18:1 గ్రీసులో (అకయ) మరో ముఖ్యపట్టణం కొరింథు. దానిలోని రెండు ఓడరేవులు మధ్యధరా ప్రాంతంలోని వ్యాపారానికి దాన్ని కేంద్రంగా చేశాయి.
18:2 క్రీ.శ. 41లో యూదులు రోమాలో సమావేశం కాకూడదని కౌదియ చక్రవర్తి నిషేధించినట్లు కనబడుతుంది. తరువాత ఆ శాసనాన్ని వారు సరిగ్గా పట్టించుకోనందున, క్రీ.శ.49లో అతడు వారిని పూర్తిగా బహిష్కరించి ఉంటాడు. బహుశా ఇదే కాలంలో అకుల, ప్రిస్కిల్లలు వెళ్ళగొట్టబడి వుంటారు. వారు ఇటలీ నుండి కొత్తగా వచ్చినవారు అనడం బట్టి, పౌలు కొరింథుకు సుమారు క్రీ.శ. 50లో వచ్చినట్లు సూచిస్తుంది.
18:3 డేరాలు కుట్టువారు అంటే చర్మకారులను సూచిస్తుండవచ్చు, ఇది బహుశా పౌలు స్వంత ప్రాంతమైన కిలికియలో తయారయ్యే మేక వెంట్రుకలతో తయారయ్యే బట్టలతో చేసే పనికావచ్చు. బోధకులు తమను తాము పోషించుకోవడానికి సహాయకరంగా ఉండేలా ఒక వృత్తిని నేర్చుకోవడం ఎంత ప్రాముఖ్యమో ప్రాచీన రబ్బీ సాంప్రదాయం నిర్ధారిస్తుంది.
18:4 తన వాడుక చొప్పున, పౌలు సమాజ మందిరములో తర్కించుచు, యూదులను గ్రీసు దేశస్థులను ఒప్పించ యత్నించాడు. . సమాజ మందిరంలోను, బయటా అతడు కలిసిన గ్రీకులు దేవునికి భయపడేవారుగా ఉన్నట్లనిపిస్తారు. "హెబ్రీయుల సమాజ మందిరం" అని రాయబడిన శిలాశాసనం కొరింథులో దొరికింది. అది రాయబడిన కాలాన్ని గురించి వాదనలున్నాయి, కానీ అది పౌలు తరువాతి కాలంలోది కావచ్చు.
18:5 కొరింథులో ఉన్న పౌలుతో సీల, తిమోతి వచ్చి చేరేసరికే, అతడు తాను చేయగల శ్రేష్టమైన పనిలో అంటే వాక్యము బోధించుటలోను, యేసే క్రీస్తని యూదులకు సాక్ష్యమిచ్చుటలోను నిమగ్నమై ఉన్నాడు.
18:6 తన బట్టలకు పట్టిన దుమ్ము దులిపినట్లుగా వస్త్రములు దులుపుకొని అంటే యూదుల సువార్తీకరణకు ప్రాధాన్యత నివ్వడానికి పౌలు ముగింపు పలికాడు అనడాన్ని సూచిస్తుంది. మరింత ఫలభరితమైన కోతకోసం అతడు ఇకపై అన్యజనులపై దృష్టిని కేంద్రీకరిస్తాడన్న మాట. అలాగే 13:46లో సువార్తను మాటిమాటికీ తిరస్కరిస్తున్న యూదులతో "మేము అన్యజనుల యొద్దకు వెళ్ళుచున్నాము" అని పౌలు, బర్నబాలు స్పందించడం చూస్తాం.
18:7-8 వ.6లో పౌలు చేసిన శపథం సమాజ మందిరంలో నుండి ఎవరూ అతని సందేశాన్ని స్వీకరించలేదని సూచించదు. ఎందుకంటే క్రిస్పు, తన యింటివారందరితో కూడ ప్రభువును నమ్ముకున్నాడని సూచిస్తుంది. అంతేకాక తీతియు యూస్తు (అన్యుడు) దేవునియందు భక్తిగలవాడని, అతని యిల్లు సమాజమందిరమును ఆనుకొనియుండెను గనుక అతడు అందులో తప్పక సభ్యుడై ఉంటాడు.
18:9-11 ఫిలిప్పీ, థెస్సలోనికయ, బెరయ పట్టణాలతో సహా, ఇంతకు ముందటి పట్టణాల్లో పౌలు శ్రమపొందాడు. కానీ కొరింథులో అతనికి మంచి పరిచర్య జరుగబోతుందని ప్రభువు వాగ్దానం చేశాడు. పౌలు అక్కడ ఒక సంవత్సరము మీద ఆరునెలలు ఉండడానికి కారణం అదే..
18:12 గల్లియోను కొరింథు రాజధానిగా ఉన్న అకయకు అధిపతిగా ఉన్నకాలం, కొ.ని.. కాలానికి సంబంధించి మరింత స్థిరమైన తేదీని సూచిస్తుంది. డెల్ఫీ దగ్గర కనుగొన్న ఒక శిలాఫలకంపై రాసి వున్నదాని ప్రకారం గల్లియోను క్రీ.శ.51 ఆరంభంలో అధిపతిగా నియమింపబడ్డాడని సూచిస్తుంది. ఆ సంవత్సరం చివరిలో పౌలు అతని ముందు నిలబడ్డాడు.
18:13 ధర్మశాస్త్రమునకు వ్యతిరిక్తముగా దేవుని ఆరాధించుటకు ప్రజలను పౌలు రేపుతున్నాడనే ఆరోపణకు సంబంధించిన మరొక సంఘటన గురించి, 16:20-21 నోట్సు చూడండి.
18:14-17 గల్లియోను ఒక గ్రహింపు గల వ్యక్తిగా (ఇలాంటి సంగతులను గురించి విమర్శ చేయుటకు నాకు మనస్సు లేదు), అదే సమయంలో నిర్లక్ష్యంగా (సోప్రెనేసును కొట్టడం కూడా అతడు లక్ష్యం చేయలేదు) కనిపిస్తాడు. బహుళజాతి ప్రాంత పట్టణంలో, విపరీతమైన వ్యాపారం, పర్యాటక ప్రాంతంలో అన్నిటినీ క్రమంగా ఉంచడం చాలా కష్టం. గల్లియోను తనకేమీ పట్టనట్టు ఉండే విధానాన్ని అనుసరించాడు.
18:18 కెంకేయలో తలవెండ్రుకలు కత్తిరించుకొనినది పౌలు అనే విషయంలో స్పష్టత లేదు. అది అకుల అయివుండవచ్చు. గ్రీకు వాక్యనిర్మాణం బట్టి అకుల కావచ్చనిపిస్తుంది, కానీ అది అస్పష్టంగా ఉంది. ఈ మ్రొక్కుబడి నాజీరు వ్రతానికి సంబంధించింది కావచ్చు. ఒకవేళ మ్రొక్కుబడి చేసింది పౌలే అయితే, అతడు యెరూషలేముకు వెళ్ళి “సంఘపువారిని" దర్శించి (వ. 22), అంటే దేవాలయం దగ్గర ఆగి, తన మ్రొక్కుబడి పూర్తిచేసుకోవడానికి తన తలవెంట్రుకలు అర్పించాలి. ఇలాంటి పని పౌలు చేయడం, అదీ యూదయ వెలుపల చేయడం, అసాధారణం (21:26తో పోల్చండి). కానీ అతడు యూదుడు కాబట్టి అలా చేసేందుకు అవకాశం ఉంది కూడా.
18:19-20 పౌలు ఎఫెసులో ఆగడం చాలా స్వల్పవ్యవధి - కోసం అయివుంటుంది. అందువల్లే అతడు అపొల్లోను (వ. 24-28) కలిసి వుండడు లేక తరువాత తాను ఎఫెసులో ఎక్కువకాలం ఉన్నపుడు ఎదుర్కొన్న తప్పుబోధను (అధ్యా. 19) ఎదుర్కొనివుండడు.
18:21 దేవుని చిత్తమైతే ఎఫెసుకు మళ్ళీ వస్తానని పౌలు వాగ్దానం చేశాడు, అలాగే వచ్చాడు కూడా (19:1). తన పరిచర్య, తన జీవితం అంతా దేవుని సేవ కోసమేనని, ఆయన స్వాధీనంలోనే ఉందని పౌలు దృష్టించాడు (రోమా 1:1-7 నోట్సు చూడండి).
18:22 పౌలు యెరూషలేము సంఘానికి వెళ్ళి, అక్కడి నుండి అంతియొకయకు వెళ్ళాడు. పౌలు మళ్ళీ అంతియొకయకు తిరిగి రావడం అతని రెండవ మిషనరీ యాత్ర ముగింపును సూచిస్తుంది.
18:23 ఇది పౌలు మూడవ మిషనరీ యాత్ర ఆరంభాన్ని సూచిస్తున్నది. మొదటి రెండింటిలానే, ఇది కూడా అంతియొకయ నుండి ఆరంభమై, ముందటి ప్రయాణంవలె చిన్నాసియా (ఆసియ మైనర్) గుండా, మరి ముఖ్యంగా గలతీయ ప్రాంతపు పురియ ద్వారా కొనసాగింది.
18:24-25 అజల్లో గ్రీకు-రోమా ప్రపంచంలోని అత్యధిక విద్యావంతుల పట్టణమైన ఐగుప్తులోని అలెగ్జాండ్రియా పట్టణపు వాడు. అతడు ప్రభువు మార్గము విషయమై ఉపదేశము పొంది వున్నాడు కాబట్టి అప్పటికే క్రైస్తవ్యం ఐగుప్తుకు చేరిందని మనకు తెలుస్తుంది. అయినప్పటికీ, అతనికి బాప్తిస్మమిచ్చు యోహాను బాప్తిస్మము మాత్రమే తెలుసు కనుక క్రైస్తవ్యాన్ని గురించి అతని జ్ఞానంలో కొదువ వుంది. అయితే ఆత్మయందు తీవ్రపడి అనే మాటలను కొందరు అపొల్లో అప్పటికే పరిశుద్ధాత్మతో నిండివున్నాడని అర్థం చేసుకుంటారు. అయితే క్రీస్తులో తన విశ్వాసారంభాన్ని గురించి అపోల్లో చాలా తీవ్రత కలిగి వున్నాడు కానీ పరిశుద్ధాత్మ బాప్తిస్మం ఇంకా పొంది వుండకపోవచ్చు.
18:26 యేసును గురించి ధైర్యంగా మాట్లాడటం ఒక్కటే సరిపోదని మనం ఇక్కడ చూడవచ్చు. విశ్వాసాన్ని పూర్తిగా అర్థం చేసుకొని వుండాలి కూడా. ప్రిస్కిల్ల,అకులలు అపొల్లోకు బోధించే సమయాన్ని తీసుకోవడం ద్వారా, అతనికి, దేవుని రాజ్యా నికి సేవ చేసిన వారయ్యారు.
18:27-28 అపొల్లోకున్న వాక్చాతుర్య నైపుణ్యాలు, క్రైస్తవ విశ్వాసపు పూర్తి అవగాహనతో జతకలిసిన తర్వాత, అతడు ఎఫెసును విడిచి అకయ (కొరింథు)కు వెళ్ళాడు (19:1). అతడు పౌలువలెనే విశ్వాస సమర్థన, ఉపదేశ ప్రక్రియలను ఉపయోగించి యూదుల వాదమును బహిరంగముగాను గట్టిగాను ఖండించుచు వచ్చాడు. ప్రిస్కిల్ల, అకులల నమ్మకత్వం బట్టి మాత్రమే ఇది సాధ్యమయ్యింది.