4:1-42 సమరయ స్త్రీని యేసు కలుసుకోవడమనేది దైవిక అవసరం ద్వారా జరిగింది. (వ.4). నీకొదేములాగా కాకుండా స్త్రీ తన అవగాహనలో ఎదుగుదల చూపించింది. ఆమె యేసుని మొదట ఒక యూదునిగా (వ.9), ఆ తర్వాత తన జీవితాన్ని సులభతరం చేయగలిగిన వ్యక్తిగా (వ. 15), ఆ తర్వాత ఒక ప్రవక్తగా (వ.19), ఆ తర్వాత బహుశా మెస్సీయగా చూసింది (వ.29). స్త్రీ తోటి పట్టణ ప్రజలు, యేసే లోకరక్షకుడని నిర్ధారించుకున్నారు (వ.42).
4:1 పరిసయ్యులు బాప్తిస్మమిచ్చు యోహాను అర్హతలను దర్యాప్తుచేసారు (1:19,24), ఇప్పుడు వారు యేసుకున్న అర్హతలను పరిశీలిస్తున్నారు.
4:2 ఈ సువార్త రచించినవాడూ, సువార్తికుడూ అయిన యోహాను, ఇంతకు ముందు 3:26 లో చేసిన ప్రకటనకు ఇక్కడ స్పష్టత నిచ్చాడు.
4:3 యేసు యూదయ నుండి గలిలయ వెళ్లడం గురించి 3:22 నోట్సు, చూడండి.
4:4 యేసు ప్రయాణాన్ని దేవుడు తన సార్వభౌమ ప్రణాళిక ద్వారా నిర్ణయించడాన్ని వెళ్ళవలసి వచ్చెను అన్న మాట సూచిస్తూ ఉండవచ్చు (9:4; 10:16; 12:34; 20:9), యూదయ నుండి సమరయ మార్గమున సరాసరి గలిలయ చేరుకోవచ్చు కానీ నిక్కచ్చిగా ఉండే యూదులు అపవిత్రులవ్వకుండా తప్పించుకోవడం కోసం సమరయ ద్వారా కాకుండా చాలా పొడవైన చుట్టు మార్గం గుండా వెళ్లేవారు. ఇందులో భాగంగా వారు యొర్దాను నది దాటి సమరయ నుండి నదికి అవతల తూర్పు వైపున ప్రయాణించేవారు.
4:5 సుధారను ఊరు గెరిజీము, ఏబాలు పర్వతాలకు తూర్పున ఉంది. యాకోబు తన కుమారుడైన యోసేపుకిచ్చిన భూమి అన్న మాటలను సాధారణంగా ఆది 48:21-22 మరియు యెహో 24:32 నుండి తీసుకోవడం జరిగింది. షెకెములో హమోరు కొడుకుల దగ్గర కొన్న పొలాన్ని యాకోబు తన కొడుకైన యోసేపుకిచ్చాడు (ఆది 33:18-19), ఆ తర్వాతి కాలంలో యోసేపుని ఆ పొలంలోనే పాతిపెట్టారు (నిర్గమ 13: 19; యెహో 24:32), 4:6 యేసు తన ప్రయాణము వలన అలసిపోయాడు. ఈ విషయం యేసు నిజంగా సంపూర్ణమైన మానవుడేనని నొక్కి చెబుతుంది.
4:7 మొదటి మాటే "యేసు ఏం చెయ్యబోతున్నాడు?" అన్న ప్రశ్న లేవనెత్తవచ్చు. సమరయుల గురించి తెలిసిన వారెవరైనా యేసు చేసిన అభ్యర్థనను బట్టి విస్తుపోతారు.
4:8 యేసూ, ఆయన శిష్యులు సాధారణంగా తమ ప్రయాణాల్లో తినడానికి ఏదైనా కొంత తీసుకెళ్తారు లేదా ఏమీ తీసుకెళ్లరు. దానికి బదులుగా దారిలో అవసరమైన వాటిని కొనుక్కోవడం కోసం డబ్బులు తీసుకువెళ్ళేవారు (12:6; 13:29). ఆహారం కొనడమనేది సాధారణంగా శిష్యులకు అప్పగించే పని. సమరయుల ఊరిలో కొన్న “ఆహారం" వల్ల అపవిత్రం అవుతానని యేసు భయపడలేదు.
4:9 యూదులు సమరయులతో సాంగత్యం చేయరు అని రచయిత పక్కన రాసిన మాటలు, సమరయులు నిరంతరం అపవిత్ర స్థితిలోనే ఉంటారన్నట్లుగా రబ్బీలు భావించేవారని చెదరిన యూదులలోని తన పాఠకులకు వివరించాయి.
4:10-15 జీవజలమును అనుగ్రహించేవానిగా యేసుని సూచించడమనేది ద్వంద్వార్థాన్నిస్తుంది. (3:3-8, 14-15 నోట్సు చూడండి). అక్షరార్థంగా ఆ మాట ఊరేటి నీటి బుగ్గను సూచిస్తుంది. (ఆది 26:19, లేవీ 14:6). దేవుడు జీవానికి ఆధారమైన వానిగానూ (ఆది 1:11-12,20-31; 2:7), “జీవజలముల ఊట” గానూ (యిర్మీయా 2:13; యెషయా 12:3 చూడండి) ప్రసిద్ధి. సంఖ్యా 20:8-11 లో ఇశ్రాయేలీయులకు ఎంతో అవసరమైన నీళ్ళు బండలోనుండి ప్రవహించాయి.
4:11 యాకోబు బావి పాలస్తీనాలోనే లోతైనది అయ్యుండొచ్చు. అది ఈ రోజున వంద అడుగుల కన్నా ఎక్కువ లోతు కలిగి ఉంది, బహుశా యేసు రోజుల్లో ఇంకా లోతుగా ఉండి ఉండవచ్చు.
4:12 యాకోబు సమరయులకు బావి నివ్వడాన్ని తానును అందులో నీళ్లను తాగడం గురించి స్త్రీ చెప్పిన విషయాలు సాంప్రదాయాన్ని ఆధారం చేసుకొని చెప్పినవే గానీ వాటికి లేఖనాధారం ఏమీ లేదు. యాకోబు బావి తవ్వడం గురించి, అందులో నీళ్ళని తాగడం గురించి, దాన్ని అతని కుమారులకు ఇవ్వడం గురించీ ఆదికాండంలో రాయలేదు.
4:14 వానిలో ఊరేడి నీటి బుగ్గగా ఉండునని యేసు పలికిన మాటలు యెషయా 12:3 ని గుర్తుచేస్తాయి (యెషయా 44:3; 55:1-3).
4:16 యేసు ఆ స్త్రీకిచ్చిన సూచనలు ఆమె తన భర్తతో కాకుండా మరో వ్యక్తితో నివసిస్తున్నట్లు అంగీకరించే అవకాశాన్నిచ్చాయి.
4:17 ఒక విధంగా సత్యమే అనిపిస్తున్నప్పటికీ, స్త్రీ మాటలు తప్పుదారి పట్టించేవిగా ఉన్నాయి. ఎందుకంటే ఆమె మాటలు తనింకా ఎవరితోనూ జతపడలేదన్న అర్థాన్ని కూడా ఇవ్వొచ్చు. యేసుకి సత్యమేమిటో పూర్తిగా తెలుసు.
4:18 స్త్రీకి అయిదుగురు పెనిమిట్లుండిరి లేదా ఐదుగురు పురుషులు (గ్రీకు. ఆనేర్. అనగా "భర్త" లేదా "పురుషుడు”) ఉండిరి - వరుసగా అక్రమ సంబంధాలను కలిగి ఉంది, ఆమె తన ప్రస్తుత ప్రియున్ని కూడా పెళ్లి చేసుకోలేదు. పాత, కొత్త, రెండు నిబంధనలూ వివాహానికి వెలుపల లైంగిక సంబంధాలను నిషేధించాయి.
4:19 స్పష్టంగా ఎవరూ తెలియజేయనప్పటికీ యేసుకి తన జీవితంలోని పరిస్థితులన్నీ తెలుసన్న సంగతిని స్త్రీ గ్రహించింది. అందుచేత ఆయన ఒక ప్రవక్త అయ్యుండాలి (లూకా 7:39).
4:20-21 పితరులు ఈ పర్వతము పై ఆరాధించారు. ఇది గెరిజీము పర్వతాన్ని సూచిస్తుంది. (ద్వితీ 11:29; 27:12). పా.ని. లో ఈ పర్వతం నిబంధన ననుసరించడం వల్ల వచ్చే ఆశీర్వాదాలను ప్రకటించడానికి వేదికగా ఉంది, దేవుడు ఈ పర్వతంపైనే బలిపీఠం కట్టమని మోషేకి ఆజ్ఞాపించాడు (ద్వితీ 27:4-6). ఈ ప్రాంతంలో బలిపీఠాలు కట్టినవారి జాబితాలో అబ్రాహాము (ఆది 12:7), యాకోబు(ఆది 33:20)లు కూడా ఉన్నారు.
4:22 నిజమైన ఆరాధన నిజమైన దేవుని జ్ఞానం మీద ఆధాపడినదై ఉండాలి, అయితే సమరయులు మాత్రం తమని తాము కేవలం పంచకాండాల వరకే పరిమితం చేసుకున్నారు. రక్షణ యూదులలో నుండియే కలుగుచున్నది, రక్షణ చరిత్రలో చూస్తే ప్రపంచానికి రక్షణ వచ్చే మార్గం యూదులేనని అర్ధమవుతుంది.
4:23-24 దేవుడు ఆత్మ గనుక చుట్టుపక్కల దేశాలు చేసినట్లుగా ఇశ్రాయేలీయులు “దేని రూపములోనైననూ" విగ్రహాలను చెయ్యకూడదు (నిర్గమ 20:4). యేసు చెప్పిన విషయమేమిటంటే దేవుడు ఆత్మ గనుక సరైన ఆరాధన కూడా ఆత్మ సంబంధమైనది అయ్యుంటుంది కానీ భౌతికమైన స్థలంతో సంబంధం ఉండదు.
4:25-26 యేసు బిరుదులలో ఒకటైన “క్రీస్తు”ని గురించి 1:38 నోట్సు చూడండి.
4:27 ఒక స్త్రీతోనైనా లేదా ఒకని భార్యతోనైనా ఎక్కువగా మాట్లాడడం వల్ల సమయం వృధా అవుతుందనీ, లేఖనాల అధ్యయనం నుండీ దేవుణ్ణి ధ్యానించడం నుండీ ఒకని దృష్టి మళ్లుతుందని సాధారణంగా యూదులు బోధించేవారు కాబట్టి యేసు స్త్రీతో మాటలాడుట శిష్యులు చూసి ఆశ్చర్యపోయారు.
4:28 స్త్రీ దగ్గరున్నకుండ బహుశా మట్టితో చేసిన పెద్ద కూజా అయ్యుండొచ్చు. దాన్ని భుజంపై గానీ తొంటి పైగానీ పెట్టుకొని మోసుకువెళ్ళేవారు. యేసు గురించి తన గ్రామస్థులకు చెప్పడం కోసం ఆమె బావి దగ్గరికి రావడానికి కారణమైన అసలు పనిని విడిచిపెట్టేసింది. 4:29 నేను చేసినవన్నియు నాతో చెప్పెను అన్న మాటలను అతిశయోక్తులుగా చెప్పిందామె. కానీ ఆమె ఉత్సాహం యొక్క వెలుగులో వాటిని అర్థం చేసుకోవచ్చు. వ. 39 నోట్సు చూడండి.
4:30 ఆమె ఏ వ్యక్తితో మాట్లాడిందో ఆయన్ని చూడటానికి ప్రజలు తమ పనులను కూడా విడిచిపెట్టి వచ్చేంత విశ్వసనీయత ఆ స్త్రీకి ఉండడమనేది ఆసక్తికరమైన విషయం .
4:31 బోధకుడా, భోజనము చేయుమని శిష్యులు చెప్పడమనేది సాధారణంగా తమ గురువు పట్ల వారికున్న శ్రద్ధను తెలియజేస్తుంది. సమరయ స్త్రీతో జరిగిన సంభాషణ కంటే ముందే యేసు ప్రయాణం వల్ల అలసిపోయాడు (వ.6 నోట్సు చూడండి). అయినప్పటికీ, ఆయన తినడానికి ఏమీ తీసుకోలేదు.
4:32-34 యేసు భౌతిక ఆహారం కంటే తన తండ్రి పనిని పూర్తి చెయ్యడమే ముఖ్యం అనుకున్నాడు (మత్తయి 6:25; మార్కు 3:20-21). అతని మాటలలో ద్వితీ 8:3 ప్రతిధ్వనిస్తూ ఉండవచ్చు. (మార్కు 4:4; లూకా 4:4). యేసు పని గురించి 17:4 నోట్సు చూడండి.
4:35 వ్యవసాయంలో విత్తడానికి కోతపనికీ మధ్యనుండే కాల వ్యవధి ఎక్కువగానే ఉంటుంది. యేసు రాకతో విత్తడమూ (బోధించడం), కోయడమూ (మారుమనస్సు పొందడం) రెండూ ఒక్కసారే సంభవిస్తున్నాయని శిష్యులు గ్రహించాల్సిన అవసరం ఉంది. తరువాతి వచనాలు యేసు దగ్గరికి రాబోతున్న సమరయులను సూచిస్తూ ఉండ వచ్చు (వ.39-42),
4:36 ఈ మాట ఆమోసు 9:13 ని గుర్తు చేస్తుంది. ఆ వచనంలో కొత్త యుగంలో ఉండే సమృద్ధిని వర్ణించారు. అందువల్ల యేసు తాను మెస్సీయ యుగాన్ని ప్రారంభిస్తున్నానని చెప్పాడన్నమాట. ఆ కాలంలో పంట వేగంగా కోతకొస్తుంది, సమృద్ధిగానూ పండుతుంది.
4:37-38 ఈ మాటలు మీకా 6:15 ని సూచిస్తూ ఉండవచ్చు - “నీవు విత్తనము విత్తుదువుగాని కొయ్యక యుందువు”. అయినప్పటికీ యేసు ఆ వచనంలోని - తీర్పు గురించి ప్రస్తావించకుండా దాన్ని విడిచిపెట్టేశాడు. ఇతరులు కష్టపడిరి అన్న మాటలలో ఇతరులు - అంటే యేసూ, తన కంటే ముందుగా వచ్చినవారూ. ఇటీవలి సంవత్సరాలలో చూస్తే పా.ని. యుగానికి సంబంధించిన చివరి ప్రవక్తయిన బాప్తిస్మమిచ్చు యోహానే ఆ ముందుగా వచ్చినవాడు. ఆ ముందు కష్టించిన వారి పనికి లబ్దిదారులు, ఆ పంటను తీసుకొచ్చేవారు యేసును వెంబడించేవారే.
4:39 ఆ ఊరు అన్న మాట సుఖారును సూచిస్తుంది (వ. 5 నోట్సు చూడండి). ఈ అనైతిక సమరయ స్త్రీ వంటి వారు చేసే మతపరమైన వ్యాఖ్యలను ప్రజలు సహజంగానే సందేహించవచ్చు కానీ ఆమె యేసు గురించి మాట్లాడేటప్పుడు తన మాటలను వాస్తవాలుగా పరిగణించే విధంగా ఆమె నిజాయితీయే తన పట్టణ ప్రజలను ఒప్పించింది. (నిజాయితీ అంటే బహుశా ఆమె నైతికతలో గుర్తించదగిన మార్పు ఏదైనా అయ్యుండొచ్చు).
4:40 సమరయులకు వ్యతిరేకంగా , యూదులు చూపే పక్షపాతాన్ని యేసు అస్సలు సమర్ధించలేదు. దానికి రుజువు ఆయన వారితో రెండు దినములుండెను (వ.4,9 నోట్సు చూడండి).
4:41-42 ఆ స్త్రీ కూడా ఇతరులు చేసినట్లుగా (1:40-41,45) ఆ ప్రజలు తమంతట తామే యేసుని చూడటానికి వీలయ్యే విధంగా వారిని ఆయన దగ్గరికి తీసుకొచ్చింది. అంతిమంగా యేసుని వ్యక్తిగతంగా కలుసుకున్న దాని ఆధారంగానే వారు విశ్వాసముంచారు. సమరయుల మధ్య పెద్ద మొత్తంలో ఆయన కోసిన పంట, సార్వత్రికంగా అందరికీ విస్తరించిన ఆయన రక్షణ కార్యపరిధిని సూచిస్తుంది. (10:16; 11:51-52). ఆదిమ సంఘం కూడా సమరయుల మధ్య సువార్త పరిచర్యను చేపట్టింది (అపొ.కా.1:8; 8:4-25). యూదయ నుండి (నీకొదేము, యోహాను 3 అధ్యా.) సమరయ వరకూ (యోహాను 4 అధ్యా.), అన్యజనుల వరకూ (వ.46-54; 12:20-33) యేసు ముందుగా ప్రారంభించిన పరిచర్య విధానాన్నే పెంతెకొస్తు అనంతరం ఆదిమ సంఘం కూడా అవలంబించింది (అపొ.కా.1:8).
4:43-54 ప్రధాని కుమారుడు స్వస్థపరచబడటంతో యోహాను సువార్తలోని “కానా చక్రం" పూర్తి అవుతుంది. అది 2:1 నుండి 4:54 వరకూ నడిచింది. దాని ప్రారంభమూ ముగింపూ గలిలయలోని కానాలో యేసు ప్రదర్శించిన సూచక క్రియల ద్వారానే జరిగింది (2:11; 4:54; 2:11 నోట్సు చూడండి). యేసు చాలా దూరం నుండే చేసిన స్వస్థతలకి ఈ సూచన క్రియే ఒక అరుదైన ఉదాహరణ. ఈ కథ మత్తయి 8:5-13; లూకా 7:2-10 లోని అన్యుడైన శతాధిపతి కథను పోలి ఉంటుంది కానీ ఇది ఆ సన్నివేశం కాదు. కానా చక్రంలో కనిపించే మూడు సూచక క్రియలు (నీటిని ద్రాక్షారసంగా మార్చడం, మందిరం నుండి వ్యాపారులను తోలివేయడం, ఇంకా ప్రధాని కుమారుణ్ణి స్వస్థపరచడం) యేసును మెస్సీయగా కనపరుస్తాయి. ఆ విధంగా యేసు తాను దైవికంగా నియమింప బడ్డాడన్న దానికి నమ్మకమైన రుజువులను చూపించాడు.
4:43 యేసు అక్కడ (సుఖారు) నుండి బయలుదేరి గలిలయకు వెళ్ళాడు. సుఖారు నుండి కానా వరకూ ఉండే దూరం నలభై మైళ్ళు, ప్రయాణం చెయ్యడానికి రెండు మూడు రోజులు పడుతుంది.
4:44 ప్రవక్త స్వదేశములో ఘనత పొందక పోవడాన్ని గురించి, మత్తయి 13:57 నీ, లూకా 4:24 నీ పోల్చి చూడండి.
4:45 యేసును గలిలయులు స్వాగతించడాన్ని వ.44,48 ల వెలుగులో అర్థం చేసుకోవాలి (2:23-25).
4:46 ప్రధాని బహుశా అన్యుడైన శతాధిపతి అయ్యుండొచ్చు, బహుశా హేరోదు అంతిపయ వద్ద పని చేస్తుండవచ్చు. (మార్కు 6:14). అతని కొడుకు జ్వరంతోనూ (యోహాను 4:52) ప్రాణాంతకమైన అనారోగ్యంతోనూ (వ.47,49) ఉన్నట్లు తెలుస్తూ ఉంది.
4:47 కపెర్నహూము నుండి కానాకు దాదాపు పదిహేను మైళ్ళ దూరం ఉంటుంది. చాలావరకు ప్రయాణమంతా పైకి ఎక్కుతూ నడవాల్సి ఉంటుంది (2:12 నోట్సు చూడండి). ఇదే మాదిరిగా తిరిగొచ్చేటప్పుడు, యేసు కానా నుండి కపెర్నహూముకి దిగి వచ్చాడు.
4:48 సూచక క్రియలను మహత్కార్యములను అన్న మాటలు ఐగుప్తులోనుండి బయటికి వచ్చేటప్పుడు మోషే వరుసగా చేసిన అద్భుతాలను గుర్తు చేస్తున్నాయి. అద్భుతాలపై ఆధారపడినందుకు యేసు ప్రజలను మందలించాడు. యోహాను సువార్తలో మాత్రం "అద్భుతాలనేవి" యేసే
మెస్సీయ అని సూచించే గుర్తులుగా ఉన్నాయి (2:11 నోట్సు చూడండి).
4:49-50 దూరం నుండే చేసిన అద్భుతాలకి ఇదొక అరుదైన ఉదాహరణ. ఇటువంటి సంఘటనే మత్తయి 8:5-13; లూకా 7:2-10 లో కూడా చూడవచ్చు. నీ కుమారుడు బ్రతికియున్నాడని అన్న మాటలు 1రాజులు 17:23 లోని ఏలీయా మాటలను గుర్తు చేస్తూ ఉండవచ్చు. అలాగైతే యేసు
మెస్సీయ సంబంధ కార్యకలాపాలను, ఏలీయా చేసిన స్వస్థత పరిచర్యతో పోల్చారన్నమాట (లూకా 4:23-27).
4:54 రెండవ సూచక క్రియ అన్న మాట కానాలో చేసిన సూచకక్రియలను సూచిస్తుంది (2:11 నోట్సు చూడండి). ఆ మధ్యనున్న కాలవ్యవధిలో యేసు యెరూషలేములో కూడా సూచక క్రియలు చేశాడు (2:23; 3:2; 4:45). ఆ విధంగా యేసు మొదటి పరిచర్య దశను యోహాను ముగించాడు. అది గలిలయలోని కానాలో ప్రారంభమై అక్కడే ముగిసింది (వ.43-54 నోట్సు చూడండి).