10:1 అక్కడ నుండి అనే మాటలు బహుశా కపెర్నహూము గురించి ప్రస్తావిస్తుండవచ్చు. (9:33). యూదయ దక్షిణాన ఉంటుంది. మొర్దానుకు అవతల అంటే పెరయను సూచిస్తూ ఉంది. పెరయ ప్రాంతం హేరోదు అంతిప పరిపాలనలో ఉంది. వ.2 లో ఉన్న ప్రశ్నకు ఇది కారణాన్ని వివరిస్తుంది.
10:2 విడాకులను గురించి రెండు ప్రధానమైన అభిప్రాయాలుండేవి (మత్తయి 19:3). షమ్మాయి వర్గపు వారి అభిప్రాయం చాలా కఠినంగా ఉండేది; హిల్లేల్ వర్గపు వారి అభిప్రాయం స్వేచ్చగా ఉండేది. యేసును శోధించుటయే పరిసయ్యుల ఉద్దేశం (8:11; 12:15). అంతిప పాలించే
ప్రాంతంలో ఈ సంఘటన జరిగి ఉంటే, యేసు కూడా బాప్తిస్మమిచ్చే యోహానులాగా జవాబిచ్చి, అతనిలాగే శిక్షించబడతాడని వాళ్లు ఆశించి ఉంటారు (6:16-17 నోట్సు చూడండి).
10:3-4 మోషే మీకేమి ఆజ్ఞాపించెనని యేసు అడిగాడు. ద్వితీ 24:1-4 పై ఆధారపడి వాళ్లు స్పందించారు. అయితే ఈ వాక్యభాగం విడాకులు తీసుకోమని ఆజ్ఞాపించలేదు. ఈ వాక్యభాగం కేవలం విడాకులను గుర్తించింది. స్త్రీల హక్కుల్ని భద్రపరచింది, ఒక వ్యక్తి తన మొదటి భార్యను విడిచిపెట్టి వేరొక స్త్రీని వివాహం చేసుకున్న తర్వాత మరలా తన మొదటి భార్యను పెళ్ళి చేసుకోకుండా నిషేధించింది. మరొకసారి పరిసయ్యులు లేఖనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు.
10:5 మీ హృదయ కాఠిన్యమును బట్టి అనే మాట “దేవుని సత్యానికి ఒకడు తన హృదయాన్ని మూసివేయడం గురించి మాట్లాడుతోంది”. వారి ఆధ్యాత్మిక కఠినత్వాన్ని బట్టి మోషే విడాకులను అనుమతించాడు.
10:6-8 యేసు ఆదికాండం నుండి రెండు వచనాలను తీసుకుని ద్వితీయోపదేశకాండంలో మోషే ఇచ్చిన అనుమతి నుండి సృష్ట్యాదినుండి దేవుని ఉద్దేశం తట్టు వాళ్ల దృష్టిని మళ్లించాడు. వివాహమనేది పురుషునికి స్త్రీకిని మధ్యనే జరగాలని ఆది 1:27 ఆధారంగా యేసు స్థాపించాడు..
10:9 వివాహం దేవుడు స్థాపించిన వ్యవస్థ అని యేసు నొక్కి చెప్పాడు. మనుష్యుడు వేరుపరచకూడదనే మాట న్యాయస్థానం గురించి కాదు గానీ, అది భర్తకు సంబంధించినది (వ.11 తో పోల్చండి). వ.2 లో ప్రశ్నకు ఆవిధంగా జవాబు చెప్పి యేసు విడాకులను నిషేధించాడు.
10:10 యేసు చేసిన బోధ విని శిష్యులు ఆశ్చర్యానికి గురై, ఆయన ఉద్దేశమేమిటని వాళ్లు అడిగారు.
10:11-12 పునర్వివాహాన్ని వ్యభిచరించడంగా యేసు చెప్పినట్లు అనిపి స్తుంది. కానీ పునర్వివాహాలన్నిటినీ ఆయన రద్దు చేయలేదు. బైబిల్ కి అనుగుణంగా విడాకులు తీసుకోకుండా చేసుకునే పునర్వివాహం వ్యభిచార సంబంధమేనని యేసు నొక్కి చెప్పాడు. మత్తయి 5:32; 19:9ల్లోని మినహాయింపు ఉపవాక్యాలను మార్కు రాయలేదు. విడాకుల గురించీ పునర్వివాహం గురించీ యేసు చేసిన బోధ అంతా ఈ వాక్యభాగంలో లేదని ఇది గుర్తుచేస్తుంది.
10:13 కొందరు అంటే బహుశా తల్లిదండ్రులు అయి ఉండవచ్చు. చిన్న బిడ్డలను అనే మాట లూకా 18:15లో “శిశువు" అనే మాటను బట్టి స్పష్టం చేయబడింది. వాళ్లను ముట్టవలెనని అనేమాట వ.16 లో “వారి మీద చేతులుంచి ఆశీర్వదించెను” అనే మాటతో స్పష్టం చేయబడింది.
10:14 యేసు కోపపడి అని చెప్పబడిన మాట సువార్త గ్రంథాల్లో ఇక్కడ ఒక్కచోటే ఉంది. (3:5తో పోల్చండి). తీవ్రమైన ఆగ్రహం అని ఈ పదానికి అర్థం. పిల్లల్ని దగ్గరకు రావడానికి యేసు అనుమతించాడు. అయితే ఈలాటి వారిదే అన్నదే అసలైన విషయం. దేవుని రాజ్యం ఎవరికి చెందిందో ఆ ప్రజలకు ఈ మాట వర్తిస్తుంది.
10:15 యేసు పలికిన రెండవమాట ఒక వ్యక్తి దేవుని రాజ్యమును ఎలా ఆహ్వానిస్తాడు, ఎలా అందులో ప్రవేశిస్తాడు అనే దానికి సంబంధించింది. చిన్నబిడ్డ తనకున్న హక్కుల గురించి వాదించకుండా తనకు అనుగ్రహించబడిన బహుమానాన్ని స్వీకరిస్తాడు (మత్తయి 18:3 తో పోల్చండి). ఒక వ్యక్తి దేవుని రాజ్యంలో ప్రవేశింపవలెనంటే అతడు లేక ఆమె దాన్ని ఒక కృపావరంగా అంగీకరించాలి.
10:16 ఎత్తి కౌగలించుకొని అనేది గ్రీకులో ఒకే ఒక్క పదం, యేసు చిన్నబిడ్డ లను స్వీకరించడమే కాదు, వాళ్లను ఆయన దీవించాడు. ఆశీర్వదించెను అనే పదం నొక్కి చెప్పబడింది. అది యేసు యథార్థతను వెల్లడి చేస్తుంది.
10:17 బయలుదేరి అనే ప్రయాణపు భాష కొనసాగింది. యేసు యెరూషలే ముకు తన తుది యాత్ర చేస్తున్నాడని ఇది పాఠకులకు గుర్తుచేస్తుంది (వ.1; 8:27; 9:2,30,33). యేసుని సమీపించిన ఈ వ్యక్తి "యౌవనుడు" అని మత్తయి (19:22) తెలియచేయగా, అతడొక “అధికారి” అని లూకా (18:8) రాశాడు. అతడు మిగుల ఆస్తిగలవాడని మార్కు (10:22) సూచించాడు. అందువల్లనే ఇతణ్ణి "ధనవంతుడైన యవ్వన అధికారి" అని పేర్కొనడం జరిగింది. పరుగెత్తికొని రావడం, మోకాళ్ళూని అనే చర్యలు అతని ఆసక్తినీ మర్యాదను తెలియచేస్తున్నాయి. మరణం తర్వాత తనకు జీవితం లేదని అతనికి తెలుసు. నిత్యజీవము, "దేవుని రాజ్యము" సమానార్థకాలని 23వ వచనం చూపిస్తుంది.
10:18 యేసు తిరిగి అడిగిన ప్రశ్నలు అతణ్ణి దేవునివైపు మళ్లించాయి. దేవుడొక్కడే... సత్పురుషుడు అని చెబుతూ యేసు తన దైవత్వాన్ని తృణీకరించలేదు. మంచిచెడులను అంతిమంగా నిర్ధారించడానికి మానవ వివేచన సరిపోదని మాత్రమే ఆయన తెలియచేశాడు.
10:19 ఈ ఆజ్ఞలు ధర్మశాస్త్రపు రెండవ పలకపైన రాయబడినవి. ఈ ఆజ్ఞలు ప్రవర్తన పైన సంబంధాల పైన దృష్టి సారించేవి (నిర్గమ 20:12-17; ద్వితీ 5:16-21).
10:20 ఆ యవ్వనస్తుడు మరొకసారి యేసును బోధకుడా అని సంబోధించాడు. అయితే ఈసారి "సత్" (మంచి) అనే మాటను అతడు ఉపయోగించలేదు (వ.18).
10:21 అతని చూచి అనే క్రియాపదం చాలా తీవ్రమైనది, నిశితంగా పరిశీలించడాన్ని ఈ పదం సూచిస్తుంది. కేవలం మార్కు మాత్రమే యేసు... అతని ప్రేమించి అనే మాటలు రాశాడు. నీకు ఒకటి కొదువగానున్నది. అనే మాట పరిపూర్ణమైన విధేయత చూపడానికి మనుష్యులు చేసే ప్రయత్నాలు నిత్యజీవాన్ని సంపాదించలేవని చూపిస్తుంది. ఆ “ఒకటి” తన ఆస్తిపాస్తులను విడిచిపెట్టి శిష్యుడవడాన్ని సూచిస్తుంది (1:17; 2:14). ఇహలోక సంపదలకు బదులుగా, అతనికి పరలోకమందు... ధనము కలుగుతుంది.
10:22 ముఖము చిన్నబుచ్చుకొని అనే క్రియాపదం వివరణాత్మకమైనది, కేవలం మార్కు సువార్తలో మాత్రమే రాయబడింది. దీనికి “విభ్రాంతిచెంది" “విస్మయంతో” అని అర్థాలున్నాయి. యేసు అతనికి చేయమని చెప్పిన మాటల ప్రభావం ఆ యవ్వనస్థుని ముఖంలో స్పష్టంగా కనబడుతోంది. యేసును వెంబడించడానికి బదులు (వ.21), యేసు కంటే తనకున్న మిగుల ఆస్తిని విలువైనదిగా ఎంచుకుని అతడు వెళ్లిపోయెను. అతడు 4:18-19కి ఉదాహరణగా ఉన్నాడు (4:14-20 నోట్సు చూడండి.
10:23 ఎంతో దుర్లభమంటే విపరీతమైన కష్టం అని అర్థం. ఆస్తిపాస్తులు దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి మార్గాన్ని సుగమం చేయకపోగా ఆటంకంగా నిలుస్తాయి.
10:24 విస్మయమొందిరి గురించి 1:21-22 నోట్సు చూడండి. శిష్యులు బహుశా ధనసంపదలు దేవుని దీవెనకు సూచనని అర్థం చేసుకుని ఉంటారు (ద్వితీ 28:1-14)
10:25 అసాధ్యతను ఉదహరించడానికి యేసు - ఒక , సామెతను ఉపయోగించాడు. ఒంటె పాలస్తీనా ప్రాంతంలో కనిపించే అతి పెద్ద జంతువు. అది సూది బెజ్జములో దూరి వెళ్లడం అనేది కచ్చితంగా సాధ్యం కాదు.
10:26 యేసు - శిష్యుల స్పందన “విస్మయమొంది” (వ. 24) నుంచి అత్యధికముగా ఆశ్చర్యపడి అనే స్థాయికి చేరుకుంది. (వ.26). రక్షణ పొందగలడు (గ్రీకు. సోజో) అనేమాట “దేవుని రాజ్యంలో ప్రవేశించుట" (వ.23-25)కు, “నిత్యజీవము" (వ.17,30)కు, “పరలోకము” (వ.21)కు, “రాబోవు లోకము” (వ.30)కు సమానార్థకంగా ఉంది.
10:27 వారిని చూచి అనే మాట గొప్ప తీవ్రతను సూచిస్తుంది... యేసు యవ్వనస్థుని వైపు ఎలా చూశాడో దాన్ని ఇది గుర్తుచేస్తుంది. (వ.21)
10:28 యథావిధిగానే పేతురు శిష్యులందరి పక్షంగా మాట్లాడాడు (8:29, 32; 9:5; 11:21), పేతురు అభిప్రాయం ప్రకారం, ధనవంతుణ్ణి యేసు ఏం చేయమని ఆజ్ఞాపించాడో దాన్ని తానూ, ఇతర శిష్యులు చేశారు (10:21).
10:29 తనపైన, సువార్తపైన ఆయన సమాన ప్రాధాన్యతనుంచాడు.
10:30 మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని చెప్పడం యేసు గంభీరమైన ప్రమాణ , శైలి. వాగ్దానం చేయబడిన నష్టపరిహారం (నూరంతలుగా) ఇప్పుడు... (3:34-35 చూడండి), రాబోవు లోకమందు కూడా సరిపోతుంది. యేసును వెంబడించడం శ్రమ నుంచి భద్రతను సమకూర్చదు, అయితే దానికి ప్రతిఫలం మాత్రం నిత్యజీవము. ధనవంతుడైన యవ్వన అధికారి దీనికోసం అన్వేషించాడు. (వ.17). అయితే దాన్నుంచి దూరంగా వెళ్లిపోయాడు. (వ. 22).
10:31 విలువల తారుమారు అనే క్రైస్తవ శిష్యత్వంలోని ఎంతో ముఖ్యమైన విషయాన్ని యేసు నొక్కి చెప్పాడు (మత్తయి 19:30; 20:16; లూకా 13:30 లతో పోల్చండి).
10:32 రహదారి యాత్ర కొనసాగింది (వ.1,17; 8:27; 9:2,30,33-34). " యెరూషలేముకు తూర్పు నుంచి దారి ఎత్తులో ఉంటుంది. ఎందుకంటే నగరం చాలా ఎత్తులో ఉంది. యేసు వారికి ముందు నడుచుచున్నాడు. తనకోసం ఎదురుచూస్తున్న సంభవాలకు ఆయన భయపడలేదు అని ఇది చూపిస్తుంది.
10:33-34 తన శ్రమ గురించీ, పునరుత్థానం గురించీ యేసు చేసిన మూడవ అత్యంత స్పష్టమైన ప్రవచనం ఇది. మనము అనే పదం శిష్యుల్ని ఇంకా భయాభ్రాంతులకు గురిచేసి ఉంటుంది. ఈ చివరి ప్రవచనంలో ప్రధాన యాజకులు, శాస్త్రులు తనకు మరణశిక్ష విధించి (14:53; 16:64 నోట్సు చూడండి), తనను అన్యజనుల కప్పగించెదరు. ఎందుకంటే మరణశిక్షను అమలుచేయడానికి వాళ్లకు అధికారం లేదు (15:1-2).
10:35-45 యేసు శ్రమలు, మరణం ద్వారా ఉత్పన్నమయ్యే సంగతులను గ్రహించడంలో యాకోబు, యోహానులు విఫలమయ్యారు.
10:35-36 యాకోబు, యోహానులు ఇతర శిష్యులకు వేరై తమకుతాముగా స్వార్థపూరితంగా పనిచేసిన సమయం మార్కు సువార్తలో ఇది ఒక్కటే ఉంది. తమ కోరికను తెలియచేయడానికి ముందే తమకు మాట ఇమ్మని వాళ్లు యేసును అడిగాడు. ఎందుకంటే తాము స్వార్థంతో ఆలోచిస్తున్నామని వాళ్లకు తెలుసు. "
10:37 కుడివైపు అనేది అత్యున్నత గౌరవం పొందే స్థానం, ఎడమవైపు అనేది గౌరవంలో తక్కువ స్థానం. రూపాంతర సమయంలో యాకోబు, యోహానులు యేసు మహిమను పాక్షికంగా చూశారు (9:12-13), ఇప్పుడు వాళ్లు మరింత కోరుకున్నారు. ఈ మనవి చేయమని వాళ్ల తల్లే వాళ్లకు సలహా
ఇచ్చింది (మత్తయి 20:20-21) . 10:38 గిన్నె... బాప్తిస్మము అనేవి యేసుని శ్రమ, మరణాలను సూచిస్తున్నాయి (14:36).
10:39-40 మీరు త్రాగెదరు అనేది యాకోబు హతసాక్షి కావడాన్ని (అపొ.కా.12:2), యోహాను చెరలోకి వెళ్లడాన్ని ప్రవచిస్తుంది. (ప్రక 1:9). అది ఎవరికి సిద్ధపరచబడెనో వారికే దొరకునని అంటే ఘనత పొందే స్థానాలను ఎవరికివ్వాలో దేవుడే నిర్ణయిస్తాడు అని భావం.
10:41 ఇతర శిష్యులు కోపపడసాగిరి, వ.14 లో ఇదే క్రియాపదం యేసుకు ఉపయోగించబడింది.
10:42 ఈ పాఠాన్ని యేసు అపొస్తలులందరికీ ఉపదేశించాడు. దీన్ని బట్టి యాకోబు, యోహానుల్లా ఇతరులందరూ కూడా ఘనమైన స్థానాలు పొందాలనే దురాశతోనే ఉన్నారు.
10:43-44 క్రైస్తవ నాయకత్వంలో ప్రముఖుడై ఉండాలంటే దాసుడై ఉండాలి. అంటే మన యజమాని చిత్రాన్ని జరిగిస్తూ ఇతరుల ప్రయోజనార్థం దీనమనసుతో పనిచేయడమే!
10:45 సేవాతత్పరత కలిగిన నాయకత్వానికి గొప్ప , నిదర్శనం మనుష్యకుమారుడు. ఇవ్వడమే సేవాతత్వపు సారాంశం. యేసు అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చాడు. (యెషయా 53:10-12 తో పోల్చండి). "క్రయధనము” అనేది “బానిసను విడుదల చేయడానికి చెల్లించాల్సిన వెల”. తన మరణం గురించి యేసుకున్న స్వీయ అవగాహనకు వ.45 లో మాటలు చాలా కీలకమైనవి.
10:46-52 ఒక గుడ్డి వాని సంఘటన (8:22-26)తో తాను ఆరంభించిన “రహదారి ప్రయాణం" విభాగాన్ని మరొక గుడ్డి వాని సంఘటనతో మార్కు ముగిస్తున్నాడు. గుడ్డి వాడు చూడగలిగిన దానితో శిష్యులు చూడలేక పోయిన దానిని (10:35-45) ఈ వృత్తాంతం భేదపరుస్తుంది.
10:46 యెరూషలేముకు ఈశాన్యంగా 17 మైళ్ల దూరంలో, 3500 వేల అడుగుల దిగువన యెరికో పట్టణం ఉంది. పస్కా పండుగకు వచ్చే యాత్రికులే ఇక్కడ చెప్పిన బహు జనసమూహము.
10:47-48 ఆయనను నజరేయుడైన యేసు అని మార్కు గుర్తించడం ఇది రెండవసారి (1:24). యేసును దావీదు కుమారుడా అని ఎవరైనా సంబోధించడం మార్కు సువార్తలో ఇదే మొదటిసారి, ఈ బిరుదు మెస్సీయకు ఇచ్చిన బిరుదు, ఇది 2 సమూ 7:11-14 పై ఆధారపడింది (మార్కు 11:10; 12:35-37తో పోల్చండి)..
10:52 "8:22-25 వచనాల్లో గ్రుడ్డివానిని స్వస్థపరచిన దానికి భిన్నంగా, యేసు ఇతనికి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను అని ప్రకటించాడు, బర్తిమయి చూపు పొంది వెళ్ళాడు.