2:1-2 తప్పుచేసిన విశ్వాసులను దుఃఖపెట్టేలా క్రైస్తవుడు ప్రవర్తించడం సమంజసమే అయినా, దుఃఖపరచినవాణ్ణి, దుఃఖపడినవాడే సంతోషపరచే స్థానంలోకి రావడం చాలా కష్టం. అలాంటి సంఘటన తర్వాత వారికి చాలా ప్రోత్సాహం అవసరం.
2:3-4 వ్రాసితిని... వ్రాసితిని అనే పౌలు మాటలు, అతడు కొరింథుకు చేసిన బాధాకరమైన ప్రయాణం తర్వాత తీతు ద్వారా పంపి, మనకు లభించకుండా పోయిన కఠినమైన ఉత్తరాన్ని గురించి పేర్కొంటూ ఉండవచ్చు (7:6-8). కానీ కొందరు బైబిల్ పండితులు అది 1కొరింథీ పత్రిక అని
భావిస్తారు. సేవకులు దేవునిలో సంతోషించడం ఎంత సమంజసమో వారు ఎవరికైతే పరిచర్య చేస్తున్నారో వారి పట్ల ఖరీదైన ప్రేమ చూపడం కూడా అంతే సమంజసం.
2:5 ఇది 1కొరింథీ. 5:1-5 లోని వావి వరసలు తప్పి పాపం చేసిన వ్యక్తిని గురించి కావచ్చు. దొంగ అపొస్తలులను గురించిన సూచన కూడా అయ్యేందుకు మరింత అవకాశం ఉంది. (2కొరింథీ 11:4). ఎందుకంటే పౌలు తాను వ్యక్తిగతంగా క్షమించిన ఒక పాపాన్ని గురించి చెబుతున్నాడు (2:10).
2:6-7 సంఘ క్రమశిక్షణ ఒక శిక్షలా అనిపించినా, దాని ఉద్దేశం మాత్రం విమోచనాత్మకం. ఎవరైనా మారుమనస్సు పొందితే, విశ్వాసులు అతణ్ణి క్షమించి ఆదరించుట మంచిది. సంఘానికి తిరిగి వచ్చిన పాపిని అత్యధికమైన దుఃఖములో ముంచకూడదు. సంఘం విధించగలిగిన అతి తీవ్రమైన క్రమశిక్షణా చర్య వెలివేయడమే (మత్తయి 18:17; 1కొరింథీ 5:5).
2:8 వానియెడల మీ ప్రేమను స్థిరపరచడం అంటే పశ్చాత్తాపం పొందిన వానిని పునరుద్ధరించడాన్ని సూచిస్తుంది.
2:9 వ్రాసితిని గురించి వ.3-4 నోట్సు చూడండి.
2:10 మొదటి క్రియాపదం (క్షమించుచున్నారో), క్షమించడం అనేది ఒక ప్రక్రియ అని సూచిస్తుంది (గ్రీకు. వర్తమాన కాలం), రెండవ క్రియాపదం (క్షమించుచున్నాను) క్షమాపణా కార్యాన్ని సంపూర్తి చేయమని సూచిస్తుంది. (గ్రీకు సంపూర్ణ భూతకాలం).
2:11 కొరింథీ సంఘంలోని పాపం, అనైక్యత వెనుక పౌలు దుష్టుడైన సాతానును గమనించాడు. వాని తంత్రములు ఎల్లప్పుడూ విశ్వాసుల ఐక్యతను చెడగొట్టడమే. విశ్వాసుల ఐక్యత కోసమే యేసు తీవ్రంగా ప్రార్థించాడు (యోహాను 17 అధ్యా. ).
2:12-13 ఆసియా ప్రాంతంలోని ఉత్తరభాగంలో ఉన్న తీరపట్టణం త్రోయ. ఎఫెసులో అల్లరి జరిగిన తర్వాత (అపొ.కా. 19:23-41) మాసిదోనియకు వెళ్తూ పౌలు అక్కడికి వెళ్ళాడు. (అపొ.కా.20:1-2). తీతు అపొస్తలుల కార్యములు గ్రంథంలో పేర్కొనబడలేదు. అన్యజనులు సున్నతి వంటి ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండానే మారుమనసు పొందవచ్చు అనడానికి పౌలుకు అతడొక రుజువు (గలతీ 2:3). పౌలు (యూదుడు) తిమోతిని, తీతును సహోదరుడు (1:1) అని పిలవడం, అతని ప్రాథమిక గుర్తింపు క్రైస్తవుడే గాని యూదుడు కాదని సూచిస్తుంది. కొరింథులో వచ్చిన సంక్షోభాన్ని సరిచేయడానికి పౌలు ప్రతినిధిగా తీతు సమర్థవంతంగా వ్యవహరించాడు. తరువాత అతడు అపొస్తలుని ప్రతినిధిగా క్రేతులో ఉన్న క్రైస్తవుల దగ్గరకు వెళ్ళాడు (తీతు 1:4).
2:14 ప్రాచీనకాలాల్లో విజేతలైన సైన్యాధిపతులు తమ రాజధాని నగరంలోని రాజ ప్రాసాదానికి, తాము బందీలుగా తెచ్చినవారిని, వారి వెనుక తాము కొల్లగొట్టిన సంపదను ప్రదర్శిస్తూ కవాతుగా వచ్చేవారు. మధురమైన సాంబ్రాణి ధూపం వేసేవారు. నగర ప్రజలు వారి విజయపు రుజువును ఆఘ్రాణించేవారు. ఇక్కడ క్రీస్తు పౌలునూ, మిగిలిన విశ్వాసులందరినీ, దేవుడు రాజుగా ఉన్న నిత్య పట్టణంలోకి నడిపిస్తున్నాడు.
2:15-16 ఈ వచనాల్లో రెండు వ్యతిరేక జంటపదాలు, లోపలి రెండు మూలకాలు వ్యతిరేకంగా, బయటి రెండు అనుకూలంగా ఉండేలా సముచ్చయం చేయబడ్డాయి. ఒకే సువాసన రెండు ఫలితాలను ఇస్తుంది. సువార్త సందేశం ద్వారా క్రీస్తు జ్ఞానాన్ని స్వీకరించేవారు జీవిస్తారు. మిగిలిన అందరూ నశించిపోతారు.
2:17 దేవుని వాక్యమును కలిపి చెరిపెడు వారు అంటే ప్రాథమికంగా ఆర్ధికలాభం కోసమే కొరింథులో ఉన్న దొంగ అపొస్తలులు (11:13). క్రైస్తవులు దేవుని పరిచర్యలకు ఆర్థికంగా సహాయం చేయడాన్ని సమర్థిస్తూనే, సంఘాలలో ఎలాంటి జీతం తీసుకోకుండా పనిచేయడం పౌలు విధానం (1కొరింథీ. 9:12-15). సందేశం విషయంలో జవాబుదారీతనం సందేశం ఎవరి నుండి వస్తుందో వారి పైనే ఉంటుంది.