - Mark : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary |