Corinthians II - 2 కొరింథీయులకు 3 | View All

1. మమ్మును మేమే తిరిగి మెప్పించుకొన మొదలు పెట్టు చున్నామా? కొందరికి కావలసినట్టు మీయొద్దకైనను మీ యొద్దనుండియైనను సిఫారసు పత్రికలు మాకు అవసరమా?

ఈ రెండు ప్రశ్నలకూ “కాదు” అనేదే జవాబు. కొన్ని సందర్భాల్లో సిఫారసు లేఖలు అనవసరమని పౌలు చెప్పడం లేదు. పౌలు స్వయంగా కొందరి విషయం సిఫారసు చేశాడు (2 కోరింథీయులకు 8:16-24; రోమీయులకు 16:1-2; 1 కోరింథీయులకు 16:3, 1 కోరింథీయులకు 16:10-11). అయితే తనకోసం అలాంటిదేమీ అవసరం లేదని ఇక్కడ అంటున్నాడు.

2. మా హృదయములమీద వ్రాయబడియుండి, మనుష్యులందరు తెలిసికొనుచు చదువుకొనుచున్న మా పత్రిక మీరేకారా?

కొరింతు విశ్వాసులే పౌలుకు సిఫారసు లేఖల వంటివారు. వారిని లేఖలుగా పోల్చి ఈ విషయాలను చెప్తున్నాడు: వారు పౌలు హృదయంపై, అతని సాటి సేవకుల హృదయాలపై రాసిన లేఖల వంటివారు (అంటే పౌలు, ఇతర సేవకులు కొరింతు విశ్వాసుల్లో జరిగిన దేవుని పనిని గుర్తించి వారిని అతి ప్రియంగా ఎంచారు – 2 కోరింథీయులకు 7:3); వారు పౌలు హృదయంలో దాగి ఉన్న రహస్య లేఖ వంటివారు కారు గాని ఎవరైనా చదవగలిగిన బహిరంగ లేఖ (అంటే పౌలు పరిచర్య ద్వారా వారిలో కలిగిన మార్పు వారిని చూచే వారందరికీ కనిపిస్తుందన్నమాట); వారు “క్రీస్తు రాయించిన” లేఖ (అంటే కొరింతు విశ్వాసుల్లో ఆ మార్పు కలిగించినది క్రీస్తు సంకల్పం, క్రీస్తు సందేశమే); వారు పౌలు, అతని సాటి సేవకులు రాసిన లేఖ కూడా (ఈ పనిలో క్రీస్తు వారిని వాడుకున్నాడు); వారి ఆధ్యాత్మిక జీవానికి మూలాధారం దేవుని ఆత్మ (యోహాను 3:5-8 పోల్చి చూడండి); రాత వారి హృదయాలపై ఉంది (అంటే వారిలోని మార్పు కేవలం బాహ్యంగానే కాదు, వారి అంతరంగాల్లో జరిగింది – 2 కోరింథీయులకు 5:17). రాతి పలకలపై దేవుడు ధర్మశాస్త్రాన్ని రాసిన సందర్భానికి పౌలు దీనంతటినీ పోలుస్తున్నాడు. నిర్గమకాండము 31:18; నిర్గమకాండము 32:15-16 చూడండి. యిర్మియా 31:33-34; హెబ్రీయులకు 8:10-12 పోల్చి చూడండి. ఇప్పుడు కూడా “లేఖలు” రాయడానికి దేవునితో కలిసి ఆయన సేవకులు పని చేస్తున్నారు. ఈ లేఖలంటే క్రీస్తు శుభవార్త మూలంగా లోతైన, శాశ్వతమైన మార్పు నొందినవారు. ఇలాంటి పని కన్నా ఈ భూమిపై మరింత ఘనమైన ఆధిక్యత వేరే ఉందా?

3. రాతిపలకమీదగాని సిరాతోగాని వ్రాయబడక, మెత్తని హృదయములు అను పలకలమీద జీవముగల దేవుని ఆత్మతో, మా పరిచర్యమూలముగా వ్రాయబడిన క్రీస్తు పత్రికయై యున్నారని మీరు తేటపరచబడుచున్నారు.
నిర్గమకాండము 24:12, నిర్గమకాండము 31:18, నిర్గమకాండము 34:1, ద్వితీయోపదేశకాండము 9:10-11, సామెతలు 3:3, సామెతలు 7:3, యిర్మియా 31:33, యెహెఙ్కేలు 11:19, యెహెఙ్కేలు 36:26

ఈ వచనాల్లో పౌలు పాత ఒడంబడికకూ, కొత్త ఒడంబడికకూ తేడాలు చూపుతున్నాడు. పాతది మరణాన్ని తెచ్చిన పరిచర్య (వ 6,7); కొత్తది జీవాన్ని తెచ్చింది (వ 6) పాతదాన్ని రాతి పలకలపై రాయడం జరిగింది (నిర్గమకాండము 31:18) కొత్తది మనుషుల హృదయాలపై రాయబడింది (వ 3) పాతది మనుషులను నేరస్థులుగా తీర్చే పరిచర్య, కొత్తదైతే వారిని నిర్దోషులుగా తీర్చేది (వ 9; రోమీయులకు 3:19-24) పాతది గతించిపోతూ ఉంది (వ 11; హెబ్రీయులకు 8:13) కొత్తది శాశ్వతం (వ 11) ఒక్క మాటలో చెప్పాలంటే పాత ఒడంబడిక మనుషుల హృదయాలను మార్చలేని ఆజ్ఞల్లో, శాసనాల్లో ఉంది (నిర్గమకాండము 19:5-6 నోట్‌); కొత్త ఒడంబడిక మనుషులను కొత్తవారుగా చేసే దేవుని ఆత్మ పరిచర్యను తెచ్చేది (వ 3,6,8) కాబట్టి పాతదానికి కొంత మహిమ ఉన్నప్పటికీ, కొత్తదానికి మరెంతో ఎక్కువ మహిమ ఉంది (వ 8-11) మోషే ధర్మశాస్త్రాన్ని పాటించాలని చెప్తూ కొందరు కొరింతులోని క్రైస్తవులను కలవర పెడుతున్నట్టుంది. అపో. కార్యములు 15:1-2 పోల్చి చూడండి. వారు ఉపదేశిస్తున్న ధర్మశాస్త్రం కంటే తాను ఉపదేశిస్తున్న శుభవార్త ఎంత గొప్పదో పౌలు కొరింతువారికి చూపిస్తున్నారు.

4. క్రీస్తుద్వారా దేవునియెడల మాకిట్టి నమ్మకము కలదు.

పైన వర్ణించిన పనిలో దేవుడు తనను వాడుకుంటున్నాడు అనడంలో పౌలుకు ఏ సందేహమూ లేదు. క్రీస్తే స్వయంగా అతనికి ఈ నిశ్చయత ఇచ్చాడు.

5. మావలన ఏదైన అయినట్లుగా ఆలోచించుటకు మాయంతట మేమే సమర్థులమని కాదు; మా సామర్థ్యము దేవుని వలననే కలిగియున్నది.

2 కోరింథీయులకు 2:16. దేవుడు పిలిచి సామర్థ్యాన్ని ఇవ్వని పక్షంలో ఈ పని ఎవరికైనా అసాధ్యమైనంత కష్టతరం. ఈ పనిలో పౌలుకున్న నిబ్బరం తన సామర్థ్యాలను బట్టి కలిగినది కాదు. తాను చేస్తున్నదంతా జరిగించేవాడు దేవుడే అని అతనికి తెలుసు (1 కోరింథీయులకు 15:10; కొలొస్సయులకు 1:29. యోహాను 15:5 చూడండి).

6. ఆయనే మమ్మును క్రొత్త నిబంధనకు, అనగా అక్షరమునకు కాదు గాని ఆత్మకే పరిచారకులమవుటకు మాకు సామర్థ్యము కలిగించియున్నాడు. అక్షరము చంపునుగాని ఆత్మ జీవింపచేయును.
నిర్గమకాండము 24:8, యిర్మియా 31:31, యిర్మియా 32:40

దేవుడు తన పనిమీద పంపిన వారెవరికైనా, ఆ పని చేసేందుకు సామర్థ్యాన్ని ఇస్తాడన్న నిబ్బరం ఉండాలి. కొత్త ఒడంబడిక గురించి మత్తయి 26:28; యిర్మియా 31:31-34; హెబ్రీయులకు 8:6-13 నోట్స్ చూడండి. ఇక్కడ “అక్షరం” అనడంలో పౌలు పాత ఒడంబడికనూ దాని చట్టాలు, నియమాలు, ఆజ్ఞలనూ సూచిస్తున్నాడు. ఎవరూ దాన్ని పూర్తిగా ఆచరణలో పెట్టలేదు గనుక అది మరణాన్నే తెచ్చింది. న్యాయంగానే అది మనుషులను మరణ పాత్రులుగా తీర్పు తీర్చింది (రోమీయులకు 7:9-11; గలతియులకు 3:10. రోమీయులకు 3:19-20; రోమీయులకు 4:15; రోమీయులకు 5:20; రోమీయులకు 8:3 మొదలైనవి కూడా చూడండి). కానీ కొత్త ఒడంబడిక దేవుని ఆత్మమూలంగా జీవాన్ని తెచ్చింది (రోమీయులకు 7:6; రోమీయులకు 8:2-4, రోమీయులకు 8:11; యోహాను 3:5-8).

7. మరణ కారణమగు పరిచర్య, రాళ్లమీద చెక్కబడిన అక్షరములకు సంబంధించినదైనను, మహి మతో కూడినదాయెను. అందుకే మోషే ముఖముమీద ప్రకాశించుచుండిన ఆ మహిమ తగ్గిపోవునదైనను,ఇశ్రాయేలీయులు అతని ముఖము తేరిచూడలేక పోయిరి.
నిర్గమకాండము 34:29-30, నిర్గమకాండము 34:34

“మోషే ముఖం”– నిర్గమకాండము 34:29-35 చూడండి.

8. ఇట్లుండగా ఆత్మసంబంధ మైన పరిచర్య యెంత మహిమగలదై యుండును?

9. శిక్షా విధికి కారణమైన పరిచర్యయే మహిమ కలిగినదైతే నీతికి కారణమైన పరిచర్య యెంతో అధికమైన మహిమ కల దగును.
ద్వితీయోపదేశకాండము 27:26

10. అత్యధికమైన మహిమ దీనికుండుటవలన ఇంతకు మునుపు మహిమ కలదిగా చేయబడినది యీ విషయములో మహిమలేనిదాయెను.
నిర్గమకాండము 34:29-30

11. తగ్గిపోవునదే మహిమగలదై యుండినయెడల,నిలుచునది మరి యెక్కువ మహిమగలదై యుండును గదా.

12. తగ్గిపోవుచున్న మహిమయొక్క అంతమును ఇశ్రాయేలీయులు తేరిచూడకుండునట్లు మోషే తన ముఖము మీద ముసుకు వేసికొనెను.

“ఆశాభావం”– రోమీయులకు 5:2-5; రోమీయులకు 8:23-25. ఈ ఆశాభావం, రాబోయే ఈ మహిమను గురించిన ఎదురుతెన్నులు పౌలును ఇప్పుడెంతో ధైర్యవంతుడిగా చేశాయి.

13. మేమట్లు చేయక,యిట్టి నిరీక్షణ గలవారమై బహు ధైర్యముగా మాటలాడు చున్నాము.
నిర్గమకాండము 34:33, నిర్గమకాండము 34:35, నిర్గమకాండము 36:35

నిర్గమకాండము 34:29-35. మహిమ ప్రత్యక్షం ఇస్రాయేల్ వారికి భయం కలిగించింది. కొత్త ఒడంబడిక అయితే భయం పుట్టించదు గానీ ఆశాభావం, ధైర్యం, ఆనందాలను కలిగిస్తుంది.

14. మరియు వారి మనస్సులు కఠినములాయెను గనుక నేటివరకును పాతనిబంధన చదువబడునప్పుడు, అది క్రీస్తునందు కొట్టివేయ బడెనని వారికి తేటపరచబడక, ఆ ముసుకే నిలిచియున్నది.

మోషే తన ముఖంపై వేసుకున్న ముసుగు నుంచి ఇప్పుడు పౌలు ఆధ్యాత్మిక పాఠాలు నేర్పిస్తున్నాడు. వ 14లో ఇంకా పాత ఒడంబడిక క్రింద ఉన్నవారిని గురించి, అంటే యూదులు, యూద మతం పుచ్చుకున్నవారిని గురించి మాట్లాడుతున్నాడు. వారి మనసులు మందకొడిగా ఉన్నాయి. వారి హృదయాలపై ముసుగు ఉంది (వ 15). పాత ఒడంబడిక గ్రంథంలో వారు చదివినదాన్ని వారెంత మాత్రం ఆధ్యాత్మికంగా అర్థం చేసుకోలేకపోయారు. 2 కోరింథీయులకు 4:3-4 చూడండి. యోహాను 5:39-40, యోహాను 5:46-47 మొదలైన చోట్ల యూదులతో యేసుప్రభువు అన్న మాటలను పోల్చి చూడండి. చీకటి, అజ్ఞానం అనే ముసుగును క్రీస్తు మాత్రమే తీసివేయగలడు, మనుషులు సత్యాన్ని అర్థం చేసుకుని దేవుణ్ణి తెలుసుకునేలా చేయగలడు (వ 14,16; మత్తయి 11:27; యోహాను 8:12, యోహాను 8:31-32; యోహాను 14:6).

15. నేటి వరకును మోషే గ్రంథము వారు చదువునప్పుడెల్ల ముసుకు వారి హృదయముల మీదనున్నది గాని

16. వారి హృదయము ప్రభువువైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుకు తీసివేయబడును.
యెషయా 25:7, నిర్గమకాండము 34:34

17. ప్రభువే ఆత్మ ప్రభువుయొక్క ఆత్మయెక్కడ నుండునో అక్కడ స్వాతంత్ర్యము నుండును.

తండ్రి, కుమారుడు ఏవిధంగానో, అదే విధంగా యేసుప్రభువు, దేవుని ఆత్మ కూడా ఏకంగా ఉన్నారు (యోహాను 10:30; యోహాను 14:9). దేవుని ఆత్మను రోమ్ 8:9లో క్రీస్తు ఆత్మ అనడం కనిపిస్తుంది. త్రిత్వం గురించి నోట్స్ మత్తయి 3:16-17; మొ।।. “స్వేచ్ఛ”– దేవుని ఆత్మ అనేక రకాల స్వేచ్ఛలనిస్తుంది – ధర్మశాస్త్రం నుంచి (రోమీయులకు 7:4, రోమీయులకు 7:6; గలతియులకు 5:18), భయం నుంచి (రోమీయులకు 8:15); పాపం నుంచి (రోమీయులకు 6:14, రోమీయులకు 6:18). యోహాను 8:36 పోల్చి చూడండి.

18. మన మందరమును ముసుకు లేని ముఖముతో ప్రభువుయొక్క మహిమను అద్దమువలె ప్రతిఫలింపజేయుచు, మహిమనుండి అధిక మహిమను పొందుచు, ప్రభువగు ఆత్మచేత ఆ పోలిక గానే మార్చబడుచున్నాము.
నిర్గమకాండము 16:7, నిర్గమకాండము 24:17

“చూస్తూ...ఉన్నాం”– విశ్వాసులంతా ఇప్పుడు క్రీస్తులో దేవుని మహిమను కొంత చూస్తున్నారు (2 కోరింథీయులకు 4:6). అంటే వారికి దాన్ని కొంతవరకు ఆధ్యాత్మికంగా అర్థం చేసుకోగలరు. వారికి మనసులో జ్ఞానోదయం ఉంది. కానీ అదంతా కూడా మసక అద్దంలో చూస్తున్నట్టుగానే ఉంది. 1 కోరింథీయులకు 13:12 పోల్చి చూడండి. అద్దంలో ప్రతిబింబం మాత్రమే కనిపిస్తుంది. క్రీస్తును ముఖాముఖిగా చూచేటప్పుడు విశ్వాసులకు కనిపించే వాస్తవికమైన దృశ్యమంతా ఇప్పుడు కనిపించదు. అయితే ఇప్పుడు విశ్వాసులంతా మార్పు నొందుతూ ఉన్నారు. “పోలికగా మారుతూ ఉన్నాం” అని అనువదించిన గ్రీకు పదం క్రొత్త ఒడంబడిక గ్రంథంలో నాలుగు సార్లు మాత్రమే కనిపిస్తున్నది – ఇక్కడ, మత్తయి 17:2; మార్కు 9:2; రోమీయులకు 12:2. ఇది బయట కనిపించే అంతరంగంలోని మార్పును సూచిస్తున్నది. క్రీస్తు విషయంలో ఈ మాటను వాడిన సందర్భంలోనైతే ఆయన అంతరంగంలో ఏమిటో దానికి అనుగుణంగా బాహ్యరూపంలో కూడా మార్పునొందాడు. విశ్వాసుల విషయంలో ఇది లోపల, బయట కూడా జరిగే మార్పు. అంతేగాక వారి విషయంలో ఇది ఓ క్షణంలో జరిగేది కాదు. ఇది క్రమేణా జరుగుతుంది. కీర్తనల గ్రంథము 84:7; సామెతలు 4:18 పోల్చి చూడండి. ఇక్కడే, ఇప్పుడే దేవుడు వారిని మరింతగా క్రీస్తు పోలికలోకి మారుస్తున్నాడు. చివరికి ఆయన తిరిగి వచ్చే సమయంలో వారు పూర్తిగా ఆయనలాగా అయిపోతారు (రోమీయులకు 8:29; 1 యోహాను 3:1-2). ఇప్పుడు ఇది జరుగుతున్నదని విశ్వాసికే నమ్మకం కుదరనంత మెల్లగా ఈ మార్పు జరుగుతుండవచ్చు. అయితే దేవుని నిజమైన పిల్లలందరిలోనూ ఇది ఇప్పుడు జరుగుతూ ఉంది.Shortcut Links
2 కోరింథీయులకు - 2 Corinthians : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |