3:1 కొరింథీయులను నిరుత్సాహపరచిన దొంగ అపొస్తలులు సిఫారసు పత్రికలు తెచ్చుకున్నారు. ఈ వచనంలో “లేదు” అని జవాబు వచ్చే రెండు ప్రశ్నలు పౌలు ఎన్నడూ సిఫారసులు కోరడం అవసరం అనుకోలేదు అని స్పష్టం చేస్తున్నాయి.
3:2-3 కొరింథీయుల ఆధ్యాత్మిక రూపాంతరమే పౌలుకు అవసరమైన నిర్ధారణ. వారి వ్యక్తిత్వంలో వారే పౌలు హృదయం అనే పలక మీద ఆత్మచేత రాయబడిన ఆధ్యాత్మిక పత్రికలు. కాగితం మీద సిరాతో రాసినవి, లేక రాతి పలకల మీద చెక్కినవి అయిన పత్రికలను మారిన జీవితాలతో పోల్చలేము. రాతి పలకలు అనగానే పాఠకులకు పది ఆజ్ఞలు, పాత నిబంధన గుర్తుకువస్తాయి (వ.7 నోట్సు చూడండి; ద్వితీ 9:9తో పోల్చండి).
3:4 ఈ వచనంలో పౌలు వర్ణించిన నమ్మకము కపట దీనత్వాన్ని, అహంకారపూరిత ఆత్మవిశ్వాసాన్ని సూచించడం లేదు.
3:5 నిజమైన క్రైస్తవ పరిచర్యలో దేవుని వలన తప్ప మరి దేనివలనా సమృద్ధి ఉండదు. ఈ వచనం 2:16 చివర ఉన్న ప్రశ్నకు జవాబిస్తుంది.
3:6 పరిచారకులు. అన్న పదాన్ని వృత్తిపరంగా సేవకులు, యాజకుల వర్గానికి చెందని, "పెద్దలు" (డీకన్లు) అనే విస్తృతమైన పదంగా కూడా తర్జుమా చేశారు. క్రొత్త నిబంధన యిర్మీయా 31:31-38 లో ప్రవచింపబడి, లూకా 22:20లో యేసు మరణం ద్వారా స్థాపించబడి, పౌలు చేత ప్రకటించబడి, విస్తరించింది. అక్షరము చంపును అనేది జీవమునివ్వడానికి రూపించబడని పాత నిబంధన ధర్మశాస్త్రాన్ని సూచిస్తుంది. అది కేవలం పాపాన్ని వెల్లడి చేసింది. (రోమా 7:7-12). పరిశుద్దాత్మ సువార్త ప్రకటనను వాడుకుని, విశ్వాసం ద్వారా నూతన జీవమును సృష్టిస్తాడు (రోమా 8:10; 10:17).
3:7 మరణ కారణమగు పరిచర్య సీనాయి పర్వతం దగ్గర చేసుకున్న పాత నిబంధనను సూచిస్తుంది. దాని ప్రభావం వల్ల శిక్షా, మరణం వచ్చాయి గానీ నీతి, జీవం రాలేదు. ఇది పాత నిబంధన తప్పు కాదు, అది విధించిన షరతులు నెరవేర్చలేని పాపులదే (రోమా 7:13). పది ఆజ్ఞలు రాళ్ళమీద చెక్కబడిన అక్షరములతో రాశారు. (నిర్గమ 31:18). ధర్మశాస్త్రాన్ని ఇచ్చింది. దేవుడు కాబట్టి దానిని తెచ్చిన మధ్యవర్తి దేవునికి సంబంధించిన మహిమ కొంతవరకు కలిగి ఉండడం సరైనదే (నిర్గమ 34:29-35 చూడండి).
3:8-9 ఆత్మ సంబంధమైన పరిచర్య, నీతికి కారణమైన పరిచర్య అనే మాటలు మనలో నివసించే ఆత్మ ద్వారా నీతిని కలిగించే కొత్త నిబంధనను సూచిస్తున్నాయి.
3:10-11 పాత, కొత్త నిబంధనలు ఒకదానితో ఒకటి విభేదించేది వాటికి సంబంధించిన మహిమ స్థాయి విషయంలోనే. ఎన్నటికీ తగ్గని సూర్యుని మహిమతో పోలిస్తే సాధారణ క్రమంలో (ప్రతి నెలా తగ్గే) చంద్రుని మహిమ అసలు మహిమే కాదు.
3:12 మోషే వేసుకున్న ముసుకు ముఖ్యోద్దేశం, తగ్గిపోతున్న పాత నిబంధన మహిమను ఇశ్రాయేలీయులు తేరి చూడకుండా నివారించాలని. ధర్మశాస్త్రాన్ని రూపొందించిన దేవుడు, దానిని పాతగిలి పోయే స్వభావంతో నిర్మించాడు (గలతీ 3:24-25; హెబ్రీ 8:13).
3:13 ఆత్మ సంబంధమైన పరిచర్య మోషే పరిచర్యకన్నా ఎక్కువ మహిమ గలదైతే, దాని పరిచారకులకు మరింత ధైర్యం ఉండవచ్చు ( గార్లాండ్).
3:14 ముసుగుకున్న మరో ఉద్దేశం ముసుకు వేసుకున్న వ్యక్తిని బయటికి చూడకుండా చేయడం. మొదటి శతాబ్దంలోని సువార్తను నమ్మని యూదులు వారి లేఖనాలు చదవబడుతున్నప్పుడు, తగ్గిపోతున్న వాటి మహిమను, పాత నిబంధన తాత్కాలిక స్వభావాన్ని గుర్తించలేక పోయారు..
3:15-16 ముసుకు వారి హృదయముల మీద నున్నది అనే మాటలు నిజమైన ముసుకును కాక వారి ఆధ్యాత్మిక వైకల్యాన్ని సూచిస్తున్నాయి. చారిత్రకంగా యేసును మెస్సీయగా స్వీకరించలేకపోవడానికి యూదులకున్న ఒక గొప్ప ఇబ్బంది ఏమిటంటే వాడబారిపోతున్న పాత నిబంధనను ఆయన మించిపోయాడని గుర్తించడమే. ముసుకు తీసివేయబడును అనే మాటల్లోని "బడు" ప్రయోగం, దేవుని సార్వభౌమ కార్యాన్ని సూచిస్తుంది.
3:17 కుమారునికి, పరిశుద్దాత్మకు ఉన్న సన్నిహిత సంబంధాన్ని నొక్కిచెప్పే ఒక ముఖ్యమైన త్రిత్వసంబంధిత లేఖనం ఇది. రోమా 8:9లో “దేవుని ఆత్మ” "క్రీస్తు ఆత్మ" ఒకదాని స్థానంలో ఒకటి మార్చి వాడినట్టు కనిపిస్తాయి.
3:18 ముసుకు లేని ముఖముతో ఉన్నవారిలో పౌలు విశ్వాసులందర్నీ కలిపాడు. కొత్త నిబంధనలో ఆరంభమైన వారి మహిమ ఎన్నటికీ తగ్గదు. అది మహిమ నుండి (భూమి మీద తిరిగి జన్మించి, నీతిమంతులుగా తీర్చబడి, పరిశుద్ధపరచబడినప్పుడు) మహిమకు (పరలోకంలో మహిమపరచ బడినపుడు) వృద్ధి చెందుతూ ఉంటుంది.