1:1 పూర్వకాలమందు నానా సమయములలోను అనే మాటలు పా.ని. . చరిత్ర కాలాలను సూచిస్తున్నాయి. నానావిధములుగాను అంటే మాట్లాడడానికి , దేవుడు ఉపయోగించిన వివిధ రకాల పద్ధతులైన దర్శనాలు, కలలు, సూచకక్రియలు, ఉపమానాలు, సంఘటనలు (యెషయా 28:10 చూడండి) ఉన్నాయి.
1:1-2:18 సృష్టిలో సమస్తానికి, విమోచన చరిత్రలో సమస్తానికి, దేవుని కుమారుడు, మనుష్యకుమారుడైన యేసు క్రీస్తు కేంద్రంగా ఉన్నాడు. దేవుడు .. చేసిన సమస్తానికి కేంద్రబిందువు యేసు అని రచయిత ఒప్పింపబడ్డాడు కాబట్టి ఆయనే సంఘ విశ్వాసానికి కేంద్రబిందువు అని చెబుతున్నాడు. యేసు క్రీస్తు సృష్టికి కారకుడు, ప్రత్యక్షతా శిఖరం, విమోచనకు మధ్యవర్తి, చరిత్రకు తీర్పు తీర్చేవాడు.
1:1-2 ఈ వచనాలు యేసు క్రీస్తు ప్రత్యక్షతను, పా.ని. ప్రవక్తల ద్వారా - వచ్చిన దేవుని పూర్వ ప్రత్యక్షతతో పోల్చుతున్నాయి. దేవుడు పూర్వ కాలములలో నానా సమయములలో, నానా విధాలుగా ప్రవక్తల ద్వారా మాట్లాడాడు, కానీ ఇప్పుడు ఆ గత ప్రత్యక్షతలకంటే అంచెలంచెలు దాటి, కుమారునిద్వారా మనుషులతో నేరుగా మాట్లాడాడు. అంచెలంచెల ప్రత్యక్షతా సిద్ధాంతం ప్రవక్తల మాటలను దైవిక ప్రత్యక్షతగా గుర్తిస్తుంది. కానీ వారి ప్రవచనాలు రాబోతున్న మెస్సీయను సూచించాయి. ఆ మెస్సీయ ఇప్పుడు వచ్చాడు -ఆయనే యేసు క్రీస్తు.
1:2-4 యేసు క్రీస్తు, ఆయనకు సంబంధించినదంతా, ఆయనకు ముందు ఉన్నదానికి, తరువాత రాబోయే దానంతటి కంటే ఉన్నతమైనది అనే వాదనను పత్రిక ఏడు స్తుతులతో ఆరంభించింది. (1) ఆయన కోసం సమస్తమును చేయబడ్డాయి కాబట్టి యేసు క్రీస్తు సృష్టికి వారసుడు. (2) ప్రపంచములను నిర్మించెను: “ప్రపంచములు" కోసం ఉపయోగించిన గ్రీకు పదం “కాస్మోస్", “తరములు” అనే అర్థాన్ని కూడా ఇస్తుంది. ఆయన సృష్టికర్త, ఆయన ద్వారానే సమస్తమును ఉనికిలోకి వచ్చాయి. (3) ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు కాబట్టి సమస్త సృష్టి పరిపూర్ణతకోసం ఆయనవైపు చూస్తుంది. (4) ఆయన తండ్రియైన దేవుని స్వభావానికి మూర్తిమంతము. అంటే కుమారుడు తండ్రి దైవిక స్వభావములో పాలుపొంపులు పొందినవాడని అర్థం. (5) ఆయన దేవుని “వాక్యము", దేవుడైయున్న ఒకే ఒక్క దైవ ప్రవక్త. నిర్వహించుచు అంటే "మోయుచు” లేక “సహిస్తూ" అని అర్థం. కదిలిస్తూ, అంతము వరకు, ముందుకు తీసుకెళ్ళడాన్ని సూచిస్తుంది. కుమారుడు తన మహత్తుగల మాటచేత విశ్వమును సృజించడమే కాకుండా, దాని గమనాన్ని నిర్వహిస్తూ, నడిపిస్తున్నాడు. (6) ఆయన సర్వ మానవుల పాపమునకు సంపూర్ణమైన బలిని అర్పించిన దేవుని యాజకుడు. శుద్దీకరణము అంటే “కడిగి, పవిత్రపరచి" అని అర్థం (7) కూర్చుండెను అనే మాట అధికారికంగా ప్రధానయాజకుని స్థానాన్ని తీసుకునే విధానాన్ని సూచిస్తూ, తన పనిని పూర్తిచేసి ఎన్నడూ కూర్చొనే పరిస్థితి లేని (10:11-13) లేవీయ యాజకునికి ఉన్న భిన్నత్వాన్ని సూచిస్తుంది. ఆయన సింహాసనంపై తండ్రి కుడిపార్శ్వమున కూర్చున్న రాజు. కాబట్టి యేసు సృష్టిలో ఉన్నత జీవులైన దేవదూతలకంటే శ్రేష్ఠుడు, వారికంటే మరింత ఉన్నతుడు.
1:5-14 దేవుని కుమారుని దైవిక, మానవ స్వభావాలనుగూర్చి రచయిత తన పాఠకులకు బోధిస్తూ, ఆయన ఔన్నత్యం దేవదూతలకంటే,మోషేకంటే ఉన్నతమైనదని స్థాపిస్తున్నాడు. ఒక మానవుడు దేవదూతలకంటే అధికమైనవాడు అనేది ఒక మామూలు యూదా పాఠకునికి మింగుడుపడని విషయం. యేసు క్రీస్తు పూర్తిగా మానవుడు, కానీ ఆయన పూర్తిగా దైవం. ఇది ఆయనను దేవదూతలకన్నా ఉన్నతునిగా చేస్తుంది.
దేవునికి ఆపాదించిన అనేక పా.ని. లేఖనాలనుండి, తండ్రియైన దేవుడు తన కుమారుడు దైవమని ఏ విధంగా పిలిచాడో రచయిత చూపిస్తున్నాడు. తండ్రియైన దేవుడు ఆయనను విశిష్టంగా నా కుమారుడు (2సమూ 7:14; 1దిన 17:13; కీర్తన 2:7) అనీ, దేవుడు (కీర్తన 45:6-7), ప్రభువు (కీర్తన 102:22) అనీ పిలిచాడు. అంతేకాక, తండ్రియైన దేవుడు తన కుమారునికి దైవకార్యాలను ఆపాదించాడు. దేవదూతలందరూ ఆయనకు నమస్కారము చేయవలసినవాడుగా ఈ లోకములోనికి పంపబడిన ఆది సంభూతుడు, “కనిన” కుమారుడు (ద్వితీ 32:43; కీర్తన 97:7). ఆయన దూతలను తన దూతలనుగా, తన సేవకులను గా చేసుకున్న కుమారుడు (కీర్తన 104:4). ఆయన దైవ సింహాసనము మీద కూర్చుని, నీతి (కీర్తన 45:6-7) అనే దైవగుణలక్షణంతో పాలించే కుమారుడు. ఆయన ఆదియందు భూమ్యాకాశములను సృజించిన కుమారుడు. సృష్టి సిద్ధిపొందిన పుడు అలాగే ఉండబోయేవాడు, ఎందుకంటే ఆయన నిత్యుడైనవాని దైవిక గుణలక్షణాలలో పాలున్నవాడు (కీర్తన 102:25-27). ఈ ఉదాహరణలు దేవుడు యేసు క్రీస్తును వాగ్దానం చేయబడిన మెస్సీయగా, శాశ్వత జనితైక దేవుని కుమారుడుగా ఉండునట్లు ప్రకటించాడని చూపుతున్నాయి. ఈ 1:6 ఆయన... మరల రప్పించినప్పుడు అనేది రెండవ రాకడను సూచిస్తుంది. ఆదిసంభూతుడు అనే మాట ఇక్కడ స్థాయిని చూపిస్తుంది. అంటే మిగిలిన వారందరికన్నా పైనున్న వ్యక్తి అని అర్థం (కీర్తన 89:27 చూడండి).
1:9 తోడివారి అనేది భాగస్వాములు, సన్నిహిత సహచరులు " అనే అర్థాన్నిస్తుంది. విశ్వాసులు క్రీస్తుతో సహచరులు అనేది హెబ్రీ పత్రికలో ముఖ్యాంశం (3:1,14; 6:4; 12:8). క్రీస్తుతో, ఆయన పాలనలో పాల్గొనేవారిని ఈ మాట సూచిస్తుంది.
1:10-12 విశ్వం నశించును (2 పేతురు 3:10-13; ప్రక 21:1 చూడండి), కానీ కుమారుడు మాత్రం నిలిచియుంటాడు.