10:1 ఇది 9:1-6 లో ప్రస్తావించబడినప్పటికీ, యేసు ఇంతకుముందు అపొస్తలులను యిద్దరిద్దరినిగా పంపించినట్లు కనబడుతుంది. (మార్కు 6:7 చూడండి). తాను వెళ్లడానికి ముందే సువార్త సందేశంతో యూదయ ప్రాంతానికి వెళ్లమని 70 (కొన్ని ఆంగ్లానువాదాల్లో 72 మంది అని ఉంది) మందిని ఆయన పంపించాడని ఈ వచనంలో ఉంది.
10:2 సువార్త ప్రకటించడానికి తాను పంపించిన 70 మంది కూడా సరిపోనంత విస్తారముగా ఆత్మసంబంధమైన కోత ఉందని యేసు చెబుతున్నాడు. ఈ సందేశాన్ని తీసుకెళ్లడానికి మరింకెంతోమంది అవసరం, ఈ అవసరం తీరాలంటే ప్రార్థనలు చేయాలి.
10:3 తోడేళ్ల మధ్యకు గొర్రెపిల్లలను అనే మాట యూదుమతంలో ఉన్న సాధారణ అలంకారం. ప్రమాదకరమైన పరిస్థితిలో ఉండడం అని దానికి అర్థం.
10:4 ప్రయాణం కోసమైన వస్తువుల గురించి 9:3-5 నోట్సు చూడండి.
10:5-6 సమాధానమగు (హెబ్రీ. షాలోమ్) గాక అనేది యూదులు ఒకరినొకరు పలకరించుకొనే సాంప్రదాయం . అయితే ఈ పదం నిజానికి “సంపూర్ణత లేదా క్షేమం" గురించి మాట్లాడుతుంది. “పాత్రుడు” అనే మాట “ఒకని స్వభావాన్ని తెలియచేసే యూదుల పరిభాష (అపొ.కా. 4:36). ఈ సందర్భంలో సమాధాన పాత్రుడు, మీ సమాధానము అనే మాటలు యేసుక్రీస్తులో విశ్వాసం ద్వారా దేవునితో సమాధానం (రోమా 5:1) అనే సందేశాన్ని ప్రకటిస్తున్న 70 మందికి సంబంధించినవిగా కనిపిస్తాయి.
10:7 ఆ యింటిలోనే యుండుడి అనే మాట గురించి 9:3-5 నోట్సు చూడండి. పనివాడు తన జీతమునకు పాత్రుడు అనేది న్యాయానికి సంబంధించి ప్రాథమిక నియమం. దేవుని వాక్య పరిచారకులకు తమ పనికి తగిన విధంగా జీతభత్యాలను సమకూర్చాలని చెబుతున్న సందర్భంలో అపొస్తలుడైన పౌలు ఈ మాటలను పేర్కొన్నాడు (1తిమోతి 5:17-18).
10:8-9 ఒక పట్టణము లోనివారు 70 మంది శిష్యులను చేర్చుకుంటే, ప్రజల హృదయాలు సువార్త సందేశాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాయని అది సూచిస్తుంది. 70 మందికి యేసు అప్పగించిన సువార్త ప్రకటన, స్వస్థత పరిచర్యల్లో దేవుని రాజ్యముకు సంబంధించిన వర్తమానకాల అంశాలున్నాయి.
10:10-11 పాదధూళి దులిపివేయుట గురించి 9:3-5 నోట్సు చూడండి. దేవుని రాజ్యము సమీపించియున్నది గురించి వ.8-9 నోట్సు చూడండి.
10:12 ఆ దినమున అంటే తీర్పు దినమున అని అర్థం. సొదొమ చేసిన పాపాన్ని బట్టి ప్రభువు దానిని నాశనం చేశాడు (ఆది 19:23-24).
10:13-14 కొరాజీను... బేత్సయిదాలు గలిలయలో కపెర్నహూముకు దగ్గరగా ఉండే పట్టణాలు. తూరు, సీదోనులు గలిలయకు వాయవ్యదిశలో మధ్యధరా సముద్రతీరంలో నున్న ఫేనికయకు చెందిన అన్యజాతుల నగరాలు. దుఃఖించేవారు గోనెపట్ట కట్టుకుని తమపై బూడిద చల్లుకునేవారు పాపం విషయంలో పశ్చాత్తాపపడడానికి కూడా ఇది సాదృశ్యంగా ఉండేది (నెహెమ్యా 9:1; యోనా 3:5).
10:15 గలిలయలోని మరి యే ఇతర పట్టణంలో కంటే కూడ కపెర్నహూములోనే యేసు పరిచర్యలో ఎక్కువ సమయాన్ని గడిపాడు. అయినా అహంకారంతో (ఆకాశము మట్టుకు హెచ్చించబడెదవా) ఈ నగర ప్రజలు యేసును తృణీకరించారు. వారి అవిశ్వాసం మూలంగా వాళ్లు పాతాళమునకు పంపబడతారు. (పాతాళం అంటే మరణం అనీ మృతుల లోకం అనీ మరణం తర్వాత శిక్ష అనీ అర్థం).
10:16 ఇక్కడ నియమం ఏంటంటే శిష్యులను తృణీకరించడం చివరికి తండ్రియైన దేవుణ్ణి (నన్ను పంపినవానిని) తృణీకరించడమే. ఎందుకంటే తండ్రి కుమారుణ్ణి పంపించాడు. కుమారుడే సువార్తను ప్రకటించడానికి రోగాలను స్వస్థపరచడానికీ (వ.1,9 ) 70 మంది శిష్యులను పంపించాడు.. ఈ 70 మందిని పంపించింది క్రీస్తే కాబట్టి, వీరు చెప్పిన దాన్ని వినడమంటే యేసు మాటను విన్నట్లే. అదేవిధంగా వీళ్లను తృణీకరించడమంటే యేసును తృణీకరించడమే. అంతిమంగా యేసును తృణీకరించడమంటే తండ్రియైన దేవుణ్ణి తృణీకరించడమే.
10:17-20 ఆ 70 మంది చేసిన స్వస్థతల్లో దయ్యా లను వెళ్లగొట్టడం కూడా భాగమే (వ.9). సాతాను... ఆకాశము నుండి పడుట అనే మాట యెషయా 14:12 వచనాన్ని సూచిస్తున్నదని కొందరు వ్యాఖ్యానకర్తలు అభిప్రాయపడుతున్నారు. యెషయాలో ఉన్న ఈ వాక్యభాగంలో యెషయా బబులోనుపై తీర్పు ప్రకటిస్తున్నప్పటికీ, సాతాను పతనమైన సందర్భాన్ని ప్రవక్త బబులోనుకు అన్వయించాడని చాలామంది దీన్ని అర్థం చేసుకున్నారు. శిష్యుల పరిచర్య ద్వారా సాతాను మరింతగా ఓటమి పాలయ్యాడని చెప్పడానికి సాతాను పతనమైన నాటి భాషను లూకా ఈ వాక్యభాగంలో ఉపయోగిస్తున్నాడు. యెషయా 14:12 వచనం సాతానును ప్రస్తావించట్లేదని, వాని అధికారంపై శిష్యుల విజయాన్ని యేసు అలంకార రీతిలో వివరిస్తున్నాడని ఇతరులు వ్యాఖ్యా నిస్తారు. దయ్యాలను వెళ్లగొట్టడానికి గొప్ప శక్తి, అధికారం అవసరమే. అయితే పరలోకంలో గొర్రెపిల్ల జీవగ్రంథంలో వాళ్ల పేర్లు రాయబడ్డాయన్నది మరింత ముఖ్యమైన విషయమని యేసు వాళ్లను హెచ్చరిస్తున్నాడు (ప్రక 13:8).
10:21-22 ఇక్కడ పరిశుద్దాత్మ గురించిన ప్రస్తావన పరిశుద్దాత్మకు లూకా ఇచ్చిన ప్రాధాన్యతలో భాగం. ఆ ప్రాంతంలో ఉండే జ్ఞానులు వివేకులు ఈ 70 మంది శిష్యుల పరిచర్యను తృణీకరించారు. అయితే సామాన్యులు పసిబాలురు వాళ్ల - సందేశాన్ని అంగీకరించారు. ఇది దేవుని ప్రణాళికలో భాగం. దేవుని దృష్టికి అనుకూలమైన (ఎఫెసీ 1:3-11 చూడండి) ఈ సంగతులు కొందరికి మరుగుచేయబడ్డాయి, కొందరికి బయలుపరచబడ్డాయి. కుమారుడు బయలుపరిస్తే తప్ప ఆత్మసంబంధంగా మృతులైన మనుషులకు తండ్రియైన దేవుణ్ణి, ఆయన కుమారుని ఎరగడం అసాధ్యం.
10:23-24 క్రీస్తు పరిచర్యను, చివరికి ఆయన అప్పగించిన అధికారాన్ని స్వస్థతల్లోనూ దయ్యాల్ని వెళ్లగొట్టడంలోను చూడడం నిజంగా ధన్యకరమైన విషయమే. యేసు చేస్తున్న కార్యాలను పా.ని. ప్రవక్తలును, రాజులును మాత్రమే కాదు చివరికి దేవదూతలు కూడా చూడగోరి... వినగోరి ఉన్నారని పేతురు తెలియజేశాడు (1 పేతురు 1:22 చూడండి).
10:25 ధర్మశాస్రోపదేశకుడు అంటే శాస్త్రి అని అర్థం (11:45-46, 5253). ఈ శాస్త్రుల్లో చాలామంది పరిసయ్యులు కూడా ఉండేవారు. ఇతడు అడిగిన ప్రశ్న యూదుమతంలో ప్రామాణికమైనది. యేసును శోధించు (పరీక్షించు) ఉద్దేశంతో అతడు ఈ ప్రశ్న అడిగాడు. యూదు జాతి వారసత్వంపైనా తమ సత్రియల పైనా తమ నిత్యత్వం ఆధారపడి ఉందని చాలామంది యూదులు భావించేవారని నిత్యజీవమునకు వారసుడనగుటకు అనే మాట చూపిస్తుంది.
10:26-28 శాస్త్రి అడిగిన ప్రశ్నకు అతని చేతనే జవాబు చెప్పించేలా యేసు పరిస్థితిని తారుమారుచేసి, లేవీ 19:18, ద్వితీ 6:5 లోని వచనాలను జవాబుగా చెప్పినందుకు అతణ్ణి అభినందించాడు. దేవుడైన ప్రభువును... నీ పొరుగువాని ప్రేమించడం మూలంగా నిత్యజీవాన్ని సంపాదించడం సాధ్యమని యేసు చెప్పలేదు. యేసు తప్ప మరి యే ఇతర మనుష్యుడూ ప్రతీ పరిస్థితిలోనూ పరిపూర్ణంగా ప్రేమించ లేకపోయారు. లేఖనాల్లో హృదయము... మనస్సు... వివేకము అనే పదాలు కొన్నిసార్లు పర్యాయపదాలుగా ఉపయోగించబడ్డాయి. కాబట్టి ఈ పదాలను మనిషి ఉనికిలో ఉన్న భిన్న అంశాలు గురించి మాట్లాడినవిగా తీసుకోకూడదు. ఈ పదాలు వ్యక్తి సంపూర్ణతను సూచిస్తున్నాయి.
10:29 మొదటి ప్రశ్నకు సరైన జవాబు చెప్పిన తర్వాత, ఈ వ్యక్తి ఒక ముఖ్యమైన విషయంలో స్పష్టతను కోరాడు. పొరుగువారిలో కొన్నిరకాల - వ్యక్తులను ప్రేమించడం సులభం. మరికొందరు గొడవలు పెట్టుకునేవారిగా, భిన్నమతస్థులుగా, నైతికంగా పతనమైనవారిగా ఉంటారు కాబట్టి అలాంటి వారిని ప్రేమించడం చాలా కష్టం. కొన్ని రకాల పొరుగువారికి వ్యతిరేకంగా తనకున్న పక్షపాత ధోరణిని యేసు సమర్థిస్తాడని ఆ వ్యక్తి భావించినట్లు కనబడుతుంది.
10:30-32 యెరూషలేము నుండి యెరికో పట్టణానికి మధ్య 17 మైళ్ల దూరం ఉంటుంది. యెరూషలేముకు 3 వేల అడుగుల కంటే దిగువ ప్రాంతంలో యెరికో ఉంటుంది. ఈ రెండు పట్టణాల మధ్యనున్న ఎడారి ప్రాంతపు రహదారిలో ప్రయాణించడం చాలా ప్రమాదకరం. ఆ రహదారి చుట్టూ ఉండే ఎడారి ప్రాంతంలో దొంగలు పొంచి ఉండగల ప్రదేశాలు చాలా ఉన్నాయి. యాజకుడు... లేవీయుడొకడు త్రోవకు వేరే ప్రక్కగా వెళ్లిపోయి ఉంటారు. ఎందుకంటే ఈ గాయపడిన వ్యక్తి మరణించి ఉంటాడు, అతణ్ణి తాకితే ధర్మశాస్త్రం ప్రకారం తాము అపవిత్రులమవుతామని వారు భావించి ఉంటారు. ఈ వ్యక్తికి సహాయపడితే, ఆ దొంగలే తమపై కూడా దాడి చేస్తారేమోనన్న భయంతోనో, ఆ వ్యక్తికి సహాయపడి అసౌకర్యానికి గురవ్వడం ఎందుకనే ఆలోచనతోనో అతణ్ణి దాటి వెళ్ళిపోయి వుండవచ్చు.
10:33-35 యూదులు ఇతర జాతి వ్యక్తులను వివాహం చేసుకోవడం మూలంగా జన్మించిన సంకరజాతి ప్రజలే సమరయులనీ, వీరు తప్పు విధానంలో దేవుని ఆరాధిస్తున్నందున దోషులనీ యూదులు భావించేవారు.
యూదులకు అంత బద్ద విరోధి అయిన వ్యక్తి గాయపడిన ఒక యూదునిపై జాలిపడి, అతని ఆరోగ్యాన్ని కుదుటపరిచేందుకు ఖర్చులు భరించడం,యూదుల మతాధికారులు ఇద్దరూ ఆ పని చేయకపోవడం ఒక యూదునికి ఎంతో అవమానకరం.
10:36-37 నా పొరుగువాడెవడు? (వ.29 నోట్సు చూడండి) అనే ప్రశ్నతోనే ఈ ఉపమానం మొదలయ్యింది. ఇప్పుడు యేసు ఆ ప్రశ్నకు తిరిగి వచ్చాడు. దొంగల దాడికి గురైన వ్యక్తిపట్ల దయగల కార్యాలను చేసి సమరయుడు అతనికి మంచి పొరుగువానిగా నిరూపించుకున్నాడని చెప్పడమే ఆయన ఉద్దేశం. జాలిపడినవాడు సమరయుడనే వాస్తవాన్ని తృణీకరించడం శాస్త్రికి అసాధ్యమయ్యింది. ఈ ఉపమానంలో మంచి సమరయుడు ఆ యూదునిపై ఏవిధంగా ప్రేమ చూపించాడో అదే విధంగా యూదులు కూడా సమరయులైన తమ పొరుగువారిని ప్రేమించాలని నీవును వెళ్ళి ఆలాగు చేయుమని యేసు చెప్పిన జవాబు నొక్కి చెబుతుంది.
10:38-39 వ.38 లో ఉన్న గ్రామము బేతనియ. ఈ గ్రామం ఒలీవల పర్వతానికి పైన, యెరూషలేముకు తూర్పుదిశలో రెండు మైళ్ల దూరంలో ఉంది. మృతుల్లో నుంచి యేసు తిరిగి లేపిన లాజరు (యోహాను 11:1-44) సహోదరీలే ఈ మార్త... మరియలు. యేసు పాదముల యొద్ద కూర్చుండి... వినుట అనేది అంకితభావం గల శిష్యుడు చేసే ముఖ్యమైన పని.
10:40-42 యేసు నుంచి నేర్చుకోవడమే మార్తకు అత్యంత ఉన్నతమైన ప్రాధాన్యతగా ఉండవలసినదైనా, ఆమె దృష్టి వేరే విషయాలపైకి మళ్ళి తొందరపడింది. ఇంట్లో జరగాల్సిన పనుల గురించి గాభరాపడుతూ తన సహోదరియైన మరియపై విసుక్కుంది. ఎందుకంటే అలాంటి పరిస్థితిలో పురు షులకు పరిచర్య చేయడమే స్త్రీల బాధ్యత. శిష్యత్వం నిత్యమూ మెచ్చుకోదగిన ఎంపిక. మరియ దానిని ఎంచుకుంది. అది ఆమెయొద్ద నుంచి తీసివేయబడదు. మార్త ఎంపిక కూడా అదే అయ్యుండాలని యేసు సూచించాడు.