20:1-2 శ్రమల వారంలో ఏ రోజున ఈ సంఘటనలు జరిగాయో లూకా ప్రస్తావించలేదు. దీనికి సమాంతర వాక్యభాగమైన మార్కు 11:19-20,2733 ఇది మంగళవారం జరిగిందని తెలియచేస్తుంది. ప్రధానయాజకులు... శాస్త్రులు... పెద్దలు యూదుల మహాసభ అనే పాలన యంత్రాంగంలో సభ్యులు - (22:66 - నోట్సు చూడండి). దేవాలయ ప్రాంగణం నుంచి వ్యాపారులను యేసు బయటకు వెళ్లగొట్టాడు (19:45). ఈ చర్య యూదుల మతవిశ్వాసాల పై ప్రత్యక్షమైన దాడి చేయడం అని భావించిన యూదుమత నాయకులు ఏ అధికారముతో ఈ పని చేస్తున్నావని యేసును ప్రశ్నించారు. వాళ్ల అభిప్రాయం ప్రకారం కేవలం దేవదూషకుడు మాత్రమే ఇలాంటి చర్యకు ఒడిగడతాడు. ఆవిధంగా పస్కా పండుగకు హాజరైన ప్రజల దృష్టిలో యేసు విశ్వసనీయతను కొట్టిపారేయడానికి వాళ్లు ప్రయత్నించారు (19:47-48 నోట్సు చూడండి).
20:3-8 తరచూ చేసిన విధంగానే, బాప్తిస్మమిచ్చే యోహాను బాప్తిస్మపు అధికారం గురించి అడిగి ప్రజల దృష్టిని తనను ప్రశ్నించిన వారిపైకి యేసు మళ్ళించాడు. ఊహించని ఆ ప్రశ్న విని ఖంగుతిన్న మతనాయకులు యోహాను అధికారానికి ఆధారమేమిటో తమకు తెలియదని చెప్పారు. తన విరోధులను ఇరకాటంలో పెట్టిన తర్వాత యేసు కూడా వాళ్ల ప్రశ్నకు జవాబు చెప్పడానికి నిరాకరించాడు.
20:9-12 ద్రాక్షతోట ఇశ్రాయేలుకు సూచనగా ఉంది (యెషయా 5:7), దాని యజమాని దేవుడే. కాపులు ఇశ్రాయేలు ప్రజలకు, మరిముఖ్యంగా దాని మతనాయకులకు సూచనగా ఉన్నారు. కౌలు రైతుల దగ్గరకెళ్లి అవమానాలకు, హింసలకు, చివరికి హత్యకు గురైన సేవకులు దేవుని దగ్గర నుంచి పంపబడిన పా,ని. ప్రవక్తలను సూచిస్తున్నారు.
20:13-18 నా ప్రియకుమారుడు అనే మాట యేసును సూచిస్తుంది (3:21-22 నోట్సు చూడండి). యేసు ఆస్తిని చేజిక్కించుకోవడానికి యూదు మతనాయకులు ఆయనను చంపాలనుకోలేదు. కానీ మెస్సీయగా దావీదు సింహాసనానికి వారసునిగా ఆయనను బలవంతంగా తృణీకరించడానికే వాళ్లు ఆయనను చంపదలచుకున్నారు. ద్రాక్షతోట యజమాని (దేవుడు) కాపులను (ఇశ్రాయేలును) నాశనం చేయడమనేది అన్యులు దేవుని నూతన నిబంధన ప్రజలుగా అంగీకరించబడి సంఘంగా కూర్చబడతారనే వాస్తవాన్ని ముందుగానే చూస్తుంది. లూకా తర్వాత రాసిన అపొస్తలుల కార్యములు గ్రంథం ప్రధానోద్దేశం ఇదే. దేవుడు అలాంటి కార్యానికి ఉపక్రమిస్తాడనే విషయాన్ని యేసు మాటల్ని దేవాలయ ప్రాంగణంలో ఉండి వింటున్న ప్రజలు ఊహించలేకపోయారు (వ. 1,9). కీర్తన 118:22 నుంచి తీసుకున్న మాటల్లో యేసే రాయి... మూలకు తలరాయి (అపొ. కా. 4:11; ఎఫెసీ 2:20; 1పేతురు 2:7 చూడండి). కట్టువారు ఎవరో ఇక్కడ ప్రస్తావించబడలేదు. అయితే వాళ్లు ఇశ్రాయేలు మతనాయకులు అనడం నిస్సందేహమైన విషయం (వ.1,19).
20:19-21 ఇంతకుముందు యేసు చెప్పిన ఉపమానము తమగురించినదేనని మతనాయకులు (ప్రధాన యాజకులును, శాస్త్రులును) అర్థం చేసుకున్నారు, అందువల్ల వెంటనే ఆయనను అడ్డు తొలగించుకోవాలనుకున్నారు. అయితే ప్రజల కోపం రేపకుండా ఉండడానికి, ఒక ప్రశ్న ద్వారా ఆయనను ఇరికించి తర్వాత రోమా సామ్రాజ్యపు అధికారులకు అప్పగించాలని వాళ్లు ప్రయత్నించారు. ప్రశ్నించడానికి వచ్చినవాళ్లు భక్తిగలవారిగా, మర్యాదస్థులుగా కనబడనప్పటికీ, వాళ్లు అడిగిన ప్రశ్న ఆ రోజుల్లో అత్యంత వివాదాస్పదమైన - రోమా సామ్రాజ్యానికి పన్ను చెల్లించాలా వద్దా? అనే అంశం.
20:22-26 యేసు ఏవిధంగా జవాబు చెప్పినా ఆయనను ఇరికించగల ఒక పరిపూర్ణ మార్గాన్ని కనుగొన్నామని మతనాయకులు భావించారు. కైసరుకు పన్ను చెల్లించడం న్యాయమే అని చెబితే, అది యూదుల్ని ఆయనకు వ్యతిరేకుల్ని చేస్తుంది. పన్ను చెల్లించడం చట్టవిరుద్ధమని చెబితే, రోమా సామ్రాజ్యానికి విరుద్ధంగా వ్యాఖ్యలు చేసినందుకు రాజద్రోహం నేరం కిందకు ఆయనను బంధించడానికి రోమీయులకు వీలుపడుతుంది. అయితే యేసు వాళ్ల ఉచ్చులో చిక్కుకోలేదు. పన్ను చెల్లించడానికి ఉపయోగించే దేనారము వాళ్ల దగ్గరనుండే అడిగి తీసుకొని,
రోమా ప్రభుత్వాధికారానికి సహకరించడం అత్యవసరమని మతనాయకులే గుర్తించారని యేసు బట్టబయలు చేశాడు. కైసరువి కైసరుకు చెల్లించండి అనే మాట దేవుని ప్రణాళికలో మానవ ప్రభుత్వానికున్న సరైన పాత్రకు తగిన గుర్తింపుగా ఉంది (రోమా 13:1-7). దేవునివి దేవునికి చెల్లించుడి అనే మాట జీవితాన్ని లౌకికంగానూ పవిత్రంగానూ విడదీయదు, దేవుడు మానవ జీవితానికి సంబంధించిన కొన్ని అంశాలను పట్టించుకోడని కాదు. దానికి భిన్నంగా జీవితంలోని అన్ని విభాగాలూ అది ప్రభుత్వాధికారానికి లోబడడమైనా దేవునికి సంబంధించిన విషయమేనని యేసు చెప్పిన మాట అంతరార్థం. ఈ జవాబు శాస్త్రులనూ ప్రధాన యాజకులనూ నిర్ఘాంతపోయేలా చేసింది (వ.26). యేసును ఇరికించి బంధించాలనే వాళ్ల ప్రయత్నాలను ఆటంకపరిచింది. -
20:27-33 మతనాయకుల్లో మరొక బృందం యేసును ఇరికించడానికి ప్రయత్నించారు. ధర్మశాస్త్ర గ్రంథంలో (ఆదికాండం నుంచి ద్వితీయోపదేశకాం డం వరకు) మృతుల పునరుత్థానం అనే అంశం బోధించబడలేదు కాబట్టి సదూకయ్యులు పునరుత్థానాన్ని నమ్మేవారు కాదు. పునరుత్థానము అనే విషయం ఒక వెర్రితనమని కొట్టిపారేయడానికి అనుకూలంగా సిద్ధం చేసుకున్న ప్రశ్న వారు యేసును అడిగారు. ఒకని సహోదరుడు సంతానము లేక చనిపోయిన యెడల అనే మాట ద్వితీ 25:5లో ప్రస్తావించబడిన మరిది ధర్మాన్ని ప్రస్తావిస్తుంది. దేహం పునరుత్థానము అయిన తర్వాత కూడా అది ఇహసంబంధమైన జీవితానికి సంబంధించిన కొన్ని ప్రాథమిక లక్షణాలను కలిగి ఉంటుందనే అపొహలో సద్దూకయ్యులు ఉండేవారు.
20:34-36 పెండ్లి... ఈ లోకపు పరిథికి మాత్రమే పరిమితమైందని యేసు జవాబిచ్చాడు. క్రీస్తులో విశ్వాసముంచినవారే యోగ్యులని ఎంచబడతారు ఎందుకంటే మెస్సీయలో విశ్వాసముంచిన వ్యక్తిని మాత్రమే దేవుడు అంగీకరిస్తాడు (రోమా 5:1; గలతీ 2:15-16), పరలోకంలో మనం దేవదూతల్లా అర్థవంతమైన పలు సంబంధాలను ఆస్వాదిస్తాం. కానీ వివాహం చేసుకోము, సంతానోత్పత్తి ఉండదు. పునరుత్థానం తర్వాత, మానవ జీవితచక్రం (పుట్టుక, వివాహం, సంతానోత్పత్తి, మరణం) శాశ్వతంగా మారిపోతుంది.
20:37-40 మోషే రాసిన గ్రంథాల యెడల భయభక్తులు చూపించే సదూకయ్యులకు యేసు నిర్గమ 3:1-6ను ఎత్తిచూపాడు. యేసు ఉపయోగించిన తర్కం ఈ విధంగా ఉంది: దేవుడు తన్నుతాను అబ్రాహాము... ఇస్సాకు... యాకోబుల దేవునిగా మోషేకు పరిచయం చేసుకుంటూ, అతని రోజుల్లో వాళ్లింకా బ్రతికే ఉన్నారన్నట్లు మాట్లాడాడు. ఈ ముగ్గురు గతంలో ఎన్నో సంవత్సరాల క్రితమే మరణించారు. కాబట్టి తప్పనిసరిగా మరణం తర్వాత జీవితం ఉండి తీరాల్సిందే. యేసు ఎంతో అద్భుతంగా మాట్లాడుతూ వారిని వెర్రివారిని చేసేశాడు. కాబట్టి ఈ సందర్భం తర్వాత మతనాయకులు యేసును మరేమియు అడుగ తెగింపలేదు.
20:41-44 కీర్తన 110:1 వచనాన్ని ఆధారం చేసుకుని దైవశాస్త్ర సంబంధమైన అతి కష్టమైన ప్రశ్నను యేసు అడిగాడు. క్రీస్తు దావీదు కుమారుడు... ప్రభువు ఎలా అవుతాడు? జవాబు ఇక్కడ ఇవ్వబడలేదు. అయితే యేసుక్రీస్తు సంపూర్ణంగా దేవుడు (ప్రభువు), సంపూర్ణ మానవుడు (దావీదు కుమారుడు)..
20:45-47 శాస్త్రులు ధరించే - నిలువుటంగీలు తెల్లని సన్నపునార వస్త్రాలు, వాటి అంచులు అలంకరించబడి ఉంటాయి. సమాజమందిరాల్లో అగ్రపీఠములంటే హాజరైన ప్రతి ఒక్కరికీ కనబడే కుర్చీల్లాంటివి. విధవరాండ్ర యిండ్లను దిగమ్రింగుచు అంటే కొందరు శాస్త్రులు నిస్సహాయులైన విధవరాళ్ల ఇళ్లనూ వాళ్లకుండే పరిమితమైన వనరులనూ మోసపూరితంగా చేజిక్కించుకున్నారని అర్థం. మత్తయి 23:1-36 ఈ వాక్యభాగానికి సమాంతర వాక్యభాగం. దేవుడు శాస్త్రుల్ని పరిసయ్యుల్ని ఏ పాపాల నిమిత్తం తీర్పు తీరుస్తాడో వాటిని మత్తయి 23వ అధ్యాయం సమగ్రంగా వివరిస్తుంది.