Luke - లూకా సువార్త 2 | View All

1. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలెనని కైసరు ఔగుస్తువలన ఆజ్ఞ ఆయెను.

2. ఇది కురేనియు సిరియదేశమునకు అధిపతియై యున్న ప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య.

3. అందరును ఆ సంఖ్యలో వ్రాయబడుటకు తమతమ పట్టణములకు వెళ్లిరి.

4. యోసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు గనుక, తనకు భార్యగా ప్రధానము చేయబడి గర్భవతియై యుండిన మరియతోకూడ ఆ సంఖ్యలో వ్రాయ బడుటకు

5. గలిలయలోని నజరేతునుండి యూదయలోని బేత్లెహేమనబడిన దావీదు ఊరికి వెళ్లెను.

6. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవదినములు నిండెను గనుక

7. తన తొలిచూలు కుమారుని కని, పొత్తిగుడ్డలతో చుట్టి, సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను.

8. ఆ దేశములో కొందరు గొఱ్ఱెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొను చుండగా

9. ప్రభువు దూత వారియొద్దకు వచ్చి నిలిచెను; ప్రభువు మహిమ వారిచుట్టు ప్రకాశించినందున, వారు మిక్కిలి భయపడిరి.

10. అయితే ఆ దూతభయ పడకుడి; ఇదిగో ప్రజలందరికిని కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయు చున్నాను;

11. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి యున్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు

12. దానికిదే మీకానవాలు; ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్ట బడి యొక తొట్టిలో పండుకొనియుండుట మీరు చూచెదరని వారితో చెప్పెను.

13. వెంటనే పరలోక సైన్యసమూహము ఆ దూతతో కూడనుండి

14. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన కిష్టులైన మనుష్యులకు భూమిమీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను.

15. ఆ దూతలు తమయొద్దనుండి పరలోకమునకు వెళ్లిన తరువాత ఆ గొఱ్ఱెల కాపరులుజరిగిన యీ కార్యమును ప్రభువు మనకు తెలియజేయించి యున్నాడు; మనము బేత్లెహేమువరకు వెళ్లి చూతము రండని యొకనితోనొకడు చెప్పుకొని

16. త్వరగా వెళ్లి, మరియను యోసేపును తొట్టిలో పండుకొనియున్న శిశువును చూచిరి.

17. వారు చూచి, యీ శిశువునుగూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి.

18. గొఱ్ఱెల కాపరులు తమతో చెప్పిన సంగతులనుగూర్చి విన్న వారందరు మిక్కిలి ఆశ్చర్యపడిరి.

19. అయితే మరియ ఆ మాటలన్నియు తన హృదయములో తలపోసికొనుచు భద్రము చేసికొనెను.

20. అంతట ఆ గొఱ్ఱెల కాపరులు తమతో చెప్పబడినట్టుగా తాము విన్నవాటిని కన్నవాటినన్నిటినిగూర్చి దేవుని మహిమ పరచుచు స్తోత్రముచేయుచు తిరిగి వెళ్లిరి.

21. ఆ శిశువునకు సున్నతి చేయవలసిన యెనిమిదవ దినము వచ్చినప్పుడు, గర్భమందాయన పడకమునుపు దేవదూతచేత పెట్టబడిన యేసు అను పేరు వారు ఆయనకు పెట్టిరి.
ఆదికాండము 17:12, లేవీయకాండము 12:3

22. మోషే ధర్మశాస్త్రముచొప్పున వారు తమ్మును శుద్ధి చేసికొను దినములు గడచినప్పుడు
లేవీయకాండము 12:6

23. ప్రతి తొలిచూలు మగపిల్ల ప్రభువుకు ప్రతిష్ఠ చేయబడవలెను అని ప్రభువు ధర్మశాస్త్రమందు వ్రాయబడినట్టు ఆయ నను ప్రభువుకు ప్రతిష్ఠించుటకును,
నిర్గమకాండము 13:2, నిర్గమకాండము 13:12, నిర్గమకాండము 13:15

24. ప్రభువు ధర్మశాస్త్ర మందు చెప్పబడినట్టు గువ్వల జతనైనను రెండు పావురపు పిల్లలనైనను బలిగా సమర్పించుటకును, వారు ఆయనను యెరూషలేమునకు తీసికొనిపోయిరి.
లేవీయకాండము 5:11, లేవీయకాండము 12:8

25. యెరూషలేము నందు సుమెయోనను ఒక మనుష్యుడుండెను. అతడు నీతి మంతుడును భక్తిపరుడునైయుండి, ఇశ్రాయేలుయొక్క ఆదరణకొరకు కనిపెట్టువాడు; పరిశుద్ధాత్మ అతనిమీద ఉండెను.
యెషయా 40:1, యెషయా 49:13

26. అతడు ప్రభువుయొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మచేత బయలు పరచబడి యుండెను; ఆత్మవశుడై అతడు దేవాలయము లోనికి వచ్చెను.

27. అంతట ధర్మశాస్త్రపద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తలి దండ్రులు శిశువైన యేసును దేవాలయములోనికి తీసికొనివచ్చినప్పుడు

28. అతడు తన చేతులలో ఆయనను ఎత్తికొని దేవుని స్తుతించుచు ఇట్లనెను

29. నాథా, యిప్పుడు నీ మాటచొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు;

30. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను
యెషయా 40:5, యెషయా 52:10

31. నీవు సకల ప్రజలయెదుట సిద్ధపరచిన
యెషయా 40:5, యెషయా 52:10

32. నీ రక్షణ నేనుకన్నులార చూచితిని.
యెషయా 25:7, యెషయా 42:6, యెషయా 46:13, యెషయా 49:6

33. యోసేపును ఆయన తల్లియు ఆయననుగూర్చి చెప్ప బడిన మాటలను విని ఆశ్చర్యపడిరి.

34. సుమెయోను వారిని దీవించి ఇదిగో అనేక హృదయాలోచనలు బయలు పడునట్లు, ఇశ్రాయేలులో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గురుతుగా ఈయన నియమింపబడియున్నాడు;
యెషయా 8:14-15

35. మరియు నీ హృదయములోనికి ఒక ఖడ్గము దూసికొనిపోవునని ఆయన తల్లియైన మరియతో చెప్పెను.

36. మరియఆషేరు గోత్రికురాలును పనూయేలు కుమార్తెయునైన అన్న అను ఒక ప్రవక్త్రి యుండెను. ఆమె కన్యాత్వము మొదలు ఏడేండ్లు పెనిమిటితో సంసారముచేసి బహుకాలము గడిచినదై,

37. యెనుబది నాలుగు సంవత్సరములు విధవరాలైయుండి, దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్లు సేవచేయుచుండెను.

38. ఆమెకూడ ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి, యెరూషలేములొ విమోచనకొరకు కనిపెట్టుచున్నవారందరితో ఆయనను గూర్చి మాటలాడుచుండెను.
యెషయా 52:9

39. అంతట వారు ప్రభువు ధర్మశాస్త్రము చొప్పున సమస్తము తీర్చిన పిమ్మట గలిలయ లోని నజరేతను తమ ఊరికి తిరిగి వెళ్లిరి.

40. బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు, ఎదిగి బలము పొందుచుండెను; దేవుని దయ ఆయనమీద నుండెను.

41. పస్కాపండుగప్పుడు ఆయన తలిదండ్రులు ఏటేట యెరూషలేమునకు వెళ్లుచుండువారు.
నిర్గమకాండము 12:24-27, ద్వితీయోపదేశకాండము 16:1-8

42. ఆయన పండ్రెం డేండ్లవాడై యున్నప్పుడు ఆ పండుగ నాచరించుటకై వాడుకచొప్పున వారు యెరూషలేమునకు వెళ్లిరి.

43. ఆ దినములు తీరిన తరువాత వారు తిరిగి వెళ్లుచుండగా బాలుడైన యేసు యెరూషలేములో నిలిచెను.

44. ఆయన తలిదండ్రులు ఆ సంగతి ఎరుగక ఆయన సమూహములో ఉన్నాడని తలంచి, యొక దినప్రయాణము సాగిపోయి, తమ బంధువులలోను నెళవైనవారిలోను ఆయనను వెదకుచుండిరి.

45. ఆయన కనబడనందున ఆయనను వెదకుచు యెరూషలేమునకు తిరిగి వచ్చిరి.

46. మూడు దినములైన తరువాత ఆయన దేవాలయములో బోధకుల మధ్య కూర్చుండి, వారి మాటలను ఆలకించుచు వారిని ప్రశ్నలడుగుచు ఉండగా చూచిరి.

47. ఆయన మాటలు వినినవారందరు ఆయన ప్రజ్ఞకును ప్రత్యుత్తరములకును విస్మయ మొందిరి.

48. ఆయన తలిదండ్రులు ఆయనను చూచి మిక్కిలి ఆశ్చర్యపడిరి. ఆయన తల్లికుమారుడా, మమ్మును ఎందుకీలాగు చేసితివి? ఇదిగో నీ తండ్రియు నేనును దుఃఖపడుచు నిన్ను వెదకుచుంటిమని అయనతో చెప్పగా
యెషయా 52:14

49. ఆయనమీరేల నన్ను వెదకుచుంటిరి? నేను నా తండ్రి పనులమీద నుండవలెనని మీరెరుగరా1 అని వారితో చెప్పెను;

50. అయితే ఆయన తమతో చెప్పిన మాట వారు గ్రహింపలేదు.

51. అంతట ఆయన వారితో కూడ బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి యుండెను. ఆయన తల్లి ఈ సంగతులన్నిటిని తన హృదయములో భద్రము చేసికొనెను.

52. యేసు జ్ఞానమందును, వయస్సునందును, దేవుని దయయందును, మనుష్యుల దయ యందును వర్ధిల్లు చుండెను.
1 సమూయేలు 2:26, సామెతలు 3:4బైబిల్ అధ్యయనం - Study Bible
2:1 ఔగుస్తు (ఈ మాటకు "ఘనత వహించినవాడు" అని అర్థం. క్రీ.పూ. 27 లో రోమా చట్ట సభ ఆమోదించిన బిరుదు ఇది) క్రీ.పూ.31 నుంచి క్రీ.శ. 14 వరకు రోమా సామ్రాజ్యానికి కైసరుగా ఉన్నాడు. సర్వలోకమునకు ప్రజా సంఖ్య వ్రాయవలెనని... అనే ఆజ్ఞ రాజ్యంలో పన్నులు వసూలు చేయడం కోసం, దండులో సైనికుల్ని చేర్చుకోవడం కోసం జారీచేస్తారు.

2:2 సిరియకు. రోమీయ గవర్నరుగా కురేనియ రెండుసార్లు, అంటే మొదటిసారి క్రీ.పూ. 6-4 మధ్య కాలంలో, రెండవసారి క్రీ.పూ. 6-9 మధ్య కాలంలో పనిచేశాడని సమాచారం. మొదటి ప్రజాసంఖ్య జరిగినప్పుడు యేసు జన్మించాడు. కురేనియ రెండవ దఫా పరిపాలనలో మరొక జనగణన కూడా జరిగింది (అపొ.కా.5:37). 

2:3-4 తమ తమ పట్టణము అంటే గలిలయలోని నజరేతుకు కాదు, తన పూర్వీకుల పట్టణమైన యూదయలోని బేల్లెహేముకు వెళ్లాడని భావం. బేల్లెహేముకు దావీదు ఊరు అనే పేరుంది. ఎందుకంటే దావీదు అక్కడే పెరిగాడు (1సమూ 16:1). యోసేపు దావీదు వంశం నుంచే వచ్చాడు (లూకా 1:27), నజరేతు బేల్లెహేముకు సుమారు 90 మైళ్ల దూరంలో ఉంటుంది. ఆ ప్రయాణానికి కనీసం మూడు రోజుల సమయం పడుతుంది.

2:5-6 "1:27లో మరియ యోసేపులకు కేవలం ప్రధానము మాత్రమే జరిగింది. వాళ్ల దాంపత్య జీవితం ఇంకా మొదలు కాలేదు. అయినప్పటికీ ఆమె గర్భవతిగా ఉండి (1:31-33 నోట్సు చూడండి) ప్రసవ దినములు నిండి జన్మనివ్వడానికి సిద్ధంగా ఉంది. 

2:7 తొలిచూలు కుమారుడు అనే మాట సహజంగానే మరియ తర్వాత కాలంలో బిడ్డలను కన్నది అనే వాస్తవాన్ని సూచిస్తుంది (మత్తయి 13:55-56). బాలుడైన యేసును పశువుల తొట్టిలో పరుండబెట్టిననేది ఆ కుటుంబం పశువుల కొట్టంలో ఉండవలసి వచ్చిందనే విషయాన్ని తెలియచేస్తుంది. అది బహుశా పశువుల కొట్టంలా పనిచేసిన ఒక గుహ అయ్యుంటుంది. ఎందుకంటే బేల్లెహేములో వాళ్లకు మరెక్కడా స్థలం దొరకలేదు. 

2:8 యెరూషలేములో - దేవాలయంలో అర్పణలకు ఉపయోగించబడే గొర్రెలు యెరూషలేముకు బయట పొలాల్లో ఉంచబడేవి. రాత్రివేళ దొంగల నుంచి, క్రూరమృగాల నుంచి ఆపద పొంచి ఉంటుంది. కాబట్టి గొర్రెల కాపరుల సంరక్షణ ఆ సమయంలో అత్యవసరం. గొర్రెల కాపరులకు ఆనాటి సమాజంలో విలువ లేదు. అయితే తరచుగా బైబిల్లో వారి పాత్ర గొప్పదిగా పరిగణించబడింది. లేఖనం దేవుణ్ణి కాపరిగా చిత్రించింది. (ఆది 49:24; కీర్తన 23:1). దేవుని ప్రజలకు దావీదు రాజు కాపరి (2సమూ 5:2). యేసు తన్నుతాను “మంచి కాపరి" అని పిలుచుకున్నాడు (యోహాను 10:11). 

2:9-10 ఆ రాత్రివేళ చీకట్లో ప్రభువు మహిమ గొప్ప వెలుగుగా ప్రకాశించింది. ఈ వెలుగు దేవుని మహిమకరమైన సన్నిధిని సూచిస్తుంది. దేవదూతను చూసి మిక్కిలి భయపడడం సహజమే (1:11-12 నోట్సు చూడండి). అకస్మాత్తుగా ఆకాశం నుంచి రాత్రివేళ వచ్చిన దేదీప్యమానమైన వెలుగు వాళ్ల భయాన్ని రెట్టింపు చేసింది. గొర్రెల కాపరులను భయపడవద్దని చెప్పి, వాళ్ల దృష్టిని సువర్తమానము పైకి దేవదూత మళ్లించాడు. ప్రజలందరికీ అనే మాట ఇశ్రాయేలును సూచిస్తూ ఉండవచ్చు. అయితే అన్యజనులకు సువార్త ప్రకటించడంపైన దృష్టి సారించిన లూకా “అన్ని జాతుల వారికీ” అని భావించి ఉంటాడు.

2:11-12 రక్షకుడు అంటే “విడిపించేవాడు, విమోచించేవాడు”. క్రీస్తు (క్రిస్టోస్ అనే గ్రీకు మాట మషియాక్ అనే హెబ్రీ పేరుకు సమానమైంది) అంటే అభిషిక్తుడు అని అర్థం. మరి ముఖ్యంగా ఆయన రాజుగా అభిషేకించబడ్డాడనే విషయంపై ఈ పేరు దృష్టిసారిస్తుంది. ప్రభువు (గ్రీకు. "కురియోస్") అనే బిరుదు లౌకిక పరిపాలకులకు వర్తిస్తుంది. అయితే యాహ్వే అనే దేవుని హెబ్రీ నామాన్ని తరచుగా ప్రభువు అని అనువదించారు. మెస్సీయ జన్మించాడనే వార్త విని గొర్రెల కాపరులు సంభ్రమాశ్చర్యాలకు గురైయుంటారు. అయితే బీదవారైన స్త్రీ, పురుషులకు ఆయన జన్మించి పశువుల తొట్టిలో పరుండపెట్టబడి ఉండడం గురించి విని వాళ్లు ఒకింత విస్మయానికి గురైయుంటారు. 

2:13-14 పరలోక సైన్యసమూహము పాడిన స్తుతి పాట నేడు అందరికీ సుపరిచితమే (సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ అని వ. 14 ప్రారంభంలో ఉన్న మాటలు లాటిన్ వల్గేట్ బైబిల్ లో “గ్లోరియా ఇన్ ఎక్సెల్సిస్ డియో" అని ప్రసిద్ధికెక్కాయి). "దేవునికి మహిమ" నివ్వడం అంటే ఆయనకు ఇంతకు ముందు కొదువగా ఉన్న దాన్ని ఇవ్వడం కాదు, అనాదిగా ఆయన కలిగి ఉన్న అద్భుతమహిమను ఒప్పుకోవడం. భూమి మీద సమాధానము అంటే రోమా సామ్రాజ్యం వలన ఆనాడు కలిగిన సార్వత్రిక శాంతి కాదు, యేసుక్రీస్తులో విశ్వాసం ద్వారా దేవునితో ఏర్పడే శాంతి సంబంధం అని అర్థం (రోమా 5:1; లూకా 1:78-79 నోట్సు చూడండి). ఆయనకు ఇష్టులైన మనుషులు అంటే క్రీస్తు ద్వారా తమకు అర్హతలేని దేవుని కృపను పొందుకున్న వ్యక్తులు.

2:15 జరిగిన యీ కార్యము అనేది ప్రభువును క్రీస్తునైన రక్షకుని జన్మను సూచిస్తుంది (వ.11,12 నోట్సు చూడండి). 

2:16 తొట్టిలో పండుకొని యుండుట గురించి వ.7 నోట్సు చూడండి. 

2:17 ఈ శిశువును గురించి తమతో చెప్పబడిన మాటలు గురించి వ.9-10 నోట్సు చూడండి. 

2:18 దానిని వినిన వారందరు అంటే గొర్రెల కాపరులు ఆ సందేశాన్ని ఎవరితో పంచుకోడానికి అవకాశం వచ్చిందో బేబ్లె హేము పరిసర ప్రాంతాలకు చెందిన ఆ ప్రజలు అని అర్థం (వ.8-14). 

2:19 మరియ జరిగిన ఈ సంఘటనలన్నింటినీ తన హృదయములో.... భద్రము చేసుకుంది. 1,2 అధ్యాయాల్లో కనబడుతున్న ఈ సంగతులన్నింటినీ లూకా తప్పనిసరిగా మరియ దగ్గర నుంచే సేకరించి ఉంటాడనే విషయం సుస్పష్టం. 

2:20 బేల్లెహేముకు వెలుపల పొలాల్లో ఉన్న తమ మందలను కాచుకోడానికి గొట్టెల కాపరులు... తిరిగి వెళ్ళిరి. బేల్లెహేములో పరిస్థితులన్నీ దేవదూత వారికి చెప్పినట్లే ఉన్నాయి కాబట్టి వాళ్లు దేవుని మహిమపరచుచు స్తోత్రము చేయుచు వెళ్ళారు (వ. 10-12).

2:21 సున్నతి... ఎనిమిదవ దినము అనే విషయాలపై వ.1:59-63 నోట్సు చూడండి. యేసు అనే నామం గురించి 1:31-33 నోట్సు చూడండి. 

2:22-24 శిశువు సున్నతి జరిగిన తర్వాత మరొక 33 రోజులపాటు వారు తమనుతాము శుద్ధి చేసికొను దినములు కొనసాగేవి (లేవీ 12:2-8) ప్రభువుకు ప్రతిష్ఠ చేయబడడం అంటే ఇశ్రాయేలులో ప్రతి తొలిచూలు మగపిల్లను ప్రభువుకు సమర్పించాల్సి ఉంది. (నిర్గమ 13:2,12), గువ్వల... పావురపు పిల్లల బలి అర్పణల గురించి లేవీ 12:8 నోట్సు చూడండి. 

2:25-26 జెకర్యా, ఎలీసబెతు (1:6-7 నోట్సు . చూడండి) ల వలెనే సుమెయోను కూడా నీతిమంతుడు. ఇశ్రాయేలు యొక్క ఆదరణ అనే మాట దేవుడు తన ప్రజల పట్ల కలిగి ఉన్న ప్రణాళికలో ప్రజలకు ఉన్న ఆదరణ, నిరీక్షణలను సూచిస్తున్నది. మరిముఖ్యంగా ఆ ప్రణాళికలో అది మెస్సీయ పాత్రను సూచిస్తుంది. పా.ని.లో పరిశుద్దాత్మ ఎంపిక చేయబడిన కొద్దిమంది ప్రజలపైకే దిగివచ్చేవాడు. (సంఖ్యా 24:2; 1సమూ 10:10; 16:13). పెంతెకొస్తు తర్వాత విశ్వాసులందరిలోనూ పరిశుద్దాత్ముడు నివసించాడు (యోహాను 14:16-17; 1కొరింథీ 3:16). యోహాను గురించి ప్రవచించేలా పరిశుద్ధాత్మ జెకర్యాను నింపాడు (లూకా 1:67-79). సుమెయోను విషయంలో, యేసు గురించి అతడు ప్రవచించగలిగేలా, మెస్సీయను చూసేటంత వరకు - అతడు జీవించే ఉంటాడని అతనికి పరిశుద్దాత్మ అభయమిచ్చాడు (2:29-32). 

2:27 పరిశుద్దాత్మ సుమెయోనును సరైన స్థలానికి (దేవాలయము) సరైన సమయంలో (ధర్మశాస్త్ర పద్దతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు... శిశువైన యేసును... తీసుకువచ్చిన సమయానికి).. నడిపించాడు. వ.21,22-24 నోట్సు చూడండి.. 

2:28-32 సుమెయోను పలికిన ఈ మాటలకు లాటిన్ వల్గేటు అనువాదంలో “నంక్ డిమిట్టిస్” అనే పేరుంది. నీ రక్షణ (అంటే క్రీస్తు) నువ్వు చూస్తావని సుమెయోను. నాధుడు అతనికి వాగ్దానం చేశాడు, దాన్ని నెరవేర్చాడు కాబట్టి ఇక ఇప్పుడు అతడు కన్నుమూయవచ్చు. (దాసుని పోనిచ్చుచున్నావు). క్రీస్తులో దేవుని రక్షణ (వ.30) అందరికీ (అన్యజనులకు... ఇశ్రాయేలుకు) చెందింది. తాను రాసిన సువార్త గ్రంథంలోనూ, అపొస్తలుల కార్యాల్లోనూ సువార్త ప్రపంచవ్యాప్తంగా ఉద్దేశించబడిందనే అంశాన్ని లూకా స్థిరంగా తెలియచేస్తున్నాడు. 

2:33-35 మరియ గర్భం ధరించడంలో పరిశుద్దాత్ముడే కారకుడైనప్పటికీ (1:34-35), చట్టబద్ధంగా యేసుకు తండ్రి యోసేపు (3:28-38 నోట్సు చూడండి). యేసు ఆధ్యాత్మిక విషయాల్లో సమాజాన్ని విభజనకు గురిచేస్తాడు (వివాదాస్పదమైన గురుతు). క్రీస్తు సువార్తను గురించి ఆలోచిస్తూ ఇశ్రాయేలులో అనేకులు అవిశ్వాసం వలన నిత్యనాశనంలో పడిపోయారు, ఇతరులు విశ్వాసం ద్వారా నిత్యజీవానికి లేచారు. యేసు తృణీకరించబడి, సిలువ మరణానికి గురైనప్పుడు చూసి మరియ గొప్ప బాధను అనుభవించబోతుంది. ప్రజలు యేసుకు ఎలా స్పందిస్తారనేదే క్షమాపణను లేక శిక్షనూ, పరలోకాన్ని లేక నరకాన్ని నిర్దేశించే విషయం . 

2:36-38 ప్రవచనం చెప్పిన సుమెయోను అనే పురుషుని నుండి వెంటనే అన్న అనే ప్రవక్తియైన స్త్రీ వైపుకు దృష్టి సారించడం ద్వారా లూకా స్త్రీలకు తన సువార్త గ్రంథంలో ఇచ్చిన ప్రాధాన్యతను మరొకసారి మనకు చూపిస్తున్నాడు. కొ.ని.లో ప్రస్తావించబడిన ఇతర ప్రవక్తినులు ఫిలిప్పు కుమార్తెలు (అపొ.కా. 21:8-9). ఏడేండ్లు వైవాహిక జీవితం గడిపిన తర్వాత ఆమె యెనుబది నాలుగు సంవత్సరములు విధవరాలుగా ఉంది అంటే ఆమె వయసు 100 సంవత్సరాలు పైగానే ఉండి ఉంటుంది. అన్న ప్రవక్తిగానే కాక ప్రార్థనా పరిచర్యకు కూడా తనను తాను అంకితం చేసుకుంది. యెరూషలేము యూదులకు రాజధాని కాబట్టి యెరూషలేము విమోచన అంటే ఇశ్రాయేలు ప్రజలందరి విమోచన అని అర్థం. 

2:39 తూర్పుదేశపు జ్ఞానుల సందర్శన, బాలునిగా ఉన్న మెస్సీయను హేరోదు రాజు చంపడానికి ప్రయత్నించ బోతున్నాడనే వార్తను తెలుసుకుని మరియ, యోసేపులు యేసును ఐగుప్తుకు తీసుకెళ్లడం మొదలైన ప్రముఖమైన సంగతులు మత్తయి తన సువార్త గ్రంథంలో రాశాడు (మత్తయి 2:1-23). అయితే లూకా ఈ వృత్తాంతాన్ని తన గ్రంథంలో చేర్చలేదు. 

2:40 బాలుడైన యేసుని గురించిన వివరణ, 1:80లో బాప్తిస్మమిచ్చే యోహాను గురించిన వివరణను పోలి ఉంది. యేసు జ్ఞానముతో నిండుకొనుచు వున్నాడనీ, దేవుని దయ ఆయన మీదనుండెననీ అదనపు అంశాలు నొక్కి చెప్పబడ్డాయి (అపొ.కా. 6:8,10లో సైఫను గురించి ఇలాంటి వివరణనే చూడవచ్చు. 

2:41-42 యేసు బాల్య జీవితానికీ, యోహానుచేత బాప్తిస్మం పొందడానికీ -- మధ్య కాలంలో యేసు జీవితం గురించి లేఖనం తెలియజేసిన ఒకే ఒక్క సంఘటన ఇది (3:21-22). పస్కా పెంతెకొస్తు, పర్ణశాలల పండుగ అనే వార్షిక పండుగలకు యూదుల్లో పురుషులు వాళ్ల కుటుంబాలతో యెరూషలేముకు యాత్ర చేయాలని పా.ని. ఆదేశించింది. యూదుజాతికి చెందిన బాలుడు పురుషునిగా గుర్తించబడే వయస్సు 13 సంవత్సరాలు. ఈ సందర్భంలో జరిగే వేడుకను బార్ - మిట్టి వాహ్ (ఆజ్ఞ పుత్రుడు) అంటారు. యేసు ఇప్పుడు పండ్రెండేండ్లవాడు కాబట్టి ఆయన పురుషునిగా పరిగణించబడడానికి ముందు ఆయనకు ఇదే ఆఖరి పస్కా పండుగ. 

2:43-45 యేసు గురించి చింతపడడానికి ముందు మరియ, యోసేపులు ఒక దిన ప్రయాణము చేశారు. ఎందుకంటే తమతోబాటు ప్రయాణిస్తున్న ఇతర గుంపులలో ఆయన ఉన్నాడని వారు భావించారు. ప్రతీ విషయంలోనూ ఆయన మరియ యోసేపులకు విధేయుడయ్యాడు. విధేయత చూపకపోవడం ఆయన స్వభావానికి పూర్తిగా విరుద్ధం (వ.51 చూడండి).

2:46-47 యేసును వెదకడానికి మూడు దినములు పట్టింది. యెరూషలేము నుంచి వెళ్లడానికి మొదటి రోజు, తిరిగి యెరూషలేముకు వెళ్లడానికి రెండవరోజు, నగరంలో యేసును వెదకడానికి మూడవరోజు. బోధకులు అంటే మోషే ధర్మశాస్త్రాన్ని ఎరిగిన పండితులైన రబ్బీలు. రబ్బీలు ఒక బాలునితో అలా చర్చించడానికి అంగీకరించడం అనేదే అసాధారణమైన విషయం . ఒక బాలుని అద్భుతమైన లేఖన ప్రజ్ఞ వాళ్లను ఆశ్చర్యచకితుల్ని చేయడం మరింత విస్మయకరమైన విషయం.

2:48-50 నా తండ్రి ఇల్లు (అంటే దేవాలయం) అన్నప్పుడు యేసు తన పరలోక తండ్రి గురించి ప్రస్తావిస్తున్నాడు. ఈ విషయం యోసేపు, మరియలకు అర్థం కాలేదు. ఆ పరలోక తండ్రికి ఆయన విధేయుడవ్వాలి. అలాంటి విధేయత కొన్ని సందర్భాల్లో అతని ఇహలోక తల్లిదండ్రులకు తక్కువ ప్రాధాన్యతనిచ్చేలా చేసినా సరే, ఆయన తన పరలోక తండ్రికే లోబడ్డాడు. 2:51 ఈ సంగతులన్నింటినీ ఆమె తన హృదయములో భద్రము చేసికొనెను అనే మాట వ. 19 లాగా ఉంది. ఈ మాట, 1,2 అధ్యాయాల్లో మాత్రమే కనబడే విషయాలు, లూకా మరియ దగ్గర నుంచే సేకరించాడని సూచిస్తుంది. 

2:52 యోసేపు మరియలకు విధేయునిగా జీవించిన సంవత్సరాల్లో, యేసు నిరంతరం జ్ఞానమందును (మేథస్సు, ఆచరణాత్మక పరిశుద్ధతలలో), వయస్సునందును, దేవుని దయయందును (తండ్రికి ఆత్మీయంగా సన్నిహితంగా ఉండడంలో) మనుష్యుల దయలో (సమాజంలో గౌరవ మర్యాదల్లో) ఎదిగాడు. యవ్వన బాలునిగా ఉన్నప్పుడు యేసు జ్ఞానం గమనించదగినదే (వ.40 నోట్సు చూడండి). 12 ఏళ్ల వయసులో ఆయన జ్ఞానానికి రబ్బీలు ఆశ్చర్యచకితులయ్యారు. తన పరిచర్య ప్రారంభించే నాటికి ఆయన జ్ఞానం శిఖరస్థాయికి చేరుకుని ఉంటుంది.


Shortcut Links
లూకా - Luke : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary |