6:1 యేసుని స్వదేశము నజరేతు పట్టణం (1:9-11 నోట్సు చూడండి).
6:2- ఆయన... బోధింపనారంభించెను అనే - మాటలు బోధించడానికి ఆయన ఆహ్వానింపబడ్డాడని తెలియచేస్తున్నాయి. లూకాకు భిన్నంగా (లూకా 4:16-21), మార్కు యేసు ఉపదేశసారం పైన దృష్టి పెట్టలేదు. గలిలయలో యేసు క్రమంగా బోధించాడు (మార్కు 1:21-22,39), సమాజమందిరాల్లో అద్భుతాలు చేశాడు (1:23-28,39; 3:1-6), నజరేతులో తృణీకరించబడిన తర్వాత, మరొకసారి ఆయన సమాజమందిరంలోకి వెళ్లాడన్న ప్రస్తావన లేదు. కేవలం వేషధారణ, హింస ఉండే (12:39-13:9) స్థలాలుగానే మార్కు సమాజమందిరాలను ప్రస్తావించాడు. కపెర్నహూములోని ప్రజల మాదిరిగానే (1:22), నజరేతు ప్రజలు కూడా యేసుబోధకు ఆశ్చర్యపడ్డారు.
6:3 ఇతడు... వడ్లవాడు కాడా? అనే మాటలకు సమాంతర వాక్యభాగం మత్తయి 13:55. అక్కడ “ఇతడు వడ్లవాని కుమారుడు కాడా?" అని ఉంది. లూకా 4:22లో “ఇతడు యోసేపు కుమారుడు కాడా?” అని ఉంది. వడ్లవాడు (గ్రీకు. టెక్టోన్) అంటే రాళ్లనూ చెక్కనూ వస్తువులుగా మలిచేవాడు. మరియ కుమారుడు అనే మాట యేసు పుట్టుక చట్టబద్ధం కాదనే వదంతిని గాని, యోసేపు మరణించాడని గానీ సూచిస్తూ ఉంది. (వ.4 లో గానీ, మార్కు సువార్తలో మరెక్కడ గానీ అతని గురించిన ప్రస్తావన లేదు. అయితే యోహాను 6:41 చూడండి). మార్కు సువార్తలో కేవలం ఇక్కడ మాత్రమే యేసు తల్లి పేరుతో ప్రస్తావించబడ్డాడు. యేసు సహోదరుడైన యాకోబు తర్వాతి కాలంలో యెరూషలేము సంఘానికి నాయకుడయ్యాడు. క్రీ.శ. 62 లో ప్రధానయాజకుని ఉత్తర్వులను బట్టి అతడు చంపబడ్డాడు (జోసీఫస్ రచనల ఆధారం). యాకోబు పత్రికను రాసింది ఈ యాకోబే. ఇక్కడ పేర్కొన్న యూదా ఆ పేరుతో ఉన్న పత్రికను రాసినవ్యక్తి అయ్యుంటాడు. యోసే (యోసేపు), సీమోనులు కొ.ని.లో మరెక్కడా ప్రస్తావించబడలేదు. (అయితే యోహాను 2:12; 7:5; అపొ.కా. 1:14; 1కొరింథీ 9:5 చూడండి). యేసు సహోదరీల పేర్లేంటో తెలియదు. అయితే సోదరీమణులందరు అనే పదం బహువచనం కాబట్టి యేసుకు ఒకరికంటే ఎక్కువమంది సహోదరీలున్నారని తెలియచేస్తుంది.
6:4 తనకుతానే అన్వయించుకున్న ఈ సామెతను యేసు మరొకచోట కూడా చెప్పాడు. (యోహాను 4:44). మార్కు కథనం ప్రకారం (సమాంతర వాక్యభాగాలైన మత్తయి 13:57తో, లూకా 4:24తో పోల్చండి). ప్రవక్త తన దేశములోను తన బంధువులలోను (3:20-21,31-35), తన ఇంటివారిలోను ఘనత పొందడని యేసు మూడు విధాలుగా చెప్పాడు.
6:5-6 ఆయన చేయజాలకపోయెను అనే మాటను - ఆయన శక్తికున్న పరిమితుల గురించిన మాటగా కాక వాస్తవాన్ని తెలియచేసే మాట (“ఆయన... చేయలేదు”. మత్తయి 13:58)గా మత్తయి ఉద్దేశించాడు. ప్రజల అవిశ్వాసము దానికి కారణం. ఇంతకు ముందు వాళ్లు యేసును చూసి ఆశ్చర్యపోయారు (వ.2). ఇప్పుడు యేసు వాళ్లను చూసి ఆశ్చర్యపడెను అనే మాటతో మార్కు ఈ వృత్తాంతాన్ని ముగించడం చాలా విచారకరమైన మలుపు (లూకా 4:25-30తో పోల్చండి). నజరేతువాసులు యేసును పేరుతో పిలవకుండా ఇతడు అని సంబోధించారు. అది. ఆయనపట్ల వారికున్న ద్వేషాన్ని వెల్లడి చేస్తుంది. గలిలయలో సువార్త ప్రచారం చేస్తూ తిరగడం యేసుకు ఇది మూడవసారి (1:14,39).
6:7 ఆయన పండ్రెండుగురు శిష్యులను తన యొద్దకు పిలిచి అనేమాట 3:13 ని గుర్తుచేస్తుంది. వారిని పంపుచు 3:14ను గుర్తుచేస్తుంది. అపవిత్రాత్మల మీద వారికధికారమిచ్చి 3:15ను గుర్తుచేస్తుంది. ఇద్దరిద్దరినిగా పంపించడం జ్ఞానయుక్తమైన ఆచారం (ప్రసంగి 4:9-10), యేసు సాధారణ అభ్యాసం (మార్కు 11:1; 14:13; లూకా 10:1), ఆది సంఘంలో కూడా ఈ పద్ధతినే అనుసరించారు . (అపొ.కా. 8:14: 9:38; 11:30; 12:25; 13:2; 15:39-40). ఈ అభ్యాసం స్నేహాన్ని, పరస్పర సహకారాన్ని పెంపొందిస్తుంది. ఇద్దరు సాక్షులుండాలన్న పా.ని. నియమం దీని ద్వారా నెరవేరింది (ద్వితీ 17:6; 19:15; 2 కొరింథీ 13:1). ఆ పండ్రెండుమంది తిరిగొచ్చిన తర్వాత వారు అపొస్తలులని పిలువబడ్డారు (మార్కు 6:30).
6:8-9 మార్కు సువార్త ప్రకారం శిష్యులు చేతికర్ర... చెప్పులు... ఒక అంగీ తీసుకొని వెళ్ళాలి. ఐగుప్తు నుంచి వెళుతున్నప్పుడు వీటినే తీసుకెళ్లమని దేవుడు ఇశ్రాయేలీయులకు చెప్పాడు (నిర్గమ 12:11). తికర్రలు మత్తయి, లూకా సువార్తలలో నిషేధించబడ్డాయి (మత్తయి 10:9; లూకా 9:3). మత్తయి చెప్పులను నిషేధించాడు. (మత్తయి 10:9; లూకా 10:4తో పోల్చండి). మార్కు సువార్త ప్రకారం వాళ్లు రొట్టెను గానీ, జోలెను గానీ సంచి గానీ, ధనం గానీ అదనపు అంగీని గానీ తీసుకెళ్లకూడదు.
6:10-11 ఒక పట్టణంలో ఒక ఇంటిలో ఆతిథ్యం పొందినప్పుడు, మరింత శ్రేష్టమైన వసతి కోసం వేరే ఇళ్లకు వెళ్లకుండా శిష్యులు మొదటిగా దిగిన ఇంటిలోనే బస చేయాలి. వాళ్లు ) ఆహ్వానించబడకపోతే, వాళ్ల పాదముల క్రింది ధూళి దులిపివేయాలి. 70 మందిని సువార్త ప్రకటనకు పంపించినప్పుడు యేసు ఈ అంశంపై సమగ్రంగా చర్చించాడు. (లూకా 10:10-11). తొలిదినాల్లో మిషనరీలు ఈ నియమాన్నే అనుసరించే వారు (అపొ.కా.13:51ని అపొ.కా. 18:6తో పోల్చండి). వారి మీద సాక్ష్యముగా ఉండుటకు అనే మాట "మారుమనస్సుకు పిలుపు"ను సూచిస్తుంది (1:44; 13:9 లతో పోల్చండి).
6:12-13 మారుమనస్సు పొందవలెనని ప్రకటించడమే - బాప్తిస్మమిచ్చే
యోహాను (1:4), యేసు (1:15) చేసిన ప్రసంగాల సారాంశం. ప్రసంగించ డం, బోధించడం (6:30), దయ్యాలను వెళ్లగొట్టడం, స్వస్థపరచడం 12 మంది చేసే పరిచర్య సారాంశంగా ఉంది. నూనె రాచి అనేకులగు రోగులను స్వస్థపరచడం అనేది ఇక్కడ, లూకా 10:34 లోని ఉపమానంలోనూ, యాకోబు 5:14లోనూ కూడా ప్రస్తావించబడింది.
6:14-15 రాజైన హేరోదు అంతిప, హేరోదియ, బాప్తిస్మమిచ్చే యోహానుల వృత్తాంతం 1రాజులు 21వ అధ్యాయంలో ఉన్న అహాబు, యెజెబెలు, ఏలీయాల చరిత్ర మాదిరిగానే ఉంది. నిజానికి ఏలీయా పేరు ఈ వృత్తాంతానికి చాలా దగ్గరగా ముడిపడి ఉంది. (మార్కు 6:15). రాజైన హేరోదు. అంటే హేరోదు. అంతిప (ఇతడు క్రీ.పూ. 20లో జన్మించాడు). మహా హేరోదు కుమారుడు. క్రీ.పూ.4 నుండి క్రీ.శ.39 వరకు గలిలయ, పెరయ ప్రాంతాలను ఇతడు పరిపాలించాడు. యేసు చేసిన సువార్త యాత్ర వలన, 12 మంది చేసిన పరిచర్య వలన యేసు కీర్తి ప్రసిద్ధమాయెను. యేసు ఎవరు? అనే ప్రశ్నకు ప్రజలు చెప్పిన మూడు జవాబులు: అతడు బాప్తిస్మమిచ్చు యోహాను... ఏలీయా... లేదా ఒక ప్రవక్త అయి ఉండవచ్చు. ఈ అంశమే 8:28లో మరొకసారి మనకు కనబడుతుంది.
6:16-17 బాప్తిస్మమిచ్చే యోహానే పునరుత్థానుడై యేసుగా వచ్చాడని హేరోదు నమ్మాడు. ఆ నమ్మకమే తాను తల గొట్టించిన యోహాను గురించి భయంతో ఆలోచించేలా అతణ్ణి పురికొల్పింది (1:14), హేరోదియ ఇంతకుముందు హేరోదు మారుటి తల్లికి జన్మించిన హేరోదు. ఫిలిప్పును పెళ్ళి చేసుకుని, సలోమే అనే కుమార్తెను కన్నది. ఫిలిప్పును విడిచిపెట్టి తనను పెళ్ళి చేసుకోమని హేరోదు అంతిప ఆమెను ఒప్పించగలిగాడు. దానికి మార్గం సిద్ధం చేసుకోవడానికి హేరోదు తన సొంత భార్యకు విడాకులిచ్చాడు.
6:18 ఈ వివాహం న్యాయము కాదని బాప్తిస్మమిచ్చే యోహాను పదేపదే ఖండించాడు (లేవీ 18:16; 20:21).
6:19-20 బాప్తిస్మమిచ్చే యోహాను గురించి హేరోదియకు, హేరోదు అంతిపకూ ఉన్న భిన్నాభిప్రాయాలను ఈ వచనాలు తెలియచేస్తున్నాయి. హేరోదియ అతని మీద పగపట్టి అతని చంపింపగోరెను. దాన్ని ఆచరణలో పెట్టడానికొక మార్గం కోసం ఎదురుచూసింది. మరొకప్రక్కన అంతిప యోహాను నీతిమంతుడును పరిశుద్దుడగు మనుష్యుడని అతని కాపాడుచు వచ్చెను.
6:21 దుర్మార్గుడైన హేరోదు జనన దినోత్సవం రోజే నీతిమంతుడైన యోహానుకు మరణదినమయ్యింది. ఇది చాలా విచారకరం. 6:22 హేరోదియ కుమార్తె పేరు సలోమె అని. మార్కు రాయలేదు గాని యూదు చరిత్రకారుడైన జోసీఫస్ రాశాడు. చిన్నది. (22, 28 వచనాలు) అనే పదాన్నే 5:41లో 12 సం||ల అమ్మాయిని పిలవడానికి యేసు ఉపయోగించాడు. నాట్యమాడి... సంతోషపరిచెను అంటే చూసేవారిలో కామాతురతను పురికొల్పింది అని అర్థమిచ్చే అవకాశముంది. కానీ ఖచ్చితంగా దాని అర్థం అదేనని చెప్పలేము.
6:23 హేరోదు పెట్టుకున్న ఒట్టు ఎస్తేరుకు . అహష్వేరోషు రాజు చెప్పిన మాటలను గుర్తుచేస్తుంది (ఎస్తేరు 5:3,6; 7:2). అంతిప రోమా సామ్రాజ్యంలో ఒక అధికారి మాత్రమే. అందువల్ల అతడు చేసిన వాగ్దానం అక్షరానుసారమైనది కాక కేవలం అలంకారమైనది మాత్రమే (1రాజులు 13:8తో పోల్చండి).
6:24-25 ఈ క్షణం నుంచి ఈ వృత్తాంతం చాలా వేగంగా ముగింపు వైపుగా నడిచింది. వెంటనే (వ.25,27), ఇప్పుడే (వ.25), త్వరగా (వ. 25) అనే పదాలను గమనించండి. సలోమే తన తల్లి చేతిలో పావులా ఉపయోగించబడింది.
తరాలు 6:26-28 హేరోదు. బహుగా దుఃఖపడెను. గెత్సేమనే తోటలో యేసు (14:33) కు సంబంధించి కేవలం మరొక్కసారి మాత్రమే మార్కు బహుగా దుఃఖపడెను అనే మాటనుపయోగించాడు.
6:30-31 కేవలం ఇక్కడ, 3:14లో వాళ్లు నియమించబడినప్పుడు మాత్రమే ఆ పన్నెండు మందిని అపొస్తలులని మార్కు ప్రస్తావించాడు. తాము చేసినవన్నియు బోధించినవన్నియు ఆయనకు తెలియచేసిరి అనే మాటలు 7-13 వచనాల్లోని పరిచర్యను తెలియచేస్తున్నాయి. ఏకాంత ప్రదేశము అనేది 1:3-5, 12-13,35,45 వచనాలను గుర్తుచేస్తుంది. అరణ్యంలో ఆహార సమకూర్పును ప్రతిధ్వనించే అద్భుతానికి అనుకూలమైన నేపథ్యాన్ని సమకూరుస్తుంది. భోజనము చేయుటకైనను వారికి అవకాశము లేకపోయెను అనే మాటలు 3:20ని గుర్తు చేస్తూ దాని తర్వాత జరగబోయే వృత్తాంతానికి మార్గాన్ని సిద్ధం చేస్తున్నాయి.
6:32 అరణ్య ప్రదేశము. ఏమిటో మార్కు రాయలేదు. (లూకా 9:10తో పోల్చండి. దోనె యెక్కి ప్రయాణం చేయడం యేసుకిది మూడవ పర్యాయం (4:35-5:1, 21-22).
6:33-34 కనికరపడి అనేమాట ఉదరం లోపల ఉండే అవయవాలను సూచిస్తుంది, ఆ అవయవాలే భావోద్వేగాలకు ప్రధాన స్థావరమని పరిగణించబడేది. కొ.ని.లో కేవలం యేసుకు సంబంధించి మాత్రమే ఈ పదం ఉపయోగించ బడింది (1:40-45 నోట్సు చూడండి). ప్రజలను నాయకులు లేనివారిగా, అవసరంలో ఉన్నవారిగా (కాపరిలేని గొర్రెలవలె) యేసు చూశాడు. యెషయా 40:11 నెరవేర్పుగా యేసు తన మంద గురించి శ్రద్ధ తీసుకున్నాడు.
6:35-44 అయిదు వేల మందికి ఆహారం పెట్టడమనే ఒకే ఒక్క అద్భుతం మాత్రమే నాలుగు సువార్త గ్రంథాల్లోనూ గ్రంథస్థం చేయబడింది. (మత్తయి 14:13-21; లూకా 9:10-17; యోహాను 6:1-15).
6:35-36 మార్కు ఇది. అరణ్య ప్రదేశము - అనే మాటలను ఏకాంత ప్రదేశమును సూచించేవిగా 3 సార్లు ఉపయోగించాడు. (వ.31,32,35). చాల ప్రొద్దుపోయినది అని చెప్పిన తర్వాత, ప్రజలను పంపివేయుమని శిష్యులు యేసుతో చెప్పారు.
6:37 తనదైన సొంత ఆజ్ఞతో యేసు స్పందించాడు. మీరు అనే పదాన్ని యేసు నొక్కి చెప్పాడు. శిష్యుల దగ్గర యిన్నూరు దేనారములు లేవన్నది స్పష్టం (దేనారం అంటే ఒకరోజు కూలికి వేతనం}. నిజానికి వాళ్లు సువార్త యాత్రకెళ్లి తిరిగివచ్చారు, ఆ యాత్రకు వాళ్లు ఆహారాన్ని గానీ ధనాన్ని గానీ తీసుకెళ్లలేదు (వ.8). ఇంతమంది ప్రజలకు ఆహారం పెట్టడం పెద్ద సవాలుతో కూడిన విషయం (నిర్గమ 16:1-35; సంఖ్యా 11:13,22లో మోషే అరణ్య పరిస్థితితో; 2రాజులు 4:42-44లో ఏలీయా పరిస్థితితో పోల్చండి)
6:38 తమకు ఏమి కొదుగా ఉన్నాయనే దానిపైన శిష్యులు దృష్టి పెట్టారు. అయితే యేసు వారి దగ్గరున్న అయిదు రొట్టెలును రెండు చేపలు పైన దృష్టి - పెట్టాడు. రొట్టెలు అంటే బహుశా చిన్నగా గుండ్రంగా, బల్లపరుపుగా ఉండే
బార్లీ , బిస్కట్లు అయ్యుండవచ్చు: చేపలు బహుశా ఎండిపోయినవి అయ్యుండవచ్చు.. 6:39-40 మత్తయి (14:19), యోహాను (6:10) - గడ్డి - గురించి ప్రస్తావించారు. అయితే మార్కు మాత్రమే ప్రజలు ఏ గడ్డి పైనైతే కూర్చున్నారో అది పచ్చిక అని రాశాడు. దానిని బట్టి అది వసంతకాలమని తెలుస్తుంది. 6:41 ఆకాశము వైపు చూడడం అనేది ప్రార్థన చేసే భంగిమ (7:34తో పోల్చండి). సువార్త గ్రంథకర్తలు యేసు చేసిన ప్రార్ధన ఎలా ఉందో రాయలేదు. అయితే రొట్టె గురించి యూదుల సంప్రదాయపు స్తుతినే
యేసు పలికి ఉంటాడు. “ప్రభువైన మా దేవా, లోకానికి రాజా, నేల నుంచి ఆహారాన్ని మొలిపించేవాడా, నీకు స్తుతులు" అని ఆ ప్రార్థన ఉండేది. 6:42 తృప్తి పొంది అనే క్రియాపదం క్రొవ్విన జంతువుల గురించి ఉపయోగించబడేది. ఆవిధంగా యేసు కేవలం పోషణను మాత్రమే కాక దానిని సమృద్ధిగా అనుగ్రహించాడు. చివరకు 6:43 పండ్రెండు గంపెళ్ళు 12 మంది అపొస్తలులనూ 12 గోత్రాల ఇశ్రాయేలీయులనూ పోలి ఉన్నాయి. “గంపెళ్ళు" అనే పదం బరువైన,
భారీగా ఉండే పాత్రలను సూచిస్తున్నాయి.
6:44 అయిదు వేలమంది పురుషులకు ఆహారం పెట్టబడింది. మార్కు "ఆండ్రెస్" అనే గ్రీకు పదాన్ని ఉపయోగించాడు. ఈ పదం పురుషులకు వర్తిం చేది. స్త్రీలు, పిల్లలు అదనంగా ఉన్నారని మత్తయి రాశాడు (మత్తయి 14:21). అంటే 5 వేల మంది కంటే ఎక్కువ మందికి ఆహారం పెట్టబడిందని అర్థం.
6:45 వెంటనే అనే మాట ఈ సువార్త గ్రంథంలో మనకు తరచూ కనబడుతుంది. బలవంతము చేసెను అనే క్రియాపదానికి “ఒత్తిడి చేశాడు, నిర్బంధించాడు” అనే తీవ్రమైన భావం ఉంది. యేసు తన శిష్యులను ఎందుచేత బలవంతం చేసి అక్కణ్ణుంచి పంపించేశాడో మార్కు తెలియచేయలేదు, కానీ ఆయనను రాజుగా చేయాలని ప్రజలు తలంచారని యోహాను 6:14-15 తెలియచేస్తుంది.
6:46 ఆయన వారిని వీడుకొలిపి అనే మాటలో “వారిని” అంటే శిష్యులను అని అర్థం. మార్కు సువార్తలో యేసు ఒంటరిగా ప్రార్థన చేయుటకు ఏకాంత - ప్రదేశానికి వెళ్ళాడని రాయడం ఇది రెండవసారి.
6:47 సాయంకాలమైనప్పుడు అంటే ఆ రాత్రిపూట చాలా ఆలస్యమైందని తెలియచేస్తుంది. రాత్రి నాలుగవ జాము అయ్యిందని వ.48 తెలియచేస్తుంది.
6:48 వారికి గాలి ఎదురైనందున, దోనె నడిపించుటలో వారు మిక్కిలి కష్టపడుచుండగా అనేమాట పరిస్థితి 4:35-41లో గాలినీ సముద్రాన్ని గద్దించిన విధంగా లేదని తెలియచేస్తుంది. రాత్రి ఇంచుమించు నాలుగవజామున అనేమాట “రాత్రిని నాలుగు జాములుగా విభజించిన రోమీయుల పద్దతిని సూచిస్తుంది”. నాలుగవ జాము అంటే ఉదయాన 3:00 నుంచి 6:00 గంటల వరకు ఉంటుంది. సముద్రము మీద నడచుచు అనే మాటలు అక్షరార్ధంగానే రాయబడ్డాయి. వ.47 లో "మెట్టనుండెను”. అనే క్రియాపదానికి ఇది సమాంతరమైనది.
6:49 యేసును దయ్యము (గ్రీకు. ఫాంటాస్మా) అని శిష్యులు భావించారు. వారు భ్రమపడ్డారని అది వ్యక్తం చేస్తుంది.
6:50 రెండు ఆజ్ఞలతో యేసు శిష్యులను ధైర్యపరిచాడు: ధైర్యము తెచ్చుకొనుడి, నేనే భయపడకుడి. నేనే అనే మాటకు అక్షరానుసారమైన అనువాదం - "నేను ఉన్నవాడను” (గ్రీకు.. ఎగో ఎమీ), నిర్గమ 3:14లో ఇది దేవుని నామం (యెషయా 41:4; 43:10-11; 48:12లతో పోల్చండి). దేవుడు మాత్రమే చేయగలిగిన దానిని యేసు చేశాడు, తన్నుతాను వెల్లడి చేసుకోవడానికి దేవుని నామాన్ని ఉపయోగించుకున్నాడు.
6:51 ఇంతకు ముందు 4:35-41 లో యేసు గాలిని నిమ్మళించు అని ఆజ్ఞాపించినప్పుడు గాలి అణగెను. ఇక్కడ ఆయన దోనె ఎక్కి లోనికి ప్రవేశించగానే గాలి ఆగిపోయింది. విభ్రాంతి నొందిరి అనే మాట యేసు పట్ల వారి సాధారణ స్పందన(1:22,27; 2:12; 5:15; 20,42 లతో పోల్చండి)ను సూచిస్తుంది.
6:52 రెండు రకాల సమస్యలను మార్కు పసిగట్టాడు. వారి హృదయము కఠినమాయెను గనుక శిష్యులు గ్రహించలేదు. కఠిన హృదయాలు (ఆత్మ సంబంధంగా స్పర్శలేనితనం) అనేది కపెర్నహూములోని సమాజ మందిరములో పరిసయ్యులను వర్ణించే మాట (3:5).
6:53-56 యేసుని పరిచర్య సారాంశాన్ని మార్కు రాసిన మూడవ పర్యా యమిది (1:35-39; 3:7-12లతో పోల్చండి).
6:53 గెన్నేసంతు అనేది కపెర్నహూము, తిబెరియలకు మధ్యన గలిలయ సముద్రపు పశ్చిమ తీరాన ఉన్న సారవంతమైన మైదానం.
6:54 జనులు ఆయన (యేసు)ను గురుతు పట్టి అని చెప్పడం ఆయనను గుర్తుపట్టడంలో విఫలమైన శిష్యుల చర్యకు భిన్నంగా ఉంది (వ.49).
6:55 పక్షవాతం.. గల వ్యక్తిని ఎలాంటి మంచం మీద తీసుకువచ్చారో అలాంటి మంచముల మీదే ఈ రోగులను కూడా యేసు దగ్గరకు తీసుకొచ్చారు (2:2-12).
6:56 గ్రామములలోను, పట్టణములలోను, పల్లెటూళ్ళలోను అనే మాటలు మొత్తం గలిలయ ప్రాంతాన్ని వర్ణిస్తున్నాయి. సంతవీధులు (గ్రీకు. అగోరా) స్థానిక జనంతో అత్యంత రద్దీగా ఉండే కేంద్రాలు. రోగులు యేసును వేడుకొనుచుండిరి అనేమాట "కుష్ఠరోగమున్న వ్యక్తి (1:40), దయ్యం పట్టిన వ్యక్తి (5:10,12,17-18), సమాజమందిరపు అధికారి (5:23) వంటి వారి మాటలను గుర్తుచేస్తున్నాయి. ఆ సందర్భాల్లో కూడా ఇదే పదం ఉపయోగించబడింది. ఆయన వస్త్రపు చెంగు మాత్రము ముట్టనిమ్మనే వారి కోరిక రక్తస్రావరోగం కలిగిన స్త్రీ కోరికను గుర్తుచేస్తుంది (5:28).