8:1 ఇంతకు ముందు పత్రికలో కొరింథీయులు అడిగిన ప్రశ్నకు పౌలు జవాబు ఇస్తున్నాడని వాటి విషయము అనే మాటలు సూచిస్తున్నాయి (5:9; 7:1). ఆచారప్రకారం కొరింథీయులు అన్య దేవాలయాలలో (ఊరికి సంబంధించిన పౌర కార్యక్రమాలు జరిగే కేంద్రాలుగా ఉండేవి) భోజనం చేయడం లేక అక్కడ అర్పించిన బలుల మాంసంలో భాగం పొందడం సాధారణం. కాబట్టి కొరింధీ క్రైస్తవులు - అన్య దేవాలయాలలో “విందులో కూర్చున్నపుడు (విగ్రహం ఉన్న దేవాలయంలో భోజనం చేయడం. వ.10). లేక విగ్రహార్పితమైనవి వండిన ఇంటిలో జరిగిన విందులో పాల్గొన్నప్పుడు విగ్రహములకు బలిగా అర్పించిన వాటిని తినవచ్చో లేదో తెలుసుకోవాలనుకున్నారు.
8:1-3 ఈ విషయంలో పౌలు రెండు మార్గదర్శక సూత్రాలను ఇచ్చాడు. మొదటిది, (క్రైస్తవ స్వాతంత్ర్యం గూర్చిన) జ్ఞానము ఒక్కటే ఉంటే అది ఆ వ్యక్తిని అహంకారం గలవాడిగా చేస్తుంది. కానీ ప్రేమ విశ్వాసులకు క్షేమాభివృద్ధి కలుగజేయును. రెండవది, జ్ఞానము మనలను దేవుని ముందు అంగీకృతులుగా చేయదు, కానీ దేవుని పట్ల మనకున్న ప్రేమ ద్వారా మనం ఆయనకు ఎరుకైనవారమే. అన్నిటికంటే ఎక్కువైన జ్ఞానం అదే. కాబట్టి ఏమాత్రం ప్రాధాన్యత లేని తన జ్ఞానం ఏ విశ్వాసికీ గర్వకారణం కాకూడదు.
8:4-6 విగ్రహాలకు బలిగా అర్పించిన వాటిని విశ్వాసులు తినవచ్చనే పౌలు జవాబు మనకు ఆశ్చర్యం కలిగించవచ్చు, కానీ అది తర్కబద్ధమైందే: విగ్రహాలు “వట్టివి" ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడు. కానీ ఈ విషయమై అతని సలహా ఇక్కడితో ఆగిపోవడం లేదు. (వ.7-13; ముఖ్యంగా 10:14-22 తో పోల్చండి).
8:7-8 క్రైస్తవ స్వాతంత్ర్యం మనం విఱ్ఱవీగడానికో, దానితో అధికారం చెలాయించడానికో కాదు. తమ సహవాసంలో కొందరు ఇదివరకు విగ్రహములను ఆరాధించినవారు ఇంకా వారి మనస్సాక్షి బలహీనమైనదిగా ఉండి క్రైస్తవులు విగ్రహార్పితమైన వాటిని తినడం చూస్తే అపవిత్రమయ్యే అవకాశం ఉందని కొరింథీ విశ్వాసులు గ్రహించాల్సిన అవసరం ఉంది.
8:8-13 విగ్రహాలు వట్టివని ఎరిగిన వారికి పౌలు స్పష్టంగా చెబుతున్నాడు, ఏదైనా తినడం (విగ్రహార్పితమైనది. సహితం) విశ్వాసులను దేవునికి అయిష్టులుగా చేయదు.
8:9 యేసు మాటలను జ్ఞాపకం చేసే భాషతో, బలవంతులు బలహీనులకు అభ్యంతరము కలుగకుండా చూసుకోవాలి అని పౌలు అంటున్నాడు (మత్తయి 18:10తో పోల్చండి). విశ్వాసంలో బలవంతుడైన వాడు. తన స్వాతంత్ర్యమును దుర్వినియోగం చేస్తే అది బలహీనుడైన వానికి క్రీస్తుపట్ల ఉన్న విధేయతను నాశనం చేయగలదు.
8:10-12 ఒక జ్ఞానము గల విశ్వాసి విగ్రహాలయమందు. భోజనం చేయడం చూసిన ఒక బలహీనమైన మనస్సాక్షి గలవాడు దానికి మతపరమైన ప్రత్యేకతను జోడించి, క్రీస్తు పట్ల తన విధేయత విషయంలో గందరగోళానికి లోనవుతాడు.
8:13 విశ్వాసంలో పరిణతి చెందిన విశ్వాసులు స్వయం పరిమితులు కలిగి ఉంటే అది క్రైస్తవ సహవాసంలోని నూతన విశ్వాసులకు కాపుదలగా ఉంటుంది. ముఖ్యంగా కొరింథులాంటి అన్య సమాజం ఎక్కువగా ఉన్నచోట అది మరింత అవసరం.