8:1-3 యేసు గలిలయలో ప్రకటించుచు... సంచారము చేయుచుండగా, పండ్రెండుమంది శిష్యులూ (6:14-16 నోట్సు చూడండి) పలువురు ధనవంతులైన స్త్రీలు ఆయనను అనుసరించారు. యేసు ద్వారా స్వస్థపడినందున ఆయనకూ అపొస్తలులకూ ఆర్థికంగా చేయూతనిచ్చారు. మగ్దలేనే (అంటే మగ్దల అనే పట్టణానికి చెందిన) మరియను లూకా ఇక్కడ పరిచయం చేస్తున్నాడు. ప్రభువును అనుసరించిన ప్రముఖ వ్యక్తులలో ఈమె ఒకతె (మత్తయి 27:61). గలిలయకు చతర్జాధిపతియైన హేరోదు అంతిప (3:1 నోట్సు చూడండి) దగ్గర ఉద్యోగ బాధ్యతలు నిర్వహించిన ఒక వ్యక్తిని వివాహమాడిన యోహన్నా కూడా ఈ స్త్రీల గుంపులో ఉంది. ఈమెను లూకా 24:10లో కూడా ప్రస్తావించాడు. సూసన్న గురించి ఎలాంటి సమాచారమూ తెలియదు.
8:4-8 ఈ సందర్భం నుంచి యేసు ఎక్కువగా ఉపమానరీతిగా బోధించాడు. ఆయన ఇలా చేయడంలో ఉద్దేశాన్ని లూకా 9,10 వచనాల్లో వివరించాడు. వ్యవసాయమంటే బాగా పరిచయమున్న సమాజం అది. విత్తువాడు తన విత్తనములు చల్లడానికి పొలంలోకి వెళ్లినప్పుడు ఏమి జరిగి ఉంటుందో ప్రతీ ఒక్కరూ అర్ధం చేసుకుని ఉంటారు. చాలా పొలాలకు కనీసం నడవడానికి
ఒక్క త్రోవ అయినా ఉంటుంది. ఇశ్రాయేలులోని నేల ఉపరితలం పైన పలుచటి మట్టిపొర, లోపలి భాగంలో పెద్దరాతి కొండలు ఉంటాయి. అలాంటి బాటల్లో విత్తనాలు వేయడం వ్యర్థం. చాలా పొలాలకు చుట్టు ప్రక్కల ముళ్ల పొదలుంటాయి. అందులో పడిన విత్తనాలు కోత సమయం వరకు ఎదిగి మనుగడ సాధించడానికి అవకాశం లేదు. అయితే మరికొన్ని సారవంతమైన నేలపై పడి, విత్తిన దానికి నూరంతలుగా ఫలించెను. వినుటకు చెవిగలవాడు వినునుగాక అనే వాక్యం ద్వారా తాను చెప్పిన ఉపమానం గురించి శ్రద్ధగా ఆలోచించి, దాని అంతరార్థాన్ని దాన్నుంచి ఉత్పన్నమయ్యే భావాలనూ గ్రహించమని యేసు తన శ్రోతలను సవాలు చేస్తున్నాడు (ప్రక 2:7).
8:9-10 ఈ ఉపమాన భావాన్ని యేసుని శిష్యులు అర్థం చేసుకోలేకపోయారు. అందువల్ల దాని అర్థమేంటని వాళ్లు ఆయనను అడిగారు. విశ్వాసులకు దేవుని రాజ్యము గురించిన సత్యాలను వెల్లడి చేయడానికి అవిశ్వాసులకు దాన్ని మరుగు చేయడానికి తాను ఉపమానరీతిగా బోధించానని ఆయన యెషయా 6:9 ని ప్రస్తావిస్తూ వివరించాడు. "
8:11-12 విత్తబడిన విత్తనము దేవుని వాక్య ప్రకటనను సూచిస్తున్నదనేదే ఈ ఉపమానంలో కీలకమైన సత్యం. త్రోవ ప్రక్కన పడిన విత్తనాలు దేవుని వాక్యాన్ని విన్నవారి హృదయములో చొచ్చుకుపోలేదు. వాళ్లు దేవుని వాక్యాన్ని వింటారు. అయితే అపవాది ఆ వాక్యాన్ని ఎత్తుకుపోతాడు కాబట్టి వాక్యం వాళ్ల హృదయాల్లోకి చొచ్చుకొనిపోదు. అందువల్ల వాళ్లు రక్షణ పొందకుండానే ఉండిపోతారు.
8:13-14 రాతి నేలపైన పడిన విత్తనాలు మొదట చక్కగా ఎదిగినట్లే కనబడ్డాయి. అయితే అవి రాతినేలలోకి తమ వేళ్లను పంపించలేకపోయాయి. అందువల్ల అవి త్వరగానే ఎండిపోయి చచ్చిపోయాయి. ముండ్ల పొదలలో పడిన విత్తనములు పరిపక్వముగా ఫలింపనివారు. ఎందుకంటే (1) ఈ జీవనసంబంధమైన విచారములకు ధనభోగములకు వాళ్లు స్పందించిన విధానం ద్వారా వాళ్ల అవిశ్వాసం బట్టబయలయ్యింది. లేదా (2) వీళ్లు బహుశా ఫలించని విశ్వాసులై ఉంటారు (1కొరింథీ 3:10-15).
8:15 మంచి నేలనుండు విత్తనములు ఫలించే విశ్వాసులను సూచిస్తున్నాయి (యోహాను 15:2). వాళ్లు సహృదయంతో దేవుని వాక్యము విని అంగీకరించి విశ్వాసంలో నిలకడగా ఉంటారు.
8:16-18 దైవ ప్రత్యక్షతకు ఒకడు స్పందించే విధానమే అతడు మరింత వెలుగును పొందుకుంటాడా, లేక ఉన్న దాన్ని కూడా పోగొట్టుకుంటాడా? అనే విషయాలను నిర్ధారిస్తుంది. అంతంలో దేవుడు ప్రతీ దానిని వెలుగులోకి తీసుకొస్తాడు.
8:19-21 (మత్తయి 13:55లో పేర్కొనబడిన) యేసు సహోదరులు మరియ, యోసేపులకు యేసు తర్వాత జన్మించిన సంతానం. కుటుంబ సభ్యులు అవిశ్వాసులైనప్పుడు వాళ్ళతో ఉండే సంబంధ బాంధవ్యాల కంటే క్రీస్తులో ఉన్న విశ్వాసం పైనా, ఒకరితో ఒకరికి ఉన్న ఆత్మసంబంధమైన సాన్నిహిత్యం పైనా, దేవుని వాక్యము విని దానిపై చూపే విధేయత పైనా ఏర్పడిన మానవ సంబంధాలు చాలా ముఖ్యమైనవి.
8:22-25 శిష్యులు గలిలయ సముద్రంలో దోనె పై ప్రయాణం చేస్తుండగా ప్రచండమైన గాలివానలో చిక్కుకున్నారు. ఆ సమయంలో యేసు ఆ దోనెలో నిద్రిస్తూ ఉన్నాడు. శిష్యులు భయభ్రాంతులకు గురై చనిపోతామని
ఆందోళనపడ్డారు. యేసును వాళ్లు నిద్ర లేపినప్పుడు, ఆ గాలివానను నిమ్మళపరచి గాలిపైన నీటి పొంగు పైన తనకున్న సంపూర్ణాధికారాన్ని ఆయన ప్రదర్శించాడు. తన శిష్యుల అల్పవిశ్వాసమును కూడా ఆయన గద్దించాడు. వాళ్లు యేసును నిజంగా నమ్మి ఉంటే, ప్రచండమైన గాలి తరంగాలకు కూడా వాళ్లు భయపడేవాళ్లు కాదు..
8:26 గెరసీనీయుల దేశము గలిలయ సముద్రతీరానికి తూర్పుదిక్కున బహుశా గెర్గాసా (లేదా ఖేర్సా) అనే పట్టణానికి సమీపంగా ఉండి ఉంటుంది. ఇది అన్యులు ఎక్కువగా ఉండే ప్రాంతం. గెరేసా అనే పట్టణం నుంచి ఈ
ప్రాంతానికి గెరాసేనుల ప్రాంతం అనే పేరు వచ్చి ఉంటుంది. ఇది గలిలయ సముద్రానికి ఆగ్నేయదిశలో 35 మైళ్ల దూరంలో ఉంది.
8:27 ఈ వాక్యభాగానికి సమాంతర వాక్యభాగమైన మత్తయి 8:28లో దయ్యములు పట్టిన ఇద్దరు వ్యక్తుల గురించి ప్రస్తావన ఉంది. ఎవరైతే మాట్లాడుతున్నాడో అతనిపై లూకా ఎక్కువ దృష్టి పెట్టినట్లు కనబడుతుంది. సమాధులలోనే గాని యింటిలో ఉండువాడు కాడు అంటే బయటనున్న సమాధుల స్థలాన్ని సూచిస్తూ ఉంది. అయితే అతడు దిగంబరిగా ఉండేవాడు కాబట్టి బహుశా అది ఒక గుహను ప్రస్తావిస్తూ ఉండవచ్చు. ఆ ప్రదేశంలో అనేక గుహలు బయటపడ్డాయి.
8:28-31 లూకా 4:34; అపొ.కా. 16:17లో దయ్యా లలాగా ఈ వాక్య భాగంలో మాట్లాడిన దయ్యం కూడా యేసును గుర్తించింది. సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అనే మాట దేవదూత మరియతో కూడా చెప్పాడు (1:31-33 నోట్సు చూడండి). నన్ను బాధపరచకుము అనే మాట బహుశా ఆ దయ్యాన్ని పాతాళానికి పంపించడం అనేదాన్ని సూచిస్తుండవచ్చు. పాతాళంలో ప్రస్తుతం దేవుడు కొన్ని దయ్యాలను ఖైదు చేశాడు (ప్రక 9:1-2,11). దయ్యాలు తాము ఎవరినైతే అదుపుచేశాయో వాళ్లు గొప్ప శక్తితో పనులు చేసేలా బలపరిచాయి (వాడు బంధకములను తెంపగా). యేసు ఆ వ్యక్తి పేరు అడుగుతున్నాడో లేక ఆ దయ్యం పేరు అడుగుతున్నాడో స్పష్టంగా తెలియదు. అయితే ఆ దయ్యం జవాబు చెప్పింది. సేన అంటే ఆరువేలమంది సైనికులున్న రోమా దళం. దీన్నిబట్టి ఈ వ్యక్తిని పట్టిన దయ్యాలు అనేకం అని అర్ధమౌతుంది.
8:32-33 విస్తారమైన పందుల మంద ఆ ప్రాంతంలో ఉండడాన్ని బట్టి గెరసీనీయుల ప్రాంతం అధికశాతం అన్యజాతుల వాళ్లుండే ప్రాంతమని తెలుస్తుంది. ఎందుకంటే యూదులు పందులను అపవిత్రమైన జంతువులుగా పరిగణిస్తారు. (లేవీ 11:7-8) కాబట్టి వాళ్లు పందులను మేపరు. యేసు ఆ దయ్యాలను పందుల్లోకి వెళ్లడానికి అనుమతించగానే అవి ఆ పందులు వెళ్ళి సరస్సులో (గలిలయ సముద్రంలో) పడి చచ్చేలా చేశాయి. దీన్ని బట్టి దయ్యాల క్రూరమైన, నాశనకరమైన స్వభావమేంటో అర్థమవుతుంది.
8:34-37 యేసు పాదములయొద్ద కూర్చోవడమనేది శిష్యుని (అంటే విద్యార్థి, 10:38-42) స్థానాన్ని తెలియచేస్తుంది. దయ్యం పట్టినవాడు సాధారణ స్థితికి రావడం చూసి ప్రజలు భయపడ్డారు. యేసు తన సహజాతీతమైన గుర్తింపును వెల్లడిచేసేలా తనశక్తిని ప్రదర్శించాడు.
8:38-39 అక్కడి ప్రజలు యేసును - ఆ ప్రదేశాన్ని విడిచిపొమ్మని వేడుకున్నారు. అందువల్ల స్వస్థపరచబడిన వ్యక్తిని ఆ ప్రాంతంలో ఉండి దేవుడు తనకు చేసిన దానికి సాక్ష్యం చెప్పమని యేసు అతనితో చెప్పాడు.
యేసు తనకెట్టి గొప్ప కార్యములు చేశాడో ప్రకటిస్తూ ఆ వ్యక్తి.. యేసుకు విధేయత చూపించాడు.
8:40-42 యేసు గలిలయకు తిరిగివచ్చాడు. యాయీరును ఆయన ఇంతకు ముందే కలిసి ఉంటాడు. గలిలయలో ఉండే అనేక సమాజ మందిరాల్లో యేసు బోధించాడు. యాయీరు స్థానిక సమాజమందిరంలో అధికారి (ఆర్కోన్ అనే గ్రీకు పదానికి “నాయకుడు" అని అర్థం). బహుశా స్థానిక సమాజమందిరములో అతడు ఆరాధన కార్యక్రమాలను నిర్వహించే ముఖ్య పెద్ద అయ్యుండవచ్చు.
8:43-46 యాయీరు కుమార్తె తీవ్రమైన అనారోగ్యంతో ఉన్న సంక్లిష్ట సమయంలో కూడా పండ్రెండేండ్లనుండి రక్తస్రావముగల ఒక స్త్రీని బాగుచేయడానికి, ఆమెతో మాట్లాడటానికి యేసు వెనుకాడలేదు. ఆ స్త్రీకి రక్తస్రావం బహుశా రుతుచక్రం వల్లనే కలిగి ఉంటుంది. ధర్మశాస్త్ర పద్దతి
ప్రకారం ఆమె అపవిత్రురాలు (లేవీ - 15:25-31). ఆ స్త్రీ తనకున్న ధనాన్నంతటిని వైద్యుల చుట్టూ తిరిగి ఖర్చు పెట్టినా, ఆమె స్వస్థతనొందనిదిగా ఉంది. వైద్యుడైన లూకా ఈ విషయంపై చాలా సున్నితంగా మనసు పెట్టాడు. యేసుకు అన్నివైపుల జనసమూహం ఉన్నారు. అయినా తనను ఆ స్త్రీ తాకిన వెంటనే ఆయన గుర్తించగలిగాడు. ఆయనను తాకగానే ఆ రక్తస్రావం నిలిచిపోయి ఆమె బాగుపడింది. స్వస్థపరిచే ప్రభావము తనలో నుంచి బయటికెళ్లిన విషయం ఆయనకు ఎలా తెలిసిందో లూకా వివరణ ఇవ్వలేదు.
8:47-48 ఆ స్త్రీ వెంటనే... స్వస్థపడింది. అయితే యేసు ఆమెను గుర్తించ గానే ఆమె భయాందోళనలతో వణికిపోయింది. యేసు ఆమె వివరణను విన్న తర్వాత, ఆమె విశ్వాసము ఆమెను స్వస్థపరచెను అని యేసు చెప్పాడు.
8:49-50 రక్తస్రావ రోగం ఉన్న స్త్రీతో యేసు చేసిన సంభాషణ మూలంగా కాలహరణం జరిగింది. ఈలోపు సమాజ మందిరపు నాయకుని కుమార్తె మరణించింది. యేసు చేసే సహాయానికి ఆమె అందనంత దూరానికి వెళ్లిపోయిందని అక్కడున్నవాళ్లంతా అనుకున్నారు. అయితే, రక్తస్రావరోగం కలిగిన స్త్రీని స్వస్థపరచగలిగిన విశ్వాసమే మరణించిన బాలికను కూడా
బ్రతికించగలదని యేసు చెప్పాడు.
8:51-53 ఈ వాక్యభాగంలో యేసు తనకున్న శిష్యులలో పేతురు, యోహాను, యాకోబులను ఆంతరంగిక బృందంగా ప్రత్యేకించుకున్నాడు (9:28; మత్తయి 26:37). ఆ బాలిక తల్లిదండ్రుల, చివరికి అపొస్తలుల నిస్సహాయతను చూడగానే, ఆమె నిద్రించుచున్నదే గాని చనిపోలేదని యేసు చెప్పినప్పుడు అది విన్న అక్కడున్న జనం అపహసించిరి.
8:54-56 చిన్నదానా, లెమ్మని యేసు ఆజ్ఞాపించినప్పుడు ఆమె ఆత్మ ఆమె శరీరంలోకి తిరిగి వచ్చింది. ఆమె పైకి లేచి... భోజనము చేసింది. వారి కుమార్తెను మృతుల్లో నుంచి లేపిన సంగతిని ఎవ్వరికీ చెప్పవద్దని ఆమె తల్లిదండ్రులను యేసు ఎందుకు ఆదేశించాడో తెలియదు. యేసు ఆమెను చూడడానికి లోపలికి వెళ్లగానే ఆమె బ్రతికింది. యేసు ఆమెను లేపాడనే సత్యాన్ని దాచడానికి అవకాశం లేనేలేదు.