14:1 యేసు మాటలు, పా.ని.లోని అలాంటి హెచ్చరికలను ప్రతిధ్వనిస్తాయి (ద్వితీ 1:21,29, 20:1,3; యెహో 1:9ను యోహాను 11:33; 12:27; 13:21తో పోల్చండి), విశ్వాసముంచుడి అనే మాట పా.ని. లో ఉపయోగించి నట్లే, వ్యక్తిగత, సంబంధానుగుణమైన విశ్వాసాన్ని నిలుపుకోవడాన్ని సూచిస్తుంది (యెషయా 28:16).
14:2-3. వేరొకచోట తన శిష్యులు “నిత్యమైన నివాసములలో”నికి ఆహ్వానించబడతారని యేసు చెప్పాడు (లూకా 16:9). శిష్యులు పరమునకు చేరడం, ఒక కుమారుడు తన తండ్రి ఇంటికి తిరిగి రావడంతో పోలిక కలిగి ఉంది (లూకా 15:11-32). నేనుండు స్థలములో మీరును ఉండులాగున... మిమ్మును తీసికొని పోవుదును అనే మాటలు, పరమ 8:2 లోని భాషను ప్రతిధ్వనిస్తున్నాయి. మెస్సీయవరుడైన యేసు (యోహాను 3:29), తనను అనుసరించే వారికోసం తండ్రి యింట... స్థలము సిద్ధపరచ వెళ్తున్నానని, తరువాత వచ్చి తనతో ఉండేలా తీసుకుపోతానని చెప్పాడు.
14:4-6 యేసే మార్గమును సత్యమును జీవమును అయివున్నాడు (6:35,48 నోట్సు చూడండి), ఆయన ద్వారానే తప్ప యెవడును తండ్రియొద్దకు రాడు. యేసు ఒక్కడే దేవుని వద్దకు వెళ్ళే మార్గాన్ని ఏర్పరచగలడు. ఎందుకంటే ఆయన మాత్రమే మన పాపములకు వెల చెల్లించాడు (యెషయా 53:5; హెబ్రీ 1:3). ఆయనే సత్యం. (యోహాను 1:14,17; 5:33; 18:37ను 8:40,45-46తో పోల్చండి). దానికి విరుద్ధంగా చేసే ప్రకటనలన్నీ అబద్దమే. ఆయనొక్కడే జీవమై యున్నాడు (1:4), ఆయనలోనే జీవముంది (5:26). అందువల్లే ఆయన తనయందు. విశ్వాసముంచు వారందరికీ నిత్యజీవాన్ని ఇవ్వగలడు (3:16). యేసు సత్యము జీవమై ఉన్నాడు, రక్షణకు ఒకే ఒక్క మార్గం ఆయనే.
14:7 యేసును, తండ్రియైన దేవుణ్ణి - వాస్తవంగా ఎరుగుదుము అని నొక్కిచెప్పడం, పా.ని. నిబంధనా పరిభాషను ప్రస్తావిస్తుంది. (యిర్మీయా 24:7; 31:34; హో షేయ 13:4)
14:8 ఫిలిప్పు ఏదొక రకంగా దైవ ప్రత్యక్షత కావాలనుకున్నాడనేది స్పష్టం. పా.ని, లో మోషే దేవుని మహిమను చూడాలని కోరి, కొంతవరకు ఆయన మహిమను చూడగలిగాడు (నిర్గమ 33:18ను నిర్గమ 24:10తో పోల్చండి), యెషయా కూడా అలాంటి దర్శనమే పొందాడు (యెషయా 6:1; యోహాను 12:41 నోట్సు చూడండి). పా.ని. బోధనానుగుణంగా నైతే, దేవుని నేరుగా చూచే దర్శనం పొందడం సాధ్యం కాదని యేసు చెప్పాడు (1:18; 5:37; 6:46).
14:9-11 యేసు తనకు తండ్రితో ఉన్న ఐక్యతను గురించి చెప్పాడు. తండ్రి తనను తాను యేసు ద్వారా బయలుపరచుకున్నాడు.
14:12 సిలువ కార్యం తర్వాత యేసు తండ్రియొద్దకు వెళ్ళుచున్నాడు కాబట్టి శిష్యులు గొప్పవాటిని చేయడం సాధ్యమౌతుంది (12:24; 15:13; 19:30), ఆ కార్యములు గొప్పవి. ఎందుకంటే అవి యేసు సంపూర్ణకార్యం మీద ఆధారపడి, నిత్యఫలాలను ఇస్తాయి. (మత్తయి 11:11; యోహాను 15:8,16).
14:13-14 యేసు నామములో ప్రార్థించడం, ఒకడు తన కోరికలను, ఉద్దేశాలను దేవునితో సరిచేసుకున్నాడని వ్యక్తీకరిస్తుంది. (1యోహాను 5:14-15). యోహాను 3:16-18 నోట్సు చూడండి.
14:15 యేసు మాటలు ద్వితీయోపదేశ కాండపు నిబంధన షరతులను ప్రతిధ్వనిస్తున్నాయి (ద్వితీ. 5:10, 6:5-6, 7:9, 10:12-13, 11:13,22)
14:16-17 వేరొక ఆదరణకర్త లేక సత్యస్వరూపియైన ఆత్మ అంటే పరిశుద్దాత్మ (వ.26). ఆయన శిష్యులను సర్వసత్యం లోనికి నడిపిస్తాడు (16:13). భౌతికమైన యేసు సన్నిధికి బదులుగా, ఆయన అనుచరులలో ఎల్లప్పుడూ నివసించే ఆత్మతో మార్పిడి జరుగుతుంది. యేసు అనుచరులలో ఉండే దైవ సన్నిధిలో ఆత్మ (14:15-17), యేసు (వ.18-21), తండ్రి (వ. 22-24) ముగ్గురూ ఉంటారు.
14:18 శిష్యునిలో ఉండే ఆత్మ సన్నిధి, యేసు తానే వ్యక్తిగతంగా ఉండేదానికి సమానంగా ఉంటుంది. ఎందుకంటే, ఆత్మ యేసును గురించి సాక్ష్యమిస్తాడు (15:26), యేసు చేసిన కార్యంలోని ప్రత్యేకతను శిష్యుడు అర్థం చేసుకొనేలా చేస్తాడు (16:14). నేను మిమ్మును అనాథలనుగా విడువను అని యేసు నిశ్చయతను ఇవ్వడం, మోషే ఇశ్రాయేలీయులతో పలికిన వీడ్కోలు మాటలను ప్రతిధ్వనిస్తున్నాయి (ద్వితీ 31:6ను యెహో 1:5తో పోల్చండి). ఇలా చెప్పినప్పుడు యేసు మనసులో ఆయన పునరుత్థానం, పెంతెకోస్తు నాడు ఆత్మ దిగిరావడం ఉన్నాయి.
14:19-20 ఆ దినమున బహుశా పెంతెకోస్తు నాడు యేసు తన శిష్యులపైకి పరిశుద్దాత్మను పంపడాన్ని సూచిస్తుండవచ్చు.
14:21 నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడు అనడం, నన్ను కనబరచుకొందుననే మాటలు, సీనాయి కొండ దగ్గర మోషేకు ధర్మశాస్త్రమును ఇవ్వడాన్ని, ఇంకా మిగిలిన పా.ని. దైవ ప్రత్యక్షతలను గుర్తుచేస్తాయి (నిర్గమ 33:13).
14:22 ఈ ఇస్కరియోతు కాని యూదా బహుశా “యాకోబు కుమారుడైన యూదా” కావచ్చు. ఇతనినే తద్దయి అని కూడా అన్నారు (మార్కు 3:18-19 నోట్సు చూడండి). ఇతనిని ఇంకా లూకా 6:16; అపొ.కా.1:13లో కూడా పేర్కొన్నారు. కానీ ఇతడు యేసు సహోదరుడైన యూదా కాదు (మత్తయి 13:55; మార్కు 6:3).
14:23-24 మేము వానియొద్దకు వచ్చి వానియొద్ద నివాసము చేతుము అనే మాటలు ప్రత్యక్షపు గుడారంలో దేవుడు తన ప్రజలతో (నిర్గమ 25:8; 29:45; లేవీ 26:11-12), దేవాలయంలో (1రాజులు 8:10-11ను అపొ.కా.7:46-47 తో పోల్చండి) నివసించడాన్ని జ్ఞాపకం చేస్తూ, పెంతెకోస్తు నాడు పరిశుద్దాత్మ దిగి రావడాన్ని గూర్చి చూపుతుంది (అపొ.కా.2).
14:25-26 పరిశుద్దాత్మను (1:33; 20:22) పా.ని.లో అరుదుగా పేర్కొన్నారు. (కీర్తన 51:11; యెషయా 63:9-10). ఇక్కడ యేసు దృష్టి, భవిష్యత్తులో పరిశుద్దాత్మచేసే బోధనా పరిచర్య మీద ఉంది. (1యోహాను 2:20,27).
14:27 శాంతి (లేక సమాధానం) అనే వ్యక్తీకరణ (హెబ్రీ. షాలోమ్) దేవునితో సరైన సంబంధంలో ఉన్నవారికి శుభములుగాను లేక ఆశీర్వాదాలు పలకడానికి ఉపయోగించవచ్చు (సంఖ్యా 6:24-26ను కీర్తన 29:11; హగ్గయి 2:9తో పోల్చండి). మెస్సీయ “సమాధాన కర్తయగు అధిపతి” కాబట్టి (యెషయా 9:6), ఆయన “సమాధాన వార్త అన్యజనులకు తెలియజేయును” కాబట్టి (జెకర్యా 9:10; 9:9తో పోల్చండి), ఆయన వచ్చిన తర్వాత సమాధానకాలం ఉంటుందని పా.ని. ప్రవచించింది. సమాధానం, రక్షణ శుభవార్తలు ఉంటాయి (యెషయా 52:7తో 54:13; 57:19 పోల్చండి), దేవుడు తన ప్రజలతో ఒక నిత్యమైన “సమాధాన నిబంధన” స్థాపిస్తాడు (యెహె 37:26). కలవర పడకండి, వెరవకండని (14:1తో పోల్చండి) తన అనుచరులకు యేసు ఇచ్చిన వీడ్కోలు ప్రోత్సాహం, మోషే వీడ్కోలు ఆలోచనను ప్రతిధ్వనిస్తుంది (ద్వితీ 31:6,8).
14:28-29 యేసు హెచ్చించబడిన తర్వాత, ఆయన శిష్యులు హెచ్చించ బడిన యేసు నామాన్ని బట్టి, తమలో నివసించే ఆత్మను బట్టి ప్రార్థించగలరు. తండ్రి నాకంటె గొప్పవాడు అనే మాటలు యేసు అన్నా, తండ్రి అన్నా ఒక్కరే అనే వాదనను కాక, నిత్యుడైన కుమారునిగా యేసు విధేయతను సూచిస్తున్నాయి.
14:30 లోకాధికారి గురించి, 12:30-31 నోట్సు చూడండి. సాతానుకు యేసుపై చట్టబద్ధంగా ఎలాంటి అధికారం, పట్టు లేవు.
14:31 "14:31 నుండి 15:1 కి ఉన్న మార్పు భాషాపరమైన అతుకు అని కొందరు పండితులు సూచించారు. అంటే యోహాను సువార్త వేర్వేరు కథనాలను (ఒకటి 14:31 దగ్గర ముగిసిందని; వేరొకటి 15:1 దగ్గర ఆరంభమైందని) కలిపి కుట్టిందని వారి భావన. అయితే యోహాను మేడగది నుండి గెత్సెమనె తోటకు మార్పును వివరిస్తున్నాడంతే (లెండి, ఇక్కడనుండి వెళ్ళుదము). 18:1 వచనానికి ఆయన గెత్సెమనె తోటకు చేరుకున్నాడు.