Luke - లూకా సువార్త 4 | View All

1. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యొర్దాను నది నుండి తిరిగి వచ్చి, నలువది దినములు ఆత్మచేత అరణ్యములో నడిపింప బడి

2. అపవాదిచేత శోధింపబడుచుండెను. ఆ దినములలో ఆయన ఏమియు తినలేదు. అవి తీరిన తరువాత ఆయన ఆకలిగొనగా

3. అపవాది నీవు దేవుని కుమారుడవైతే, రొట్టె అగునట్లు ఈ రాతితో చెప్పుమని ఆయనతో చెప్పెను

4. అందుకు యేసు మనుష్యుడు రొట్టెవలన మాత్రమే జీవించడు అని వ్రాయబడియున్నదని వానికి ప్రత్యుత్తరమిచ్చెను.
ద్వితీయోపదేశకాండము 8:3

5. అప్పుడు అపవాది ఆయనను తీసికొనిపోయి, భూలోక రాజ్యములన్నిటిని ఒక నిమిషములో ఆయనకు చూపించి

6. ఈ అధికారమంతయు, ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును; అది నాకప్పగింపబడియున్నది, అదెవనికి నేను ఇయ్యగోరుదునో వానికిత్తును;

7. కాబట్టి నీవు నాకు మ్రొక్కితివా యిదంతయు నీదగునని ఆయనతో చెప్పెను.

8. అందుకు యేసు నీ దేవుడైన ప్రభువునకు మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను అని వ్రాయబడియున్నదని వానికి ప్రత్యుత్తర మిచ్చెను.
ద్వితీయోపదేశకాండము 6:13

9. పిమ్మట ఆయనను యెరూషలేమునకు తీసికొనిపోయి, దేవాలయ శిఖరమున ఆయనను నిలువబెట్టినీవు దేవుని కుమారుడవైతే ఇక్కడనుండి క్రిందికి దుముకుము

10. నిన్ను కాపాడుటకు నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును.
కీర్తనల గ్రంథము 91:11-12

11. నీ పాదమెప్పుడైనను రాతికి తగులకుండ వారు నిన్ను చేతులతో ఎత్తికొందురు అని వ్రాయబడియున్నదని ఆయనతో చెప్పెను.
కీర్తనల గ్రంథము 91:11-12

12. అందుకు యేసు నీ దేవుడైన ప్రభువును శోధింపవలదు అని చెప్పబడియున్నదని వానికి ప్రత్యుత్తరమిచ్చెను.
ద్వితీయోపదేశకాండము 6:16

13. అపవాది ప్రతి శోధనను ముగించి, కొంతకాలము ఆయనను విడిచిపోయెను.

14. అప్పుడు యేసు, ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్లెను; ఆయననుగూర్చిన సమాచారము ఆ ప్రదేశమందంతట వ్యాపించెను.

15. ఆయన అందరిచేత ఘనతనొంది, వారి సమాజమందిరములలో బోధించుచు వచ్చెను.

16. తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. తన వాడుక చొప్పున విశ్రాంతిదినమందు సమాజమందిరము లోనికి వెళ్లి, చదువుటకై నిలుచుండగా

17. ప్రవక్తయైన యెషయా గ్రంథము ఆయన చేతి కియ్యబడెను; ఆయన గ్రంథము విప్పగా -

18. ప్రభువు ఆత్మ నామీద ఉన్నది బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డివారికి చూపును, (కలుగునని) ప్రకటించుటకును నలిగినవారిని విడిపించుటకును
యెషయా 58:6, యెషయా 61:1-2

19. ప్రభువు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపియున్నాడు. అని వ్రాయబడిన చోటు ఆయనకు దొరకెను.
యెషయా 58:6, యెషయా 61:1-2

20. ఆయన గ్రంథము చుట్టి పరిచారకునికిచ్చి కూర్చుండెను.

21. సమాజ మందిరములో నున్నవారందరు ఆయనను తేరిచూడగా, ఆయననేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినదని వారితో చెప్పసాగెను.

22. అప్పుడందరును ఆయననుగూర్చి సాక్ష్యమిచ్చుచు, ఆయన నోటనుండి వచ్చిన దయగల మాటల కాశ్చర్యపడి ఈయన యోసేపు కుమారుడు కాడా? అని చెప్పుకొనుచుండగా
కీర్తనల గ్రంథము 45:2, యెషయా 52:14

23. ఆయన వారిని చూచివైద్యుడా, నిన్ను నీవే స్వస్థపరచుకొనుము అను సామెత చెప్పి, కపెర్నహూములో ఏ కార్యములు నీవు చేసితివని మేము వింటిమో, ఆ కార్యములు ఈ నీ స్వదేశమందును చేయుమని మీరు నాతో నిశ్చయముగా చెప్పుదురనెను.

24. మరియు ఆయనఏ ప్రవక్తయు స్వదేశ మందు హితుడుకాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.

25. ఏలీయా దినములయందు మూడేండ్ల ఆరు నెలలు ఆకాశము మూయబడి దేశమందంతటను గొప్ప కరవు సంభవించినప్పుడు, ఇశ్రాయేలులో అనేకమంది విధవరాండ్రుండినను,
1 రాజులు 17:1, 1 రాజులు 18:1

26. ఏలీయా సీదోనులోని సారెపతు అను ఊరిలో ఉన్న యొక విధవరాలియొద్దకే గాని మరి ఎవరి యొద్దకును పంపబడలేదు.
1 రాజులు 17:9

27. మరియు ప్రవక్తయైన ఎలీషా కాలమందు ఇశ్రాయేలులో అనేక కుష్ఠరోగులుండినను, సిరియ దేశస్థుడైన నయమాను తప్ప మరి ఎవడును శుద్ధి నొందలేదని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.
2 రాజులు 5:1-14

28. సమాజమందిరములో ఉన్నవారందరు ఆ మాటలు విని

29. ఆగ్రహముతో నిండుకొని, లేచి ఆయనను పట్టణములో నుండి వెళ్లగొట్టి, ఆయనను తలక్రిందుగా పడద్రోయవలెనని తమ పట్టణము కట్టబడిన కొండపేటువరకు ఆయనను తీసికొని పోయిరి.

30. అయితే ఆయన వారి మధ్యనుండి దాటి తన మార్గమున వెళ్లిపోయెను.

31. అప్పుడాయన గలిలయలోని కపెర్నహూము పట్టణము నకు వచ్చి, విశ్రాంతిదినమున వారికి బోధించు చుండెను.

32. ఆయన వాక్యము అధికారముతో కూడినదై యుండెను గనుక వారాయన బోధకు ఆశ్చర్యపడిరి.

33. ఆ సమాజ మందిరములో అపవిత్రమైన దయ్యపు ఆత్మపట్టిన వాడొక డుండెను.

34. వాడునజరేయుడవైన యేసూ, మాతో నీకేమి? మమ్ము నశింపజేయ వచ్చితివా? నీ వెవడవో నేనెరుగుదును; నీవు దేవుని పరిశుద్ధుడవని బిగ్గరగా కేకలు వేసెను.

35. అందుకు యేసు ఊరకుండుము, ఇతనిని వదలి పొమ్మని దానిని గద్దింపగా, దయ్యము వానిని వారిమధ్యను పడద్రోసి వానికి ఏ హానియు చేయక వదలి పోయెను.

36. అందు కందరు విస్మయమొంది ఇది ఎట్టి మాట? ఈయన అధికారముతోను బలముతోను అపవిత్రాత్మలకు ఆజ్ఞా పింపగానే అవి వదలిపోవుచున్నవని యొకనితో నొకడు చెప్పుకొనిరి.
యెషయా 52:14

37. అంతట ఆయననుగూర్చిన సమాచారము ఆ ప్రాంతములందంతటను వ్యాపించెను.

38. ఆయన సమాజమందిరములోనుండి లేచి, సీమోను ఇంటిలోనికి వెళ్లెను. సీమోను అత్త తీవ్రమైన జ్వరముతో పడియుండెను గనుక ఆమె విషయమై ఆయనయొద్ద మనవి చేసికొనిరి.

39. ఆయన ఆమె చెంతను నిలువబడి, జ్వరమును గద్దింపగానే అది ఆమెను విడిచెను; వెంటనే ఆమె లేచి వారికి ఉపచారము చేయసాగెను.

40. సూర్యుడస్తమించుచుండగా నానావిధ రోగములచేత పీడింపబడుచున్నవారు ఎవరెవరియొద్దనుండిరో వారందరు ఆ రోగులను ఆయనయొద్దకు తీసికొని వచ్చిరి; అప్పుడాయన వారిలో ప్రతివానిమీద చేతులుంచి, వారిని స్వస్థపరచెను.

41. ఇంతేకాక దయ్యములునీవు దేవుని కుమారుడవని కేకలు వేసి అనేకులను వదలిపోయెను; ఆయన క్రీస్తు అని వాటికి తెలిసియుండెను గనుక ఆయన వాటిని గద్దించి వాటిని మాటాడనీయలేదు.

42. ఉదయమైనప్పుడు ఆయన బయలుదేరి అరణ్య ప్రదేశ మునకు వెళ్లెను. జనసమూహము ఆయనను వెదకుచు ఆయనయొద్దకు వచ్చి, తమ్మును విడిచి పోకుండ ఆపగా

43. ఆయననేనితర పట్టణములలోను దేవుని రాజ్యసువార్తను ప్రకటింపవలెను; ఇందునిమిత్తమే నేను పంపబడితినని వారితో చెప్పెను.

44. తరువాత ఆయన యూదయ సమాజమందిరములలో ప్రకటించుచుండెను.బైబిల్ అధ్యయనం - Study Bible
4:1-2 యోహానుచేత బాప్తిస్మం పొంది తిరిగి వచ్చినప్పుడు (3:21-22 నోట్సు చూడండి), యేసు పరిశుద్దాత్మ పూర్ణుడై... అరణ్యములో... అపవాదిచేత శోధించబడడానికి ఆత్మచేత నడిపించబడ్డాడు. ఇక్కడ పరిశుద్ధాత్మ పాత్ర చాలా ముఖ్యమైంది. దానికి కనీసం 3 కారణాలున్నాయి: (1) యేసుకు అపవాదితో ముఖాముఖి అనుభవాన్ని దేవుడే నియమించాడని యేసును అరణ్యానికి నడిపించడంలో పరిశుద్ధాత్మ పాత్ర చూపిస్తుంది. (2) లూకా తన సువార్తలో పరిశుద్ధాత్మ కార్యాలను పదేపదే ప్రస్తావించడం ద్వారా పరిశుద్ధాత్మ గురించి నొక్కి చెప్పాడు. (3) యేసు జీవితంలో పరిశుద్దాత్మ జోక్యం యేసు నిజమైన మానవత్వాన్ని స్పష్టంగా వెల్లడిచేస్తుంది. ఆత్మనింపుదల (ఎఫెసీ 5:18), ఆత్మ నడిపింపు (గలతీ 5:18) అనేవి క్రైస్తవ జీవితంలో శక్తి పొందడంలో కీలకాంశాలు. దేవునిముందు విశ్వాస పరీక్షలో ఇశ్రాయేలు అరణ్యంలోనే విఫలమయ్యింది. (సంఖ్యా 14). ఇశ్రాయేలు సఫలం కాలేని అరణ్య పరీక్షలో యేసు సఫలమయ్యాడు. అంతేకాదు, మొదటి ఆదాము విఫలమయ్యాడు. కడపటి ఆదాముగా యేసు పరీక్షించబడి (1కొరింథీ 15:45) సఫలీకృతుడయ్యాడు. 

4:3-4 యేసు భౌతికంగా బలహీనంగా అనగా ఆకలిగా ఉన్నప్పుడు, రొట్టె అగునట్లు ఈ రాతితో చెప్పమని (వ.3) సాతాను ఆయనను పరీక్షించాడు. నీవు దేవుని కుమారుడవైతే అనే మాట యేసు దైవత్వం పట్ల సందేహాన్ని వ్యక్తం చేయట్లేదు. నిజానికి “నీవు దేవుని కుమారునివి కాబట్టి" అని దీన్ని అర్ధం చేసుకోవాలి. యేసుకున్న విపరీతమైన ఆకలి తీర్చుకోవడానికి తన దైవశక్తిని ఉపయోగించుకోమని ఆయనకు సాతాను గాలం వేయడానికి ప్రయత్నించాడు. దేవుని నుండి వచ్చే విడుదల, శక్తి కోసం ఎదురుచూసే పరిపూర్ణ విధేయుడైన నరునిలా బాధను అనుభవిస్తూ ఓపికతో ఆ కష్టాన్ని సహించడం యేసు కర్తవ్యం (వ.1). లిఖితపూర్వకమైన దేవుని వాక్యాన్ని ప్రస్తావించి యేసు జవాబు చెప్పాడు (ద్వితీ 8:3). ఇశ్రాయేలు 40 ఏళ్లు అరణ్యయాత్రలో ఉన్నప్పుడు భౌతికంగా మన్నా ద్వారా, ఆధ్యాత్మికంగా దేవుని సన్నిధి ద్వారా, దేవుని వాక్యం ద్వారా వారి అవసరాలు తీరిన సందర్భంలోనుంచి యేసు ఈ వచనాన్ని తీసుకున్నాడు. 4:5-12 మత్తయి 4, లూకా 4 అధ్యాయాల్లో రెండవ, మూడవ శోధనల క్రమం తారుమారయ్యింది. తన సువార్తలో, యెరూషలేములో దేవాలయ శిఖరంపైన మూడవ శోధన జరిగినట్లు గ్రంథస్తం చేసి యేసు యెరూషలేముకు పయనిస్తున్నాడని చూపించడమే లూకా ఇలా రాయడానికి ముఖ్యమైన కారణమయ్యుంటుంది. 

4:5-8 ఈ యుగాంతంలో భూలోకరాజ్యములన్నిటి పైన యేసు మెస్సీయగా పరిపాలిస్తాడు. (ప్రక 11:15 చూడండి). ఆ ప్రపంచవ్యాప్తమైన అధికారాన్ని అడ్డదారిలో చేజిక్కించుకోమని అపవాది యేసును శోధించడానికి ప్రయత్నిం చాడు. సాతానును లోకాధికారి అని పిలవడం నిజమే (యోహాను 12:31) అయినా లోకం తనకు అప్పగించబడి యున్నది అనీ తాను దాన్ని ఎవనికి ఇయ్యగోరుదునో వానికి ఇచ్చే అధికారం ఉందని సాతాను అనడంలో నిజం లేదు. దేవుని పరిపాలనను అపవాది దురాక్రమణ చేసుకున్నాడు. ఇక్కడ వాడు సత్యాన్ని చెప్పకపోవడం ఆశ్చర్యపోయే విషయమేమీ కాదు. ఎందుకంటే వాడు “అబద్ధికుడు, అబద్దములకు జనకుడు” (యోహాను 8:44), పది ఆజ్ఞల్లో (నిర్గమ 20:3) మొదటి ఆజ్ఞను ప్రతిధ్వనించే విధంగా "కేవలం దేవుడు మాత్రమే ఆరాధనకు యోగ్యుడు” అనే విషయాన్ని ద్వితీ 6:13 పేర్కొంటూ యేసు స్పష్టం చేశాడు. 

4:9-12 రెండు పరీక్షల్లో విఫలమైన తర్వాత (వ.3-8), లేఖనాన్ని పేర్కొని యేసును ఇరికించాలని అపవాది ప్రయత్నించాడు. ఆ దేవాలయ శిఖరము నేలకు వంద అడుగులకంటే ఎక్కువ ఎత్తులో ఉంటుంది. యేసును ఆ శిఖరంనుండి క్రిందికి దుముకుమని సాతాను సవాలు చేశాడు. యేసు అలా దూకితే దేవదూతలు వచ్చి ఆయనను కాపాడతారని సాతాను కీర్తన 91:11,12 వచనాలను ప్రస్తావించాడు. అపవాది ప్రస్తావించిన లేఖన సత్యాన్ని యేసు తృణీకరించలేదు. కానీ, వాడు వక్రీకరించి చేయమని చెప్పినదాన్ని ఆయన తృణీకరించాడు. దానికి పూర్తి భిన్నంగా ద్వితీ 6:16ని ఆయన ప్రస్తావించాడు. మెరీబా, మస్సాల దగ్గర దేవునికి విరోధంగా ఇశ్రాయేలు చేసిన సణుగులనూ, దేవునికి వాళ్లు పెట్టిన పరీక్షనూ, దాని మూలంగా కలిగిన విషాదాన్ని ఈ వచనం గుర్తుచేస్తుంది (నిర్గమ 17:1-7). 

4:13 మత్తయి 4, లూకా 4 అధ్యాయాల్లో కేవలం 3 పరీక్షలు మాత్రమే నమోదు చేయబడ్డాయి. ప్రతి శోధన అనే మాట ఇంకా చాలాసార్లు యేసు శోధించబడ్డాడు అనే విషయాన్ని సూచిస్తుంది. అపవాదిని ఈసారికి యేసు అడ్డుకున్నాడు. మరొకసారి ఆయనను శోధించడానికి వాడు యేసును విడిచిపోయెను (గ్రీకు. "కైరోస్" అంటే అవకాశం, సందర్భం వచ్చే కాలం వరకు). 

4:14-15 అపవాది సంధించిన ప్రతీ శోధన బాణాన్నీ యేసు ఆత్మ శక్తితోనే అడ్డుకున్నాడు (వ.1,2 నోట్సు చూడండి). సమాజ మందిరములలో ఆయన బోధించుచు ఉండగా కూడా అదే శక్తి ఉంది. అందరు నమ్మడానికి తొలుత అంగీకరించే మనస్సును అనుగ్రహించింది ఆ శక్తే. 

4:16-17 యేసు బాల్య వయసు నుంచీ (2:39,51), 30 ఏళ్ల వయసులో తన బహిరంగ పరిచర్యను ప్రారంభించే వరకూ గలిలయలోని నజరేతులోనే జీవించాడు (పెరిగిన, -3:23 నోట్సు చూడండి). నజరేతులో తన కుటుంబంతో జీవించినపుడు విశ్రాంతి దినమున ఈ సమాజ మందిరములోనే ఆయన తరచూ ఆరాధించాడు. ఆనాడు సమాజ మందిరాల్లో జరిగే ఆరాధనా కార్యక్రమం వినికిడిలో ఉన్న సమాచారాన్ని బట్టి చూస్తే, విశ్రాంతి దినం రోజున సాధారణంగా మోషే ధర్మశాస్త్ర గ్రంథం (హెబ్రీ. తోరా) నుండి ముందుగానే నియమించబడిన భాగాన్ని చదువుతుంటారు. అదే సమయంలో ప్రవక్తల గ్రంథాల (హెబ్రీ. నబీమ్) నుంచి చదవడానికి ఎంపికైన వ్యక్తికి తాను కోరిన వాక్యభాగాన్ని చదివే స్వేచ్చ ఉంటుంది. యేసుకు యెషయా గ్రంథపు చుట్టను ఇచ్చినప్పుడు, దాన్ని విప్పి యెషయా 61:1 నుంచి చదవడం ప్రారంభించాడు. 

4:18 ప్రభువు ఆత్మ యేసుపై ఉన్నాడని గలిలయ ప్రాంతమంతటా ఆయన చేసిన పరిచర్య వెల్లడిచేసింది (వ.14). ఇశ్రాయేలుకు రాజుగా ఉండడానికి, చట్టబద్ధంగా మెస్సీయగా రాజుగా ఉండడానికి ఆయన అభిషేకించబడ్డాడు. అయితే ఇక్కడ (సువార్త ప్రకటించుటకై) ప్రవక్తగా అభిషేకం ఉంది. పాపానికి బందీలుగా ఉన్నవారికే యేసు తొలుత తన సందేశాన్ని ప్రకటించాడు. అయితే బీదలు... చెరలో ఉన్నవారు.. గ్రుడ్డివారు... నలిగినవారు అనే మాటలు పేదవారిపై, అణచివేతకు గురైనవారిపై లూకా దృష్టిసారించిన విషయాన్ని చూపిస్తున్నాయి. 

4:19-21 యెషయా 61:2 వచనంలో తొలి భాగాన్ని చదివి, రెండవ భాగాన్ని చదవకుండా, వాక్య పఠనాన్ని ముగించి కూర్చుండెను (లేఖన పఠన సమయంలో నిలబడి ఉంటారు; కూర్చుని బోధిస్తారు.. ప్రభువు హితవత్సరము ప్రకటించుట అనేచోట ఆయన లేఖన పఠనాన్ని ముగించాడు.
ఎందుకంటే మెస్సీయ పరిచర్యలో దేవుని కృపాకాలం వచ్చింది, ఆయన ఖచ్చితంగా బోధించిన సందేశం అదే! యెషయా 61:2వ వచనపు రెండవ భాగాన్ని చదవకుండా ఆపేశాడు. ఆ మాట ప్రభువు ప్రతిదండన గురించినది. ఇది క్రీస్తుని రెండవ రాకడ గురించి, లోకంపై ఆయన తీర్పు గురించి ప్రస్తావిస్తుంది. (ప్రక 19:11-21). అందువల్ల తన మొదటి రాకడలో నెరవేరిన ప్రవచన భాగాన్ని మాత్రమే చదివి (యెషయా 61:1-2) తీర్పు సమయంలో జరుగబోయే దాన్ని ఆయన చదవకుండా ముగించాడు.

4:22. సమాజమందిరంలో యేసుని సందేశానికి వచ్చిన తక్షణ స్పందన అనుకూలంగానే ఉంది, గలిలయలోనైతే ప్రతికూల స్పందన వచ్చింది (వ. 1415 నోట్సు చూడండి). అయితే వాళ్లకు యెషయా 61వ అధ్యాయం తెలుసు. యేసును యోసేపు కుమారుడుగా (3:23-38 నోట్సు చూడండి) వాళ్లు భావిస్తున్నారు. ఎంతోకాలంగా వారు ఎదురుచూస్తూ ఉన్న మెస్సీయను తానే అని ఈ యవ్వన ప్రసంగికుడు చెప్పడం ప్రజల్ని బహుగా కలవరపరచింది. 

4:23-24 కపెర్నహూములో యేసు చేసిన అద్భుతాల గురించి ఆయన స్వదేశమైన నజరేతులోని ప్రజలు విన్నారు. తాము కూడా ఆ అద్భుతాలను కళ్లతో స్వయంగా చూడాలని అనుకున్నారు. అయితే వాళ్లను ప్రేరేపించింది కేవలం వింత చూడాలనే ఆశే గాని ఆత్మసంబంధమైన ఆసక్తి కాదు. ప్రజలను అద్భుతాలు చేసి సంతృప్తి పరచడానికి బదులు, ప్రవక్త (4:18; యెషయా 61:1 చూడండి) తన స్వదేశమందు హితుడు కాడు అని యేసు చెప్పాడు. ఈ నియమం పాత నిబంధన కాలంలో తరచూ నిరూపించబడింది. 

4:25-27 ప్రవక్త తన సొంత ప్రజలచే తృణీకరించబడతాడు అనే మాటకు తొలి ఉదాహరణగా ఏలీయాను యేసు చూపిస్తున్నాడు. ఇశ్రాయేలులో మూడేండ్ల ఆరునెలలు కరువు వచ్చినప్పుడు ఏలీయాకు. ప్రజాదరణ లేనేలేదు. అప్పుడు గలిలయకు వాయవ్యంగా ఉన్న మధ్యధరా సముద్రతీర ప్రాంతంలోని ఫేనికయ దేశానికి చెందిన సారెవతు అనే అన్య పట్టణంలో అతడు ఆశ్రయం పొందవలసి వచ్చింది (1రాజులు 17:1-24), రెండవ ఉదాహరణ ప్రవక్తయైన ఎలీషా, తన కాలంలో ఇశ్రాయేలులో ఉన్న కుష్టురోగులందర్నీ దాటిపోయి, సిరియా దేశ సైన్యాధ్యక్షుడైన నయమానును మాత్రమే శుద్ధి చేశాడు (2రాజులు 7:1-19). 

4:28-30 యేసు చెప్పిన ఉదాహరణలు దేవుడు అన్యజనులను అంగీకరించి, ఇశ్రాయేలును తృణీకరించాడు అని అర్థమిచ్చే విధంగా ఉన్నాయి. అందువల్ల సమాజమందిరంలో ప్రజలు ఆగ్రహముతో నిండుకొని దొమ్మిగా కూడి వచ్చి ఆయనను కొండపై నుంచి తోసేద్దామని ఆయనను ఈడ్చుకుంటూ వెళ్లారు. అయితే యేసు వాళ్ల ప్రయత్నాలపై నీళ్లు చల్లాడు. వారి మధ్య నుండి నడుచుకుంటూ వచ్చేశాడు. ఈ వింతైన సంఘటన ఒక అద్భుతం. మరొక విధంగా చెప్పుకుంటే ప్రజలు ఎంత కోపంగా ఉన్నా తమకు తాముగానే ఆయన దారికి అడ్డు తప్పుకుని ఆయనను వెళ్ళనిచ్చేంత బలీయంగా ఆయన సన్నిధి ఉండి ఉంటుందని ఈ సంఘటన సూచిస్తుంది. 

4:31-32 విశ్రాంతి దినమున కపెర్నహూములో తన బోధ ద్వారా యేసు ప్రదర్శించిన అధికారము ఎలాంటిదో దాన్ని లూకా సమగ్రంగా చర్చించలేదు. ప్రాచీనకాలపు మతాధికారులు చేసిన ఉపదేశాలను యూదు బోధకులు తరచూ ప్రస్తావిస్తుండేవారు. వారి బోధల నుంచి కాక నేరుగా దేవుని దగ్గర నుంచి పొందిన సందేశాన్నే యేసు బోధించడం వల్ల ఆయన బోధ అధికారంతో కూడినదిగా ఉండేదని మనం గ్రహించవచ్చు. 

4:33-36 కపెర్నహూములో యేసు ప్రదర్శించిన అధికార ప్రభావానికి ఇదొక ఉదాహరణగా ఉంది. సమాజ మందిరములో ఉన్న ఒక వ్యక్తిలోని అపవిత్రమైన దయ్యపు ఆత్మను ఆయన వదిలించాడు. ఊరకుండుము, ఇతనిని వదిలిపొమ్మని ఒక్క గద్దింపుతో యేసు దీన్ని చేశాడు. యేసు గురించి ఆయన సందేశం గురించీ దురాత్మల ప్రపంచంపై ఆయనకున్న అధికారం గురించీ జనసమూహాలు ఆశ్చర్యపడ్డారు. అయితే యేసు దేవుని పరిశుద్దుడని అపవిత్రాత్మకు తెలుసు. యేసు గురించి పేతురు కూడా ఇదే మాట చెప్పాడు (యోహాను 6:69).

4:38-40 యేసు అధికారం భౌతిక అనారోగ్యానికి కూడా విస్తరించింది. దయ్యాన్ని గద్దించిన విధంగానే యేసు జ్వరమును కూడా గద్దింపగానే సీమోను పేతురు అత్త వెంటనే స్వస్థపడింది. ఫలితంగా, రోగంపై యేసుకున్న అధికారం గురించిన సమాచారం కపెర్నహూము అంతటా వ్యాపించింది. నానావిధ రోగములతో బాధపడుతున్న వ్యక్తులపై ఆయన తన చేతులుంచి వాళ్లందరినీ స్వస్థపరిచాడు. 

4:41 కపెర్నహూములో ఎంతోమంది ప్రజలకున్న భౌతిక రోగాలను ఆయన స్వస్థపరుస్తుండగా యేసు చాలా దయ్యములను కూడా వెళ్లగొట్టాడు. కొన్ని వ్యాధులకు కారణం దయ్యాలే అనడానికి ఇదొక బలమైన ఆధారంగా ఉంది. సమాజమందిరంలో అపవిత్రాత్మ పట్టిన వ్యక్తి (వ. 33-36) మాదిరిగా దయ్యాలు యేసును దేవునిగా గుర్తించాయి. యేసు తానెవరో బయలుపరచుకోడానికి ముందే ఆయనే క్రీస్తని వెల్లడి చేస్తూ ఆయనపై అధికారాన్ని ప్రదర్శించడానికి ప్రయత్నిస్తున్న దయ్యాలను యేసు గద్దించి వాటిని మాటలాడనీయలేదు. 

4:42-44 లూకా సువార్తలో దేవుని రాజ్యము గురించి 30 కంటే ఎక్కువసార్లు ప్రస్తావించబడింది. తొలిసారి జరిగిన ప్రస్తావన వ.43 లో ఉంది. దేవుని రాజ్యం అనే అంశంలో ఇమిడి ఉన్న విషయాలు: (1) రాజు (పరిపాలకుడు), (2) పరిపాలన (పరిపాలించడానికి సార్వభౌమాధికారం), (3) పరిపాలించబడుతున్న ప్రదేశం (ఈ లోకం) (4) పరిపాలించబడేవాళ్లు (యేసుక్రీస్తు సువార్తను నమ్మేవాళ్లు). సువార్త గ్రంథాల్లో కొన్ని వాక్యభాగాలు దేవుని రాజ్యం ఇప్పటికే వచ్చిందని చెబుతుండగా (మత్తయి 12:28), మరికొన్ని వాక్యభాగాలు. అది భవిష్యత్తులోనే వస్తుందని మాట్లాడుతున్నాయి (మత్తయి 6:10) 


Shortcut Links
లూకా - Luke : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary |