3:1 అధ్యా, 2 చూస్తే యూదుడైనా, అతడు సున్నతి పొందినా ప్రయోజనము లేదు అన్నట్లుగా కనిపించవచ్చు. కానీ 9:4-5లో యూదులకున్న అనేక ప్రయోజనాలను పౌలు చెప్పాడు. నేటి రోజుల్లో క్రైస్తవులైన తల్లిదండ్రులకు పుట్టడం, చర్చికి హాజరవ్వడం, బాప్తిస్మం పొందడం, క్రైస్తవ పాఠశాలకు హాజరవ్వడం, బైబిల్ చదవడం అనేవి ప్రయోజనాలే కానీ - ఇవేవీ మనలను రక్షించలేవు.
3:2 యూదుడుగా ఉండడంవల్ల ప్రయోజనాలు - ప్రతి విషయమందును అధికమే. దేవుడు పలికిన “పది మాటలు” లేక పది ఆజ్ఞలు వారు నేరుగా విన్నారు. (నిర్గమ 20:1-20), తరువాత అనేక మంది ప్రవక్తల ద్వారా దేవుని మాటలు వారి యొద్దకు వచ్చాయి. భూమిమీద ఉన్న మరి ఏ జనమునకు ఈ భాగ్యం కలుగలేదు.
3:3 కొందరు యూదులు అవిశ్వాసులైన నేమి? దేవుడు తన నిబంధనకు నమ్మకస్తుడై, తన వాగ్దానాలను నెరవేర్చుతాడు. ముఖ్యంగా మెస్సీయాయైన యేసు క్రీస్తులో కేంద్రితమైన వాగ్దానాలను పౌలు పేర్కొంటున్నాడు.
3:4 బత్పైబ సంఘటన చుట్టూ జరిగిన తన పాపాలు నాతాను ప్రవక్త ద్వారా విన్నపుడు, దావీదు కీర్తన 51:4లో దేవుడు న్యాయము తీర్చునపుడు నీతిమంతుడు అని ఒప్పుకున్నాడు. దేవుడు సత్యవంతుడు కాక తీరడు, ఎందుకంటే వేరే విధంగా ఉండడం అనేది ఆయన అనంతమైన పరిపూర్ణ స్వభావానికి విరుద్ధమైంది.
3:5-8 పౌలు అనేక విషయాలను గూర్చి మాట్లాడాడు, అనేకమంది విమర్శ కులు ఆయన బోధలు తప్పని పొరపాటుగా భావించారు. ఉదాహరణకు, మనుషుని పాపం, పొరపాటు వల్ల దేవుడు సత్యవంతుడుగా కనిపిస్తే, మన లోపాలవల్ల దేవుడు ఘనత పొందాడు అనే బోధ. ఆయన నీతిని కనపరచడానికి మన లోపాలతో మనం ఆయనకు సహాయం చేస్తే, దేవుడు మనలను ఎలా శిక్షించగలడు? అయితే పాపంపై దేవుని తీర్పు ఎల్లప్పుడూ నీతిగానే ఉంటుందని పౌలు నియమప్రకారం జవాబిచ్చాడు. వేరే విధంగా ఆలోచించేవారు. శిక్షావిధికి పాత్రులు, ఎందుకంటే వారి దృష్టి నిజంగా దేవుని మహిమ పరచడం మీద గాక తమ స్వంత పాపకోరికలను స్వేచ్చగా నెరవేర్చుకోవడం మీదే వుంది.
3:9 అందరును పాపమునకు లోనై ఉన్నారు, అయినప్పటికీ మన లౌకిక సమాజంలో పాపం పాతకాలపు అంశంగా భావించబడుతుంది. ఎందుకో ఊహించడం అంత కష్టమేమీ కాదు. దోషం అనేది ఒకడు తనకే విరోధంగా చేసుకునేది; నేరం - అంటే ఒక వ్యక్తికి లేక సమాజానికి విరోధంగా చేసేది; కానీ పాపం దేవునికి విరోధంగా చేసేది. కానీ ఆధునిక సంస్కృతి నాస్తికవాదానికి కొమ్ముకాస్తున్నందున, “పాపం" అనేది ఒక అర్ధరహితమైన పదంగా మిగిలిపోయింది.
3:10-18 మానవాళి అంతా పాపదాస్యంలో ఉన్నదని చూపడానికి పౌలు ఈ వచనాలను ఏడు పా.ని. వాక్యభాగాలకు కలిపాడు (కీర్తన 14:1-3; ప్రసంగి. 7:20; కీర్తన 5:9; కీర్తన 140:3; కీర్తన 10:7; యెషయా 59:7-8 కీర్తన 36:1) నీతిమంతుడు లేడు; గ్రహించువాడెవడును లేడు (యోహాను 8:43-44; 1కొరింథీ 2:14), దేవుని వెదకువాడెవడును లేడు. ఆదాము, హవ్వలు పాపంలో పడినప్పటినుండి మనుషులు దేవునినుండి దాక్కుంటున్నారు, కానీ దేవుడు “నశించిన దానిని వెదకి రక్షించుటకు” (లూకా 19:10) తన కుమారుని పంపాడు. అందరూ త్రోవతప్పారు. (యెషయా 1:2-4; 53:6), దేవుని దృష్టిలో సరియైనవాడు ఒక్కడూ లేడు. చెడుతనం ఎంతగా పెరిగిపోయిందో చూపడానికి పౌలు పై వాక్యభాగాలను పేర్కొన్నాడు. యేసు బోధించినట్లు, “లోపలినుండి, అనగా మనుషుల హృదయాలలో నుండి” (మార్కు 7:21) చెడుతనమంతా వస్తుంది. రక్తము చిందించుటకు మనుషులు తొందరపడుతున్నారు. గత శతాబ్దంలో 3 కోట్ల 90 లక్షలమందికి పైగా యుద్ధాలలో ప్రాణాలు కోల్పోయారు. సంప్రదాయ లెక్కల ప్రకారం - లెనిన్, స్టాలిన్, మావో, హిట్లర్, ఇంకా ఇతరులచే నడిపించబడిన మానవ ప్రభుత్వాలు మరో పన్నెండున్నర కోట్లమంది ప్రజలను చంపేశాయి. మూలకారణం ఏమిటంటే, తాము దేవుని నమ్ముతున్నామని చెప్పుకుంటూ కూడా మనుషులు తరచూ ఆచరణాత్మకంగా నాస్తికులుగా ఉంటున్నారు. వారు దేవుని చిత్తానికి విరుద్ధమైనది. ఎంచుకుని, కనీస భయం కూడా చూపలేదు.
3:19 పైన చెప్పిన ఏడు వాక్యభాగాలు అన్యజనుల దేశాలను సూచిస్తున్నాయి కానీ యూదులను కాదు అని కొందరు వాదించవచ్చు. కానీ హెబ్రీ బైబిల్లో ఉన్న ప్రతిదీ, మొదట యూదుల ఉపదేశం కోసం, వారు దాని ద్వారా పాపపు శక్తిని గురించి నేర్చుకోవాలని వ్రాయబడింది. ఏ దేశంవారైనా, ఏ జాతివారైనా, మనుషులంతా పాపులే, దేవుడు సర్వలోకమునకు తీర్పు తీర్చుతాడు. దేవుని న్యాయస్థానంలో అందరూ నిరుత్తరులే.
3:20 ధర్మశాస్త్రం కోరేదానికి విధేయులవ్వడం ద్వారా ఎవ్వరూ నీతిని సంపాదించుకోలేరు. ధర్మశాస్త్రం ద్వారా రక్షణ కలగాలనేది ఎన్నడూ దేవుని ఉద్దేశం కాదు. ధర్మశాస్త్రపు ప్రాథమిక ఉద్దేశం పాపాన్ని దాని పరిపూర్ణతతో బయలుపరచి, నీతిని వరంగా పొందడం తప్ప మానవాళికి వేరొక మార్గం లేదని చూపడమే.
3:21-26 ఇట్లుండగా అనే మాట పౌలు వాదనలో ఒక నిర్ణయాత్మక మార్పును చూపుతుంది. ఈ వచనాలు (మూల భాషలో ఏకవాక్యంగా ఉంది) వేదాంత శాస్త్ర విషయాలను చక్కగా సంక్షిప్త పరుస్తున్నాయి. క్రీస్తు సిలువ ద్వారా దేవుని నీతి ప్రత్యక్షపరచబడి, అనుగ్రహింపబడింది. పాపులు ధర్మశాస్త్రాన్ని హత్తుకొని ఉండడంవల్ల క్షమాపణ పొందరు కాని, వారి పక్షముగా నీతినంతటినీ నెరవేర్చినవాని యందు విశ్వాసముంచడం ద్వారా క్షమాపణ పొందుతారు. ధర్మశాస్త్రమును ప్రవక్తలును పా.ని.ని సూచిస్తున్నాయి, యేసుకు ఆయన కార్యానికి సాక్ష్యంగా అర్ధం చేసుకుంటే పా.ని. సరిగ్గా అర్థమౌతుంది.
3:22 విశ్వాసమునకు కర్తయు, దేవుని నీతి అనే వరమును పొందే మార్గం యేసే. ఈ వరం నమ్మువారందరికీ అంటే విశ్వసించే యూదులకు, అన్యజనులకు కూడా అనుగ్రహింపబడుతుంది..
3:23 దేవుడు మానవాళికి ఉద్దేశించిన లక్ష్యాన్ని ఛేదించడంలో అందరూ తప్పిపోయి, ఆరంభ సృష్టి మహిమను కోల్పోయారు (కీర్తన 8:5). సువార్తను విశ్వసించడం మహిమను తిరిగి ఇచ్చే ప్రక్రియను ఆరంభిస్తుంది. (రోమా 8:30; 2 కొరింథీ 3:18).
3:24 నీతిమంతులని తీర్చబడుట అంటే క్రైస్తవులు నీతిమంతులుగా ప్రకటించబడుట అని అర్థం (5:1,9; 8:30; 1కొరింథీ 1:30; 6:11). దేవుని న్యాయస్థానంలో పాపులు శిక్షార్హులుగా నిలబడతారు, అయినప్పటికీ ఆయన యేసు సిలువపై చేసిన కార్యంవల్ల, విశ్వాసులను “నిర్దోషులు” అని ప్రకటిస్తాడు. ఉచితముగా అంటే క్రైస్తవులలో ఏవైనా యోగ్యతలు చూసి దేవుడు వారిని నీతిమంతులుగా చేయడు గాని పూర్తిగా ఆయన కృప, అయోగ్యులపై ఆయన ప్రేమ, దయను బట్టే చేస్తాడు. బానిసలకు స్వేచ్ఛను కొనడాన్ని సూచించే వ్యాపార సంబంధమైన పదం విమోచన. జనులంతా వారి పతనమైన స్థితిలో పాపానికి బానిసలే. మన స్వేచ్ఛను కొనడానికి చెల్లించిన వెల క్రీస్తు యేసు రక్తం (మార్కు 10:45; 1 పేతురు 1:18-19).
3:25-26 కరుణాధారము అనే మాట దేవాలయంలోని బల్యర్పణ వ్యవస్థనుండి తెచ్చుకున్న "హిలాస్టెరియన్" అనే గ్రీకు పదానికి అనువాదం. పా.ని. గ్రీకు తర్జుమాలో నిబంధన మందసం - "కరుణాపీఠం”ను కప్పడాన్ని సూచించే పదం (నిర్గమ 25:17-22; లేవీ 16:14-15 చూడండి). ప్రాయశ్చిత్తార్థ దినమున, జాతి కోసం ప్రాయశ్చిత్తం చేయడానికి ప్రధాన యాజకుడు మందసంపై రక్తాన్ని ప్రోక్షిస్తాడు. ఈ ఆచారం ద్వారా పాపాలకు ప్రాయశ్చిత్తం చేయబడుతుంది లేక పాపాలు తుడిచివేయబడతాయి. దానికంటే ముఖ్యంగా దేవుని ఉగ్రత మళ్ళింపబడుతుంది. లేక శాంతింప చేయబడు తుంది. కానీ మానవ పాపాలు జంతువుల మరణం చేత అక్షరార్థంగా పరిహరింపబడలేవు. “ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము” (హెబ్రీ 10:4). కాబట్టి ఏ యాజకుడూ జంతువును వధించడం ద్వారా సాధించాలని ఆశించలేనిదాన్ని చేయడానికి
యేసు వచ్చాడు: పరిహారం కోసమై దేవుడు కోరేదంతటినీ సంపూర్ణంగా తృప్తి పరచడానికి. దేవుడు తన కుమారుని కరుణాధారంగా బయలుపరచాడు. యేసు రక్తం ద్వారా- ఆయన త్యాగపూరిత మరణం ద్వారా- పాపానికి విరోధంగా వచ్చిన దేవుని పరిశుద్ధ ఉగ్రత శాంతపరచబడి, క్రీస్తునందు విశ్వాసముంచే వారి పాపాలను తొలగించింది. దేవుడు నీతిమంతుడని, యేసునందు విశ్వాసము గలవానిని నీతిమంతునిగా తీర్చువాడునై యున్నాడని సిలువ, సువార్త ప్రకటనల ద్వారా నిరూపితమౌతుంది.
3:27-28 ఎవడునూ తన క్రియలనుబట్టి అతిశయించడానికి వీలు లేదు. ఎవడూ తన విశ్వాసమును బట్టి కూడా అతిశయించరాదు. విశ్వాసమనేది ఒకడు నీతిమంతునిగా తీర్చబడడానికి కారణం" కాదు గాని "మార్గం". రక్షణకు కారణం కృప, దయ.
3:29-30 నీవు ఏ జాతీయుడవైనా, ఏదేశ వాసివైనా, దేవుడు ఒక్కడే, ఆయనచేత నీతిమంతునిగా తీర్చబడే మార్గం ఒక్కటే: విశ్వాసము ద్వారానే. నీతిమంతులుగా తీర్చును అంటే అది ప్రస్తుతం జరిగేది కాదని, భవిష్యత్కాలంలో (అంతిమ తీర్పు సమయంలో) జరుగబోయేది అని అర్థం చేసుకోకూడదు. మనం విశ్వాసంలోనికి వచ్చినపుడు దేవుడు మనలను నీతిమంతులని ఎంచుతాు అనే సత్యాన్ని అది చూపుతుంది.
3:31 సువార్త ధర్మశాస్త్రమును నిరర్థకం చేస్తుందా? ఈ ప్రశ్నకు జవాబివ్వ డానికి పౌలు అబ్రాహాము ఉదాహరణను చూపిస్తున్నాడు (రోమా 4).