Song of Solomon - పరమగీతము 4 | View All

1. నా ప్రియురాలా, నీవు సుందరివి నీవు సుందరివి నీ ముసుకుగుండ నీ కన్నులు గువ్వకన్నులవలె కనబడు చున్నవి నీ తలవెండ్రుకలు గిలాదు పర్వతముమీది మేకల మందను పోలియున్నవి.

2. నీ పలువరుస కత్తెరవేయబడినవియు కడుగబడి అప్పుడే పైకి వచ్చినవియునై జోడుజోడు పిల్లలు కలిగి ఒకదానినైన పోగొట్టుకొనక సుఖముగానున్న గొఱ్ఱెల కదుపులను పోలియున్నది.

3. నీ పెదవులు ఎరుపునూలును పోలియున్నవి. నీ నోరు సుందరము నీ ముసుకుగుండ నీ కణతలు విచ్చిన దాడిమ ఫలము వలె నగపడుచున్నవి.

4. జయసూచకముల నుంచుటకై దావీదు కట్టించిన గోపురముతోను వేయి డాలులును, శూరుల కవచములన్నియును వ్రేలాడు ఆ గోపురముతోను నీ కంధరము సమానము.

5. నీ యిరు కుచములు ఒక జింకపిల్లలయి తామరలో మేయు కవలను పోలియున్నవి.

6. ఎండ చల్లారి నీడలు జరిగిపోవువరకు గోపరస పర్వతములకు సాంబ్రాణి పర్వతములకు నేను వెళ్లుదును.

7. నా ప్రియురాలా, నీవు అధికసుందరివి నీయందు కళంకమేమియు లేదు.

8. ప్రాణేశ్వరీ, లెబానోను విడిచి నాతోకూడ రమ్ము లెబానోను విడిచి నాతో కూడ రమ్ము అమానపర్వతపు శిఖరమునుండి శెనీరు హెర్మోనుల శిఖరమునుండి సింహవ్యాఘ్రములుండు గుహలుగల కొండలపైనుండి నీవు క్రిందికి చూచెదవు.

9. నా సహోదరీ, ప్రాణేశ్వరీ, నీవు నా హృదయమును వశపరచుకొంటివి ఒక చూపుతో నా హృదయమును వశపరచుకొంటివి. నీ హారములలో ఒకదానిచేత నన్ను వశపరచుకొంటివి.

10. సహోదరీ, ప్రాణేశ్వరీ, నీ ప్రేమ ఎంత మధురము! ద్రాక్షారసముకన్న నీ ప్రేమ ఎంత సంతోషకరము నీవు పూసికొను పరిమళ తైలముల వాసన సకల గంధవర్గములకన్న సంతోషకరము.

11. ప్రాణేశ్వరీ, నీ పెదవులు తేనియలొలుకుచున్న ట్టున్నవి నీ జిహ్వక్రింద మధుక్షీరములు కలవు నీ వస్త్రముల సువాసన లెబానోను సువాసనవలె నున్నది.

12. నా సహోదరి నా ప్రాణేశ్వరి మూయబడిన ఉద్యానము మూతవేయబడిన జలకూపము.

13. నీ చిగురులు దాడిమవనము వింతైన శ్రేష్ఠ ఫలవృక్షములు కర్పూరవృక్షములు జటామాంసి వృక్షములు

14. జటామాంసియు కుంకుమయు నిమ్మగడ్డియు లవంగపట్టయు వివిధమైన పరిమళతైల వృక్షములు గోపరసమును అగరు వృక్షములు నానావిధ శ్రేష్ఠ పరిమళద్రవ్యములు.

15. నా సహోదరీ, నా ప్రాణేశ్వరీ, నీవు ఉద్యానజలాశయము ప్రవాహజలకూపము లెబానోను పర్వతప్రవాహము.

16. ఉత్తరవాయువూ, ఏతెంచుము దక్షిణవాయువూ, వేంచేయుము నా ఉద్యానవనముమీద విసరుడి దాని పరిమళములు వ్యాపింపజేయుడి నా ప్రియుడు తన ఉద్యానవనమునకు వేంచేయును గాక తనకిష్టమైన ఫలముల నతడు భుజించునుగాక.బైబిల్ అధ్యయనం - Study Bible
4:1-5:1 వివాహపు రాత్రి షూలమ్మితిలోని ఏడు గుణలక్షణాల గురించిన ప్రశంశతో ఆరంభమై (4:1-7), ఆ తరువాత ఆహ్వానం (4:8), ప్రణయం (4:9-11), కవితాత్మకమైన వారిరువురి సంగమం (4:12-5:1) లకు దారితీస్తుంది. 

4:1-7 ఈ వచనాలు షూలమ్మితి గురించి సమగ్రమైన ప్రశంసను తెలియజేస్తున్నాయి. ఈ ప్రశంసలో అంత ర్భాగంగా సొలొమోను షూలమ్మితి కళ్లను, తలవెండ్రుకలను, దంతాలను, పెదవులను, నోటిని (వ.2,3 నోట్సు చూడండి) మెడను, వక్షాలను విస్తృతార్థంలో వర్ణించాడు. ఆమె వక్షస్థల వర్ణనకు (వ.5), వ.7 లోని సమగ్రమైన ప్రశంసకు మధ్యన షూలమ్మితి వినతికి (2:17) సొలొమోను ప్రత్యుత్తరం కనబడుతుంది. ఈ ప్రత్యుత్తరం సమగ్రమైన ప్రశంసలో ఆమె వక్షస్థలాన్ని గురించిన వర్ణన తరువాత ఉండడం ఒక ప్రాముఖ్యతను సంతరించుకుంది. అదేమంటే 2:17 లోని "కొండబాటల" అనే పదం 4:6 లోని “గోపరస పర్వతములకు” సాంబ్రాణి పర్వతములకు అనే పదాలు షూలమ్మితి వక్షస్థలానికి అలంకారిక వర్ణనలుగా ఉన్నాయి అనే వ్యాఖ్యానాన్ని బలపరుస్తున్నది. 

4:1 ప్రాచీనకాలంలో గువ్వలను (పావురాలు) ప్రేమపక్షులుగా వర్ణించేవారు, ప్రాచీన ఐగుప్తులోని కళాఖండాల్లో ఇవి ప్రేమ సందేశాలను అందించే రాయబారులు. షూలమ్మితి కన్నులు సొలొమోనుకు ప్రేమ సందేశాన్నందించే రాయబారులుగా ఉన్నాయి (1:15-2:3 నోట్సు చూడండి), షూలమ్మితి కురులు పొడవుగా ఒత్తుగా ఉండి గాలికి కదులుతూ, నల్లని మేకల మందలు ఒకదానివెంట ఒకటి గిలాదు పర్వతము మీద నుండి దిగుతున్నట్టుగా ఉన్నాయని చెప్పడం, షూలమ్మితి అందమైన కురులు నొక్కులు నొక్కులుగా కదులుతూ ఆహ్లాదాన్నిస్తున్నాయని తెలియజేసే అలంకారిక వర్ణన.

4:2 షూలమ్మితి పలువరస తెల్లగా మెరుస్తుంది. కడుగబడి అప్పుడే పైకి వచ్చునవియునై అనే వర్ణన ఉత్సవ సమయంలో గొట్టిపిల్లల నుండి ఉన్నిని సేకరించడాన్ని సూచిస్తుండవచ్చు. సొలొమోను బహుశా షూలమ్మితి పళ్లమీద మెరుస్తున్న నవ్వును ప్రశంసిస్తుండవచ్చు.

4:3 దండెత్తి వస్తున్న ఇశ్రాయేలీయులు తనను రక్షించాలని తెలియజేసే సంకేతంగా రాహాబు తన ఇంటి కిటికీకి ఎర్రని దారం కట్టింది. (యెహో 2:18). షూలమ్మితి సౌశీల్యాన్ని వెల్లడిచేసే ఆమె నోటిమాటలే ఆమెకు కాపుదల. రాహాబు కట్టిన ఎర్రని దారం ఆమె దేవునికి ఆయన ప్రజలకు చెందినదని తెలియజేసినట్టుగానే (క్రెగ్ గ్లిక్మన్), ఈ వర్ణన షూలమ్మితి దేవునికి చెందినదని సూచిస్తుంది. నీ కణతలు (హెబ్రీ. రాక్కా, అనే పదాన్ని నీ పెదవులు అని కూడా అనువదించవచ్చు, విచ్చిన అనే పదానికి “తెరచుకున్న" అనే సంక్షిప్త వర్ణన కూడా ఉంది. అప్పటికాలం నాటి చిత్రలేఖనాల్లో, పూర్తిగా పగలక కొద్దిగా విచ్చిన దానిమ్మపండ్ల చిత్రాలుండడం ఈ వర్ణనను బలపరుస్తున్నది. (ఓత్మార్ కీల్). ఈ ప్రశంసలు కావ్యంలోని కదలికలను వర్ణశోభను అద్భుతంగా ప్రతిబింబిస్తున్నాయి. తెల్లని గువ్వలు, నల్లని మేకలు, ఉన్నినిచ్చే తెల్లని గొట్టెపిల్లలు, ఎర్రని పెదవులు, ఎర్రని నోరు వివిధ రకాల రంగులను సూచిస్తున్నాయి. గువ్వలు ఎగరడం, మందలు దిగిరావడం, ఉన్నిని కత్తిరించిన తర్వాత గొట్టె పిల్లలు గెంతుతూ పరుగెత్తడం, దానిమ్మ పండ్లు విచ్చుకోవడం షూలమ్మితి కదలికలను తెలియజేస్తున్నాయి. 

4:4 కంధరము (మెడ) యొక్క కదలికలు షూలమ్మితి సౌశీల్యాన్ని సూచిస్తాయి. షూలమ్మితి మెడ సైనిక గోపురం లాగా ఉంది అనడం ఆమె గౌరవప్రదమైన నైతిక స్వభావాన్ని సూచిస్తుంది. సొలొమోను ఆమెకు సంపూర్ణమైన గౌరవ ప్రశంసల నిచ్చాడు. డాలులును, కవచములు అనేవి. బహుశా అలంకారిక వర్ణనలో షూలమ్మితి కంఠహారాన్ని సూచిస్తుండవచ్చు (వ.9). 

4:5 తామరలో మేయు అనే వర్ణన (2:1 నోట్సు చూడండి) షూలమ్మితి వక్షస్థలానికి జీవాన్నిచ్చే ప్రభావం ఉందని సూచిస్తుంది. జింకపిల్లలతో పోలిక బహుశా సొలొమోను వాటిని ఎత్తుకొని నిమిరినట్టుగా ప్రతిస్పందించాడని తెలియజేస్తుండవచ్చు. 

4:6 రాత్రి అంతా ఉండే ప్రేమపూర్వక వాగ్దానాలను వరకు (2:17 నోట్సు చూడండి) అనే మాట సూచిస్తుంది. పర్వతములకు అనే సాదృశ్యం మొదటి రెండు విభాగాల ముగింపులో (2:17), చివరి రెండు విభాగాల ముగింపులో (8:14), మధ్య విభాగానికి మధ్యలో, అంటే ఇక్కడ కూడా కనబడుతుంది.

4:7 కళంకమేమియు లేదు. అనే మాట ఆంతర్యంలోను బాహ్యంగాను పరిపూర్ణతను సూచిస్తుంది. ఇది సొలొమోను షూలమ్మితి సౌందర్యానికి, సౌశీల్యానికి ఇచ్చిన ప్రశంసలకు సరిగ్గా సరిపోయే సంక్షిప్త సారాంశం.

4:8 వ.6 లోని సాంబ్రాణి అనే పదానికి హెబ్రీలోని హల్లెవోనా అనే పదం, వ.7 లో ఉన్న నీవు అధిక సుందరివి అనే పదానికి హెబ్రీలోని హల్లెవోనా కులక్ అనే పదం అక్షరార్థంగా "సాంబ్రాణివైన..." అంటే "నీవు సంపూర్ణమైన దానివి" అనే భావనను తెలియజేస్తున్నాయి. ఈ వర్ణనాత్మక పదాలకు, ప్రాణేశ్వరీ, లెబానోను అనే పదాలకు హెబ్రీలోని మిల్లెవనోన్, కల్లా అనే పదాలకు శబ్దసామ్యం కనబడుతుంది. ఈ శబ్దచమత్కారం ప్రాణేశ్వరి అధికసుందరి (“వధువు”, “పరిపూర్ణురాలు”) అనే గుణనిర్దేశాన్ని సూచిస్తుంది. అమాన పర్వతపు శిఖరమునుండి... సింహ వ్యాఘ్రములుండు గుహలు అనే భయానకమైన స్థలాల గురించిన ఈ అలంకారిక వర్ణన, షూలమ్మితిలో దాగి ఉన్న భయాలను సూచిస్తుంది. ఆమె తన హృదయాన్ని సొలొమోనుకు సంపూర్ణంగా సమర్పించుకోడానికి ఈ భయాలన్నిటినీ వీడవలసి ఉంటుంది. 

4:9 ప్రాచీన ఈజిప్షియన్ ప్రేమగీతాల్లోను, సుమేరియన్ ప్రేమకావ్యాల్లోను సహోదరీ, సహోదరా అనే పిలుపులు ఇష్టాన్ని సూచించే పదాలు. ఆదాము హవ్వతో తన ఐక్యతను తెలిపిన వ్యక్తీకరణ బహుశా దీన్నే సూచిస్తుండవచ్చు: “నా యెముకలలో ఒక యెముక నా మాంసములో మాంసము” (ఆది 2:23) 
ఇది తోడబుట్టినవారి మధ్య ఉండవలసిన ఐక్యతను, మట్టమైన స్థాయిని సూచించే రూపకాలంకారం కాబట్టి ఇది సాధ్యమైనంత సామీప్యసంబంధాన్ని తెలియజేస్తుంది. 8:1 లో షూలమ్మితి సొలొమోనును “సహోదరునిగా" వర్ణించే ఈ రూపకాలంకారం షూలమ్మితి అతనిని బహిరంగంగా సైతం మృదువుగా ముద్దు పెట్టుకోవడాన్ని సమర్థిస్తుంది. నా సహోదరీ, ప్రాణేశ్వరీ అనే పదజాలం ఆదాము హవ్వల మధ్య ఉన్నంతటి అన్యోన్యతను సూచిస్తుంది. ఇది సొలొమోను షూలమ్మితిల దాంపత్యంలోని అన్యోన్యతలో ఉన్న దశలను సైతం పరిచయం చేస్తుంది. ఆమె సామీప్యత అతనికి ప్రేరణ నివ్వడం, ఆమె ప్రేమ, ఆమె పరిమళం అతడిని ఆనందింపజేయడం (వ.10), దాంపత్య జీవితం ప్రారంభం కావడం (వ.12), వారి కలయికను వేడుకగా జరుపుకోవడం (5:1), నా హృదయమును వశపరచుకొంటివి అనే మాటలను "నా గుండె వేగంగా కొట్టుకొనేలా చేశావు" అని కూడా అనువదించవచ్చు.... 

4:10 ద్రాక్షారసముకన్న నీ ప్రేమ ఎంత సంతోషకరము అనే భావం 1:2,4 లలో కూడా కనబడుతుంది. గుగ్గిలం చెట్టును నరికినప్పుడు వచ్చే సువాసనగల జిగురు పదార్థాన్ని గంధవర్గము అని పిలిచి ఉండవచ్చు. దీన్ని సుగంధ ద్రవ్యాల్లోను సౌందర్య సాధనాల్లోను ఉపయోగించేవారు. 1 రాజులు 10:2,10; ఎస్తేరు 2:12 చూడండి.. 

4:11 నీ పెదవులు తేనియలొలుకుచున్నవి అనే వర్ణన హెబ్రీలో అనుప్రాసాలంకారంలో ఉంది, తేనె ఒలికి నప్పుడు వచ్చే ధ్వనితో సామ్యం కనబడుతుంది. మధుక్షీరములు అనే మాట ఉద్రేకపూరితమైన ముద్దులను మాత్రమే కాక, దేవుడు ఇశ్రాయేలుకు ఇచ్చిన దేశంలోని సుసంపన్నతను సైతం సూచిస్తుండవచ్చు (నిర్గమ. 3:8,17; సంఖ్యా 14:8; 16:13-14). "సొలొమోను ఇదే సుసంపన్నతను షూలమ్మితిలో చూస్తూ, ఆమెను దేవుడనుగ్రహించిన వరంగా భావిస్తున్నాడు.

 4:12-5:1 ఈ గేయాల్లో దాంపత్యసిద్ధి గురించిన వర్ణనల్లో మూడు ముఖ్య మైన అలంకారాలు కనబడుతున్నాయి. తోట, నీటి ఊట, విందుభోజనం. సొలొమోను షూలమ్మితిని ఉద్యానముతో నీటి ఊట (జలకూపము)తో (4:12) పోల్చుతూ, మొదట ఉద్యానవనం గురించి (4:13-14), తరువాత జలాశయము (4:15) గురించి విస్తృతంగా వర్ణించాడు. షూలమ్మితి కూడా ఈ వర్ణనను కొనసాగించింది, ఉద్యానవనం మీద వీచి పరిమళములు వ్యాపింప జేయాలని వాయువును ఆహ్వానిస్తుంది. (4:16). తరువాత, సొలొమోను ఉద్యానం (4:12,16), గోపరసమును... పరిమళ ద్రవ్యములు (4:14), షూలమ్మితి జిహ్వ క్రింది మధు. క్షీరములు సహా (4:11) విందు గురించి అలంకారిక వర్ణనను కొనసాగించాడు (5:1). విందు గురించి ఉన్న సవివరమైన అలంకారిక వర్ణన ఈ గీతకారుడు వేడుక చేసుకోవడాన్ని ఎలా ప్రోత్సహిస్తున్నాడో తెలియజేస్తుంది (5:1, క్రైగ్ గ్లిక్మన్). 

4:12 మూయబడిన ఉద్యానము, మూతవేయబడిన జలకూపము అనే పద సముదాయం ఉద్యానవన సాదృశ్యంతో, పర్వతాల నుండి ప్రవహించే శుద్ధజలాల సాదృశ్యంతో షూలమ్మితి కన్యాత్వపు సౌశీల్యాన్ని ప్రశంసిస్తున్నాయి (వ.15 తో పోల్చండి). 

4:13-14 చిగురులు అనే మాటకు హెబ్రీలో వాడిన పదాన్ని అనువదించడం కష్టమైనా అర్థం చేసుకోవడం తేలికే. తోటలోని నేల నుండి మొలిచే ప్రతి చిగురును (కొమ్మను), అంటే అన్నిరకాల ఫలవృక్షాలు, ఇతర వృక్షాలు, సుగంధ ద్రవ్యాలనిచ్చే మొక్కలు చెట్లను సహా ఈ పదం సూచిస్తుంది. ఈ పదం తోటను సూచించదు గానీ, తోటలో ఉండేవాటి నన్నిటినీ సూచిస్తుంది కాబట్టి వ.13-14 లోని పూర్తి వర్ణనకు ఇది సరిపోతుంది. దాడిమ (దానిమ్మ) పండ్లు ప్రణయ కలాపానికి, సంతానోత్పత్తికి చిహ్నం. వనము అనే పదం పూదోటను లేదా పండ్లతోటను సూచిస్తుండవచ్చు. అయితే ఇది ఏదెను తోట యొక్క నిష్కళంకతను (పరిపూర్ణతను) సైతం సూచిస్తుంది. కర్పూరవృక్షములు అంటే తెలుపు, లేత ఎరుపు రంగులో చిన్న పుష్పాలుండే గోరింట చెట్లు. జటామాంసి పరిమళానికి ప్రసిద్ధి. కుంకుమ యొక్క పరిమళం పుప్పొడి ఉండే పరాగకోశాల్లో ఉంటుంది, బహుశా ఇందుకే దీనిని జటామాంసితో కలిపి చెప్పి ఉంటాడు. సేకరించినప్పుడు గుప్పిట్లో ఇమిడిపోయే పట్టుకుచ్చుల్లగా ఉండే ఈ కేసరాలు బహుశా షూలమ్మితిలోని లైంగికత్వాన్ని సూచిస్తుండవచ్చు. నిమ్మగడ్డి (హెబ్రీ. కానే) లవంగపట్ట (హెబ్రీ. కిన్నామన్) ఈ రెండూ హెబ్రీలో ప్రాస ఉన్న పదాలు. జటామాంసిని కుంకుమను కలిపి చెప్పినట్టుగా సువాసననిచ్చే వీటిని కూడా సాధారణంగా కలిపి చెబుతుంటారు. పొడవుగా బద్దల్లాంటి రెమ్మలుండే నిమ్మగడ్డి చిత్తడి నేలల్లో బాగా పెరుగుతుంది. ఉద్యానవన సౌందర్యాన్ని ఇనుమడింపజేసే ఎత్తైన పరిమళతైల వృక్షములు బహుశా ప్రేమానుభవంలోని ఔన్నత్యానికి సాదృశ్యాలు కావచ్చు. 

4:15 ఉద్యానజలాశయము కూడా ఉద్యానము జలకూపముల వంటి ఒక సాదృశ్యం. లెబానోను పర్వతాల మీద నుండి క్రిందికి జాలువారే శుద్ధమైన పర్వత ప్రవాహములు అలంకారిక వర్ణనను సంపూర్ణం చేస్తున్నాయి. షూలమ్మితి లైంగిక స్పందనను సూచించే జలకూపము అనే అలంకారము సామె 5:15-18 లోని బావి అనే అలంకారానికి సమానంగా ఉంది. 

4:16 ఇప్పటివరకున్న వర్ణన భావోద్రేకాల్లోని పతాకస్థాయిని సూచిస్తుండగా, షూలమ్మితి సొలొమోనును ఆహ్వానించిన సమయం సందర్భానికి చక్కగా సరిపోయినట్టుగా కనబడుతుంది. షూలమ్మితి ఇప్పటివరకున్న వర్ణనకు కొనసాగింపుగా, తన ఉద్యానవనము మీద విసరుడి అనీ, పరిమళములు వ్యాపింపజేయుడి అనీ వాయువులను కవితాత్మకంగా ఆహ్వానిస్తుంది ("వ్యాపింప" అనే పదం, వ.15 లోని "ప్రవాహము" అనే పదం ఒకే అర్థాన్నిచ్చే క్రియావాచ కాలు). కాబట్టి, షూలమ్మితి ఉద్యానవన, జలాశయ సాదృశ్యాలు రెండింటినీ మరల ఉపయోగించిందని తెలుస్తుంది. ఉద్యానవనంలోకి సొలొమోనును ఆకర్షించేలా సమ్మోహన పరిమళాలు వ్యాపింపజేయాలని షూలమ్మితి వాయువులను అడుగుతుంది. ఈ వచనంలోని ఏతెంచుము అనే పదం, 2:7; 3:5 వచనాల్లోని పల్లవుల్లో వేచి చూడాలని చెప్పడానికి ఉపయోగించిన "లేపు" (లేపకయు) అనే పదం హెబ్రీలో ఒకే అర్థాన్నిస్తు న్నాయి. ఇది "బహుశా ఇక వేచి చూడనక్కర్లేదు" అనే భావనను పాఠకులకు గుర్తు చేయడం కావచ్చు.. 


Shortcut Links
పరమగీతము - Song of Solomon : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary |