Isaiah - యెషయా 28 | View All

1. త్రాగుబోతులగు ఎఫ్రాయిమీయుల అతిశయ కిరీటమునకు శ్రమ వాడిపోవుచున్న పుష్పమువంటివారి సుందర భూషణ మునకు శ్రమ ద్రాక్షారసమువలన కూలిపోయినవారి ఫలవంతమైన లోయ తలమీదనున్న కిరీటమునకు శ్రమ.

28 – 35 అధ్యాయాలు మరొక భాగం. ఈ భాగంలో యెషయా కాలంలోను, తదనంతరం దేశంలోని స్థితిగతులు, సంభవాల గురించిన వర్ణనలు ఉన్నాయి. అయితే ఇంతకు ముందు అధ్యాయంలో లాగానే (యెషయా గ్రంథం అంతా ఇదే విధంగా ఉంటుంది) అక్కడక్కడా ఎప్పుడో భవిష్యత్తులో జరగబోయే విషయాలు – క్రీస్తు మొదటి రాక, రెండవ రాక సమయాల గురించి రాసి ఉన్నాయి. 28–33 అధ్యాయాల్లో ఆరు బాధల వరుస క్రమం కనిపిస్తుంది – యెషయా 28:1; యెషయా 29:1; యెషయా 29:15; యెషయా 30:1; యెషయా 31:1; యెషయా 33:1 (యెషయా 5:11-23 పోల్చి చూడండి). “ఎఫ్రాయిం”– ఉత్తర రాజ్యమైన ఇస్రాయేల్‌కు మరో పేరు. “త్రాగుబోతులు”– ఆమోసు 6:4-7 కూడా సమరయకు వ్యతిరేకంగా రాసి ఉంది. ఇస్రాయేల్ యూదా ఈ రెండు రాజ్యాల్లోనూ మద్యపానం ఎక్కువగా కనిపించే దురలవాటు ఉందని కనిపిస్తున్నది (యెషయా 5:11-13). వారి యాజులు, ప్రవక్తలు కూడా కొందరు త్రాగుబోతులే (వ 7,8). ఆదికాండము 9:21 లో మద్యపానాసక్తి గురించి నోట్. “కిరీటం”– అందమైన రాజధాని సమరయ. తలపై కిరీటం ఉన్నట్టుగా ఆ నగరం ఒక కొండపై కట్టబడింది.

2. ఆలకించుడి, బలపరాక్రమములు గలవాడొకడు ప్రభువుకు ఉన్నాడు ప్రచండమైన వడగండ్లును ప్రచండమైన జలముల ప్రవాహమును ప్రచండమైన వరదయు కొట్టివేయునట్లు ఆయన తన బలముచేత పడద్రోయువాడు.

“వాడొకడు”– అష్షూరు రాజు – యెషయా 8:7-8. అష్షూరు రాజు క్రీ.పూ. 722లో సమరయను పట్టుకొన్న సంభవానికి ఇది భవిష్యద్వచనం.

3. త్రాగుబోతులగు ఎఫ్రాయిమీయుల అతిశయ కిరీటము కాళ్లతో త్రొక్కబడును.

4. ఫలవంతమైన లోయ తలమీదనున్న వాడిపోవు పుష్పమువంటిదాని సుందరభూషణము వసంతకాలము రాకమునపు పండిన మొదటి అంజూరపు పండువలె అగును దాని కనుగొనువాడు దాని చూడగానే అది వాని చేతిలో పడినవెంటనే అది మింగివేయబడును.

“వాడిపోతున్న పువ్వు”– మనిషి అతిశయం, గొప్పతనం అంతా ఉండేది కొద్దికాలం మాత్రమే (యెషయా 40:6-7; 1 పేతురు 1:24). శాశ్వతంగా నిలిచి ఉండే వాటికోసం కృషి చేసేందుకు అవకాశం ఉన్నప్పుడు ఇలాంటి వాటి కోసం జీవితాన్ని వెచ్చించడం అవివేకం గదా. మత్తయి 6:19-20; యోహాను 6:27 మొ।।.

5. ఆ దినమున సైన్యములకధిపతియగు యెహోవా శేషిం చిన తన ప్రజలకు తానే భూషణ కిరీటముగా నుండును సౌందర్యముగల మకుటముగా నుండును.

“ఆ రోజున”– సమరయ శత్రువుల చేజిక్కిన రోజున అని అర్థం రావడానికి వీలు లేదు. యెషయా 24:1 చూడండి. “సేనలప్రభువు యెహోవా”– మనుషులు తమ సొంత కిరీటాలు చేసుకొని తమ సొంత ఘనతను బట్టి మురిసిపోవచ్చు (వ1). అయితే విశ్వాసులకు (“మిగిలిన ప్రజలు”) మాత్రం ఏకైక నిజ దేవుడే కిరీటంగా ఘనతగా ఉంటాడు.

6. ఆయన న్యాయపీఠముమీద కూర్చుండువారికి తీర్పు తీర్చ నేర్పు ఆత్మగాను గుమ్మమునొద్ద యుద్ధమును పారగొట్టువారికి పరాక్రమము పుట్టించువాడుగాను ఉండును.

“తీర్పు”– యెషయా 11:2-4. “బలం”– ఈ వచనం విజయాన్ని గురించి మాట్లాడుతున్నది, అపజయం గురించి కాదు.

7. అయితే వీరును ద్రాక్షారసమువలన సొక్కి సోలుదురు మద్యమువలన తత్తరపడుదురు యాజకులేమి ప్రవక్తలేమి అందరును మద్యమువలన సొక్కి సోలుదురు ద్రాక్షారసము వారిని మింగివేయుచున్నది మద్యమువలన తత్తరపడుచున్నారు దర్శనము కలుగునప్పుడు సోలుదురు తీర్పుతీర్చుకాలమున తత్తరపడుదురు.

యాజులు, ప్రవక్తలు త్రాగుబోతులైతే ప్రజలను వారు తప్పుదారి పట్టిస్తారు. “వీళ్ళు కూడా”– 7వ వచనంలో యెషయా జెరుసలంలోని స్థితిగతులను గురించి కూడా మాట్లాడసాగినట్టు ఉంది (వ 14).

8. వారి భోజనపు బల్లలన్నియు వాంతితోను కల్మషముల తోను నిండియున్నవి అవి లేనిచోటు లేదు.

9. వాడు ఎవరికి విద్య నేర్పును? ఎవరికి వర్తమానము తెలియ జేయును? తల్లిపాలు విడిచినవారికా? చన్ను విడిచినవారికా?

ఈ త్రాగుబోతులైన యాజులూ ప్రవక్తలూ యెషయా విషయం వెక్కిరింతగా మాట్లాడుతున్నారు.

10. ఆజ్ఞవెంబడి ఆజ్ఞ ఆజ్ఞవెంబడి ఆజ్ఞ సూత్రమువెంబడి సూత్రము సూత్రమువెంబడి సూత్రము కొంత ఇచ్చట కొంత అచ్చట చెప్పుచున్నాడని వారనుకొందురు.

11. నిజమే అలసినవానికి నెమ్మది కలుగజేయుడి ఇదే నెమ్మది ఇదే విశ్రాంతి అని చెప్పినవాడు నత్తివారి పెదవుల చేతను అన్యభాషతోను ఈ జనులతో మాటలాడుచున్నాడు.
1 కోరింథీయులకు 14:21

యెషయా వారికి జవాబిస్తున్నాడు. తనద్వారా వారికి దేవుని సందేశం అందదు (వారికి గనుక అలా అందివుంటే వారికి విశ్రాంతి ఉండేది) కాబట్టి దేవుడు వారిని నాశనం చేసే విదేశీయుల ద్వారా వారితో మాట్లాడతాడు. ఎప్పుడూ మరచిపోలేనంతగా మంచి గుణపాఠం నేర్పే అష్షూరు, బబులోనువారిద్వారా అని భావం.

12. అయినను వారు విననొల్లరైరి. కావున వారు వెళ్లి వెనుకకు మొగ్గి విరుగబడి చిక్కు బడి పట్టబడునట్లు

13. ఆజ్ఞవెంబడి ఆజ్ఞ ఆజ్ఞవెంబడి ఆజ్ఞ సూత్రమువెంబడి సూత్రము సూత్రమువెంబడి సూత్రము కొంత ఇచ్చట కొంత అచ్చట యెహోవా వాక్యము మీకు వచ్చును.

14. కాబట్టి యెరూషలేములోనున్న యీ జనులను ఏలు అపహాసకులారా, యెహోవా వాక్యము వినుడి

వ 7.

15. మేము మరణముతో నిబంధన చేసికొంటిమి పాతాళముతో ఏకమైతివిు ఉపద్రవము ప్రవాహమువలె వడిగా దాటునప్పుడు అది మాయొద్దకు రాదు అబద్ధములను మాకు ఆశ్రయముగా చేసికొంటిమి మాయక్రింద దాగియున్నాము అని మీరు చెప్పుకొనుచున్నారే.

నిజంగా ఇలా పలికారా? బహుశా యెషయా వారి చర్యల అర్థాన్ని ఇక్కడ వెల్లడిస్తున్నాడంతే. వారు కర్ణపిశాచ, మంత్రతంత్రాలపై తమ నమ్మకం పెట్టుకున్నారు (యెషయా 8:19 చూడండి). అయ్యో, నేడు కూడా ఎంతోమంది సైతాను అబద్ధాలను నమ్మి, విగ్రహారాధన, మంత్రతంత్రాల మూలంగా తమకు భద్రత ఉందిలే అనుకొంటున్నారు.

16. ప్రభువగు యెహోవా ఈలాగున సెలవిచ్చుచున్నాడు సీయోనులో పునాదిగా రాతిని వేసినవాడను నేనే అది పరిశోధింపబడిన రాయి అమూల్యమైన తలరాయి బహు స్థిరమైన పునాదియైన మూలరాయియైయున్నది విశ్వసించువాడు కలవరపడడు.
రోమీయులకు 9:33, రోమీయులకు 10:11, 1 కోరింథీయులకు 3:11, ఎఫెసీయులకు 2:20, 1 పేతురు 2:4-6

ఈ రాయి యేసుప్రభువే (1 కోరింథీయులకు 3:11; ఎఫెసీయులకు 2:20; 1 పేతురు 2:6). దేవుడు సరిక్రొత్తగా మళ్ళీ ఆరంభించి ఒక నూతన నిర్మాణాన్ని కడతాడని ఈ వచనం సూచిస్తూ ఉంది. కట్టి ఉన్న ఒక ఇంటికి మళ్ళీ పునాది వేసి పునాది రాయిని ఎవరూ నిలబెట్టరు. అలాగైతే క్రొత్త ఒడంబడిక సంఘం పూర్తిగా నవనూతనమైనదా? అలా చెప్పలేము. దాన్ని క్రీస్తు రాయబారులనే పునాదిమీదే కాక ప్రవక్తలు అనే పునాదిపై కూడా కట్టడం జరిగింది (ప్రవక్తలు కూడా ఈ పునాదిలో భాగమే – ఎఫెసీయులకు 2:20). పునాదిలో ఒక భాగం అంటే ఆ కట్టడం అంతటిలోకీ ఒక ముఖ్యమైన భాగమన్నమాట. సంఘం పూర్తిగా క్రొత్తది కాకపోయినప్పటికీ ఈ యుగంలో మనకు కనిపించే సంఘ నిర్మాణం, పాత ఒడంబడిక గ్రంథంలో ఇస్రాయేల్‌లో కనిపించేదానికి భిన్నమైనది. సంఘం గురించి నోట్ మత్తయి 16:18.

17. నేను న్యాయము కొలనూలుగాను నీతి మట్టపుగుండుగాను పెట్టెదను వడగండ్లు మీ మాయాశరణ్యమును కొట్టివేయును దాగియున్నచోటు నీళ్లచేత కొట్టుకొనిపోవును.

“న్యాయం”– వ 6; యెషయా 11:4. “వడగండ్లు”– వ 2. మనుషుల అబద్ధాలు, వారు నమ్ముకొన్న ఆశ్రయాలు పనికిమాలినవని దేవుని తీర్పు సమయంలో బయట పడతుంది (2 రాజులు 24:1-2, 2 రాజులు 24:10, 2 రాజులు 24:12, 2 రాజులు 24:20; 2 రాజులు 25:1 చూడండి).

18. మరణముతో మీరు చేసికొనిన నిబంధన కొట్టివేయ బడును పాతాళముతో మీరు చేసికొనిన ఒడంబడిక నిలు వదు ప్రవాహమువలె ఉపద్రవము మీ మీదుగా దాటు నప్పుడు మీరు దానిచేత త్రొక్కబడిన వారగుదురు

“విపత్తు ప్రవాహంలాగా”– వ 2; యెషయా 8:7.

19. వచ్చునప్పుడెల్లను అది మిమ్మును ఈడ్చుకొనిపోవును ప్రతి ఉదయము ప్రతి పగలు ప్రతి రాత్రి అది వచ్చును ఇట్టి ప్రకటన గ్రహించుటవలన మహా భయము పుట్టును.

దేవుని తీర్పులు, శత్రువుల దాడులు పదేపదే వచ్చిపడ్డాయి. “మహా భయం”– దేవుని వాక్కులోని చాలా సంగతులను సరిగా అర్థం చేసుకుని నమ్మితే అవి మనుషుల హృదయాల్లో మహా భయం పుట్టిస్తాయి.

20. పండుకొనుటకు మంచము పొడుగు చాలదు కప్పుకొనుటకు దుప్పటి వెడల్పు చాలదు.

సిద్ధపాటు లేకపోవడం, నమ్మకం, విశ్రాంతి కలిగే అవకాశం లేకపోవడం గురించి చెపుతూ ఉంది.

21. నిజముగా తన కార్యమును తన ఆశ్చర్యమైన కార్యమును చేయుటకు అపూర్వమైన తన కార్యము నొనరించుటకు ఆయన పెరాజీము అను కొండమీద లేచినట్లు యెహోవా లేచును గిబియోనులోయలో ఆయన రేగినట్లు రేగును.

“పెరాజీం”– 2 సమూయేలు 5:20. “గిబియోను”– యెహోషువ 10:10-12. వింతైన కృత్యం అంటే తన స్వంత నగరాన్ని, ఆలయాన్ని, ప్రజను నాశనం చేసేందుకు శత్రువులను పంపడం.

22. మీ బంధకములు మరి బిగింపబడకుండునట్లు పరిహాసకులై యుండకుడి భూమియందంతట నాశనము ఖండితముగా నియమింప బడెను ప్రభువును సైన్యములకధిపతియునగు యెహోవావలన నేను దాని సమాచారము వింటిని

“పరిహాసం”– వ 14; 2 దినవృత్తాంతములు 36:15-16. “తెలియజేశాడు”– యెషయా 10:22-23.

23. చెవియొగ్గి నా మాట వినుడి ఆలకించి నేను పలుకునది వినుడి

ఈ ఉదాహరణకు అర్థం ఇది: దేవుడు ఇస్రాయేల్ పైకి పంపుతున్న శిక్షల వెనుక ఆయనకు మంచి ఉద్దేశం ఉంది. పొలంలో మంచి పంట ఎలా పండించాలో రైతుకు తెలుసు. ధాన్యాన్ని దుళ్ళగొట్టేవారికి దేనికి ఏ పరికరం వాడాలో, ఎంత సేపు చెయ్యాలో తెలుసు. సర్వ జ్ఞానానికీ మూలమైన దేవునికి తన ప్రజలను ఫలవంతం చెయ్యాలంటే ఏం చెయ్యాలో తెలుసు. ఆయన వారిని ఎక్కువ కఠినంగా ఎక్కువ కాలం అదే పనిగా దున్నుతూ, లేక దుళ్ళగొడుతూ ఉండడు.

24. దున్నువాడు విత్తుటకు నిత్యము తన పొలముదున్నునా? అతడు దుక్కి పెల్లలు నిత్యము బద్దలగొట్టునా?

25. అతడు నేల సదునుచేసిన తరువాత నల్ల జీలకఱ్ఱ చల్లును తెల్ల జీలకఱ్ఱ చల్లును గోధుమలు వరుసగా విత్తును యవలను తానేర్పరచిన చేనిలో చల్లును దాని అంచున మిరపమొలకలు వేయును గదా?

26. వాని దేవుడే తగిన క్రమము వానికి నేర్పియున్నాడు ఆయన వానికి ఆ పని బోధించుచున్నాడు.

27. సేద్యగాడు నల్ల జీలకఱ్ఱ పదునుగల యంత్రముచేత నూర్చడు బండిచక్రములను జీలకఱ్ఱమీద నడిపింపడు గాని కఱ్ఱచేత నల్ల జీలకఱ్ఱను చువ్వచేత జీలకఱ్ఱను దుళ్ల గొట్టును గదా?

28. మనుష్యులు గోధుమలు గాలింపగా దాని నలుచుదురా? సేద్యగాడును ఎల్లప్పుడు దాని నూర్చుచుండడు ఎల్లప్పుడును అతడు బండిచక్రమును గుఱ్ఱములను దాని మీద నడిపించుచుండడు, దాని నలుపడు గదా!

29. జనులు సైన్యములకధిపతియగు యెహోవాచేత దాని నేర్చుకొందురు. ఆశ్చర్యమైన ఆలోచనశక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించువాడు ఆయనేShortcut Links
యెషయా - Isaiah : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |