15:1 ఈ సన్నివేశం తరచుగా మూడవ యూదుల విచారణగా పరిగణించబడుతుంది, ఈ విచారణలో ఉదయము తీసుకున్న నిర్ణయాన్ని మహాసభవారందరును చట్టబద్ధం చేశారు (లూకా 22: 66-71 తో పోల్చండి). రాత్రిపూట తీసుకునే నిర్ణయాలు చట్టబద్ధం కావు. ఈ అధ్యాయంలోనూ (వ.1,10,15), ఈ గ్రంథమంతటిలోనూ అప్పగించబడడం అనేది పదేపదే పునరావృతమయ్యింది. పిలాతు క్రీ.శ. 26-36 మధ్యకాలంలో యూదుల మధ్య పనిచేసిన రోమీయ అధికారి. పిలాతు కైసరయ మారిటిమా లో నివసించేవాడు. అయితే పస్కా పండుగ సమయంలోనూ యూదుల ప్రధాన పండుగ సమయాల్లోనూ యెరూషలేములోకి యాత్రికులు తండోపతండాలుగా వస్తుంటారు కాబట్టి ఎలాంటి అల్లర్లు జరగకుండా దగ్గరుండి పర్యవేక్షించడం మంచిదని అతడు యూదుల పండుగకు యెరూషలేములోనే ఉండేవాడు.
15:2 తానే యూదుల రాజునని యేసు చెప్పుకున్నాడా? లేదా? అనే దానిపై పిలాతు దృష్టి పెట్టాడు. దేవదూషణపై (14:64) ఆధారపడిన సనాద్రిన్ సభ వారి ఆరోపణ ఇప్పుడు తిరుగుబాటుగా, రాజద్రోహంగా మార్పు చెందింది. ఈ బిరుదును మార్కు సువార్తలో ఉపయోగించడం ఇదే తొలిసారి, అయితే పిలాతు దాన్ని పదేపదే ఉపయోగించాడు (15:2,9-10, 12,26, 32 తో పోల్చండి). ఈ పదాలు యేసు పుట్టుక సమయంలో జ్ఞానుల అన్వేషణను గుర్తుచేస్తున్నాయి (మత్తయి 2:2). నీవన్నట్టే అని యేసు చెప్పిన జవాబు తన అపరాధ రాహిత్యాన్ని లేదా ఒప్పుకోలునూ సూచిస్తున్నాయి కానీ తృణీకారాన్ని కాదు.
15:3-5 పిలాతు అడిగిన ప్రశ్న ద్వంద్వ ప్రతికూలతను సూచిస్తుంది. యేసు జవాబు చెప్పలేదని మార్కు రాసిన ద్వంద్వ ప్రతికూలత దానికి సరిపడుతోంది. యేసు చెప్పే జవాబులు సంతృప్తికరంగా ఉంటే తాను ఆయనను విడిపించవచ్చు. అయితే యేసు ఏ ఉత్తరము చెప్పలేదు గనుక అది పిలాతును ఆశ్చర్యపరచింది.
15:6 యేసును హేరోదు అంతీప దగ్గరకు పంపించడం ద్వారా తన్నుతాను ఈ ఇబ్బందికరమైన పరిస్థితి నుంచి తప్పించుకోవడానికి పిలాతు చేసిన ప్రయత్నం గురించి మార్కు మౌనంగా ఉన్నాడు. (లూకా 23:5-12 తో పోల్చండి), మార్కు 6:14-29 లో ఉన్నది ఇదే హేరోదు. ఇక్కడ 15:6-15లో ప్రజలు కోరుకొనిన యొక ఖైదీని విడుదల చేసే ఆచారాన్ని ఉపయోగించి పిలాతు మరొకసారి తప్పించుకునే మార్గాన్ని ఉపయోగించుకున్నాడు. ఈ ఆచారం గురించి కొ.ని.కు బయట ఎక్కడా గ్రంథస్థం చేయబడలేదు. బహుశా ఈ ఆచారం కేవలం పస్కాపండుగ సమయంలోనే ఆచరించబడుతుంది అన్నట్లు కనబడుతుంది (యోహాను 18:39).
15:7 అధికారుల నెదిరించి... బరబ్బతో చెరసాలలో బంధించబడి ఉన్నవారిలో బహుశా యేసుతో సిలువ వేయబడిన నేరస్తులు కూడా ఉండి ఉంటారు. బరబ్బ తిరుగుబాటుతనం గురించి మార్కు ఎలాంటి వివరణ ఇవ్వలేదు. బహుశా తన పాఠకులకు ఆ విషయాలు తెలిసుంటాయి కాబట్టి వాటిని చెప్పాల్సిన అవసరం లేదని అతడు భావించి ఉంటాడు.
15:8-9 యేసు శత్రువులచేత పురికొల్పబడిన ప్రజల గుంపు అదివరకు అతడు... తమకు చేయుచు వచ్చిన ప్రకారము ఒక బందీని విడుదల చేసే ఆచారాన్ని అమలుచేయమని పిలాతును అడిగారు. పిలాతు సహజంగానే వాళ్లకు యూదుల రాజును విడుదల చేస్తానని చెప్పాడు (వ.2,9,12,26), ఆ విధంగా యేసు నిజమైన హోదాను పిలాతు తనకు తెలియకుండానే ఒప్పుకున్నాడు.
15:10 ప్రధాన యాజకులు యేసును చంపించాలని కోరడానికి కారణం అసూయ అని పిలాతు గుర్తించాడు.
15:11-12 మరొకసారి ప్రధాన యాజకులు (వ.1,3,10) పరిస్థితులను తమకు అనుకూలంగా మలుచుకున్నారు. ప్రేరేపించిరి అంటే ప్రజలను అల్లరి చేయమని వాళ్లు పురికొల్పారు. అయితే ఆ ప్రజాగుంపు తండ్రికి నిజమైన కుమారుడైన యేసుకు బదులుగా బరబ్బ (“తండ్రికి కుమారుడు")ను ఎంచుకోవడం విచారకరం.
15:13-14 సిలువ గురించి మార్కు చెప్పడం ఇదే మొదటిసారి. యేసు మరణాన్ని గురించి పలుపర్యాయాలు ముందే చెప్పినప్పటికీ, అందులో సిలువను గురించిన స్పష్టమైన ప్రస్తావన ఒక్కటి కూడా లేదు. (8:34). రాజకీయంగా తిరుగుబాటు చేసిన వారికి సాధారణంగా వేసేది సిలువ శిక్షేనని ఆర్.టి. ఫ్రాన్స్ తెలియచేస్తున్నారు.
15:15 జనసమూహమును సంతోషపెట్టుటకు మనస్సుగలవాడై న్యాయాన్ని పణంగా పెట్టి పిలాతు యేసును కొరడాలతో కొట్టించి... అప్పగించెను. ఆ రోజుల్లో చర్మపు తాళ్లతో కొరడాలుండేవి. వాటికి ఎముక ముక్కలు లేదా లోహపు కొక్కెములు అమర్చబడి ఉండేవి. అవి ఎవరి వీపు నుంచి అయినా చర్మాన్ని మాంసాన్ని పెకలించేవి. సిలువ అనేది బానిసలకూ తిరుగుబాటుదారులకూ వేసే శిక్ష..
15:16 సైనికులందరు అనేమాట కోహోర్ట్ అనే లాటిన్ మాటకు సమానార్థాన్ని తెలియచేస్తుంది. ఈ గుంపులో 600 మంది సైనికులుంటారు. అయితే మార్కు సైనికుల సంఖ్యను తెలియజేయాలనే ఉద్దేశంతో కాక ఎంతోమంది యేసును అపహాస్యం చేశారు అని తెలియచేయడానికి ఈ పదాన్ని ఉపయోగించాడు.
15:17 వస్త్రము... కిరీటము మొదలయిన వాటికి తాత్కాలిక ప్రత్యామ్నాయా లను సైనికులు ఉపయోగించారు. ఊదారంగు రాచరికపు రంగు.
15:18 యూదుల రాజా, నీకు శుభమనే మాట "కైసరూ, వందనం” అనే వందన వచనాన్ని ఎగతాళిగా అనుకరించి చెప్పినది.
15:19 రెల్లుతో ఆయన తల మీద వాళ్లు కొట్టారు.
15:20 ఆయనను సిలువ వేయుటకు తీసికొనిపోయిరి అనే మాట మొత్తం సైనిక పటాలాన్ని కాక శతాధిపతినీ శిక్ష అమలుచేసే బృందాన్ని సూచిస్తుంది.
15:21 సిలువ శిక్ష విధించబడిన నేరస్తులు శిక్ష విధించబడే స్థలానికి, అడ్డ దూలాన్ని తామే స్వయంగా మోసుకెళ్లేవారు, అక్కడ దాన్ని నిలువు దూలంతో అతికించేవారు. గ్రీకు రచయిత ప్లూటార్క్ ఇలా రాశాడు: “మరణశిక్ష విధించబడిన ప్రతీ నేరస్తుడు తన వీపుపైన తన సిలువను మోసుకెళ్తాడు”. కొరడాలతో కొట్టబడడం వలన, సైనికుల దెబ్బలకు గురవడం మూలంగా యేసు చివరి వరకూ దాన్ని మోసుకెళ్లలేకపోయాడు. అయితే రోమా సైనికులకు ఆ సిలువను ఆ దేశ పౌరుల్లో ఎవరిచేతనైనా మోయించే హక్కుంది (మత్తయి 5:41). కాబట్టి ఆయన సిలువను మోయుటకు సీమోనును బలవంతం చేశారు. సీమోను కురేనియకు చెందిన యూదుడే. కురేనియ ఆఫ్రికాకు ఉత్తర తీరంలో ఉండేది. అతడు అలెక్సంద్రుకూ రూపుకు తండ్రి. రోమాలో ఉన్న పాఠకులకు బహుశా వీళ్లు తెలుసునని ఈ వచనం తెలియచేస్తుంది. (రోమా 16:13). సీమోను ఈ అనుభవం మూలంగానే క్రైస్తవుడయ్యాడని తెలుస్తుంది.
15:22 గొల్గొతా అనేది కపాల స్థలము అని అర్థాన్నిచ్చే అరామిక్ పదం. పట్టణ ప్రాకారాలకు వెలుపల ఉండే నేటి చర్చ్ ఆఫ్ హోలి సెపల్కర్ అనే చోటనే సిలువ వేశారని సాంప్రదాయం చెబుతోంది (లేవీ 24:14; సంఖ్యా 15:35-36; హెబ్రీ 13:12).
15:23 బోళము కలిపిన ద్రాక్షరసము అనేది ప్రాచీనకాలపు మత్తుపానీయము. ఇలా ఇవ్వడం కీర్తన 69:21 ను నెరవేర్చింది.
15:24 సువార్త ప్రధాన సంఘటన గురించి మార్కు రాసిన ఒకే ఒక్క మాట: వారు ఆయనను సిలువ వేసిరి. సిలువ వేయడం శుక్రవారం రోజు జరిగింది. ఈ శుక్రవారాన్నే ఇప్పుడు మంచి శుక్రవారం అంటున్నారు. ఆయన వస్త్రములను సిలువ శిక్షను అమలుచేసిన నలుగురు సైనికులు పంచుకోవడం, అందుకోసం ఓట్లు వేయడం కీర్తన 22:18ని నెరవేర్చింది (యోహాను 19:23-24)
15:25 పగలు తొమ్మిది గంటలు అనేది అక్షరార్థంగా మూడవ ఘడియ. యూదులు సూర్యోదయం నుంచి పగటి సమయాన్ని లెక్కించేవారు.
15:26 మరణశిక్ష విధించబడిన వ్యక్తి మీద మోపబడిన నేరమును తరచూ ఒక్క చెక్క పలక మీద రాసి దాన్ని నేరస్తుని మెడకు తగిలించేవారు. యేసు విషయంలో దానిని ఆయన సిలువకు దిగొట్టారు (యోహాను 19:19), నాలుగు సువార్త గ్రంథాలూ ఈ విలాసాన్ని భిన్నంగా గ్రంథస్తం చేశాయి (మత్తయి 27:37; లూకా 23:38; యోహాను 19:19). బహుశా ఆ విలాసము మూడు భాషల్లో రాయబడడమే కారణమై ఉండవచ్చు (యోహాను 19:20). యూదుల రాజు అనే పై విలాసం యేసుని గురించిన సత్యాన్ని ప్రకటించడం చాలా కీలకమైన సంగతి.
15:27 బందిపోటు దొంగలనే పదాన్ని యోహాను 18:40లో బరబ్బను వర్ణించడానికి ఉపయోగించాడు. (మార్కు 14:48తో పోల్చండి). నేరస్తుల మధ్యలో యేసు సిలువ వేయబడడం అనేది ఆయనకు ఇరువైపులా సేవకులన్నట్లు, ఆయన రాజైనట్లు సూచనగా ఉన్నప్పటికీ, దేవుడు ఈ మొత్తం సంఘటనను నిజానికి యేసును సింహాసనాసీనుణ్ణి చేయడానికి ఉద్దేశించాడని తెలుస్తుంది. కుడివైపున ఒకనిని ఎడమవైపున ఒకనిని అనే పదజాలం యాకోబు, యోహానుల మనవిని గుర్తుచేస్తుంది (10:37,40).
15:29-30 దూషించిరి అంటే దేవదూషణలు చేసారు అని అర్థం. సహోద్రిన్ సభ వారు యేసును ఎందుకు మరణానికి అప్పగించి దోషులయ్యారో ఆ మార్గమున వెళ్లుచున్నవారు కూడా అదే దేవదూషణ చేసినందుకు అంతే దోషులుగా ఉన్నారు (14:64). అక్కడ నిలుచున్నవాళ్లు తమ తలలూచుచు అనేమాట కీర్తన 22:7; విలాప 2:15లను నెరవేర్చింది.
15:31 మరొకసారి ప్రధాన యాజకులు యేసును అపహాస్యం చేసే కార్యానికి నాయకత్వం వహించారు. వారు, శాస్త్రులు కలిసి చేసిన ఎగతాళి యేసు పరిచర్య ముఖ్యోద్దేశాన్ని తాకింది. యేసు తన్నుతాను రక్షించుకొన లేదు (10:45) ఎందుకంటే ఆయన పాపులను రక్షించాలనుకొన్నాడు.
15:32 క్రీస్తు గురించి 8:29 నోట్సు చూడండి. మతనాయకులు చేసిన అపహాస్యం స హెర్రిన్ ముందు యేసు ఎదుర్కొన్న రెండవ ఆరోపణను కూడా యేసును పీడించారని మార్కు తెలియచేశాడు. అందులో ఒకడు మారుమనస్సు పొందాడు (లూకా 23:39-43).
15:33 మధ్యాహ్నము అంటే ఆరవ గడియ అని అక్షరార్థం. మధ్యాహ్నం మూడు గంటలు అంటే 8 వ గడియ. ఇక్కడి చీకటి సహజాతీతమైనది, అది దేవుని తీర్పును సూచిస్తుంది (నిర్గమ 10:21-23; ఆమోసు 8:9).
15:34 మధ్యాహ్నం 3 గంటలకు అరామిక్ భాషలో ఎలోయీ, ఎలోయీ, లామా సబక్తానీ అని యేసు బిగ్గరగా కేకవేసెను. యథావిధిగా మార్కు ఈ మాటను అనువదించాడు. దేవునిచేత అతిఘోరంగా త్యజించబడ్డానని యేసు తలంచినప్పుడు సైతం తన తండ్రితో తనకున్న సంబంధాన్ని ఆయన రూఢిగా చెప్పాడు. నా దేవా, నా దేవా అనే మాటలు కీర్తన 22:1లోని ప్రారంభ పలుకులు. పాపాన్ని మోసిన వ్యక్తిగా దేవుని ఉగ్రతను యేసు భరించాడు.
15:35-36 దగ్గర నిలిచి యున్నవారు బహుశా “ఎలోయీ" అనే మాటను ఏలీయాగా పొరబడి ఉంటారు, ఎందుకంటే ఏలీయా తిరిగి వస్తాడనే నమ్మకం యూదామతంలో ఎన్నాళ్లగానో స్థిరపడిపోయింది. (9:11-13; మలాకీ 4:5). చిరక అనేది వెనిగర్, నీరు కలిపిన ద్రవ పదార్థం . దాన్ని సైనికులు త్రాగుతుండేవారు, అది వ.23 లోని ద్రాక్షారసం కాదు. ఈ చర్య కీర్తన 69:21 ని నెరవేర్చింది (యోహాను 19:28-29 నోట్సు చూడండి).
15:37 యేసు గొప్ప కేక వేసినప్పుడు పలికిన మాట (మొదటి మూడు సువార్త గ్రంథాలూ గ్రంథస్థం చేశాయి) ఏంటో యోహాను 19:30 స్పష్టం చేసింది. సమాప్తమైనది అని ఆయన కేక వేశాడు. యేసు పలికిన ఆఖరి మాటల్ని లూకా రాశాడు (లూకా 23:46).
15:38 దేవాలయపు తెర అనేది దేవాలయంలో అతి పరిశుద్ధ స్థలానికి ముందు వ్రేలాడదీయబడి ఉంటుంది. అది మధ్యకు చిరిగిపోవడంతో దేవుని సన్నిధికి నిరాటంకమైన ప్రవేశానికి మార్గం సుగమమయ్యింది, యేసు సిలువపై చేసిన పాప ప్రాయశ్చిత్తం మూలంగానే అది సాధ్యమయ్యింది (హెబ్రీ 6:19-20; 9:3; 10:19-22). యేసు బాప్తిస్మం తీసుకున్న సమయంలో దేవుడు ఆకాశాలను (చింపినప్పుడు) తెరచినప్పుడు మాత్రమే “చింపుట" అనే గ్రీకు పదం ఉపయోగించబడింది (మార్కు 1:10).
15:39 సిలువశిక్ష అమలు చేయడాన్ని పర్యవేక్షించిన అన్యుడైన శతాధిపతి మార్కు సువార్తలో యేసు దేవుని కుమారుడే అని మొదటిగా ఒప్పుకున్న వ్యక్తి (1:11,24; 3:11; 5:9; 9:7లతో పోల్చండి). అతని ఒప్పుకోలు మార్కు సువార్త ప్రారంభ వాక్యానికి సరిపోయింది (1:1).
15:40 మార్కు సువార్తలో మగ్దలేనే మరియ గురించిన తొలి ప్రస్తావన ఇదే. యేసు ఆమె నుంచి 7 దయ్యాలను వెళ్లగొట్టాడు (16:9; లూకా 8:2). ఈమె గలిలయ సముద్రానికి పశ్చిమాన ఉండే మగ్దల అనే ప్రాంతానికి చెందింది. చిన్న యాకోబు యోసే అను వారి తల్లియైన మరియ మత్తయి 27:61లో వేరొక మరియ అని పిలువబడింది. బహుశా ఆమె అల్పయి కుమారుడైన యాకోబు తల్లియై ఉంటుంది (మార్కు 3:18). మార్కు సువార్తలో మాత్రమే సలోమే పేర్కొనబడింది (వ.40; 16:1). ఆమె జెబెదయి కుమారులైన యాకోబు, యోహానుల తల్లి (మత్తయి 20:20; 27:56).
15:41 మార్కు సువార్తలో కేవలం స్త్రీలూ (వ.41; 1:31) దేవదూతలూ (1:13) యేసుకు ఉపచారం లేదా సహాయం చేశారు. పస్కా పండుగకు యెరూషలేముకు వచ్చిన ఇతర స్త్రీలనేకులు కూడా ఆయనకు పరిచారం చేశారు. 15:42-47 తొలినాళ్లలో క్రైస్తవ సువార్త ప్రకటనలో అతిముఖ్యమైన అంశం యేసు సమాధి చేయబడడం (1కొరింథీ 15:3-4). ఈ వృత్తాంతం మత్తయి 27:57-61; లూకా 23:50-56; యోహాను 19:38-42 ల్లో కూడా రాయబడింది.
15:42 శుక్రవారం సాయంకాలమైనప్పుడు యేసు సమాధి కార్యక్రమం హడావిడిగా జరిగిపోయింది. విశ్రాంతిదినం కొద్దిసేపట్లో మొదలవబోతుంది, విశ్రాంతిదినం మొదలైతే సమాధి కార్యక్రమాలు చేయడానికి అనుమతి ఉండదు. సిద్ధపరచు దినము అంటే విశ్రాంతి దినానికి ముందు భక్తిగల యూదులు ఆ రోజుకు అవసరమయ్యే వాటిని సిద్ధం చేసుకునే రోజు.
15:43 అరిమతయియ యోసేపు యేసుకు రహస్య శిష్యుడు (మత్తయి 27:57; యోహాను 19:38). ఇతడు సహోద్రిన్ సభలో ఘనత వహించిన యొక సభ్యుడు. వారి తీర్పును వ్యతిరేకించినవాడు (లూకా 23:51) అనే మాట యేసుకు మరణశిక్ష విధించే విషయంలో ఆ సభలో ఏకాభిప్రాయం లేదని తెలియచేస్తుంది. (మార్కు 14:55,64; 15:1 లతో పోల్చండి). యోసేపు తెగించి యేసు దేహాన్ని అడగడానికి పిలాతు దగ్గరకు వెళ్లాడు. ఇంతకుముందు అతడు కొనసాగించిన రహస్య శిష్యత్వానికి ఈ చర్య విరుద్ధంగా ఉంది. (యోహాను 19:38), రోమీయులు తరచూ నేరస్థులను సిలువపైనే కుళ్ళిపోయేవరకు వదిలేసేవారు, అయితే రాత్రిపూట వరకూ మృతులను అలా వదిలేయడానికి యూదులు అభ్యంతరం తెలియచేశారు (ద్వితీ 21:22-23).
15:44 సిలువ వేయబడిన వ్యక్తులు మరణానికి ముందు ఎన్నో రోజులు బ్రతికి ఉండేవారు. యేసు మాత్రం 6 గంటల్లోపే మరణించాడు. అందువల్ల ఆయన రెండవసారి పిలాతును ఆశ్చర్యపడేలా చేశాడు (వ.5).
15:45 తమ ప్రియుల మృతదేహాలను తీసుకోవడానికి కొన్నిసార్లు కుటుంబసభ్యులు లంచాలు ఇవ్వాల్సి వచ్చేది. అయితే ఎలాంటి లంచమూ తీసుకోకుండా పిలాతు యేసుని దేహాన్ని యోసేపున కప్పగించెను.
15:46 యోసేపు నారబట్ట కొని, యేసు దేహమును ఆ బట్టతోనే చుట్టిన విషయాన్ని కేవలం మార్కు మాత్రమే ప్రస్తావించాడు. యేసు యోసేపుదైన సమాధిలోనే ఉంచబడ్డాడు అని మత్తయి తన పాఠకులకు తెలియజేశాడు (మత్తయి 27:60). ఆ సమాధి ఎన్నడూ ఉపయోగించబడలేదని లూకా (లూకా 23:53), యోహాను (యోహాను 19:41) రాశారు. ఆ సమాధి వ్యక్తిగత సమాధి గుహకాదని, అదొక కుటుంబ సమాధి అని పాఠకులు అర్థం చేసుకోవాలి. మృతదేహాన్ని ఎవ్వరూ దొంగిలించకుండా ముద్రవేయడానికి వాళ్లు ఆ సమాధి ద్వారానికి రాయి పొర్లించెను. ఆ భారీ రాయి వృత్తాకారంలో ఉంటుంది. సమాధి ద్వారాన్ని మూయడానికి అనుకూలంగా చెక్కబడింది. 15:47 యేసుని మరణానికి సాక్ష్యమిచ్చిన స్త్రీలు ఆయన సమాధి కార్యక్రమానికి కూడా సాక్ష్యమిచ్చారు.