5:1-47 యోహాను సువార్తలోని "పండుగ చక్రం" 5:1 నుండి 10:42 వరకూ ఉంటుంది. ఇందులో యేసుక్రీస్తుకీ యూదు. అధికారులకీ మధ్య పెరుగుతున్న సంఘర్షణల గురించి ప్రస్తావించారు. ఈ చక్రం మరో సూచక క్రియతో ప్రారంభమయ్యింది. యెరూషలేములో జరిగిన ఒక విందులో యేసు ఒక కుంటివానిని స్వస్థపరిచాడు (2:11 నోట్సు చూడండి). విశ్రాంతి దినాన స్వస్థత జరగడం, ఒక పెద్ద వివాదాన్నే రేకెత్తించింది. తన చాపను పైకెత్తుకొని నడువుమని ఆ వ్యక్తితో చెప్పడాన్ని బట్టి యేసు ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించాడన్న ఆరోపణలు వచ్చాయి. 15:8-10). దేవుని పనిని కొనసాగిస్తానని చెప్పడం వల్ల యేసు దైవదూషణ చేస్తున్నాడని యూదు నాయకులు ఆరోపించే స్థాయికి వివాదం పెరిగింది (వ.18). యేసు తన పరిచర్యను సమర్ధించుకోవడానికీ తన గుర్తింపును రుజువు పరిచే సాక్ష్యాలను వెల్లడించడానికి ఈ వివాదం ఒక సందర్భానిచ్చింది.
5:1 అటుతరువాత అనే మాట ఎంత కాలం గడిచిందో నిర్దిష్టంగా సూచించడం లేదు. యేసు మందిరంలోనుండి వ్యాపారులను తోలివేయడమూ నీకొదేముని కలుసుకోవడమూ చివరిగా నమోదు చేసిన పస్కా పండుగ సమయంలో జరిగాయి. ఆ పండుగ తర్వాత ఇప్పటికి ఒకటిన్నర సంవత్సరాలు గడిచి ఉండవచ్చు. పేరు తెలియని ఆ “యూదుల పండుగ" గుడారాల పండుగ అయ్యుండొచ్చు. యేసు యెరూషలేమునకు వెళ్లడాన్ని గురించి 2:13 నోట్సు చూడండి.
5:2 బేతెస్ధ అంటే “కరుణా గృహం" అని అర్ధం. అద్భుతమైన స్వస్థత జరుగుతుందన్న ఆశతో అక్కడే పడి ఉన్న ప్రజల దుర్భర స్థితికి ఈ పదం సరిగ్గా సరిపోతుంది; 1:38 నోట్సు చూడండి.
5:5 ఆ దుర్బలుని వయస్సు లేదా అతడు ఎంతకాలం నుండి అక్కడ పడి ఉన్నాడో మనకు తెలీదు కానీ అతడు ముప్పది యెనిమిది సంవత్సరాల నుండి వికలాంగునిగా ఉన్నాడు. ఇది పూర్వం చాలా మంది ప్రజలు జీవించిన దానికంటే ఎక్కువ కాలమే.... ఇది దాదాపు ఇశ్రాయేలీయుల అరణ్య సంచారానికి పట్టినంత కాలం (ద్వితీ 2:14). "కష్టమైన", వింతైన అద్భుతాలను ఎన్నుకోవడంలో యోహాను అభిరుచి గురించి 2:11 నోట్సు చూడండి. ఇదే మాదిరిగా చేసిన స్వస్థత కోసం మత్తయి 9:1-8 చూడండి.
5:6 యెరిగి అన్న మాట బహుశా ఆయన సహజాతీత జ్ఞానాన్ని సూచిస్తుంది (1:48 నోట్సు చూడండి; 4:19), ఆ వ్యక్తి భిక్ష కోసం అభ్యర్థించడం వల్లనే యేసు అతనితో మాట్లాడే సందర్భం వచ్చి ఉండొచ్చు (అపొ.కా. 3:1-5).
5:8-9 పరుపు (గ్రీకు. కాబట్టోస్ అంటే వాస్తవంగా "చాప" లేదా "బొంత" అని అర్థం. దీనికి భిన్నంగా గ్రీకు. క్లినారియోన్ అంటే “పరుపు" ఉదా., అపొ.కా.5:15) ఒక పేదవాడు పడుకోవడానికి ఉపయోగించేది. గడ్డితో తయారు చేస్తారు, దానిని చుట్ట చుట్టి తీసుకెళ్లవచ్చు. ఇది విశ్రాంతి దినము అన్న సంగతి అద్భుతం జరిగే వరకూ మనకి చెప్పలేదు. ఇది అవిశ్వాసులైన యూదులతో ఉద్రిక్తతలకు దారితీసే సందర్భాన్ని ఏర్పరచింది (9:14).
5:10 మతపరమైన నిష్ఠను చూపించిన ఈ అల్ప ప్రదర్శనలో ఆ వ్యక్తి విశ్రాంతి దినమున తన పరుపు నెత్తుకోవడంపై యూదు నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. వాస్తవానికి ఆ వ్యక్తి ఎటువంటి బైబిలుపరమైన విశ్రాంతిదినపు నిబంధనలను ఉల్లంఘించలేదు గాని రబ్బీల నియమావళిని ఉల్లంఘించాడు. దాని ప్రకారం ఒక వస్తువుని “ఒక చోట నుండి మరో చోటకి” తీసుకెళ్లడం నిషిద్ధం. అందువల్ల యేసే ఆ వ్యక్తి పాపం చేసేలా ప్రలోభపెట్టాడని నిందారోపణ చేశారు.
5:11-13 ఆసక్తికరమైన విషయమేమిటంటే యేసు అతన్ని స్వస్థపరచి నప్పుడు తానెవరన్నది అతనికి తెలియపరచలేదు.
5:14 ఆ వ్యక్తిని స్వస్థపరచిన ప్రదేశం నుండి కొంత దూరంలో దేవాలయంలో యేసు అతన్ని మళ్ళీ కలుసుకున్నాడు. మనిషి బాధలు అతని పాపం వల్ల సంభవించాయని యేసు మాటలు సూచిస్తూ ఉండొచ్చు. కానీ అన్ని బాధలు వ్యక్తిగత పాపం వల్లనే సంభవించాయని అనడానికి అవకాశం లేదు (9:2 నోట్సు చూడండి). మరియెక్కువ కీడు అన్న మాటలు పాపానికి వచ్చే శాశ్వతమైన తీర్పును సూచిస్తూ ఉండవచ్చు (వ.22-30).
5:15-16 ఆ వ్యక్తి యేసుకి అసలు కృతజ్ఞతలే చెప్పలేదు. కేవలం ఆయన గురించి అధికారులకు తెలియజెప్పెను.
5:17 సృష్టిని చేసిన తర్వాత ఏడవ రోజు దేవుడు విశ్రాంతి తీసుకున్నాడని (హెబ్రీ. షాబాత్) ఆది. 2:2-3 బోధిస్తుంది. అది అలాగుండగా యూదు రబ్బీలు దేవుడు నిరంతరం విశ్వాన్ని ఉనికిలో ఉంచుతూ కూడా విశ్రాంతిదినపు నియమాన్ని అతిక్రమించలేదని అంగీకరిస్తారు. ఒకవేళ దేవుడు విశ్రాంతి దినపు నియమాల కంటే గొప్పవాడైతే, యేసు కూడా అంతే (మత్తయి 12:1-14). ఇంకా ఏంటంటే యూదులు కూడా విశ్రాంతిదినాన పనిని నిషేధించే నియమానికి మినహాయింపులు ఇచ్చారు. ముఖ్యంగా విశ్రాంతి దినాన సున్నతి కార్యక్రమం జరిగే సందర్భాలకు (యోహాను 7:23) ఈ మినహాయింపు ఇచ్చారు.
5:18 తన్ను దేవునితో సమానునిగా చేసికొనెను. అన్న మాట దేవుడు ఒక్కడేనన్న పా.ని. బోధను ఉల్లంఘిస్తున్నట్లు అనిపిస్తుంది. (ద్వితీ 6:4). ఆ విధంగా యూదు నాయకులు యేసు దైవదూషణ చేశాడని ఆరోపించారు. ఇదే పిలాతు ఎదుట యేసుపై మోపిన ప్రధాన ఆరోపణగా మారింది (యోహాను19:7).
5:19-26 ఈ వచనాల్లో యేసుకు తండ్రితో ఉన్న సంబంధాన్ని గురించి 3:16-18 నోట్సు చూడండి.
5:19 కుమారుడు... తనంతట తాను ఏదియు చేయనేరడు అన్న యేసు మాటలు, “ఈ సమస్త కార్యములను చేయుటకు యెహోవా నన్ను పంపెననియు నా అంతట నేనే వాటిని చేయలేదని” మోషే నిర్ధారించడాన్ని ప్రతిధ్వనింప జేస్తున్నాయి (సంఖ్యా 16:28).
5:21 కుమారుడు తనకిష్టము వచ్చినవారిని బ్రదికించును అన్న యేసు వ్యాఖ్యలు ప్రాముఖ్యమైనవి. ఎందుకంటే చనిపోయిన వారిని తిరిగి లేపడమూ జీవాన్ని అనుగ్రహించడమూ దేవుడు మాత్రమే కలిగి ఉండే విశిష్టాధికారం (ద్వితీ 32:39, 1సమూ 2:6; 2రాజులు 5:7)
5:22 జీవం మాదిరిగానే (వ.21), తీర్పు కూడా ప్రత్యేకంగా దేవునికి మాత్రమే ఉండే విశిష్టాధికారం (ఆది 18:25; న్యాయాధి 11:27). తండ్రి తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించియున్నాడు.
5:23 యేసు తన గురించి తాను దేవుని అధీకృత సందేశకునిగా చెప్పుకున్నాడు. ఇలా చెప్పడం, దేవుని ప్రతినిధులుగా, ఆయన వాక్కును అందించేవారుగా మోషే, ఇతర ప్రవక్తలు చేసిన మాదిరిగానే ఉంది. నియమించబడిన దూతల (హెబ్రీ. షాలియాభై) గురించి యూదులు ఇలా అనుకునేవారు: “ఒక మనిషి తరఫు ప్రతినిధి ఆ మనిషిలాగే ఉంటాడు". తండ్రిని ఘనపరచునట్లుగా అందరును కుమారుని ఘనపరచవలెనని యేసు అంటున్నాడంటే తనకు ఆరాధించబడే హక్కు ఉందని స్థాపిస్తూ తాను దైవత్వాన్ని కలిగి యున్నానని చెబుతున్నట్టయ్యింది.
5:25 యేసు మాటలు యెహెజ్కేలు ఎముకల లోయ దర్శనాన్ని గుర్తు చేస్తున్నాయి (యెహె 37).
5:26 యేసు “తనంతట తానే జీవముగలవాడ”నని చెప్పడం యోహాను సువార్త ముందుమాటలో “ఆయనలో (యేసులో) జీవముండెను” అన్న నిర్ధారణను ప్రతిధ్వనింపజేస్తుంది (1:4; 14:4-6 నోట్సు చూడండి). యేసు తర్వాత చెప్పిన మాటలు దీనికి మరింత మద్దతిస్తాయి - "పునరుత్థానమును జీవమును నేనే" (11:25). యేసు తానే “జీవమైయుండి" తనలోనే జీవాన్ని కలిగియున్నాడు కాబట్టి ఆయనలో నమ్మిక ఉంచేవారందరికీ జీవాన్ని (ఇప్పుడు సమృద్ధియైన జీవం, భవిష్యత్తులో శాశ్వత జీవం) అనుగ్రహించగలడు (3:16; 10:10).
5:27 ఆయన మనుష్యకుమారుడు గనుక అన్న మాటలలో దాని 7:18 ప్రతిధ్వనిస్తుంది.
5:28-29 ఈ వచనాలు దాని 12:2 తో పోల్చి చూడండి. 5:30 నా అంతట నేనే ఏమియు చేయలేను అన్న మాటల గురించి వ. 19,23 నోట్సు చూడండి.
5:31-47 యేసు తన గురించి సాక్ష్యమిచ్చిన అనేక సాక్షుల గురించి మాట్లాడాడు: బాప్తిస్మమిచ్చు యోహాను (వ.32-36; 1:7-8, 15, 19,32-34; 3:26); ఆయన సొంత క్రియలు (5:36; 10:25,32,37-38; 15:24), తండ్రియైన దేవుడు (5:37-38; 8:18), లేఖనాలు (5:39), ముఖ్యంగా మోషే రాసినవి (వ.45-47). ఈ సువార్తలోనే మరో చోట, తన గురించి తాను (3:11,32; 8:14,18; 18:37), పరిశుద్దాత్మ (అధ్యా. 14-16, ముఖ్యంగా 15:26), శిష్యులు (15:27), నాల్గవ సువార్తికుడు (19:35; 21:24) యేసు గురించి సాక్ష్యమిచ్చారు. యోహాను సువార్తలో “శోధన"లనే పెద్ద అంశంలో “సాక్ష్యమిచ్చు"ట అనే అంశం కూడా ఇమిడివుంది. ఇది యేసును శోధనకు గురిచేసే లోకం దృక్పథాన్ని తిప్పికొడుతోంది. నిజంగా శోధన లోకానికే గానీ యేసుకు కాదనీ, ఆయనే నిజమైన మెస్సీయ అనీ గుర్తిస్తూ సాక్ష్యమిచ్చే సాక్షిసమూహాన్ని బట్టి స్పష్టమవుతుంది. యేసును తిరస్కరించినందుకు లోకం అపరాధ భావాన్ని కలిగి ఉంటుందన్న విషయాన్నీ ఈ వాక్యభాగం నొక్కి చెబుతుంది.
5:31 యేసు తన విశ్వసనీయతను తిరస్కరించడం లేదు. ఆయన ఎక్కువ మంది సాక్షులను కలిగి ఉండడంలోని ప్రాముఖ్యతను సూచిస్తూ మాట్లాడుతున్నాడు (ద్వితీ 17:6; 19:15; సంఖ్యా 35:30).
5:32 నన్ను గూర్చి సాక్ష్యమిచ్చు వేరొకడు కలడు అని యేసు తండ్రియైన దేవుణ్ణి గురించి మాట్లాడుతున్నాడు (వ.37). దేవుని పేరును తప్పించడమనేది గౌరవాన్ని కనపరిచే ఒక సాధారణమైన పద్ధతి.
5:33 యేసే సత్యము అన్న దాని గురించి 14:4-6 నోట్సునూ, పిలాతు ఎదుట జరిగిన విచారణకు సంబంధించిన వాక్యభాగాన్నీ (18:37 అది ఈ వాక్యభా గాన్ని ప్రతిధ్వనింపజేస్తుంది) చూడండి. 3 యోహాను 3, 12 తో పోల్చండి.
5:35 బాప్తిస్మమిచ్చు యోహానుని మండుచు ప్రకాశించుచున్న దీపము అని యేసు వర్ణించడంలో కీర్తన 132:17 ప్రతిధ్వనిస్తుంది. ఆ వచనంలో దేవుడు తన అభిషిక్తుని కోసం “ఒక దీపము సిద్ధపరచియున్నాడని” ఉంటుంది. యోహాను “దీపమే” గానీ వెలుగు కాదు. (యోహాను 1:7-9), అతని సాక్ష్యం సాపేక్షికంగా చిన్నదీ, తాత్కాలికమైనది. భూత కాలపు క్రియలను ఉపయోగించడమనేది అప్పటికే యోహాను చనిపోయి ఉండొచ్చని లేదా ఖైదు చేయబడి ఉండవచ్చని సూచిస్తుంది. 3:29,30 నోట్సు చూడండి.
5:37 తండ్రియే... సాక్ష్యమిచ్చుచున్నాడు అన్న మాటలు యేసు బాప్తిస్మం (మత్తయి 3:17) వద్ద వినిపించిన స్వరాన్ని సూచిస్తూ ఉండవచ్చు. దీని గురించి యోహాను సువార్తలో స్పష్టంగా ప్రస్తావించనప్పటికీ లేఖనాలలో దేవుడిచ్చిన సాక్ష్యమే ప్రాథమిక సూచన అయ్యుండొచ్చు. (యోహాను 5:45-47; లూకా 24:27,44; అపొ.కా.13:27; 1యోహాను 5:9). తన శ్రోతలు దేవుని స్వరము వినలేదు, ఆయన స్వరూపము చూడలేదు (1:18) అన్న యేసు నిర్ధారణ అరణ్యంలోని ఇశ్రాయేలును సూచిస్తున్నట్లుగా ఉంది. వారు దేవుని స్వరాన్ని వినకుండా ఆయన స్వరూపాన్ని చూడకుండానే సీనాయి పర్వతం వద్ద ధర్మశాస్త్రాన్ని పొందుకున్నారు.
5:38 మీలో ఆయన వాక్యము నిలిచియుండుట అన్న మాటలు దేవుని వాక్యం హృదయంలో నివసిస్తూ, దేవునికి భయపడే వ్యక్తి వర్ణనను గుర్తుచేస్తుంది (యెహో 1:8-9; కీర్తన 119:11).
5:39 లేఖనాలు- జీవాన్ని అనుగ్రహించవు. కానీ దాని అనుగ్రహించేవాని (యేసు) గూర్చి సాక్ష్యమిస్తాయి (వ.46-47).
5:43 అంత్యకాలపు గుర్తుగా అబద్ద క్రీస్తుల విస్తరణల గురించి యేసు ప్రవచించాడు (మత్తయి 24:5). మొదటి శతాబ్దపు చరిత్రకారుడైన జోసీఫస్ క్రీ.శ. 70 కి ముందున్న సంవత్సరాల్లో "నేనే మెస్సీయ"నని చెప్పి నటించినవారి జాబితాను నివేదించాడు.
5:45-47 యేసు "మోషే" గురించి ప్రస్తావించడమనేది 6 వ అధ్యాయానికి మార్గాన్ని సిద్ధపరుస్తుంది, ఆ అధ్యాయంలో యేసును "పరలోకము నుండి దిగి వచ్చిన” కొత్త రొట్టెను అనుగ్రహించే కొత్త మోషేగా చూపించారు. మోషేను సాక్షిగా లేదా యూదులపై నేరము మోపువానిగా చెప్పడమనేది ద్వితీ 31:26-27 ని సూచిస్తుంది. ఆ వచనాలలో ధర్మశాస్త్రం ఇశ్రాయేలీయులకు వ్యతిరేకంగా సాక్ష్యమిచ్చేదిగా ఉంటుంది. యేసు గురించి మోషే రాసినట్టు యోహాను 5:46 లో ఉన్న మాటలు, పంచకాండాలను (మోషేకు ఆపాదించబడినవి) గానీ లేదా ద్వితీ 18:15 లో మోషే “వంటి ప్రవక్త” అన్న ప్రవచనాన్ని గానీ సూచిస్తూ ఉండవచ్చు.