Nehemiah - నెహెమ్యా 2 | View All

1. అటుతరువాత అర్తహషస్త రాజు ఏలుబడికాలమున ఇరువదియవ సంవత్సరములో నీసాను మాసమందు రాజు ద్రాక్షారసము త్రాగవలెనని చూచుచుండగా నేను ద్రాక్షారసము తీసికొని రాజునకు అందించితిని. అంతకు పూర్వము నేనెన్నడును అతనియెదుట విచారముగా ఉండలేదు.

2. కాగా రాజునీకు వ్యాధిలేదు గదా, నీ ముఖము విచారముగా ఉన్నదేమి? నీ హృదయదుఃఖము చేతనే అది కలిగినదని నాతో అనగా

3. నేను మిగుల భయపడిరాజు చిరంజీవి యగునుగాక, నా పితరుల సమాధులుండు పట్టణము పాడైపోయి, దాని గుమ్మములును అగ్నిచేత కాల్చబడి యుండగా నాకు దుఃఖముఖము లేకపోవునా అని రాజుతో అంటిని.

4. అప్పుడు రాజుఏమి కావలసి నీవు మనవి చేయుచున్నావని నన్నడుగగా, నేను ఆకాశమందలి దేవునికి ప్రార్థన చేసి

5. రాజుతోనీ సముఖమందు నేను దయపొందినయెడల, నా పితరుల సమాధులుండు పట్టణమును తిరిగి కట్టునట్లుగా నన్ను యూదాదేశమునకు పంపుడని వేడుకొనుచున్నానని నేను మనవి చేసితిని.

6. అందుకు రాజు రాణి తన యొద్ద కూర్చునియుండగానీ ప్రయాణము ఎన్నిదినములు పట్టును? నీవు ఎప్పుడు తిరిగి వచ్చెదవని అడిగెను. నేను ఇంత కాలమని చెప్పినప్పుడు రాజు నన్ను పంపుటకు చిత్తము గలవాడాయెను.

7. ఇదియు గాక రాజుతో నే నిట్లంటిని రాజున కనుకూలమైతే యూదాదేశమున నేను చేరువరకు నన్ను దాటించునట్లుగా నది యవతల నున్న అధికారులకు తాకీదులను,

8. పట్టణప్రాకారమునకును, మందిరముతో సంబంధించిన కోటగుమ్మములకును, నేను ప్రవేశింపబోవు ఇంటికిని, దూలములు మ్రానులు ఇచ్చునట్లుగా రాజుగారి అడవులను కాయు ఆసాపునకు ఒక తాకీదును ఇయ్యుడని అడిగితిని; ఆలాగు నాకు తోడుగా ఉండి నాకు కృప చూపుచున్న నా దేవుని కరుణా హస్తముకొలది రాజు నా మనవి ఆలకించెను.

9. తరువాత నేను నది యవతలనున్న అధికారులయొద్దకు వచ్చి వారికి రాజుయొక్క తాకీదులను అప్పగించితిని. రాజు నాతోకూడ సేనాధిపతులను గుఱ్ఱపురౌతులను పంపించెను.

10. హోరోనీయుడైన సన్బల్లటును, అమ్మోనీయుడైన టోబీయా అను దాసుడును ఇశ్రాయేలీయులకు క్షేమము కలుగజేయు ఒకడు వచ్చెనని విని బహుగా దుఃఖపడిరి.

11. అంతట నేను యెరూషలేమునకు వచ్చి మూడు దినములు అక్కడనే యుండి

12. రాత్రియందు నేనును నాతోకూడ నున్న కొందరును లేచితివిు. యెరూషలేమునుగూర్చి దేవుడు నా హృదయమందు పుట్టించిన ఆలోచననునేనెవరితోనైనను చెప్పలేదు. మరియు నేను ఎక్కియున్న పశువుతప్ప మరి యే పశువును నాయొద్ద ఉండ లేదు.

13. నేను రాత్రికాలమందు లోయద్వారముగుండ భుజంగపు బావియెదుటికిని పెంట ద్వారము దగ్గరకును పోయి, పడద్రోయబడిన యెరూషలేముయొక్క ప్రాకా రములను చూడగా దాని గుమ్మములు అగ్నిచేత కాల్చబడి యుండెను.

14. తరువాత నేను బుగ్గగుమ్మమునకు వచ్చి రాజు కోనేటికిని వెళ్లితిని గాని, నేను ఎక్కియున్న పశువు పోవుటకు ఎడము లేకపోయెను.

15. నేను రాత్రి యందు మడుగు దగ్గరనుండి పోయి ప్రాకారమును చూచినమీదట వెనుకకు మరలి లోయ గుమ్మములో బడి తిరిగి వచ్చితిని.

16. అయితే నేను ఎచ్చటికి వెళ్లినది యేమి చేసినది అధికారులకు తెలియలేదు. యూదులకే గాని యాజకులకే గాని యజమానులకే గాని అధికారులకే గాని పనిచేయు ఇతరమైనవారికే గాని నేను ఆ సంగతి చెప్పి యుండలేదు.

17. అయితే వారితో నేనిట్లంటినిమనకు కలిగిన శ్రమ మీకు తెలిసియున్నది, యెరూషలేము ఎట్లు పాడైపోయెనో దాని గుమ్మములు అగ్నిచేత ఎట్లు కాల్చబడెనో మీరు చూచియున్నారు, మనకు ఇకమీదట నింద రాకుండ యెరూషలేముయొక్క ప్రాకారమును మరల కట్టుదము రండి.

18. ఇదియుగాక నాకు సహాయము చేయు దేవుని కరుణాహస్తమును గూర్చియు, రాజు నాకు సెలవిచ్చిన మాటలన్నియు నేను వారితో చెప్పితిని. అందుకు వారు-మనము కట్టుటకు పూనుకొందము రండని చెప్పి యీ మంచికార్యము చేయుటకై బలము తెచ్చుకొనిరి.

19. అయితే హోరోనీయుడైన సన్బల్లటును, అమ్మో నీయుడైన దాసుడగు టోబీయా అనువాడును, అరబీయు డైన గెషెమును ఆ మాట వినినప్పుడు మమ్మును హేళన చేసి మా పని తృణీకరించి మీరు చేయు పనియేమిటి? రాజుమీద తిరుగుబాటు చేయుదురా అని చెప్పిరి.

20. అందుకు నేను-ఆకాశమందు నివాసియైన దేవుడు తానే మా యత్నమును సఫలము చేయును గనుక ఆయన దాసులమైన మేము కట్టుటకు పూనుకొనుచున్నాము, యెరూషలేమునందు మీకు భాగమైనను స్వతంత్రమైనను జ్ఞాపక సూచనయైనను లేదని ప్రత్యుత్తరమిచ్చితిని.



బైబిల్ అధ్యయనం - Study Bible
2:1-3 నెహెమ్యా తన విన్నపాన్ని రాజునొద్దకు తీసుకురావడానికి దాదాపు నాలుగు నెలలు (అది క్రీ.పూ. 448 సం.) ఎందుకు వేచియున్నాడో స్పష్టంగా లేదు. (నీసాను మాసము కొరకు 1:1 నోట్సు . చూడండి). బహుశా రాజు చలికాలమంతా షూషనులో కాకుండా బబులోనులో గడిపి ఉండవచ్చు. ఇలా కొన్నిసార్లు జరగడాన్ని పురాతన పత్రాలు ధృవీకరిస్తున్నాయి. లేదా నెహెమ్యా టుట్కా అనే పారసీకుల పండుగ కోసం కనిపెట్టి ఉండవచ్చు. ఎందుకంటే ఈ పండుగలో రాజు తనను వేడుకొన్నవారి మనవులను తీర్చేవాడు. నెహెమ్యా తన విచారానికి గల కారణాన్ని జాగ్రత్తగా తెలియజేశాడు. అతడు యెరూషలేము అనే పేరు ప్రస్తావించలేదు. ఎందుకంటే అది గతం నుండి ప్రతికూల భావాల్ని కలిగించి ఉండేది (ఎజ్రా 4:12). కానీ అతడు యెరూషలేమును నా పితరుల సమాధులుండు పట్టణము అని ప్రస్తావించాడు. తమ పూర్వికులకు సమాధులు నిర్మించడాన్ని పారసీక రాజులు ఎంతో ప్రాముఖ్యంగా ఎంచేవారు. కాబట్టి నెహెమ్యా తమ పితరుల యొక్క సమాధుల దుస్థితిని గురించి ఆందోళన వ్యక్తపరిస్తే రాజు సానుకూలంగా స్పందిస్తాడు. 

2:4 ఇది చాలా చిన్న ప్రార్ధన అయ్యుంటుంది కానీ రాజు చిత్తముపై దేవుని సార్వభౌమత్వాన్ని నెహెమ్యా నమ్మాడని ఇది సూచిస్తుంది.

2:5 రాజు, యెరూషలేములో - నిర్మాణాలన్నీ ఆపేయాలని ఇంతకు ముందు నిర్ణయించాడు (ఎజ్రా 4:12-16). అయినప్పటికీ, నెహెమ్యా యెరూషలేమును తిరిగి కట్టునట్లుగా మనవి చేయడం ధైర్యంతో కూడిన పని. 

2:6 ఇక్కడ వాడిన రాణి అనే పదం అరుదైనది (హెబ్రీ. షెగాల్). ఈ పదం ఇక్కడ, కీర్తన 45:9లో మాత్రమే కనిపిస్తుంది. ఇది అక్రమ లైంగిక కార్యాన్ని సూచించే ఒక క్రియాపదం (హెబ్రీ. షెగాల్)) నుంచి వచ్చింది కాబట్టి ఈ పదం ఈ స్త్రీని ఉంపుడుకత్తెగా, రాజు వ్యామోహపడిన స్త్రీగా గుర్తించిందని ప్రాచీన, నవీన వ్యాఖ్యాతలు సూచిస్తారు. 

2:7-8 నది యవతలనున్న అధికారులు యెరూషలేములో నిర్మాణాలన్నిటికి వ్యతిరేకులు (వ.10) కాబట్టి నెహెమ్యా అర్తహషస్త సభ నుంచి సెలవు మాత్రమే కాకుండా వారి కోసం రాజు అధికార తాకీదులు కూడా తీసుకోవడం అవసరం. నెహెమ్యా మందిరముతో సంబంధించిన కోట గుమ్మముల కోసం కలప ఇవ్వమని కోరాడు. ఇది బహుశా మందిరానికి ఉత్తరమువైపు ఉన్న సైనిక కట్టడాన్ని సూచిస్తుండవచ్చు. ఇది మందిరానికి, ఆరాధించేవారికి రక్షణ కల్పిస్తుంది, 3:1లో ఉన్న రెండు గోపురాలు దీనిలో భాగం అయ్యుండొచ్చు.

2:9 ఎజ్రా తిరస్కరించిన (ఎజ్రా 8:22-23) సైనిక రక్షణను నెహెమ్యా స్వీకరించినందుకు కొంతమంది అతన్ని విమర్శించారు. అయితే నెహెమ్యా నిర్ణయం అతని విశ్వాసలేమిని కాక ఇది దేవుని ఏర్పాటు అనే అతని నమ్మకాన్ని సూచించింది. 

2:10 ఈ వచనం ఈ గ్రంథమంతటా కనిపించే వ్యతిరేకతను పరిచయంచేసి - నెహెమ్యాను పదే పదే ఎదిరించిన ముగ్గురు శత్రువులలో ఇద్దరిని ప్రస్తావిస్తుంది. బబులోనీయ నామం కలిగిన సన్బల్లటు (సినబ్ ఉల్లట్ - “సీను దేవుడు జీవమిచ్చాడు”) అపూరీయుల చేత ఎక్కడినుండో స్థానచలనం పొంది, సమరయ ప్రాంతంలో నివసిస్తున్న కుటుంబానికి చెందినవాడు (2రాజులు 17:24-33) అయి ఉంటాడు. అతడు యెహోవాను ఆరాధించి ఉంటాడు, ఎందుకంటే అతడు షెలెమ్యా, దెలాయా అనే తన ఇద్దరు కుమారులకు దేవుని నామం కలగలిసిన పేర్లు పెట్టుకున్నాడు. యూదాకు (హెబ్రీ. యెహూద్) ఉత్తర ప్రాంతంలో పర్వతభూమిగా ఉన్న సమరయకు అతడు అధిపతిగా అప్పటికే పనిచేస్తూ ఉండి ఉంటాడు. హోరోనీయుడు అని అతణ్ణి పేర్కొనడం అతడు యెరూషలేముకు వాయవ్యంగా ఉన్న ఉత్తర లేక దక్షిణ బెహోరోను (యెహో 18:13) వాడని సూచిస్తుండవచ్చు. కొందరు పండితులు టోబీయా : సన్బల్లటు దగ్గర ఉన్న ఒక ఉన్నత అధికారి అయి ఉంటాడనీ, అమ్మోనీయుడు అని అతన్ని పేర్కొనడం వలన అతడు ఆ జాతికి చెందినవాడనీ అభిప్రాయపడుతున్నారు. మరి కొందరైతే టోబియా యొర్దాను నదికి తూర్పున అమ్మోనీయుల ప్రాంతానికి చెందిన యూదు కుటుంబానికి చెందినవాడనీ, అతడు ఆ రాష్ట్రానికి అధిపతి అని భావిస్తున్నారు. సన్బల్లటు, టోబీయాలు ఇద్దరూ నెహెమ్యా చేస్తున్న పనిని అడ్డుకోవాలని కంకణం కట్టుకున్నట్టు స్పష్టంగా తెలుస్తున్నది. 

2:11 ఇంతకు ముందు ఎజ్రా యెరూషలేముకు వచ్చినప్పుడు కూడా మూడు దినములు విశ్రాంతి తీసుకున్నాడు (ఎజ్రా 8:32), మరియు 

2:12 యెరూషలేమును రాత్రి సమయంలో పర్యవేక్షించడం కోసం తనతో ఉన్న మనుషులు, జంతువుల సంఖ్యను నెహెమ్యా కుదించి ఉంటాడు. అందువలన సన్బల్లటు, టోబియా సానుభూతిపరులు తమను అంతగా కనిపెట్టలేక పోవచ్చు అని అతని ఉద్దేశం. 

213-15 ఈ భాగంలో నగర తనిఖీ గురించిన వర్ణన, ఆ అధ్యా. లో పునర్నిర్మాణం గురించిన పూర్తి వివరణలు కలిసి క్రీ. పూ. ఐదవ శతాబ్దంలోని యెరూషలేము నగర కొలతలను అంచనా వేయడానికి మంచి సమాచారంగా పనిచేస్తున్నాయి. నెహెమ్యా పునర్నిర్మించిన ప్రాకారాలు దావీదు నగరానికీ, దేవాలయ ప్రాంతానికి మాత్రమే పరిమితమయ్యాయని కొందరు పండితులు వాదించారు. పునర్నిర్మించబడిన గోడలు ఎనిమిదవ శతాబ్దపు గోడలను అనుసరించి ఉన్నాయని, వాటిలో ప్రాచీన యెరూషలేము ప్రాకారాల మధ్య ఉన్న నైరుతిలోని పర్వత ప్రాంతం కూడా ఉన్నదనీ మరికొందరు వాదించారు. ఇంకా మరికొందరు పురాతత్వ శాస్త్రజ్ఞులైతే అక్కడ ఉన్న విస్తారమైన శిథిలాలను బట్టి నెహెమ్యా తూర్పువైపు గోడను మానివేసి ఆ పర్వతశిఖరాన్ని కాపాడుకోగలిగేలా ఒక కొత్త గోడను కట్టాడని నమ్ముతున్నారు. ఇంకొందరు అతడు ప్రాచీన యెరూషలేము గోడలను ఇంకా ముందుకు వాలు వరకు పునర్నిర్మించాడని తీర్మానించారు. నెహెమ్యా నగర తనిఖీ యాత్ర యెరూషలేముకు పశ్చిమాన ప్రారంభమై ఎడమవైపుగా నగరం అంతా సాగింది.

2:13 నెహెమ్యా, అతని అనుచరులు లోయద్వారము నుండి దక్షిణంగా “సర్పం/భుజంగం కన్ను" అని అర్థమిచ్చే భుజంగపుబావి వైపుకు (హెబ్రీ. ఎన్ హట్టానీన్) సాగారు. నగరానికి దక్షిణంగా అంచున ఉన్న పెంట ద్వారము వరకు నెహెమ్యా కొనసాగాడు. ఈ ద్వారం చెత్తను పారబోసి తగలబెట్టే హిన్నోము లోయకు నడిపిస్తుంది. గె-హిన్నోమ్ (హిన్నోము లోయ) అనే హెబ్రీ పదం నుండి గెహెన్నా అనే పదం వచ్చింది. 

2:14 ఉత్తరం వైపున ఉన్న శిథిలాలను అనుసరించి నెహెమ్యా బుగ్గ గుమ్మము... రాజు కోనేటికి (బహుశా 3:15లో కనిపించే “షల్లూము ధార" అంటే ఇదే కావచ్చు) వచ్చాడు. తన ఎడమవైపున ప్రాకారాల శిథిలాలు, కుడివైపున లోతైన కిద్రోను లోయ ఉండగా అతని మార్గం మూసుకుపోవడంతో అతడు వాహనం దిగిపోయాడు. ప్రాచీన యెరూషలేము ఈ వాలు కిందుగా (మిల్లో) కిచ్లోను లోయ వైపుకు విస్తరించింది. అని పురావస్తు పరిశోధనలు వెల్లడించాయి. శిథిలాలతో నిండిన ఈ ప్రాంతం కొన్ని చోట్ల 15 అడుగులు మందంగా ఇప్పటికీ కనిపిస్తూ ఉంటుంది. 

2:16 ఇక్కడ ప్రస్తావించిన అధికారులు (హెబ్రీ. సెగాన్) పర్షియాకు చెందినవారు అని కొందరు భావించినా, బహుశా వారు యూదుల... యాజకుల... యజమానుల... అధికారులకు చెందినవారు అయి ఉండవచ్చు. 

2:17 ఇక్కడ ఉన్న శ్రమ అనే మాట (హెబ్రీ. ఖైరేపా)ను తరచుగా “సిగ్గు" లేక “అవమానము? " అని కూడా అనువదించారు.. నెహెమ్యా సోదరుడు, అతని స్నేహితులు మొదటిలో యెరూషలేమును పరిస్థితిని గురించి వర్ణించిన సందర్భంలో (1:3) ఇదే మాటను ఉపయోగించారు. ఆ నగరానికి ఏర్పడిన దీన స్థితి ఆ నగరానికి, దాని ప్రజలకు, అన్నిటికీ మించి దాని దేవునికి ఒక “అవమానం"గా ఉంది. 

2:18 దేవుని కరుణాహస్తము అనే పదం వ.8, ఎజ్రా 7:9; 8:18; 22, 31 లో కూడా కనిపిస్తుంది.

2:19 - నెహెమ్యా ప్రధాన శత్రువుల్లో మూడో వ్యక్తి ఈ వచనంలో కనిపిస్తాడు. అతడే అరబీయుడైన గెషెము. క్రీ. పూ. తొమ్మిదవ శతాబ్దం నుండీ బైబిల్లో అరబీయుల ప్రస్తావన కనిపిస్తుంది. వారు కొన్నిసార్లు క్రీ.పూ. 853లో ఖర్కరు. యుద్ధంలో చేసినట్టు ఇశ్రాయేలీయులకు సహాయంగా నిలిచారు, మరికొన్నిసార్లు యూదుల రాజైన యెహోరాము కాలంలో (2దిన 21:16) - వారిపై దాడి చేశారు. నెహెమ్యా కాలంలో అరబ్బులు గెషెము నాయకత్వం కింద ఉన్నారు. అతని విస్తారమైన పరిపాలన నెగెబు నుండి దిగువ ఐగుప్తు వరకు దక్షిణ యూదాలో వ్యాపించింది. సన్బల్లటు, టోబియాలతో కలిసి అతడు నెహెమ్యాను అతని అనుచరులనూ హేళన చేశాడు. పైగా వారు పర్షియా రాజుమీద తిరుగుబాటు చేస్తున్నారని ఆరోపించాడు. 

2:20 నెహెమ్యా తన శత్రువులు చేసే నేరారోపణలను తిప్పికొట్టడానికి ప్రయత్నించకుండా ఆకాశమందు నివాసియైన దేవుడులో తన విశ్వాసాన్ని ప్రకటించాడు. ఈ సందర్భంలో జ్ఞాపక సూచన అని చెప్పిన పదజాలం భావమేమిటో తెలియడం లేదు. హెబ్రీలో దాని మూలపదానికి (జిక్కారొన్) సాధారణంగా “జ్ఞాపకార్థం” అని అర్థం. పస్కాను ఇశ్రాయేలు ప్రజలకు ఒక ఆధ్యాత్మిక గుర్తుగా వర్ణించడానికి ఈ పదం వాడబడింది. (నిర్గమ 12:14). నెహెమ్యా శత్రువులకు ఆ భూమిపై ఏ చట్టబద్ధమైన హక్కూ లేదని మాత్రమే కాక, తమ సామాజిక ఆరాధనలో పాలుపొందటానికి కూడా హక్కులేదని ఇది సూచిస్తుండవచ్చు.


Shortcut Links
నెహెమ్యా - Nehemiah : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary |