Genesis - ఆదికాండము 3 | View All

1. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై యుండెను. అది ఆ స్త్రీతో ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా? అని అడిగెను.
ప్రకటన గ్రంథం 12:9, ప్రకటన గ్రంథం 20:2

ఈ పాము ఈ నాటి పాముల్లాంటిది కాదు. అన్ని జంతువులకంటే తెలివైనది. దేవుని శాపం దానికి తగలక ముందు ఈ నాటి పాముల్లాగా కడుపుతో పాకేది కాదని అర్థమౌతున్నది. ఇక్కడ దురాత్మల నాయకుడు సైతాను పామును ఉపయోగించుకొంటూ దాని ద్వారా మాట్లాడుతున్నాడని తెలుస్తున్నది. బైబిల్లో సర్పం సైతానుకు సంకేత చిహ్నమైన పేరు (2 కోరింథీయులకు 1:3 ప్రకటన గ్రంథం 12:9 ప్రకటన గ్రంథం 20:2). మనుషుల్ని పాపానికి ప్రోత్సహించేది సైతానే గాని మామూలు పాములు కాదు (మత్తయి 4:3 1 థెస్సలొనీకయులకు 3:5). 1 దినవృత్తాంతములు 21:1 లో సైతాను గురించి నోట్ చూడండి.

2. అందుకు స్త్రీ ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును;

3. అయితే తోట మధ్యవున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు-మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు, వాటిని ముట్టకూడదనియు చెప్పెనని సర్పముతో అనెను.

దేవుని మాటలకు ఈమె కొంత కలిపి చెప్తున్నది. సామెతలు 30:6 చూడండి.

4. అందుకు సర్పము మీరు చావనే చావరు;
యోహాను 8:44

యోహాను 8:44 ప్రకటన గ్రంథం 12:9. ఆదికాండము 2:17 లో ఉన్న దేవుని మాటలను సైతాను వ్యతిరేకిస్తున్నాడు. దేవుణ్ణి గురించీ మనుషుల గురించీ వాస్తవాల గురించీ అబద్ధాలు చెప్తూ, మనుషుల్ని దుష్ ప్రేరేపణలకు గురి చేస్తూ వారిని నాశనం చేస్తాడు సైతాను. మనుషులకు ఏదో వాస్తవం కాని మంచిని, లేక గొప్పతనాన్ని ఎర చూపడం ద్వారా కూడా వారిని దుష్ ప్రేరణకు గురి చేస్తాడు. తన మాట వింటే వారికి లభించే ఏదో ఒక మేలును దేవుడు వారికి అందనీయకుండా ఉంచాడని సైతాను ఆమెకు నచ్చచెప్పే ప్రయత్నం చేశాడు. కాబట్టి మనుషుల్ని పాడు చేసేందుకు సైతాను ఉపయోగించే పద్ధతిని ఇక్కడ చూస్తున్నాం – దేవుని మాటను కాదంటాడు. అబద్ధాలు చెప్తాడు, ఏదో సౌఖ్యం లభిస్తుందనో, యథార్థం కాని మంచి జరుగుతుందనో వాగ్దానం చేస్తాడు. వ 22 కూడా చూడండి.

5. ఏలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడుననియు, మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతలవలె ఉందురనియు దేవునికి తెలియునని స్త్రీతో చెప్పగా

6. స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు, కన్నులకు అందమైనదియు, వివేకమిచ్చు రమ్యమైనదియునై యుండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసికొని తిని తనతోపాటు తన భర్తకును ఇచ్చెను, అతడుకూడ తినెను;
రోమీయులకు 5:12, 1 తిమోతికి 2:14

1 తిమోతికి 2:14 యాకోబు 1:14-15 1 యోహాను 2:16 రోమీయులకు 5:12-19 చూడండి. ఈ ఒక్క పాపం మనిషి స్వభావాన్ని మార్చివేసింది. ప్రపంచ గమనాన్నే తలక్రిందులు చేసేసింది. ఆదికాండము 6:5 ఆదికాండము 8:21 చూడండి. పాపం అంటే దేవుని వాక్కుకు అవిధేయత, సర్వ శక్తిగల దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు, ఆయన విధించిన నియమాలకు కట్టుబడకపోవడం, సొంత ఇష్టం ప్రకారం అహంతో ప్రవర్తిస్తూ దేవుని వాక్కునూ సంకల్పాన్నీ బట్టిగాక స్వంత కోరికలను అనుసరిస్తూ నడుచుకోవడం. 1 యోహాను 3:4 1 యోహాను 5:17 యాకోబు 4:17 రోమీయులకు 14:23 సామెతలు 24:9 చూడండి. ఆ పురుషుడు ఆదాము అతని భార్యవల్లే పాపంలోకి పడ్డాడు. వివాహబంధం ద్వారా వచ్చే విషమ పరీక్షలు బహు కఠినంగా ఉండగలవు. ఆదాము మోసపోలేదు (1 తిమోతికి 2:14) గానీ తన భార్య మాటకు లొంగిపోయాడు

7. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను; వారు తాము దిగంబరులమని తెలిసికొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములను చేసికొనిరి.

ఆ పండు తినే రోజున వారు చనిపోతారని దేవుడు చెప్పాడు. వారు ఆ దినాన శారీరకంగా చనిపోలేదు గాని ఆత్మసంబంధంగా చనిపోయారు (ఆదికాండము 2:17). తరువాతి వచనాల్లో ఈ సంగతి తెలుస్తున్నది. అంతేగాక శరీర మరణానికి దారితీసే శరీర క్షీణత ఆ దినానే ఆరంభమయింది (రోమీయులకు 5:12). ఇక్కడ 7వ వచనంలో నిర్దోషత్వం, అమాయకత్వం సమసిపోయాయి, మరణించాయి. తన పాపం, దోషం వల్ల మానవుడిలో కలిగేది సిగ్గు. దీన్ని కప్పుకుంటూ దాచిపెట్టేందుకు అతడు ప్రయత్నించాడు. ఈ క్రియ అంతరంగంలోని ఆధ్యాత్మిక అనుభవాన్ని తెలియజేసింది.

8. చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరమును విని, దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండ తోటచెట్ల మధ్యను దాగుకొనగా

“యెహోవా...నడుస్తూ”– ఆదికాండము 12:7 ఆదికాండము 16:7 ఆదికాండము 18:1-2 మొ।। పోల్చిచూడండి. ఇప్పుడు మానవుడు దేవునినుంచి దాక్కునేందుకు ప్రయత్నించాడు. అయితే అతణ్ణి వెతికి రక్షించడానికి దేవుడు వచ్చాడు. 1 వ అధ్యాయంలో కనిపించే అమిత శక్తివంతుడైన సృష్టికర్త ఇక్కడ ప్రేమ, కనికరం గల దేవుడుగా దర్శనమిస్తున్నాడు (1 యోహాను 4:8). నశించిన స్థితిలో ఉన్న మనిషి కోసం దేవుని శ్రద్ధ, అన్వేషణ ఇక్కడ మొదలై బైబిలంతటా కొనసాగుతుంది. నిర్గమకాండము 25:8 నోట్ చూడండి. అప్పుడు మానవుడు దేవుణ్ణి వెదకలేదు. ఇప్పుడూ అలా వెతకడం లేదు (రోమీయులకు 3:11). దేవుడే మానవుణ్ణి వెతికాడు. లూకా 19:10 పోల్చి చూడండి.

9. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవు ఎక్కడ ఉన్నావనెను.

ఆదాము ఎక్కడున్నదీ ఏమి చేసినదీ దేవునికి తెలుసు. అయితే ఆదాము నోరు విప్పి తన పాపాన్ని ఒప్పుకోవాలని ఆయన కోరిక.

10. అందుకతడు నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా నుంటిని గనుక భయపడి దాగుకొంటిననెను.

బైబిలులో “భయం” గురించి మొట్టమొదటి మాట. పాపం అనేది తనతోబాటు పట్టుబడిపోతామేమోనన్న భయాన్నీ, దేవుని సన్నిధిని గురించిన భయాన్నీ తెస్తుంది (యోహాను 3:20). మానవాళిని వేధించే భయాలన్నీ మానవుడి మొదటి పాపం ఫలితాలే అన్నమాట నిజం.

11. అందుకాయన-నీవు దిగంబరివని నీకు తెలిపినవాడెవడు? నీవు తినకూడదని నేను నీ కాజ్ఞాపించిన వృక్షఫలములు తింటివా? అని అడిగెను.

12. అందుకు ఆదాము నాతో నుండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్షఫలములు కొన్ని నా కియ్యగా నేను తింటిననెను.

అపరాధీ దోషీ అయిన మానవుడు తాను చేసినదాని బాధ్యతను వెంటనే మరొకరి మీదికి నెట్టాలని చూశాడు. నిజానికి తన పాపానికి ఆదాము దేవుణ్ణి తప్పుపట్టాలని ప్రయత్నిస్తున్నాడు. “దేవా, ఇదంతా నీ తప్పే. ఈ స్త్రీని నాకిచ్చినది నువ్వే” అంటున్నాడన్న మాట.

13. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో నీవు చేసినది యేమిటని అడుగగా స్త్రీ-సర్పము నన్ను మోసపుచ్చినందున తింటిననెను.
రోమీయులకు 7:11, 2 కోరింథీయులకు 11:3, 1 తిమోతికి 2:14

స్త్రీ కూడా తన భర్తలాగే మాట్లాడింది. ఆమె మాటలకు అర్థం ఏమిటంటే “ఇది నా తప్పు కాదు. ఈ పాము నన్ను మోసం చేసింది. మరి పామును సృష్టించినది ఎవరు?” ఆనాటినుండి ఈ నాటివరకు తన పాపాలకు బాధ్యత మరొకరిమీదికి నెట్టడం ద్వారా తప్పించుకోజూడడం మనిషికి మామూలైపోయింది. దేవుడు ఇలాంటి సాకులను అంగీకరించడు.

14. అందుకు దేవుడైన యెహోవా సర్పముతో నీవు దీని చేసినందున పశువులన్నిటిలోను భూజంతువులన్నిటిలోను నీవు శపించబడినదానివై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రదుకు దినములన్నియు మన్ను తిందువు

పాపం లోకమంతటిమీదికీ శాపాన్ని తెచ్చింది. ఆదాము పాపం చేయకముందు ఉన్న భూమిలాంటిది కాదు ఇప్పుడున్న భూమి (వ 17; రోమీయులకు 8:19-22).

15. మరియు నీకును స్త్రీకిని నీ సంతాన మునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసెదను. అది నిన్ను తలమీద కొట్టును; నీవు దానిని మడిమె మీద కొట్టుదువని చెప్పెను.
లూకా 10:19, రోమీయులకు 16:20, హెబ్రీయులకు 2:14

పాపంలో పడిన మానవుడికి రక్షకుణ్ణి గురించిన మొదటి వాగ్దానం ఇది. ఆయన స్త్రీకి జన్మిస్తాడు. ఇక్కడ పురుషుడనే మాట కనబడడం లేదు. క్రీస్తు కన్యకు జన్మించడం అనే సంగతిని ఇది సూచిస్తున్నదని చాలామంది పండితుల అభిప్రాయం (యెషయా 7:14 మత్తయి 1:22-23 గలతియులకు 4:5). ఆ రక్షకుడు సైతాను తలను చితక్కొట్టేవాడై ఉంటాడు, అంటే సైతానునూ వాడి పనులనూ నాశనం చేసే వాడవుతాడు (రోమీయులకు 16:20 హెబ్రీయులకు 2:14 1 యోహాను 3:8). బైబిలు చివరి పుస్తకంలో సైతాను చివరి పతనం కనిపిస్తుంది (ప్రకటన గ్రంథం 20:10). సర్పం రక్షకుడి కాలి మడమపై గాయం చేస్తుందని ఉంది. సైతాను ఆయన్ను వేధించి గాయపరచగలడు గాని నాశనం చేయలేడన్నమాట. రక్షకుడి గాయాలు కూడా మనిషి మేలుకోసమే (యెషయా 53:5 1 పేతురు 2:24).

16. ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించె దను; వేదనతో పిల్లలను కందువు; నీ భర్తయెడల నీకు వాంఛ కలుగును; అతడు నిన్ను ఏలునని చెప్పెను.
1 కోరింథీయులకు 11:3, 1 కోరింథీయులకు 13:34, ఎఫెసీయులకు 5:22, కొలొస్సయులకు 3:18

మనిషి పతనం సమయంనుంచి స్త్రీ పురుషుడికి లోబడాలి (ఎఫెసీయులకు 5:22 కొలొస్సయులకు 3:8 1 తిమోతికి 2:11-15 1 పేతురు 3:1-5).

17. ఆయన ఆదాముతోనీవు నీ భార్యమాట వినితినవద్దని నేను నీ కాజ్ఞాపించిన వృక్షఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడియున్నది; ప్రయాసముతోనే నీవు బ్రదుకు దినములన్నియు దాని పంట తిందువు;
హెబ్రీయులకు 6:8, రోమీయులకు 8:20, 1 కోరింథీయులకు 15:21

18. అది ముండ్ల తుప్పలను గచ్చపొదలను నీకు మొలిపించును; పొలములోని పంట తిందువు;
హెబ్రీయులకు 6:8

19. నీవు నేలకు తిరిగి చేరువరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు; ఏలయనగా నేలనుండి నీవు తీయబడితివి; నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదువని చెప్పెను.
రోమీయులకు 5:12, హెబ్రీయులకు 9:27

20. ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టెను. ఏలయనగా ఆమె జీవముగల ప్రతివానికిని తల్లి.

హవ అంటే “జీవంతో ఉన్నది” అని అర్థం.

21. దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయిలను చేయించి వారికి తొడిగించెను.

కృప, బలి ద్వారా మానవ పాప విముక్తికి దేవుడే ఏర్పరచిన మార్గం ఇక్కడ కనిపిస్తున్నదని చెప్పవచ్చు. తన దోషం, సిగ్గు దాచిపెట్టుకోవడానికి మనిషి చేసే ప్రయత్నాలు ఫలించవు. తన స్వకార్యాల ఆధారంగా అతడు దేవుని ఎదుట నిలబడడానికి తగినవాడు కాడు. దేవుడు తానే ఒక నిర్దోషమైన జంతువును సంహరించి వారికి బట్టలు తొడిగాడు. చరిత్రలో చాలా కాలం తరువాత ఆయన క్రీస్తుగా వచ్చి పాపుల కోసం మరణించి తన వద్దకు వచ్చినవారందరికీ తన నీతిన్యాయాలనే వస్త్రాలుగా ధరింపజేశాడు. మనిషి స్వభావసిద్ధంగా ఏమై ఉన్నాడో యెషయా 64:6 లో ఉంది. అయితే దేవుని కృపవల్ల అతడికి పరిపూర్ణ వస్త్రం దొరకే వీలుంది (యెషయా 61:10 1 కోరింథీయులకు 1:30). నిర్దోషిగా ఎంచడం గురించి నోట్ ఆదికాండము 15:6 రోమీయులకు 1:17 రోమీయులకు 3:21-26 రోమీయులకు 4:5 రోమీయులకు 4:23-25.

22. అప్పుడు దేవుడైన యెహోవా ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు, ఆదాము మనలో ఒకనివంటివాడాయెను. కాబట్టి అతడు ఒక వేళ తన చెయ్యి చాచి జీవ వృక్షఫలమును కూడ తీసికొని తిని నిరంతరము జీవించునేమో అని
ప్రకటన గ్రంథం 2:7, ప్రకటన గ్రంథం 22:2-14-19

ఈ వచనాన్ని బట్టి 5వ వచనంలోని సర్పం మాటల్లో కొంత నిజం ఉన్నదని తెలుస్తున్నది. సైతాను పద్ధతి ఇదే. అబద్ధాలను సత్యంతో కలిపి వాటిని మరింత ఆకర్షణీయంగా నమ్మశక్యంగా చేస్తాడు. పాపం చెయ్యడం ద్వారా మనిషి దేవుని పవిత్ర స్వభావంలో ఆయనవంటివాడు కాలేదు. నిజానికి దీనికి వ్యతిరేకం జరిగింది. కానీ మేలు కీడులు తెలుసుకొన్న ఆ ఒకే విషయంలో మాత్రమే మనిషి తన సృష్టికర్తలాగా అయ్యాడు. “శాశ్వతంగా బ్రతకకూడదు”– ఈ లోకంలో మనిషిని పాపిగా కలకాలం బ్రతకనివ్వడు దేవుడు. అలా గనుక బ్రతకనిస్తే అది భయంకరమై దౌర్భాగ్యమౌతుంది. బైబిలు ఆఖరి పుస్తకంలో జీవవృక్షం, దానికి వెళ్ళే మార్గం మళ్ళీ కనిపిస్తుంది (ప్రకటన గ్రంథం 2:7 ప్రకటన గ్రంథం 22:14).

23. దేవుడైన యెహోవా అతడు ఏ నేలనుండి తీయబడెనో దాని సేద్యపరచుటకు ఏదెను తోటలోనుండి అతని పంపివేసెను.

మనిషి పరమానంద స్థానాన్ని ఎందుకు పోగొట్టుకున్నాడంటే పాపానికీ, పరమానంద స్థానానికీ సరిపడదు. మనిషి ఏదో ఒకదాన్ని ఎన్నుకోవాలి. రెండూ కావాలంటే వీలు లేదు (ప్రకటన గ్రంథం 22:14). మానవుడు తనకన్న తక్కువ జీవరాసుల నుంచి ఉత్పన్నం కాలేదు. ఆదాములో అతడు మరింత ఉన్నతమైన జీవ స్థితినుంచి పడిపోయాడు. ఆదాము మానవాళి అంతటికీ ప్రతినిధి, పూర్వీకుడు (రోమీయులకు 5:12-19) మనందరి తరుఫున అతడు పరలోకాన్నీ పరమానంద స్థానాన్నీ జారవిడుచు కున్నాడు. మనిషిని తిరిగి ఆ పరలోకం కోసం తయారు చేసే దేవుని మార్గం గురించిన విషయమే బైబిలు.

24. అప్పుడాయన ఆదామును వెళ్లగొట్టి ఏదెను తోటకు తూర్పుదిక్కున కెరూబులను, జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను నిలువబెట్టెను.
ప్రకటన గ్రంథం 2:7

“కెరూబులు”– నిర్గమకాండము 25:18-22 యెహెఙ్కేలు 1:5-14 యెహెఙ్కేలు 10:1-10 లో కెరూబుల వర్ణన ఉంది. కెరూబులంటే ఎప్పుడూ దేవుని మహిమ, పవిత్రలతో సంబంధం కలిగిన పరలోక జీవులు లేక ఆయన మహిమ, పవిత్రతలకు సంకేతాలు అని అర్థం అవుతున్నది. ఇక్కడ తోటకు వెళ్ళే దారికి కావలిగా ఉన్నాయి. ఈ అధ్యాయంలో మనిషి చేసిన పాపం తాలూకు ఫలితాలు అతి స్పష్టంగా ఉన్నాయి. ఆ ఫలితాలు నేటికీ ఈ లోకంలో కనిపిస్తున్నాయి. సిగ్గు; దోషాన్ని కప్పిపుచ్చు కునేందుకు వ్యర్థ ప్రయత్నాలు; భయం; దేవునినుంచి దాక్కొనే ప్రయత్నాలు; పనికిమాలిన సాకులు; సృష్టిపైన శాపం; మనుషులకు బాధ; బానిసత్వం; కష్టమైన పని; మరణం; పరమానంద స్థానం నుంచి బహిష్కారం. మనిషి దేవుని పోలికలో తయారయ్యాడు (ఆదికాండము 1:26). పాపం చేసినందువల్ల ఆ పోలిక వికృతం అయిపోయింది. కొత్త ఒడంబడికలో వెల్లడైన దేవుని ఉద్దేశం విశ్వాసులను క్రీస్తు స్వరూపంలోకి మార్చడం (రోమీయులకు 8:29 1 యోహాను 3:2).Shortcut Links
ఆదికాండము - Genesis : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |