28:1 ఇది అపొ.కా.లోని ఐదవ మేము విభాగం (16:10 నోట్సు చూడండి), ఇది వ.16 వరకు కొనసాగుతుంది. ఓడ బద్దలైన ప్రదేశం, సిసిలికి దక్షిణంగా ఉన్న మెలితే (నేటి "మాలా) అనే చిన్న ద్వీపం.
28:2-4 నేడు మెలితేలో విషసర్పాలు ఏమీ లేకపోయినా, పౌలు కాలంలో లేవని అర్థం కాదు. మెలితే ద్వీపవాసులు, ఒక గ్రీకు దేవతయైన న్యాయము పౌలు మరణ పాత్రుడు కాబట్టి అతన్ని ఎంచుకుంది (వ.6తో పోల్చండి) అని తలంచడం స్పష్టం.
28:5-6 మూఢవిశ్వాసులైన మెలితే ద్వీపవాసులు పౌలు “నరహంతకుడు” (వ. 4) కాదు గాని ఒక దేవత అని చాలా త్వరగా నిర్ణయించేశారు. పౌలు పామును ఎంత తేలిగ్గా జాడించేశాడో అంతే సులువుగా వారి తప్పుడు ప్రశంసను కూడా దులిపేశాడు.
28:7 ముఖ్యుడు లేక మెలితే ద్వీపానికి “ప్రథమ వ్యక్తి" అనే బిరుదు ఆ ద్వీపంలోని శిలాఫలకాలలో ప్రతిబింబించింది. పొప్లి పౌర నాయకుడు లేక రాజకీయ నాయకుడు అయివుండవచ్చు.
28:8 పొప్లి తండ్రి "మెలితే జ్వరం"తో బాధపడుతూ ఉండివుండవచ్చు. ఈ జ్వరం శుద్ధిచేయబడని మేకపాలను తాగడం ద్వారా వస్తుంది.
28:9-10 పౌలు పొందిన సత్కారములు ద్రవ్యరూపంలో ఇచ్చిన బహుమతులు లేదా చెల్లింపు కావచ్చు. అపొ.కా. లో వేరొకచోట ఇదేమాట ధనాన్ని గూర్చి ఉపయోగించారు (5:2-3; 7:16; 19:19).
28:11 వేరొక అలెక్సంద్రియ పట్టణపు ఓడలో ప్రయాణం బహుశా ఫిబ్రవరిలో గాని లేక తరువాత గాని ఆరంభమై వుంటుంది. ఇద్దరు దేవతలు (అశ్వనీ) బహుశా ద్యుపతి (జ్యూస్) కుమారులైన కాస్టర్, పొల్లక్స్ (జెమిని) కావచ్చు. నావికులు వారిని సముద్రయాత్రికుల పితరులు లేక దేవతలుగా
భావించేవారు.
28:12 సురకూసై అనేది సిసిలికి తూర్పున ఉన్న ఓడరేవు.
28:13 రేగియు ఇటలీకి దక్షిణపు చివర సురకూ సైకి 70 మైళ్ళ దూరంలో ఉన్న ఓడరేవు పట్టణం. పొతియొలీ అనేది ఐగుప్తు నుండి రోమాకు ధాన్యం పంపించే ఒక ముఖ్యమైన ఓడరేవు పట్టణం. ఇది రోమాకు ఆగ్నేయంగా 130 మైళ్ళ దూరంలో ఉంది.
28:14 రోమాలో మొదటి క్రైస్తవులు ఎలా వచ్చారో తెలియనట్లే పొతియెలీలో సహోదరులు ఎలా వచ్చారో మనకు తెలియదు, పొతియొలీలో ఉన్న యూదులు ఓడరేవు ద్వారా ప్రయాణించే క్రైస్తవులతో సంబంధంలోకి వచ్చివుంటారు.
28:15 పౌలు రోమాకు రాక ముందు అతనికి శుభములు తెలియజేసి, ప్రోత్సాహించడానికి రోమా నుండి విశ్వాసులు అప్పీయా మార్గంలో రెండు పట్టణాల (అప్పీయ సంతపేట... త్రిసత్రములు) వరకు వచ్చారు.
28:16 పౌలు రోమీయుల ఆధీనంలోనే ఉండి, తన స్వంతఖర్చులతో, ఒకే ఒక్క సైనికుడు కావలిగా, తనకు తానుగా ఉన్నట్లు కనిపిస్తుంది (వ.23,30తో పోల్చండి). రోమా ప్రభుత్వంతో అతనికున్న సంబంధం, లేక అతని విచారణ ఎలా జరిగిందో మనకు తెలియదు. ఈ వచనం అపొ.కా. లో చివరి మేము విభాగానికి ముగింపు (16:10 నోట్సు చూడండి).
28:17 పౌలు ఒక కొత్త పట్టణంలో తన పరిచర్యను ఆరంభించడం అపొ.కా. లో ఇదే చివరిసారి. ఎప్పటివలెనే, అతడు యూదులను కలవడంతో ఆరంభించాడు. అతడు బందీగా ఉండడం వలన అతడు సమాజ మందిరానికి వెళ్ళడం కాక, యూదుల నాయకులను తన దగ్గరకే ఆహ్వానించాడు.
28:18-20 క్రైస్తవ్యానికి, యూదు మతానికి ఉన్న సంబంధాన్ని విడమర్చి చెప్పడం లూకాకు చాలా కీలకం. సువార్త యూదులకు వ్యతిరేకం కాదు అని చూపించడం చాలా ప్రాముఖ్యం.
28:21-22 రోమాలోని యూదులు క్రైస్తవ్యం అనే మతభేదము గురించి విన్నారు (24:14), కానీ పౌలు విషయమై యెరూషలేము నుండి వారికి అధికారపూర్వకంగా ఏ సమాచారం రాలేదు. యెరూషలేముకు, రోమాకు మధ్య ఈ సమాచారలోపం రావడానికి కారణం శీతాకాల వాతావరణం కావచ్చు లేక యెరూషలేములోని యూదా నాయకులు, పౌలు తమ పరిధి దాటి, కనిపించకుండా పోయాడు, ఇక అతనివల్ల తమకు ఇబ్బందిలేదు కాబట్టి అతని విషయంలో ఆసక్తిని కోల్పోవడంవల్ల కావచ్చు. ఏదేమైనా, పౌలు పరిస్థితి అవిశ్వాసులైన యూదులకంటే రోమాలో ఉన్న క్రైస్తవులకు బాగా తెలుసు (28:15 నోట్సు చూడండి).
28:23 పునరుత్థానుడైన క్రీస్తు ఎమ్మాయి మార్గంలో చేసినట్లు (లూకా 24:13-35), మోషే ధర్మశాస్త్రములో నుండియు, ప్రవక్తలలో నుండియు యేసే దేవుని మెస్సీయ అని పౌలు ఎత్తి చూపాడు.
28:24 అపొ.కా. లో వేరొకచోట నమ్మిరి అనే క్రియాపదం యథార్థమైన మారుమనస్సును సూచిస్తుంది.
28:25-27 ఇశ్రాయేలీయుల ఆత్మీయ మూరతను గురించి ప్రవక్తయైన యెషయా ద్వారా (యెషయా 6:9-10) పరిశుద్దాత్మ చెప్పినది సరియే అనే పౌలు వ్యాఖ్యతో చర్చ మలుపు తీసుకుందని లూకా గుర్తించాడు. “నమ్మకపోయి"న (వ. 24) వారికి ఈ జవాబు పౌలు చెప్పినందున, యేసును గురించి అతడు చెప్పేది, యెషయాలోని వాక్యభాగం యేసు క్రీస్తు రాకడ, ఆయనను యూదులు తిరస్కరిస్తారని పా.ని. ముందుగానే చెప్పిందని సూచిస్తుంది.
28:28 దేవుని రక్షణ అన్యజనులయొద్దకు పంపబడడం గురించి, 13:4647; 18:6 నోట్సు చూడండి.
28:30-31 అపొస్తలుల కార్యముల గ్రంథం అనుకోని విధంగా తెరవ బడినట్లున్న విధానంలో ముగుస్తుంది. పౌలు రెండు సంవత్సరములు పూర్తిగా ఖైదీగా ఉండిపోయాడు. ఈ కాలంలో అతడు తన స్వంత ఖర్చుతో నివసించి, తనను చూడడానికి వచ్చే వారందరికీ ఏ ఆటంకమును లేక ధైర్యముగా తన సందేశాన్ని ప్రకటించాడు. నీరో చక్రవర్తి కాలంలో రేగిన హింస కాలంలో పౌలు తల నరకబడి చంపబడ్డాడని సంఘ సాంప్రదాయం చాలాకాలంగా చెప్పింది (క్రీ.శ 64 లేక 65).
“రెండు సంవత్సరాల” తర్వాత పౌలు రోమాలో చంపబడి వుండే అవకాశం ఉంది. అయితే సంఘ చరిత్రకారుడైన యూసిబియస్, పౌలు రోమా చెర నుండి విడిపించబడి, తరువాతి కాలంలో మరలా ఖైదుచేయబడి, రోమాకు పంపబడి చంపబడ్డాడని నమ్ముతాడు. లూకా పౌలు చంపబడడాన్ని గురించి రాయకపోవడం బట్టి, పౌలు చంపబడడానికి ముందే లూకా అపొ.కా. గ్రంథాన్ని రాసి ఉంటాడు లేక లూకా పౌలు మరణాన్ని గూర్చిన వివరాలు రాయడానికి ఇష్టపడి ఉండకపోవచ్చు. ఎందుకంటే అతని ఉద్దేశం పౌలు ద్వారా దేవుడు నెరవేర్చిన సువార్తను అన్యజనులయొద్దకు తీసుకువెళ్ళడం అనే ఆయన ఉద్దేశాన్ని వెల్లడి చేయడమేనని అంటారు. విగ్రహారాధనతో నిండి ఉన్న రోమా సామ్రాజ్యంలో రాత్రింబగళ్ళు పౌలు ప్రసంగించడం ద్వారా, క్రైస్తవ్యం అంతర్జాతీయ సంఘటనే గాని, కేవలం ఒక స్థానిక మతం కాదని నిరూపించబడింది.