Psalms - కీర్తనల గ్రంథము 107 | View All

1. యెహోవా దయాళుడు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి ఆయన కృప నిత్యముండును.

2. యెహోవా విమోచించినవారు ఆ మాట పలుకుదురు గాక విరోధుల చేతిలోనుండి ఆయన విమోచించినవారును

3. తూర్పునుండి పడమటినుండి ఉత్తరమునుండి దక్షిణము నుండియు నానాదేశములనుండియు ఆయన పోగుచేసినవారును ఆమాట పలుకుదురుగాక.
మత్తయి 8:11, లూకా 13:29

4. వారు అరణ్యమందలి యెడారిత్రోవను తిరుగులాడు చుండిరి. నివాస పురమేదియు వారికి దొరుకకపోయెను.

5. ఆకలి దప్పులచేత వారి ప్రాణము వారిలో సొమ్మసిల్లెను.

6. వారు కష్టకాలమందు యెహోవాకు మొఱ్ఱపెట్టిరి ఆయన వారి ఆపదలలోనుండి వారిని విడిపించెను

7. వారొక నివాస పురము చేరునట్లు చక్కనిత్రోవను ఆయన వారిని నడిపించెను.

8. ఆయన కృపనుబట్టియు నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములనుబట్టియు వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు గాక

9. ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరచి యున్నాడు. ఆకలి గొనినవారి ప్రాణమును మేలుతో నింపి యున్నాడు.
లూకా 1:53

10. దేవుని ఆజ్ఞలకు లోబడక మహోన్నతుని తీర్మానమును తృణీకరించినందున

11. బాధ చేతను ఇనుప కట్లచేతను బంధింప బడినవారై చీకటిలోను మరణాంధకారములోను నివాసముచేయువారి హృదయమును

12. ఆయన ఆయాసముచేత క్రుంగజేసెను. వారు కూలియుండగా సహాయుడు లేకపోయెను.

13. కష్టకాలమందు వారు యెహోవాకు మొఱ్ఱపెట్టిరి ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను

14. వారి కట్లను తెంపివేసి చీకటిలోనుండియు మరణాంధకారములో నుండియు వారిని రప్పించెను.

15. ఆయన కృపనుబట్టియు నరులకు ఆయన చేయు ఆశ్చర్యకార్యములను బట్టియు వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు గాక.

16. ఏలయనగా ఆయన యిత్తడి తలుపులను పగులగొట్టి యున్నాడు ఇనుపగడియలను విరుగగొట్టియున్నాడు.

17. బుద్ధిహీనులు తమ దుష్టప్రవర్తనచేతను తమ దోషము చేతను బాధతెచ్చుకొందురు.

18. భోజనపదార్థములన్నియు వారి ప్రాణమునకు అసహ్య మగును వారు మరణద్వారములను సమీపించుదురు.

19. కష్టకాలమందు వారు యెహోవాకు మొఱ్ఱపెట్టిరి ఆయన వారి ఆపదలలోనుండి వారిని విడిపించెను.

20. ఆయన తన వాక్కును పంపి వారిని బాగుచేసెను ఆయన వారు పడిన గుంటలలోనుండి వారిని విడిపిం చెను.
అపో. కార్యములు 10:36, అపో. కార్యములు 13:26

21. ఆయన కృపనుబట్టియు నరులకు ఆయనచేయుఆశ్చర్య కార్యములనుబట్టియు వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు గాక.

22. వారు కృతజ్ఞతార్పణలు చెల్లించుదురుగాక ఉత్సాహధ్వనితో ఆయన కార్యములను ప్రకటించు దురుగాక.

23. ఓడలెక్కి సముద్రప్రయాణము చేయువారు మహాజలములమీద సంచరించుచు వ్యాపారముచేయు వారు

24. యెహోవా కార్యములను సముద్రములో ఆయన చేయు అద్భుతములను చూచిరి.

25. ఆయన సెలవియ్యగా తుపాను పుట్టెను అది దాని తరంగములను పైకెత్తెను

26. వారు ఆకాశమువరకు ఎక్కుచు అగాధమునకు దిగుచు నుండిరి శ్రమచేత వారి ప్రాణము కరిగిపోయెను.

27. మత్తులైనవారివలె వారు ముందుకు వెనుకకు దొర్లుచు ఇటు అటు తూలుచుండిరి వారు ఎటుతోచక యుండిరి.

28. శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొఱ్ఱపెట్టిరి ఆయన వారి ఆపదలలోనుండి వారిని విడిపించెను.

29. ఆయన తుపానును ఆపివేయగా దాని తరంగములు అణగిపోయెను.

30. అవి నిమ్మళమైనవని వారు సంతోషించిరి వారు కోరిన రేవునకు ఆయన వారిని నడిపించెను.

31. ఆయన కృపనుబట్టియు నరులకు ఆయనచేయు ఆశ్చర్య కార్యములనుబట్టియువారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు గాక.

32. జనసమాజములో వారాయనను ఘనపరచుదురుగాక పెద్దల సభలో ఆయనను కీర్తించుదురు గాక

33. దేశనివాసుల చెడుతనమునుబట్టి

34. ఆయన నదులను అడవిగాను నీటి బుగ్గలను ఎండిన నేలగాను సత్తువగల భూమిని చవిటిపఱ్ఱగాను మార్చెను.

35. అరణ్యమును నీటిమడుగుగాను ఎండిన నేలను నీటి ఊటల చోటుగాను ఆయన మార్చి

36. వారు అచ్చట నివాసపురము ఏర్పరచుకొనునట్లును పొలములో విత్తనములు చల్లి ద్రాక్షతోటలు నాటి

37. వాటివలన సస్యఫలసమృద్ధి పొందునట్లును ఆయన ఆకలికొనినవారిని అచ్చట కాపురముంచెను

38. మరియు ఆయన వారిని ఆశీర్వదింపగా వారు అధిక ముగా సంతానాభివృద్ధి నొందిరి ఆయన వారి పశువులను తగ్గిపోనియ్యలేదు

39. వారు బాధవలనను ఇబ్బందివలనను దుఃఖమువలనను తగ్గిపోయినప్పుడు

40. రాజులను తృణీకరించుచు త్రోవలేని యెడారిలో వారిని తిరుగులాడ జేయు వాడు.

41. అట్టి దరిద్రుల బాధను పొగొట్టి వారిని లేవనెత్తెను వాని వంశమును మందవలె వృద్ధిచేసెను.

42. యథార్థవంతులు దాని చూచి సంతోషించుదురు మోసగాండ్రందరును మౌనముగా నుందురు.

43. బుద్ధిమంతుడైనవాడు ఈ విషయములను ఆలోచించును యెహోవా కృపాతిశయములను జనులు తలపోయుదురుగాక.బైబిల్ అధ్యయనం - Study Bible
కీర్తన-107. విమోచించబడిన ప్రజలు తమను నిరాశ నుండి, ప్రమాదకరమైన పరిస్థితుల నుండి విడిపించినందుకు కృతజ్ఞతార్పణగా తమ దేవుని స్తుతించాలని ప్రోత్సహిస్తున్న కీర్తన. 

107:1-43 యెహోవాకు... కృతజ్ఞతా స్తుతులు చెల్లించుడి. ఆకలి దప్పికలు (వ.4-9), బానిసత్వం (వ.10-16), తీవ్ర అనారోగ్యం (వ.17-22), తుపానులు మొదలగు ప్రకృతి వైపరీత్యాలు (వ.23-32) వంటి కష్టాల్లో తన ప్రజలు తనకు ప్రార్థించినప్పుడు దేవుడు వారికి సహాయం చేసి ఆదుకుంటాడని కీర్తనకారుడు గుర్తుచేస్తున్నాడు. ఈ రోజుల్లో దురవస్థలు జీవితాలలో ప్రత్యేకంగా జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితులలో ఈ కీర్తన మన నమ్మకాన్ని బలపరచి ప్రోత్సహిస్తుంది. 

107:1 కృప (హెబ్రీ. ఫేసెద్) అనే పదం యెహోవా తన ప్రజల పక్షాన వ్యాజ్యెమాడడానికి మూలమైన ఆయన నిబంధనాపూర్వకమైన ప్రేమను రూఢిగా తెలియజేస్తుంది. 106:1 కూడా చూడండి. 

107:2 విమోచన అనే భావన (హెబ్రీ. గాల్ -విడిపించు) శత్రువు మీద యెహోవా పగతీర్చుకొనడాన్ని (ప్రతిహత్య) తెలియజేస్తుంది. ఈ భావనకు మూలం లేవీయ న్యాయవిధులలో ఉంది. (సంఖ్యా 35:12,19-27; ద్వితీ 19:6-12). 

107:3 ఈ వచనం ఇశ్రాయేలీయులు చెర నుండి తిరిగి రావడాన్ని సూచిస్తుంది (యెషయా 42:10-13; 43:5-7). 

107:4 అరణ్యమందలి అనే పదం సాధారణంగా ఐగుప్తు నుండి నిర్గమం తర్వాత ఇశ్రాయేలీయుల సంచారాల్ని ఈ పదం సూచిస్తుంది. అయితే ఈ సందర్భంలో ఇది ఇశ్రాయేలీయులు బబులోను చెరనుండి తిరిగి వచ్చే మార్గంలో సిరియా-అరేబియా ఎడారి ప్రాంతంలో వారి ప్రయాణాల్ని సూచిస్తున్నది. ఇశ్రాయేలీయులు తమను చెరలోకి తీసుకొని వెళ్లినవారి సంస్కృతిలో అక్కడి జనజీవనశైలిలో ఇమడలేకపోయారు, ఏదో ఒక సమయంలో యెహోవా తమను విడిపిస్తాడని వారు నిరీక్షించారు. 

107:5 శారీరక ఆకలిదప్పులనేవి సాధారణమైన భావమైనా, ఒక క్రమపద్ధతిలో దైవారాధన లేకపోవడాన్ని దేవుని కోసం ప్రజలు ఏదీ చేయకపోవడాన్ని కూడా ఇది సూచిస్తుంది (ఆమోసు 8:11). 

107:6 వారు కష్ట కాలమందు యెహోవాకు మొట్ట పెట్టిరి అనే వాక్యం ఈ కీర్తనలో నాలుగుసార్లు కనిపిస్తుంది. ఆ నాలుగుసార్లూ ఈ మాటల వెంటనే కీర్తనకారుడు “ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను” అని చెప్పాడు .(వ.6; 13,19,28). తన పిల్లలు విధేయతతో, అమాయకమైన నమ్మకంతో తనకు మొర్రపెట్టాలని కోరి వారి స్వశక్తి గానీ, ఏ మానవమాత్రుడు గానీ సహాయం చేయలేని పరిస్థితులను దేవుడు తరచుగా సృష్టిస్తాడు. 

107:7 యెహోవా తన ప్రజల్ని వారి స్వదేశానికి నడిపించడాన్ని కీర్తనకారుడు మనోదృష్టితో వీక్షిస్తున్నాడు (యెషయా 35:8-10; 40:9-11; 42:10-12; 49:5,9-12,22-24; 52:7-12; 59:9-12). 

107:8 ఇదే వ.15,21,31 లలో పునరావృతమవుతుంది. రక్షణ, సాక్ష్యానికి స్తుతికి నడిపించాలి (22:22-24 నోట్సు చూడండి). ఇశ్రాయేలు పక్షాన దేవుడు చేసిన ఆశ్చర్య కార్యములన్నీ అంతిమంగా క్రీస్తు ద్వారా సర్వమానవాళికి మేలు కలిగించాయి. 

107:10-14 బాధచేతను కట్లచేతను. బంధింపబడినవారై చీకటిలోను మరణాంధకారములోను - ఈ మాటలు సామాజిక సంబంధాలేవీ లేకుండా తృణీకరించబడిన వారి దారుణస్థితిని తెలియజేస్తున్నాయి. అయితే ఆ ప్రజలు పశ్చాత్తాపపడినప్పుడు, ఆయన వారిని విడిపించెను (యెషయా 42:6-7; 58:6; యిర్మీయా 30:8 చూడండి). కాగా మనం మహా దురవస్థ అనుభవిస్తూ దేవుడు మనకు తీర్పు తీరుస్తున్నాడని తెలిసినా ఆయన కృపలో నమ్మకముంచి క్షమాపణ, సహాయం కోసం ఆయనకు మొర్రపెట్టాలి. 

107:15 నరులకు అనే పదం మనుషులందరికీ (హెబ్రీ. ఆదాం) అనే అర్థాన్నిస్తుంది. వ.8 నోట్సు చూడండి. 

107:17-18 ఈ వచనాలు దుష్టనడవడి (అవిధేయత), దోషక్రియల కారణంగా నానాటికీ బలహీనపర్చే రోగాలతో బాధపడేవారి దారుణస్థితిని సంగ్రహంగా తెలియజేస్తున్నాయి.

107:21-22 వ.8 నోట్సు చూడండి. 

107:23-32 ఇశ్రాయేలీయుల నౌకాయానాల గురించి పాత నిబంధన పెద్దగా వివరించ లేదు. వ్యాపారాల నిమిత్తం సముద్ర ప్రయాణాల ప్రస్తావన అరుదుగా కనబడుతుంది (ఆది 49:13; 2దిన 9:20; 20:36). 

107:23-26 ఈ విభాగంలో పదజాలంలోని స్వరలయలు సముద్ర తరంగాల కదలికల్ని పోలి ఉన్నాయి. భీకరమైన సముద్రాల మీద యెహోవా తన సర్వాధిపత్యాన్ని చూపిస్తున్నాడు (యోబు 38:8-11; యోనా 1:4-16; మత్తయి 8:26-27). దేవుని శక్తిమంతమైన వాక్కుకు అన్నీ లోబడతాయి (యోబు 37:6-13; కీర్తన 147:15-20; యెషయా 40:6-8; 55:8-11).

107:27 నావికుల చర్యలు మత్తులైనవారి చర్యల్లాగా ఉన్నాయి (సామె 23:29-35). తూలిపోవు అనే మాటకు వాడిన హెబ్రీ పదం సాధారణంగా వేడుకను, నృత్యాన్ని సూచిస్తుంది. వారు ఎటుతోచక యుండిరి అంటే వారు విచక్షణ కోల్పోయారు అని అక్షరార్థం.

107:29-30 వ.23-28 లలో ఆపదలలో ఉన్నవారిని యెహోవా ఒడ్డుకు చేర్చడాన్ని కీర్తనకారుడు గుర్తుచేస్తున్నాడు. 

107:33-35 బబులోను చెరలో ఉన్న అనేకులు అదే సౌకర్యవంతమైన ప్రాంతమని తలంచి యూదాకు తిరిగి రావడానికి సుముఖత చూపక పోవడం వలన, కీర్తనకారుడు యూదావారిని యెరూషలేముకు తిరిగి రావడానికి ప్రోత్సహించే ప్రయత్నంలో, దేవుడు భూమ్మీద ఉన్న సహజవనరుల్ని తారుమారు చేయగలడని గుర్తుచేస్తున్నాడు. బబులోను నదులను ఎండిపోజేయగలడు, యూదా ప్రాంతంలోని ఎండిన నేలను నీటివనరులతో నింపగలడు (యెషయా 41:17-18). 

107:36-38 ఆకలిదప్పులు అంతర్ధానం కావడం తిరగబడిన వ.4-5,7 లోని పరిస్థితిని సూచిస్తుంది. క్షుద్భాద ననుభవించినవారు పాడిపంటలతో సమృద్ధి గలవారయ్యారు. 

107:39-41 వ్యత్యాసమేమిటంటే, బాధ ఇబ్బంది, దుఃఖం అనుభవించిన వారు సమృద్ధి ననుభవిస్తారు. ఇతరుల్ని దురవస్థలకు గురిచేసినవారు ఆశాభంగం చెందుతారు (7:14-16; యోబు 12:21,24). 

107:42 మోసగాండ్రందరును మౌనముగా నుందురు - యోబు 5:16 చూడండి. 

107:43 యెహోవాలోని నిబంధనా పూర్వకమైన విశ్వాస్యతను మనసులోకి తెచ్చుకోవాలనే జ్ఞానవచనంతో ఈ కీర్తన ముగుస్తుంది. 


Shortcut Links
కీర్తనల గ్రంథము - Psalms : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | 67 | 68 | 69 | 70 | 71 | 72 | 73 | 74 | 75 | 76 | 77 | 78 | 79 | 80 | 81 | 82 | 83 | 84 | 85 | 86 | 87 | 88 | 89 | 90 | 91 | 92 | 93 | 94 | 95 | 96 | 97 | 98 | 99 | 100 | 101 | 102 | 103 | 104 | 105 | 106 | 107 | 108 | 109 | 110 | 111 | 112 | 113 | 114 | 115 | 116 | 117 | 118 | 119 | 120 | 121 | 122 | 123 | 124 | 125 | 126 | 127 | 128 | 129 | 130 | 131 | 132 | 133 | 134 | 135 | 136 | 137 | 138 | 139 | 140 | 141 | 142 | 143 | 144 | 145 | 146 | 147 | 148 | 149 | 150 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary |