15:1 బలవంతులు బలహీనుల మనస్సాక్షికి ఎందుకు లోబడాలి? ఎందు కంటే ప్రేమ మార్గం అలా కోరుతుంది. బలమైన విశ్వాసి తన స్వాతంత్ర్యాలలో కొన్నిటికి దూరం కావడం చేత తన మనస్సాక్షిని విడిచి పెట్టడు.... కానీ బలహీన విశ్వాసి బలమైనవాని స్వేచ్ఛకు స్థానమివ్వడానికి తన మనస్సాక్షిని ఉల్లంఘించాల్సి రావచ్చు. అందువల్ల బలమైనవాడు - బలహీనునికి అనుగుణంగా మారాలి.
15:2-3 బలమైన విశ్వాసి, తన్నుతాను సంతోషపరచుకొనని తన ప్రభువు మాదిరిని అనుసరించాలి. లేఖనాల్లో ముందే చెప్పినట్లు, జనులకు దేవునిపై ఉన్న శత్రుత్వాన్ని, అవమానాలను యేసు భరించాడు (కీర్తన 69:9).
15:4 క్రైస్తవ విశ్వాసానికి సంబంధం లేదు అనడానికి దూరంగా, పా.ని. రచనలు మనకు బోధ కలుగుటకు రాసారు (2తిమోతి 3:16-17), అందులో ఉన్న ప్రతిదీ కొత్త నిబంధన శిష్యత్వానికి వర్తించదు, కానీ ప్రతిదీ యేసువైపుకు చూపిస్తుంది (లూకా 24:27).
15:5-6 రోమాలో ఇంట ఉన్న సంఘాలన్నిటినీ సమన్వయం చేసి, అవన్నీ దేవునికి శ్రేష్టమైన ఘనత తెచ్చునట్లుగా ప్రేమ, ఐక్యతతో ఉండాలని పౌలు ప్రార్థన.
15:7-8 యూదులు, అన్యజనుల నేపథ్యం నుండి వచ్చినవారు ఒకరినొకరు అంగీకరించడానికి ఇబ్బందిపడినట్లు ఈ వచనాలు చూపిస్తున్నాయి.యేసు క్రీస్తుగా యూదుడుగా జన్మించి, పా.ని. వాగ్దానములు, ప్రవచనాలు నెరవేర్చడానికి ఇశ్రాయేలీయులకు పరిచర్య చేశాడు ("ఇశ్రాయేలు ఇంటివారై నశించిన గొట్టెలయొద్దకే... నేను పంపబడితిని” మత్తయి 15:24). ఆయన ప్రాథమిక ఉద్దేశం ఇశ్రాయేలీయుల కోసమే, కానీ సమస్త జనాంగముల (అన్యజనులు) విషయంలో కూడా ఆయనకు ప్రణాళిక ఉంది.
15:9-12. పా.ని. నుండి వరసగా చెప్పిన లేఖనాలు దేవుని ప్రణాళికలను చూపిస్తున్నాయి. ధర్మశాస్త్రము, చరిత్ర గ్రంథాలు, కీర్తనలు, ప్రవక్తల నుండి పేర్కొన్న వచనాలు అన్యజనులు స్వీకరించబడడాన్ని, దేవుని స్తుతిని సూచిస్తు న్నాయి. కీర్తన 18:49లో మెస్సీయ మారుమనస్సు పొందిన అన్యజనుల మధ్య నిలబడి, తన స్తుతితో పాటు, వారి స్తుతిని తండ్రికి అర్పిస్తాడు. ద్వితీ 32:43లో దేవునికి ఉత్సాహ స్తుతులు అర్పించే ఇశ్రాయేలీయులతో చేరమని అన్యజనులకు మోషే ఆజ్ఞ ఇస్తాడు. కీర్తన 117 అతి చిన్న కీర్తన.
జనాంగముల నుండి సార్వత్రిక స్తుతికోసం అందులో పిలుపు ఉంది. యెషయాలో దావీదు సంతానపు రాజైన మెస్సీయ, ఇశ్రాయేలీయులకు మాత్రమే. కాక సమస్త జాతులకు నిరీక్షణగా వర్ణించబడ్డాడు. (యెషయా. 11:10).
15:13 వారి మధ్య పనిచేస్తున్న పరిశుద్దాత్మ పుట్టించిన దైవిక నిరీక్షణను నొక్కి చెబుతూ, పౌలు సంఘాలకు రెండవ ఆశీర్వాదాన్ని ఇచ్చాడు.
15:14-16 రోమాలోని క్రైస్తవులు సమర్థమైన సేవకు, ఆరోగ్యకరమైన సంఘజీవితానికై దేవుని వరాన్ని పొందారని పౌలు రూఢిగా నమ్మాడు. ఈ అవసరాలు తీర్చకుండా దేవుడు తన సంఘాన్ని నిర్మించడు. అయినప్పటికీ తనను ప్రత్యేకంగా అన్యజనులకు అపొస్తలుడుగా పిలిచి, సిద్దపరచాడని పౌలుకు తెలుసు.
కాబట్టి అతడు రాసింది రోమాలో ఇంటనున్న సంఘాలు పరిపక్వతలోకి ఎదిగేటట్లు సహాయపడేందుకైంది. అన్యజనులను దేవునికి అర్పించే యాజకుడుగా అతడు పరిచర్య చేసి, ఈ అర్పణ పరిశుద్ధమైనదిగాను, అంగీకృతమైనదిగాను, దేవునికి ప్రీతికరమైనదిగాను ఉండాలని కోరుకున్నాడు (12:1-2).
15:17-19 సువార్తను యెరూషలేము మొదలుకొని రోమా ప్రాంతంలోని ఇల్లూరికు (నేటి అల్బేనియా) వరకు విస్తరింప జేయడానికి దేవుడు తనను ఎలా వాడుకున్నాడో పౌలు రోమా విశ్వాసులతో చెప్పి క్రీస్తు యేసును బట్టి... అతిశయపడాలని కోరుకున్నాడు. దేవుడు అతని పరిచర్యను
క్రియచేతను...మహత్కార్యముల బలము చేతను అనేకుల మారుమనస్సు చేతను నిర్ధారించాడు. రోమా విశ్వాసులు ఈ సాక్ష్యం చేత ఆదరించబడి వుంటారు. ఎందుకంటే అది రక్షణ నిమిత్తం వారు తమ నిరీక్షణను సురక్షితమైన ఆధారంపై ఉంచారని చూపిస్తూ ఉంది. ఆ
15:20-21 పది - సంవత్సరాలలో రోమా సామ్రాజ్యంలోని తూర్పు భాగమంతటిలో మొదటి తరం సంఘస్థాపకుడుగా దేవుడు పౌలును ఉపయోగించుకున్నాడు. తన పరిచర్య పా.ని. మెస్సీయ ప్రవచనాన్ని బట్టి (యెషయా 52:15) ఉందని పౌలు భావించాడు. అతడు నాటాడు; ఇతరులు వచ్చి నీరు పోస్తారు, దేవుడు వృద్ధిని కలుగజేస్తాడు (1కొరింథీ 3:3-9).
15:22-24 రోమా సామ్రాజ్యంలోని తూర్పుభాగంలో పౌలు దేవుని కోసం చేసిన “పని”, అతడు త్వరగా రోమాకు రాకుండా ఆపింది, కానీ ఇప్పుడు పని పూర్తయింది కాబట్టి అతడు మార్గములో రోమా పట్టణం నుండి రోమా సామ్రాజ్యంలోని పశ్చిమభాగానికి (స్పెయిను) వెళ్ళే సువార్త పరిచర్య యాత్ర చెయ్యాలని ఉద్దేశిస్తున్నాడు. పౌలు అసలు ఎప్పటికైనా స్పెయిన్ వెళ్ళాడా అనేదాని గురించి భిన్నవాదాలు ఉన్నాయి. పౌలు స్పెయిన్కు వెళ్ళి చేసిన పరిచర్యను గూర్చి బైబిల్లో ప్రస్తావన లేదు.
15:25-29 పౌలు యెరూషలేము పట్టణ సంఘములో ఉన్న యూదులలో పేదవారికి అన్యజనుల సంఘాలనుండి ఒక కానుకను తీసుకువెళ్ళే దారిలో ఉన్నాడు. తరువాత అతడు రోమాకు రావడానికి ఉద్దేశిస్తున్నాడు. అయితే, రోమాకు తాను బందీగా కొనిపోబడతానని అతనికి తెలియదు. (అపొ.కా. 25:11-28:14,30-31).
15:30-33 పౌలు మూడు ప్రార్థనా వినతులు చేశాడు: (1) యూదయలో ఉన్న అవిశ్వాసులైన యూదుల చేతిలో పడకుండా విడిపింపబడాలని, (2) అన్యజనులైన క్రైస్తవులు ఇచ్చిన సహాయం యూదులైన క్రైస్తవులు స్వీకరించాలని, (3) అతడు రోమాకు రావాలని. మూడింటికీ జవాబు వచ్చింది; అపొ.కా. 23:10; 21:17-20; 25:11-12 వరుసగా చూడండి.