4:1-20 ఉపమానానికీ (వ.3-9), దాని వివరణకూ (వ.13-20) మధ్యలో యేసు ఎందుకు ఉపమానాల్లో మాట్లాడుతున్నాడో (వ.10-12). మార్కు తెలియచేశాడు. యేసు చెప్పిన ఇతర ఉపమానాలను అర్థం చేసుకోవడానికి (వ.13), విత్తనాలు, నేలలు గురించిన ఉపమానం కీలకమైంది.
4:1 మరల అనేమాట 2:13నీ 3:1 నీ గుర్తుచేస్తుంది. సముద్రములో అనేది గలిలయ సముద్ర తీరాన్ని సూచిస్తుంది. (1:16-18 నోట్సు చూడండి). ఆయన... ఒక దోనె యెక్కి కూర్చుండెను. బోధించడానికి తేలియాడే వేదికగా ఉపయోగించుకోవడానికే ఆయన అలా కూర్చున్నాడు.
4:2-3 వినుడి అనే ఆజ్ఞ బోధిస్తున్న దానిని కేవలం అర్థం చేసుకోమనే కాదు దానికి విధేయత చూపమని కూడా పిలుపునిస్తుంది. విత్తువాడు అంటే యేసు.
4:4-7 నేల తత్వాన్ని బట్టి, పరిస్థితులను బట్టి మూడు వైఫల్యాలను ప్రభువు తన మాటలతో చిత్రీకరించాడు. త్రోవప్రక్కను పడిన విత్తనాలు మొలకెత్తేందుకు (విశ్వాసాన్ని బహిరంగంగా ఒప్పుకునేందుకు) సమయం ఇవ్వకుండా పక్షులు (సాతాను) వచ్చి మ్రింగివేసెను. రాతినేలను పడిన విత్తనాలు వెంటనే మొలిచెను అంటే తొలిదశలో విశ్వాసపు జాడలు కనబడినా - సూర్యుడు. (ఒత్తిడి, శ్రమ) వచ్చినప్పుడు వెంటనే ఎండిపోయెను... ముండ్ల పొదలలో (చింతలు) పడిన విత్తనాలను ఆ ముండ్ల పొదలు అణిచివేసెను గనుక అవి ఫలింపలేదు.
4:8 మంచినేలను పడిన విత్తనాలు ఫలించెను. ఆ ఫలాలు అభివృద్ధిని కలిగించేవి. ఫలించే తత్వమున్న మంచి నేలకూ, బీడుబారిన అశాశ్వతమైన ఫలాన్నిచ్చే. ఇతర నేలకూ మధ్య వ్యత్యాసాన్ని యేసు చూపిస్తున్నాడు. ముప్పదంతలుగాను అరువదంతలుగాను నూరంతలుగాను అని ఆ పంట సమృద్ధిని తెలియచేస్తూ ఆయన దాన్ని నొక్కి చెప్పాడు (ఆది. 26:12తో పోల్చండి).
4:9 చెవులు గలవాడు వినును గాక అనే మాట “వినుడి” అని వ.3 చెప్పిన తొలి ఆజ్ఞను గుర్తుచేస్తుంది. అంతేకాదు, వ.10-12 లో ఉన్న ముఖ్య సమాచారం నిమిత్తం తన శ్రోతలను సిద్ధం చేస్తున్నది. (వ. 23; 7:14; 8:18లతో పోల్చండి).
4:10-12 ఈ వచనాలు కొ.ని.లోనే అత్యంత క్లిష్టమైనవి. ఉపమానముల ద్వారా - బోధించడంలో తన ఆంతర్యమేంటో యేసు ఈ వచనాల్లో తెలియచేస్తున్నాడు. పండితులు వీటి అర్థాన్ని పలురకాలుగా వివరిస్తున్నారు. కఠిన హృదయులైన శ్రోతలకు శిక్ష విధించడానికే యేసు ఉపమానాలను ఉపయోగిస్తూ బోధించాడన్నది ఒక అర్థం అయ్యుండవచ్చు. 4:10 వ. 10-12 లు యేసు సముద్రతీరంలో బోధించినవి కావు గాని ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు బోధించినవి. పండ్రెండుమందిని నియమించు కున్న సమాచారం 3:14లో ఉంది. ఆ వచనం తర్వాత ఇక్కడే 12 మందిని మార్కు తొలిసారి ప్రస్తావించాడు.
4:11 యేసు తన శ్రోతలను రెండు గుంపులుగా వర్గీకరించాడు. 1) దేవుని వలన దర్శనం ప్రత్యక్షత అనుగ్రహింపబడి యున్న మీరు (బహువచనం) 2)వెలుపల నుండువారు. వెలుపల ఉన్నవారు కేవలం ఉపమానమును విన్నారు; లోపలున్న వారు మర్మమును గ్రహించారు. మర్మం అంటే “రహస్యం" (గ్రీకు. ముస్టేరియోన్). కొ.ని.లో ముస్టేరియోన్ అనే పదం మానవకృషి మూలంగా కనుగొనగలిగే గూఢమైన జ్ఞానాన్ని కాక, దేవుడు బయలుపరిచినప్పుడు మాత్రమే అర్థమయ్యే సత్యాన్ని (దాని 2:18-19; 27-30,47) సూచిస్తుంది. ఈ మర్మం దేవుని రాజ్యమునకు సంబంధించినది. ఈ రాజ్యం గురించి ప్రకటించడానికే యేసు వచ్చాడు (1:15), దానినే 4:26-32లో ఆయన వివరించ నారంభిస్తాడు.
4:12 ఉండుటకును (గ్రీకు. హినా) అనే పదం ఉద్దేశాన్ని లేదా ఫలితాన్ని సూచిస్తుంది. అందువల్ల యెషయా 6:9-10 వచనాలను యేసు ఉటంకించి నప్పుడు ఆయన ఉపమానాల్లో బోధించడంలోని ఉద్దేశాన్ని లేక ఫలితాన్నీ వివరిస్తున్నాడు. మత్తయి 13:13లో “ఇందునిమిత్తము” (గ్రీకు. హోటీ) అనే పదముంది. ఈ పదం శ్రోతల విముఖతకు కారణాన్ని కాక దాని ఫలితాన్ని తెలియచేస్తుంది. యెషయా 6:9-10 వచనాలను మార్కు తన సొంత మాటల్లో రాశాడు, మొదటి రెండు ఉపవాక్యాలను తారుమారు చేశాడు, వ.10 మొదటి భాగాన్ని విడిచి పెట్టాడు. స్వస్థపరచబడడం అనే మాటను క్షమాపణ పొందడం అని మార్చాడు. తిరిగి అనే పదం మారుమనస్సు గురించి వ్యక్తం చేస్తుంది. క్షమించబడడం అనేది దైవకర్మణి క్రియ అంటే దేవుని చేత క్షమించబడడం అని అర్థం.
4:13-20 వ.10 లో ప్రశ్నకు స్పందించి, తాను చెప్పిన ఉపమానానికి యేసు అర్థం చెప్పాడు. 4:18 మార్కుకు ఈ వచనం చాలా కీలకం. ఈ ఉపమానాన్ని ఎవరు అర్థం చేసుకోరో వాళ్లకు యేసు చెప్పిన ఉపమానాలు ఏమీ అర్థం కావు.
4:14-20 యేసు వివరణలో, విత్తబడిన విత్తనాలు (1కొరింథీ 3:5-9తో పోల్చండి) దేవుని వాక్యము (2:2తో పోల్చండి), పక్షులు సాతానుకు సూచన; సూర్యుడు, దాని వేడిమి శ్రమకూ హింసకూ (మతపరమైన హింసకు) సూచనలు. ఎండిపోవడం అంటే తప్పిపోవడం; ముళ్లచేత అణిచివేయబడడం అనేది ఐహిక విచారములును, ధన మోసమును మరి ఇతరమైన అపేక్షలను సూచిస్తుంది (అనగా తప్పుడు ప్రాధాన్యతలు, మత్తయి 6:24-34 చూడండి), మంచి నేల అంటే వాక్యాన్ని విని, దానిని అంగీకరించి... ఫలించువారని అర్థం. యేసు దృష్టి వాక్యం పైన (గ్రీకు. లోగోస్), వినడంపైన ఉంది. వాక్యం (లోగోస్) అనే పదాన్ని ఈ వచనాల్లో 8 సార్లు, వినడం గురించి నాలుగుసార్లు ఆయన ఉపయోగించాడు. వాక్యాన్ని విని, దాన్ని అంగీకరించి, ఫలించేవాళ్లు రకరకాల పరిమాణాల్లో ఫలించినా వాళ్లు నిజమైన శిష్యులే (మత్తయి 25:14-30).
4:21-34 యేసు ఉపమానాలలో ఉపదేశించిన ఈ భాగాన్ని నాలుగు సామెతలతో (21-25), దేవుని రాజ్యం గురించిన రెండు ఉపమానాలతో (వ.26-29,30-32),ఉపమానరీతిగా యేసు చేసిన బోధనా పద్దతి గురించిన సంక్షిప్త వివరణతో (33-34) మార్కు ముగిస్తున్నాడు.
4:21-23 దీపము అనేది మట్టితో తయారుచేయబడిన దీపం. ఎక్కువ వెలుగునిచ్చే విధంగా దానిని దీపస్తంభముపై పెట్టేవారు. ఈ దీపం యేసుకు సూచనగా ఉంది. కుంచము అనేది సుమారుగా ఏడున్నర కేజీల ధాన్యాన్ని కొలవగలిగే కొలమానం. వెలుగును దాచకూడదని అలంకారిక ప్రశ్నలు తెలియచేస్తున్నాయి. సమానార్థమున్న అనురూపకతలకు చక్కటి ఉదాహరణగా ఉన్న వ. 22 లో సామెతలు యేసును ఎంతో కాలం దాచిపెట్టలేరని నొక్కి చెబుతున్నాయి.
4:24-25 మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి అనే మాటలు వ.9,23 లను, వ.13-20 ల్లో వినడంపై ఉన్న ప్రాధాన్యతనూ బలపరు స్తుంది. తన శిష్యులకు యేసు చెప్పిన మాటలు, వ. 12లో వెలుపల ఉన్నవా రికి ఇవ్వబడిన దానికి పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. వినడం అనేది చాలా ముఖ్య మైన విషయం (రోమా 10:17). విని స్పందించేవాళ్లకు దేవుడు మరింత ఎక్కువ ప్రత్యక్షతనూ అవగాహననూ అనుగ్రహిస్తాడు. కొందరు ఆ ప్రత్యక్షతను వినరు, అందుకే దాని నుంచి ఎలాంటి ప్రయోజనాన్ని పొందరు (మార్కు 4:25).
4:26-29 దేవుని రాజ్యమునకు సంబంధించిన రెండు ఉపమానాలను మార్కు ఈ వచనాల్లో రాస్తున్నాడు (వ. 26-29, 30-32 పోల్చండి. 1:15). విత్తనములో ఎదిగేశక్తి ఉన్నట్లే దేవుని రాజ్యానికి కూడా ఎదిగే శక్తి ఉంటుంది. మనుషులు చేయాల్సిన పని కేవలం నాటడమే. ఒకసారి నాటితే విత్తనాలు ఎదుగుతాయి, పంట పండుతుంది. కొడవలి అనేది అంతిమ తీర్పుకు సూచనగా ఉంది (యోవేలు 3:13; ప్రక 14:15).
4:30-32 మార్కు రాసిన రాజ్యసంబంధమైన రెండవ ఉపమానం (మత్తయి 13:31-32; లూకా 13:18-19 లతో పోల్చండి), స్వల్ప ఆరంభాన్ని అసమానమైన ఎదుగుదలతో వ్యత్యాస పరుస్తుంది. నిజానికి ఆవగింజ... భూమిమీద నున్న విత్తనములన్నిటి కంటే చిన్నది కాదు. అయితే యేసు జీవించిన కాలంలో బహుశా అది చిన్నదై ఉంటుంది. అందువల్ల అది అతి చిన్నవాటికి గుర్తుగా ఉంది (మత్తయి 17:20; లూకా 17:6). ఆవగింజ మొలకెత్తినప్పుడు అది 6 అడుగుల ఎత్తుకు ఎదుగుతుంది. అది పెద్దదై గొప్ప కొమ్మలు వేయును గనుక ఆకాశపక్షులు దాని నీడను నివసింపగలవు. దేవుని ప్రజల మధ్యలో స్థానం సంపాదించుకుంటున్న అన్యజనుల గురించి పా.ని. ఈ సాదృశ్యాన్ని ఉపయోగించింది. (కీర్తన 104:12; యెహె 17:22-23; 31:6; దాని 4:9-21).
4:33-34 ఉపమానరీతిగా యేసు బోధించిన విభాగానికి తుది వివరణనిచ్చి మార్కు ఈ భాగానికి ముగింపు పలికాడు. ఈలాటి అనేకమైన ఉపమానము లను చెప్పి అనేమాట మార్కు (ఇతర సువార్త గ్రంథకర్తలు) యేసు బోధించిన ఉపమానాల్లో కేవలం కొన్నింటిని మాత్రమే తమ గ్రంథాల్లో రాశారని తెలియచేస్తుంది (వ.2 తో పోల్చండి). ఉపమానము లేక వారికి బోధింపలేదు , అనేమాట బహిరంగంగా యేసు ఉపమానరీతిగా బోధించాడనీ, ఒంటరిగా ఉన్నప్పుడు తన శిష్యులకు అన్నిటిని విశదపరచెను అని తెలియచేస్తుంది.
4:35-36 ఆ దినమే అంటే వ.1-34 ల్లోని బోధను యేసు ఏ రోజైతే, చేశాడో అదే రోజును గురించి ప్రస్తావిస్తుంది. సాయంకాలమైనప్పుడు- ఇలా రెండు సమయాలను కలిపి ప్రస్తావించడం మార్కుకు అతి సాధారణమైన విషయం. అందులో రెండవసారి ప్రస్తావించిన సమయం "మొదటిదానికంటే ప్రత్యేకమైంది. యేసు రోజంతా బోధిస్తూనే ఉన్నాడని ఈ మాటలు తెలియచేస్తు న్నాయి. అంతేకాదు, ఆ తర్వాత జరగబోయే సంఘటన గురించి అవి ఉత్కంఠ
రేకెత్తించేవిగా ఉన్నాయి. ఎందుకంటే, రాత్రిపూట సముద్రంలో తుపాను రావడమనేది మరింత భయానకమైన సంఘటన. సముద్రపు అద్దరికి అంటే తూర్పువైపు అని అర్థం, ఆ ప్రాంతం అన్యజనులతో నిండి ఉండే ప్రదేశం.
4:37 గలిలయ సముద్రం సముద్రమట్టానికి సుమారు 700 అడుగుల దిగువన ఉంటుంది. దీని చుట్టూ ఎత్తైన కొండలుంటాయి. గలిలయ సముద్రానికి ఈశాన్యంలో హెర్మోను పర్వతం ఉంటుంది. ఈ పర్వతం సముద్ర మట్టానికి 9 వేల అడుగుల ఎత్తులో ఉంటుంది. హెర్మోను పర్వతం నుంచి వచ్చే చల్లగాలి సముద్రం నుంచి వచ్చే వెచ్చటి గాలితో కలిసినప్పుడు తరచూ అది తుపానుగా మారి ఆ ఎత్తు నుంచి ఈ సరస్సుపైకి దూసుకొస్తుంటుంది. ఆ రోజుల్లో చేపల వేటకు ఉపయోగించే దోనెలు చాలా పెద్దవి. ఆ దోనె అప్పటికే నీటితో నిండిపోయెను.
4:38 దోనె అమరము అనేది దోనె వెనుక భాగాన ఉండే ఎత్తైన ప్రదేశం. ఇక్కడే జాలరులు కూర్చుంటారు. నడుం వాల్చుతారు. తలగడ అనేది దోనెను సరైన దారిలో నడిపించేవాని కోసం ఏర్పాటు చేయబడేది. యేసు నిద్రించుచుండెను అని సువార్తలు గ్రంథస్థం చేసిన ఏకైక సన్నివేశం ఇది. బోధించి అలసిపోవడం వల్ల యేసు తన్నుతాను దేవునికి అప్పగించుకున్నాడు (వ.27; కీర్తన 3:5; 4:8లతో పోల్చండి). మేము నశించిపోవుచున్నాము, నీకు చింతలేదా? అనేమాట మత్తయి 8:25; లూకా 8:24లో కాస్తంత మృదువుగా చెప్పబడింది. ఈ మాటలు యోహాను 1:14ను గుర్తుచేస్తాయి.
4:39 నిశ్శబ్దమై ఊరుకుండు మనేది 1:25 ను గుర్తుచేస్తుంది. 1:25లో దయ్యాన్ని గద్దించి మౌనం దాల్చేలా చేశాడు. ఇక్కడ ఉపయోగించబడిన పరిపూర్ణ క్రియాపదానికి "ఊరకుండి, నిశ్శబ్దాన్ని కొనసాగించు" అని భావం. ప్రకృతి వెంటనే స్పందించింది. మిక్కిలి నిమ్మళమాయెను అనే మాట పెద్ద అంది తుపాను (వ.37) అనేదానికి పూర్తి విరుద్ధంగా ఉంది. ఈ పెద్ద మార్పు యేసు పలికిన ఒక్కమాటతోనే సాధ్యమయ్యింది. 140 తన శిష్యులకు యేసు గద్దింపు మత్తయి 8:26; లూకా 8:25 లో ఉన్నంత తీవ్రంగా లేదు. భయపడుట అంటే పిరికితనం, దేవునిలో నమ్మకం లేకపోవడాన్ని సూచిస్తుంది. నమ్మిక అంటే దేవునిలో విశ్వాసం. విశ్వాస లేమి వారిని ఆ ఉపద్రవంలో భయపడేలా చేసింది.
4:41 వారు మిక్కిలి భయపడి అంటే “వాళ్లు గొప్ప భయంతో భయపడ్డారు” అని అక్షరార్థం. పెద్ద తుపానును యేసు మిక్కిలి నిశ్శబ్దంగా మార్చేశాడు. అది శిష్యుల్ని తీవ్ర భయకంపితుల్ని చేసింది. కేవలం దేవుడు మాత్రమే గాలియు సముద్రమును... లోబడునట్లు చేయగలడనే (కీర్తన 65:7తో 89:8-9 తో పోల్చండి) భావన వెలుగులో వారి భయం అర్థం చేసుకోదగినదే!