3:1 పేతురు యోహానులు యూదుల ఆచారాలు, ఆరాధనలలో పాల్గొనడం కొనసాగించారు. ఆది క్రైస్తవులు క్రమంగా దేవాలయములో కూడుకునేవారు (2:46). ఇది సరైనదే, ఎందుకంటే క్రైస్తవ్యం యేసును మెస్సీయగా స్వీకరించిన ఒక సమకాలీన యూదు మత రూపంగానే ఆరంభమైంది. పేతురు, పౌలువంటి క్రైస్తవ నాయకులు ధైర్యంగా యేసును మెస్సీయగా ప్రకటించడం కొనసాగించడంతో, సంఘం యూదా మతం నుండి వేరవ్వడంలో ఆరంభ దశలు అపొస్తలుల కార్యముల గ్రంథంలో చెప్పబడ్డాయి. రోమాకు విరోధంగా మొదటిసారి యూదులు తిరుగబడినప్పుడు (క్రీ.శ. 66-70), క్రైస్తవ్యం యూదా మతం నుండి పూర్తిగా, చివరిగా విడిపోవడం జరిగింది.
3:2 అపొస్తలుల కార్యముల గ్రంథంలో ఇది మొదటి స్వస్థతా అద్భుతం. పుట్టినప్పటి నుండి కుంటివాడైన ఆ మనుష్యుడు, భిక్షమడుగుటకు ప్రతిరోజు శృంగారమను దేవాలయపు ద్వారము నొద్దకు కొనిపోబడేవాడు. అక్కరలున్న వారికి ప్రభుత్వం సహాయం చేసే తరాలకు ముందు రోజుల్లో పరాయి వ్యక్తులు, ప్రియులైనవారు చూపే దయ మాత్రమే ఇలాంటి వారిని ప్రాణాలతో నిలిపింది.
3:3-6 ఆ కుంటివానికివ్వడానికి పేతురు, యోహానుల దగ్గర వెండి బంగారములు లేకపోవడమే అతనికి మంచిదయ్యింది. ఎందుకంటే ఇవ్వడానికి వాటికంటే చాలా ఎక్కువ విలువైనది వారి దగ్గర ఉంది - అది యేసు క్రీస్తు ద్వారా స్వస్థపరచే శక్తి. తన భౌతిక, ఆధ్యాత్మిక సమస్యలకు తాత్కాలిక ఉపశమనం కాకుండా, శాశ్వత పరిష్కారం అతనికి దొరికింది.
3:7 అపొస్తలుల కార్యముల గ్రంథం అనేక స్వస్థత కార్యాలను నమోదు చేసింది. (ఉదా., 9:32-34,36-42). హెల్లెనీయుల కాలంలో, విజ్ఞానం , వైద్య జ్ఞానం తగినంతగా అభివృద్ధి చెందింది. కాబట్టి చూస్తున్నవారు పేతురు చేసింది అద్భుతం అని నిస్సందేహంగా గుర్తించారు. కుంటివాని పాదములును చీలమండలును బలం పొందాయని పేర్కొనడం, రచయిత, లూకా, ఒక వైద్యుడు అనే సాంప్రదాయ దృక్పథాన్ని పరోక్షంగా సమర్థించింది.
3:8-11 ఆ దృశ్యం. అనేకమంది దృష్టిని ఆకర్షించింది. చూసినవారంతా విస్మయముతో నిండి పరవశులైరి.
3:12 చూచేవారందరూ ఆశ్చర్యపడుతున్నారని గుర్తించిన పేతురు, యేసు క్రీస్తును గురించి సాక్ష్యమిచ్చే అవకాశాన్ని చేజిక్కించుకున్నాడు. దేవుని శక్తి చిహ్నాలు యేసును గురించిన సత్యం వైపు చూపించగలవు (యోహాను 3:2; 14:11).
3:13-15 దేవాలయ ప్రాంగణంలో భాగమైన సొలొమోను మంటపములో కూడుకున్న తన శ్రోతలకు, యేసు క్రీస్తు దేవుని సేవకుడు అని పేతురు చెప్పాడు. అయినప్పటికీ జనులు ఆయనను పిలాతుకు అప్పగించి, పిలాతు ఆయనను నిర్దోషి అని తీర్చినప్పటికీ (లూకా 23:20-25) ఆయనను నిరాకరించారు. యేసుని పరిశుద్దుడును, నీతిమంతుడు అని పిలుస్తూ, యేసు స్థానంలో ఒక నరహంతకుడైన మనుష్యుని విడుదల చేయమని వారు అడగడం ఘోరమైన కార్యమని పేతురు నొక్కి చెప్పాడు. అలా వారు ప్రాణం తీసినవానిని కాక, జీవాధిపతిని చంపారు. కానీ దేవుడు యేసును మృతులలో నుండి లేపెను. ఈ సత్యానికి పేతురు, యోహాను ఇద్దరూ సాక్షులు.
3:16 ఆ వ్యక్తికి జరిగిన ఆశ్చర్యకరమైన స్వస్థతను బట్టి పేతురు, యోహానులకు ఘనతవచ్చే అవకాశం ఉంది. కానీ వారు యేసు నామమునందలి విశ్వాసమే వీనిని బలపరచెను అని నొక్కి చెప్పారు. అపొస్తలులు ఆ అద్భుతాన్ని జరిగించడానికి దేవుడు ఎంచుకొన్న సాధనాలు మాత్రమే.
3:17 ఇక్కడ తెలియక చేయడం అనేది శిక్షను తప్పించుకునే సాకు కాదు, అది శిక్షార్హమైన అపరాధం. దానికి పశ్చాత్తాపం తప్పనిసరి.
3:18 క్రీస్తు (మెస్సీయ) శ్రమపడతాడన్న ప్రవచనం యెషయా 52:1353:12లో శ్రమనొందే సేవకుని గురించిన స్పష్టమైన సూచన. అతిక్రమముల కోసం సేవకుడు శ్రమనొందుతాడన్న ప్రవచనం (యెషయా 53:10) యేసు ద్వారా నెరవేరింది.
3:19-21 యేసు ఎవరో, యూదులు ఆయనతో ఎలా వ్యవహరించారో, ఆయనను మృతులలో నుండి లేపడం ద్వారా దేవుడు ఆయనను ఎలా నిర్దోషిగా నిరూపించాడో అని పేతురు చెప్పినదాని ఆధారంగా, వారి పాపములు తుడిచి వేయబడు నిమిత్తమును మారుమనస్సునొంది తిరుగుడి అని తన శ్రోతలకు అతడు పిలుపునిచ్చాడు. ఆది క్రైస్తవులు యేసు రెండవ రాకడ కోసం, ఆయన రాజ్యము భూమిపై స్థాపించబడినప్పుడు అన్నిటికి కుదురుబాటు కాలము వస్తుందని ఆశతో ఎదురు చూచారు. ఈ "కుదురుబాటు" కాలమును గురించి మోషే మొదలుకొని, ప్రవక్తల ద్వారా దేవుడు ముందుగానే చెప్పాడు (వ.22; రోమా 8:18-25 కూడా చూడండి). ..
3:22-24 దేవుడు నావంటి యొక ప్రవక్తను మీ సహోదరులలో నుండి మీ కొరకు పుట్టించును అని మోషే ఇశ్రాయేలీయులకు ముందుగానే చెప్పిన ద్వితీ 18:15-19ని పేతురు నివేదించాడు. కాలగమనంలో ఇది మెస్సీయను గురించిన ప్రవచనంగా గుర్తించబడింది. మెస్సీయను. తృణీకరించువాడు దేవుని ప్రజలలో నుండకుండ సర్వనాశనమగును. ఇశ్రాయేలీయుల చరిత్ర అంతటిలోని ప్రవక్తలు అందరు ఈ దినమును గురించి ప్రకటించిరి అని పేతురు చెప్పాడు. పా.ని. ప్రస్తావించిన ఈ విషయాన్ని గుర్తించమని యేసు తానే స్వయంగా అపొస్తలులకు బోధించాడు (లూకా 24:27).
3:25-26 పేతురు మాటలు వింటున్న యూదులు దేవుడు అబ్రాహాముతో చేసిన నిబంధనకు వారసులు, ప్రవక్తల కుమారులై ఉన్నారు. అలా వారికి ప్రవక్తలు, పంచకాండాలలో చెప్పబడిన మాటలలో వ్యక్తిగతమైన వాటా ఉంది, అలాగే భూమి మీద ఉన్న ప్రజలందరికీ కూడా భాగం ఉంది. అబ్రాహాము సంతానం ద్వారా భూమిమీదనున్న సమస్త జనులు ఆశీర్వదించబడతారని దేవుడు అబ్రాహాముతో చేసిన నిబంధన వాగ్దానం చేస్తుంది కదా. అంతిమంగా ఇక్కడ అబ్రాహాము సంతానం అంటే దేవుని సేవకుడు యేసు క్రీస్తు.