11:1-3 అన్యజనులును దేవుని వాక్యమంగీకరించిన విషయం చాలా వివాదాస్పదమైన విషయం కాబట్టి ఆ వార్త వేగంగా వ్యాపించింది. సున్నతి పొందిన యూదులు పేతురు దేవుని నియమాలతో రాజీపడ్డాడని భావించారు. ఆది సంఘంలో ఇది మరలా మరలా కలహాలకు కారణమైన విషయం. కానీ దేవుని దర్శనం నుండి నేర్చుకున్న పేతురు, సున్నతి పొందని అన్యజనులను చేర్చుకోవడానికి వ్యతిరేకంగా వాదించేవారిని సరిచేశాడు (వ.4-18).
11:4-13 కొర్నేలీకి సంబంధించిన సంభవాలన్నిటినీ పేతురు వారితో మళ్ళీ చెప్పాడు.
11:14-17 పెంతెకొస్తు సంఘటన, అలాగే కొర్నేలీ కుటుంబంలో జరిగిన సంఘటనలలోని పోలిక, దేవుడు విశ్వాసులైన యూదులకు, అన్యజనులకు ఒకే వరాలను ఇస్తున్నాడని నిరూపించింది. దీని వెలుగులో దేవుని అడ్డగించుటకు నేను ఏపాటివాడను? అని పేతురు సరిగ్గానే ప్రశ్నించాడు.
11:18 వారు... అడ్డము చెప్పక అనేది ముందు జాగ్రత్తను సూచిస్తుంది. ఈ యూదులైన విశ్వాసులు పేతురుకు యొప్పేలో, తరువాత కైసరయలో (10:9-16,44-48) కలిగిన - ఆశ్చర్యకరమైన - ప్రత్యక్షతలను అర్థం చేసుకోవాల్సివుంది. ఏమైతేనేం, చివరికి ఆయన చేసినదాన్ని బట్టి వారు దేవుని మహిమపరచిరి.
11:19 క్రైస్తవ పరిచర్య యూదయకు సుదూరంగా ఉన్న ఫెనీకే, కుప్ర, అంతియొకయ మొదలైన ప్రదేశాల వరకు విస్తరించడం కొనసాగింది.
11:20-21 అంతియొకయ సువార్తీకరణ కుప్ర, కురేనీయ విశ్వాసుల ద్వారా జరిగింది. ఫలితంగా అంతియొకయ అన్యజనులకు సువార్త ప్రకటన చేసే కేంద్రంగా మారి, పౌలును అతని మిషనరీ యాత్రలకు పంపిన సంఘమైంది (అధ్యా, 13 నుండి చూడండి).
11:22-24 బర్నబాకున్న ఆత్మీయ లక్షణాల గురించి యెరూషలేము సంఘానికి తెలుసు (4:36-37; 9:27). అతన్ని వారు అంతియొకయకు పంపడంలో ఆశ్చర్యమేమీ లేదు. అక్కడ మారుమనస్సు పొందుతున్నవారిలోని యథార్థతను ఖచ్చితంగా తెలుసుకొని, వారు ప్రభువును స్థిరహృదయముతో హత్తుకొనలెనని ప్రోత్సహించడానికి అతన్ని పంపివుంటారు.
11:25 అంతియొకయలో సువార్తీకరణ ముందుకు సాగుతుండగా, త్వరలో పౌలుగా మారబోయే సౌలు కనుమరుగయ్యాడు. మరొకసారి బర్నబా పౌలును పరిచర్యలో చేర్చడంలో ముఖ్యపాత్ర పోషించాడు (9:27 నోట్సు చూడండి), తార్సు గురించి, 9:28-30 నోట్సు చూడండి.
11:26 క్రైస్తవులు అనే పదం, అంతియొకయలో యేసును అనుసరించేవారిని “చిన్న క్రీస్తు"లు అని రోమీయులు ముద్రవేయడంతో వచ్చినదై ఉంటుంది. అది వారిని అవమానించే ఉద్దేశంతో ఇవ్వబడినా, అది శిష్యులను క్రీస్తును పోలిన జీవితాలు జీవిస్తున్నట్లుగా సూచిస్తున్నందున వారికి నిజానికి ఘనతగా మారిపోయింది.
11:27-28 అగబు యెరూషలేము నుండి వచ్చిన ప్రవక్త. ఇతడు మరలా 21:10లో కనిపిస్తాడు. కౌదియ పరిపాలన (క్రీ. శ. 41-54)లో రోమా సామ్రాజ్యంలో అనేక చోట్ల అనేక కరువులు కలిగినట్లు గుర్తించబడింది. సుమారుగా క్రీ.శ. 46-47 కాలంలో కరువు సంభవించినప్పటికీ, దాని ప్రభావం అది జరిగిన తరువాత అనేక సంవత్సరాలు ఉంది.
11:29 అంతియొకయలోని సంఘం యూదయలోని విశ్వాసులకు సహాయం పంపాలని నిర్ణయించుకుంది. అలా చేయడం ద్వారా అంతియొకయ, మిగిలిన ప్రాంతాలకు మొదటిగా సువార్త తెచ్చిన సంఘాలకు, విశ్వాసులకు వారు తిరిగి ఇచ్చినట్లయింది.
11:30 ఈ ఆరంభ సమయంలో ఆది సంఘం పరిశుద్దాత్మ మీద ఆధారపడి, పెద్దలు, డీకన్లు అనే పదవులు లేకుండా, సరియైన నిర్వహణ లేనిదిగా ఉందని కొందరు అభ్యంతరపడతారు. అయితే సంఘ ఆరంభస్థాయిలో కూడా అధికారిక పదవులు ఉండేవని కావలిసినన్ని ఆధారాలు ఉన్నాయి (14:23; 15:2,4,6,22-23; 16:4; 20:17; 21:18; ఫిలిప్పీ 1:1; 1తిమోతి 3:113; 4:14; 5:17,19; తీతు 1:5-9). ఆది సంఘం పరిశుద్దాత్మతో నింపబడడానికి, వేర్వేరు బాధ్యతలకోసం నాయకులు నియమించబడడానికి మధ్య ఏమాత్రం వైరుధ్యం లేదు. పౌలు పరిచర్య. అలాంటి సమతుల్యతతో కూడినదిగా ఉంది.