12:1-2 మనం సరిగా ఎలా స్పందించాలో (ఉదా: కాబట్టి... బతిమాలుకొ నుచున్నాను) ఆదేశపూర్వకంగా సూచించడానికి ముందు పౌలు మనకోసం దేవుడు చేసిన కార్యాలను గూర్చి చెప్పాడు. చెప్పిన విధానంలో మొదట సిద్ధాంతం, తరువాత ధర్మం లేక బాధ్యత ఉన్నాయి. మన యుక్తమైన సేవలో ఆవశ్యకమైనది సజీవయాగముగా మన శరీరములను సమర్పించడం, అంటే దేవుని ఘనతకోసం జీవించడానికి మన సంపూర్ణ వ్యక్తిత్వాన్ని అంకితం చేయడం. క్రైస్తవేతర సమాజంకంటే క్రైస్తవులు భిన్నంగా ఉండాలి. మన మనస్సు మారి నూతనమగుటవలన క్రమంగా రూపాంతరాన్ని.. మనం అనుభవించాలి. పరిశుద్దాత్మ మనలో పనిచేస్తుండగా ప్రార్ధన చేయడం, దేవుని వాక్యాన్ని చదివి, తలపోయడం, ఆరాధించడం, దేవుని కార్యాలను ధ్యానించడం అనే అభ్యాసాల ద్వారా మన మనసు మార్పు చెందుతుంది.
12:3-8 నూతనపరచబడిన మనస్సులో - భాగంగా, క్రైస్తవుడు తన గురించి జ్ఞానయుక్తంగా ఎంచుకొని, క్రీస్తు శరీరం (సంఘం; 1కొరింథీ 12:12-28)లో అతని పని ఏమిటో తెలుసుకోవాలి. విశ్వాస పరిమాణం అంటే ఒకడు సువార్తను బట్టి తనను కొలుచుకోవడం అని కావచ్చు. ఇతరులు దాన్ని భిన్నమైన విశ్వాస పరిమాణాలుగా చూస్తారు. రెండువిధాలుగా కూడా పౌలు క్రైస్తవులను దీనులుగా ఉండి, దేవుడు తమకిచ్చినది సంఘమనే శరీరం మేలు కోసం ఉపయోగించమని ప్రోత్సహిస్తున్నాడు. రోమా 12:3; 1కొరింథీ 12:8-10; ఎఫెసీ 4:11-12; 1 పేతురు 4:10 ఆధారం చేసుకుని, ఇతరుల మేలు కోసం వినియోగించడానికి క్రైస్తవులకు కృపావరములు ఇవ్వబడ్డాయి.
కొ.ని.లో కనీసం 17 రకాల కృపావరాల జాబితాలు కనబడతాయి. క్రైస్తవులు తమ వ్యక్తిగత విశ్వాసాన్ని బట్టి మాత్రమే కాక క్రీస్తు శరీరం
యొక్క వ్యక్తీకరణలైన స్థానిక విశ్వాస సహవాసాలలో వారు కలిసివుండడాన్ని బట్టి నిర్వచింపబడతారు (1కొరింథీ 12:12-31చూడండి). ఈ ప్రస్తుత వాక్యభాగంలో కొన్ని వరములను మాత్రమే వివరించాడు. కొ.ని. సంఘాలలో ప్రవచనం అంటే దేవుని నుండి నేరుగా పొందిన ప్రత్యక్షత. ఈ వరం స్పష్టమైన క్రైస్తవ సత్యాల వెలుగులో తూచబడి ఉపయోగించబడాలి. పరిచర్య (గ్రీకు. "డియాకోనియా") అనే మాటనుండే “డీకన్” (సంఘపెద్ద) అనే మాట పుట్టింది. ఇక్కడ సంఘపెద్ద అంటే పాలకుల బృందంలో సభ్యుడని కాదు గాని సేవకుడు అని అర్థం. ఇది ఒక బిరుదునో లేక పదవినో కాక పరిచర్య వరమును వివరిస్తుంది. కాపరులు ఈ పరిచారక వరం కలిగి ఉండాలి. బోధించుట ఒక ఆవశ్యకమైన వరం. తల్లిదండ్రులు పిల్లలకు నేర్పుతారు, ఎదిగిన విశ్వాసులు నూతన విశ్వాసులకు నేర్పిస్తారు, కాపరి-ఉపదేశక పరిచర్యలో ఉన్నవారు సంఘానికి ప్రధాన బోధకులుగా ఉంటారు. పెద్దలు కూడా బోధింప సమర్థులై ఉండాలి. విశ్వాసులందరూ ఒక స్థాయివరకు నేర్పించగలగాలి కానీ బోధించే ప్రత్యేక వరం గలవారు దాన్ని పెంపొందించుకొని, ఉపయోగించాల్సిన బాధ్యత కలిగి ఉంటారు. హెచ్చరించుట అనేది ప్రోత్సహించి, ప్రేరేపణ కలిగించే వరం. ఈ వరం పరిశుద్దాత్మ చేసే పనివంటిది. పంచిపెట్టుట దాతృత్వంతో చేయాలి. అందరూ ఇవ్వగలరు, కానీ ఇచ్చే సామర్థ్యాలు వేరువేరుగా ఉంటాయి. కొందరు తమకున్న చాలా చిన్నమొత్తంలో నుండి సైతం సంతోషంగా ఇస్తారు (మార్కు 12:41-44, ఇతరులు 90 శాతం ఇచ్చి, 10 శాతం మీద జీవిస్తారు. పై విచారణ చేయుట అంటే ప్రభావవంతమైన దర్శనంతో నడిపించే వరమే కానీ అది గర్వంతో కూడినదై ఉండకూడదు. కరుణించుట అంటే వ్యాధిగస్తులకు, పేదవారికి, విచారగ్రస్తులకు సహాయం చేయడం. ఈ వరాన్ని సంతోషంతో ఉపయోగించాలి. అవసరతలో ఉన్న సభ్యులకు ఆచరణాత్మకమైన సహాయం చేయడం ఆది సంఘాలలో ఉన్న ముఖ్యమైన విషయం. నేటి సంఘాలలో కూడా ఇదే లక్షణాన్ని నొక్కి చెప్పాల్సి ఉంది.
12:9-16 రూపాంతరం చెందిన ఆలోచనను వరుసగా కొన్ని క్లుప్త హెచ్చరికలలో వివరించాడు. పౌలు దేవుని ప్రేమను ఈ పత్రికలో వివరించాడు; ఇప్పుడు అతడు శిష్యుని "ప్రేమవలన కార్యసాధకమగు విశ్వాసము" (గలతీ 5:6) వైపు దృష్టి మరల్చాడు. క్రైస్తవులు ఒకటే కుటుంబం, వారు ఒకరినొకరు గౌరవించాలి, సహోదర ప్రేమ విషయములో ఒకనియందొకడు అనురాగము గలవారై ఉండాలి. వారు ఆత్మయందు. తీవ్రతగలవారై లేక పరిశుద్దాత్మ చేత రేపబడి, ప్రేరేపించబడి పరిచర్య చేసేవారుగా ఉండాలి. యేసు పునరాగమన నిరీక్షణతో వారు సంతోషించాలి కూడా. వారికున్నదాన్ని ఇచ్చుచూ తోటి సంఘస్తుల సంతోష, విచారాలలో భాగం పంచుకోవాలి. జీవితపు శ్రమలలో, హింసలలో ప్రార్థన చేస్తూ, శరీర అవయవాలుగా ఒకరికొకరు సహాయపడాలి. గర్వం ఒక పెద్ద పాపం, దీనత్వం గొప్ప సుగుణం. ఒకడు తనగురించి తాను హెచ్చుగా తలంచకూడదు. “దేవుడు. అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును" (1 పేతురు 5:5).
12:17-21 క్రైస్తవులు తరచు సమాజం నుండి ద్వేషాన్ని, హింసను ఎదుర్కొంటారు. (1 పేతురు 1:6; 2:11-12; 3:14-17; 4:12-16; 5:9). సామాన్యంగా, అలాంటప్పుడు తిరుగబడాలనిపిస్తుంది కానీ క్రైస్తవులు నశించిన, విరోధమైన లోకానికి దేవుని కృపను అందించి పరిచర్య చేయడానికి పిలవబడ్డారు. యేసే మన మాదిరి. సాధ్యమైనంత మట్టుకు మనం సమస్త మనుష్యులతో సమాధానముగా ఉందాలి. సంఘాన్ని హింసించిన సౌలువంటి వారిని కూడా మార్చగల సర్వాధికారి దేవుడు. దేవుడే న్యాయాధిపతి, ఉగ్రతను పంపించేవాడు. దేవుని కృప, ప్రేమలను మన జీవితాలలో కనపరచడమే మన పని. సిలువపై యేసు నందు దేవుడు కీడును జయించాడు. మనలను కీడు జయించకుండా చూచుకుని మేలుచేత కీడును జయించాలి.