7:1 కపెర్నహూము గలిలయలో యేసు పరిచర్యకు ప్రధాన స్థావరం (4:14-9:50)
7:2-3 శతాధిపతి అంటే రోమీయ సైన్యంలో వందమంది పై అధికారి. ఈ శతాధిపతి దయార్ద్ర హృదయుడు. తన సేవకునికి వచ్చిన రోగం విషయం చింతిస్తున్నాడు. కొంతమంది స్థానిక యూదుల పెద్దల (వీళ్లు సమాజంలో గుర్తింపు పొందిన నాయకులు లేక గౌరవనీయులైన పెద్దలై ఉంటారు) ద్వారా అతడు యేసును సమీపించాడు. మత్తయి 8:5-10 ఈ వాక్యభాగానికి సమాంతరమైనది. అక్కడ శతాధిపతి యేసును నేరుగా కలుసుకున్నట్లు ఉంది.
7:4-8 శతాధిపతి నిజంగా యోగ్యుడు అని యూదు నాయకులు భావించారు కాబట్టి యేసును సంప్రదించడానికి వాళ్లు సమ్మతించారు. అతడు అన్యుడైనా ఇశ్రాయేలును ప్రేమించి, కపెర్నహూములో సమాజ మందిరము నిర్మాణానికి తన సమయాన్నీ ధనాన్ని వెచ్చించాడు. యేసు తన దగ్గరకు రావడానికి తగినంత యోగ్యత తనకు లేదని శతాధిపతి భావించాడు. యేసు తన దాసుని దూరం నుంచి కూడా స్వస్థపరచగలడని విశ్వసించాడు. తనకున్న సైనిక అధికారాన్ని అర్థం చేసుకున్న అతడు యేసుకున్న ఆధ్యాత్మిక అధికారాన్ని కూడా అర్థం చేసుకున్నాడు (నేను సహా అధికారమునకు లోబడినవాడను; నా చేతి క్రిందను సైనికులున్నారు).
7:9-10 ఇశ్రాయేలులో విశ్వాసం కలిగినవాళ్లు ఉన్నారు. అయితే అన్యజాతికి చెందిన శతాధిపతి విశ్వాసము వాళ్లందరి కంటే ఎంతో గొప్పగా ఉంది. అందుకే యేసు ఆశ్చర్యపడి శతాధిపతి విశ్వాసానికి తగిన ప్రతిఫలం అనుగ్రహించాడు. యేసు అతని సేవకుణ్ణి స్వస్థపరచగా అతడు స్వస్థుడై అతనికి మంచి ఆరోగ్యం కలిగింది.
7:11-12 యేసు పెరిగిన నజరేతుకు దక్షిణ దిశలో 6 మైళ్ల దూరంలో నాయీనను గ్రామం ఉంది. విధవరాలైన ఒకని తల్లికి ఉన్న ఒకే ఒక్క కుమారుడు మరణించడం వల్ల ఆర్థికంగా ఆమెకు సహాయపడే మార్గం ఏమీ లేకుండా పోయింది. ఆ మృతుడైన విధవరాలి కుమారుని సమాధి కార్యక్రమ సమయంలో యేసు రావడం దేవుని ప్రణాళికలో భాగమే.
7:13-15 యేసు ఆమె యెడల కనికరపడి మృతులలో నుండి ఆ విధవరాలి కుమారుణ్ణి బ్రతికించాడు. యూదుల సమాధి కార్యక్రమాల్లో తెరచి ఉన్న శవపేటిక(పాడె)లు ఉంటాయి. ఎవరైనా మృతదేహాన్ని తాకితే వారు అపవిత్రులవుతారు (సంఖ్యా 19:11). ఈ సువార్తలో యేసు మృతుల్లో నుండి లేపిన వారిలో ఇతడే ప్రథముడు (లూకా 8:40-56; యోహాను 11:38-44),
7:16-17 ఏలీయా (1రాజులు 17:17-24), ఎలీషా(2రాజులు 4:1837)లిద్దరూ చనిపోయిన వారిని బ్రతికించారు. గొప్ప ప్రవక్త బయలుదేరి యున్నాడనియు అనే మాట బహుశా ఏలీయా ఎలీషాలను ప్రస్తావిస్తూ ఉండవచ్చు. దేవుడు తన ప్రజలకు దర్శనమనుగ్రహించి యున్నాడు అంటే దేవుడు యేసు అనే వ్యక్తి రూపంలో వచ్చాడని ఆ సమయంలో ప్రజలు నమ్మారని అర్థం కాదు (యోహాను 1:14). దేవుని శక్తి తన ప్రజల మధ్య వెల్లడయ్యిందని దాని భావం. ఈ అద్భుతం గురించిన సమాచారం యూదయ ప్రాంతాలకు చేరిందనే వాస్తవం యేసు యెరూషలేముకు చేయబోయే ప్రయాణాన్ని ముందుగా చూస్తుంది (9:51-19:44).
7:18-20 బాప్తిస్మమిచ్చే యోహాను చెరసాలలో ఉన్నాడు కాబట్టి అతనికి ఈ సంగతులన్నియు చెప్పవలసి వచ్చింది. (3:20 నోట్సు చూడండి). యోహాను వేసిన ప్రశ్న అనుమానం నుంచి కాదు గానీ అది అయోమయం నుంచి వచ్చింది. ఒక ప్రక్కన యేసు కచ్చితంగా మెస్సీయ చేయాల్సిన కార్యాలు చేశాడు. మరొక పక్కన రోమా సామ్రాజ్యాన్ని కూల్చేసి, నీతిమంతులైన బందీలను విడుదల చేయాలనే యూదుల ఆశలకు అనుగుణంగా ఆయన పనిచేయలేదు. అందువల్ల తన అయోమయాన్ని తొలగించుకోవడానికి తన శిష్యులలో ఇద్దరిని పంపించి,
రాబోవువాడవు నీవేనా? అని యేసును అడిగించాడు.
7:21-23 బాప్తిస్మమిచ్చే యోహాను శిష్యులు అడిగిన ప్రశ్నకు యేసు స్పందిస్తూ, తన పరిచర్యలో చేస్తున్న అద్భుతాల సారాన్ని వ.21 ద్వారా వివరించాడు. మీరు కన్నవాటిని విన్నవాటిని యోహానుకు తెలుపుడి అని యేసు యోహాను శిష్యులకు చెప్పాడు. ఆయన ఆ సమయంలో చేసిన కార్యాలు మెస్సీయ గురించి యెషయా 61:1-2లో ఉన్న ప్రవచనానికి మించి ఉన్నాయి. (ఉదా: చనిపోయినవారు లేపబడుచున్నారు). ధన్యుడనే మాట 6:22ను తలపిస్తుంది.
7:24-28 బాప్తిస్మమిచ్చే యోహాను దూతలు నీ దగ్గరకు ఎందుకు వచ్చారు? అని జనసమూహాలు యేసును అడిగి ఉండవచ్చు. కాబట్టి యోహాను గురించి అతని పరిచర్య ప్రాధాన్యత గురించీ యేసు వివరించాడు. యోహాను సౌకర్యవంతమైన పరిస్థితుల్లో ఇమిడిపోలేదు, రాచరికానికీ, మితిమీరిన ఆడంబరాలకూ అతడు అలవాటు పడలేదు. అతడొక ప్రవక్త, దానికి మించి అతడు మెస్సీయకు ముందుగా నడిచేవాడు. (నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను; మలాకీ 3:1 చూడండి). ఆనాటి వరకు ఏ మనిషీ బాప్తిస్మమిచ్చు యోహాను కంటె గొప్పవాడు కాలేదు. అయితే, పెంతెకొస్తు దినంతో (అపొ.కా. 2) ప్రారంభమయ్యే కొత్త నిబంధన యుగంలో (దేవుని రాజ్యములో) ఒక సామాన్య క్రైస్తవుడు (అల్పుడైనవాడు) కూడా పరిశుద్ధాత్మను తనలో శాశ్వత నివాసిగా కలిగి ఉన్నందుకు బాప్తిస్మమిచ్చే యోహాను కంటే ఆత్మసంబంధంగా గొప్పవాడే.
7:29-30 మారుమనస్సు పొంది యోహానుచేత - బాప్తిస్మం పొందిన
వారందరూ {3:2-3 నోట్సు చూడండి) దేవుడు న్యాయవంతుడని (యేసుకు
ముందు వచ్చిన యోహాను సందేశాన్ని) గుర్తించారు. అయితే పరిసయ్యులును ధర్మశాస్రోపదేశకులును మారుమనస్సు పొందలేదు. యోహాను ఇచ్చిన బాప్తిస్మం తీసుకోడానికి తమనుతాము తగ్గించుకోలేదు. తద్వారా తమ రక్షణ విషయంలో దేవుని సంకల్పమును వారు తృణీకరించారు.
7:31-35 తన తరంలోని ప్రజలను సంతోషపెట్టడం అసాధ్యమని యేసు ప్రకటించాడు. వాళ్లు ఆనందగీతానికి (పిల్లనగ్రోవి) గానీ, ప్రలాప కీర్తనకు గానీ స్పందించరు. బాప్తిస్మమిచ్చే యోహాను అత్యంత కఠోరమైన జీవన విధానాన్ని అవలంబించాడు. అయితే అతనికి దయ్యము పట్టిందని వాళ్లు విమర్శించారు. దానికి భిన్నంగా పాపులతో తింటూ, వాళ్లతో స్నేహితునిగా ఉన్నందుకు యేసును తిండిపోతు... మద్యపాని అని నిందిస్తున్నారు.
7:35 బాప్తిస్మమిచ్చే యోహాను, యేసు చేసిన బోధలను అనుసరించి జీవించే వారి ద్వారా వారి బోధలు సరైనవిగా నిరూపించబడతాయి అనేది జ్ఞానము జ్ఞానమని దాని సంబంధులందరిని బట్టి తీర్పు పొందును అనే వచన భావం.
7:36-38 నీకొదేము (యోహాను 3:1-2) లాగా నేర్చుకోవడానికి ఈ పరిసయ్యుడు యేసును తన ఇంటికి ఆహ్వానించాడో లేక ఆయనను ఇరికించడానికి ఆహ్వానించాడో స్పష్టంగా వివరించబడలేదు. పేరు ప్రస్తావించ బడని ఈ స్త్రీ బహుశా ఒక వేశ్య (పాపాత్మురాలు) అయి వుండవచ్చు. ఈమె యేసు బోధను విని పశ్చాత్తాపపడింది. భోజన పంక్తిని కూర్చుండడం అంటే భోజనబల్లకు వ్యతిరేక దిశలో పాదాలను పెట్టుకుని మోచేతితో బల్లపై ఆనుకోవడం. ఆమె ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అయినా ఆమె కన్నీళ్లు, ఎంతో ఖరీదైన అత్తరును యేసు పాదాలకు పూయడానికి సిద్ధపడడం, యేసు పట్ల ఆమెకున్న కృతజ్ఞతాభావానికి తిరుగులేని నిదర్శనంగా ఉన్నాయి.
7:39 నిజమైన ప్రవక్త పాపాత్మురాలిగా పేరొందిన ఇలాంటి స్త్రీతో సన్నిహితంగా ఉంటాడనే విషయాన్ని యేసును తన గృహంలోకి ఆహ్వానించిన పరిసయ్యుడు ఊహించలేకపోయాడు. పరిసయ్యుడుగా ఉండడం అతణ్ణి పాపానికీ, ఆమె లాంటి పాపులకూ ప్రత్యేకంగా దూరంగా ఉండేలా చేసింది.
7:40-43 మొదటి శతాబ్దంలో ఒక వ్యక్తి ఒక రోజు కూలీ ఒక దేనారము. పరిసయ్యుడైన సీమోను. ఆలోచిస్తున్నదేంటో తనకు తెలుసునని యేసు చూపించాడు. యేసు చెప్పిన ఉపమాన భావం సుస్పష్టం. ఎక్కువగా క్షమించబడిన వ్యక్తి ఆ క్షమాపణ విలువను ఎక్కువగా గుర్తించగలుగుతాడు.
7:44-47 పరిసయ్యునికీ ఆ స్త్రీకి మధ్య వ్యత్యాసాన్ని యేసు తెలియజేశాడు. యేసుకు పాదములు శుభ్రం చేసుకోవడానికి ఆ పరిసయ్యుడు . నీళ్లు ఇవ్వలేదు, ఆతిథ్యానికి సూచనగా ముద్దు పెట్టుకోలేదు, నూనెతో ఆయన తలపై అభిషేకించలేదు. అయితే ఆ స్త్రీ వీటన్నిటినీ చేసింది. పరిసయ్యుడు చాలా తక్కువ పాపాలు చేశాడని యేసు చెప్పట్లేదు. కానీ ఆ స్త్రీ తన పాపాన్ని గుర్తించినంత లోతుగా అతడు తన్నుతాను పాపినని గుర్తించలేదని. యేసు చెబుతున్నాడు.
7:48-50 ఆ స్త్రీ చేసిన పని ఆమె తన పాపాల విషయంలో నిజంగా పశ్చాత్తాపపడిందని చూపిస్తున్నాయి. అందువల్ల తన పాదాలకు అత్తరు పూసిన ఆ స్త్రీని యేసు క్షమించాడు. ఆమెకున్న విశ్వాసము ఆమెను రక్షించెనని ఆయన స్పష్టం చేశాడు (ఎఫెసీ 2:8-9 చూడండి). పాపములు క్షమించడానికి ఆయనకున్న అధికారం ఏంటని అక్కడున్న వాళ్లు మరొకసారి ప్రశ్నించారు (5:21-25 నోట్సు చూడండి)