Isaiah - యెషయా 53 | View All

1. మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను?
యోహాను 12:38, రోమీయులకు 10:16

బైబిల్లోని అత్యంత ఆశ్చర్యం గొలిపే అమోఘమైన అధ్యాయాల్లో ఇది ఒకటి. యేసు ఈ లోకానికి రావడానికి 700 సంవత్సరాల ముందు ఆయన పాపులకోసం పడవలసిన బాధలు, మరణం ఇక్కడ ఉన్నాయి. కీర్తన 22 పోల్చి చూడండి. అభిషిక్తుని గురించిన సందేశం పట్ల ఇస్రాయేల్‌వారి అపనమ్మకం గురించి ఈ వచనం చెప్తున్నది (యోహాను 12:38; రోమీయులకు 10:16). ఈ సందేశం కొంత భాగం పై అధ్యాయం చివరి 3 వచనాల్లో కనిపిస్తుంది. “హస్తం”– యేసుప్రభువు పుట్టుక, జీవితం, మరణం, పునరుత్థానంలో యెహోవాదేవుని హస్తం బలప్రభావాలు అఖండంగా వెల్లడి అయ్యాయి. అయితే ఇదంతా జరిగిస్తున్నది యెహోవా హస్తమని గుర్తించినవారు యూదుల్లో చాలా కొద్దిమంది (ఉదా।। మత్తయి 12:24; యోహాను 8:48 చూడండి). “వెల్లడి అయింది”– ఈ అధ్యాయంలో వివరించబడినవన్నీ యెషయాకు తరువాతి కాలంలో జరిగేవైనా భూతకాల క్రియారూపాలు కన్పిస్తుంటాయి. యెషయా కాలంలో బాగా ముందుకు వెళ్ళిపోయి ఈ సంభవాన్నీ జరిగిపోయినట్టుగా చూచి రాస్తున్నట్టున్నాడు. యెషయా 55:10-11 దగ్గర నోట్ చూడండి.

2. లేతమొక్కవలెను ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను అతడు ఆయనయెదుట పెరిగెను. అతనికి సురూపమైనను సొగసైనను లేదు మనమతని చూచి, అపేక్షించునట్లుగా అతనియందు సురూపము లేదు.
మత్తయి 2:23

“లేత మొక్క”, “అంకురం”– యెషయా 11:1. అభిషిక్తుణ్ణి ప్రవక్తల గ్రంథాల్లో అనేక సార్లు కొమ్మ మొదలైన పేర్లతో పిలవడం కనిపిస్తుంది. ఆయన దేవుని సన్నిధిలో పెరగడం గమనించండి. ఆరంభం నుండి అంతం వరకూ ఆయన జీవితం పూర్తిగా దైవ సంబంధమైనదే. ఎండిన భూమి బహుశా ఇస్రాయేల్‌వారి నిస్సారమైన ఆధ్యాత్మిక స్థితికి గుర్తుగా ఉంది. “అందం గానీ...లేదు”– యేసుప్రభువు పేదవాడుగా, సేవకుడుగా, పేరు ప్రతిష్ఠలు లేనివాడుగా వచ్చాడు (మార్కు 6:3; లూకా 9:58; యోహాను 9:28-29; ఫిలిప్పీయులకు 2:7). రాజోచితమైన వైభవం, ఆడంబరాలతో ఆయన రాలేదు. ఆయనలో రాజఠీవి లేదు. క్రీస్తు పట్ల ఆయన్ను చూచిన యూదులు చాలామందిలో ఏ భావన కలుగుతుందో ఇక్కడ యెషయాకు ఈ భావన కలుగుతున్నది. రోమ్ దాస్యమనే కాడి నుంచి తమ్మును విడిపించే శూరుడుగా తమ అభిషిక్తుడు రావాలని యూదులు ఎదురు చూశారు. లూకా 19:11 చూడండి. అయితే యేసు తన వైభవంతో తరలివచ్చే సొలొమోనులాగా రాలేదు. కన్నీరు మున్నీరుగా అయిన యిర్మీయా లాగా వచ్చాడు. మనుషులకు పేదరికం, శోకం ఆకర్షణీయం కావు.

3. అతడు తృణీకరింపబడినవాడును ఆయెను మనుష్యులవలన విసర్జింపబడినవాడును వ్యసనాక్రాంతుడుగాను వ్యాధి ననుభవించినవాడు గాను మనుష్యులు చూడనొల్లనివాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడినవాడు గనుక మనము అతనిని ఎన్నికచేయకపోతివిు.
మార్కు 9:12

“తృణీకరించారు”– యెషయా 49:7; కీర్తనల గ్రంథము 22:6; యోహాను 15:24. “నిరాకరించారు”– మత్తయి 26:66; మత్తయి 27:21-22; యోహాను 1:11; యోహాను 19:15-16; అపో. కార్యములు 3:13-14. “దుఃఖాలు...బాధలు”– కీర్తనల గ్రంథము 69:7-12, కీర్తనల గ్రంథము 69:19-21; లూకా 12:50; లూకా 19:41; యోహాను 11:35. శుభవార్త పుస్తకాల్లో యేసు ఏడ్చాడని ఉంది గానీ నవ్వాడని ఎక్కడా రాసివున్నట్టు కనిపించదు. నీవు ఎవరికైతే సహాయం చెయ్యజూస్తున్నావో, ఎవరినైతే రక్షించబూనుకున్నావో వారే నిన్ను ద్వేషించి తృణీకరించి అవమానిస్తూ ఉంటే నవ్వు ఎలా వస్తుంది? ఇది గాక ప్రజలందరి దోషానికీ, దురవస్థకూ, దైనస్థితికీ సంబంధించిన దుర్భరమైన బరువు కూడా యేసు పైనే ఉంది. “కనబడకుండా”– చాలామంది ఆయనవైపు చూడడమే కంటకప్రాయమైనట్టుగా ఆయన పట్ల ప్రవర్తించారు. “గొప్పగా ఎంచలేదు”– ఆయన ఈ లోకంలో జీవించినప్పుడు నాయకులు, ప్రజలు, మొదట ఆయన శిష్యులు కూడా ఆయనలోని నిజమైన గొప్పతనాన్ని, ఆయనలోని దైవత్వాన్ని చూడలేకపోయారు. వ 2 నోట్‌లో రిఫరెన్సులు చూడండి.

4. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను మన వ్యసనములను వహించెను అయినను మొత్తబడినవానిగాను దేవునివలన బాధింపబడినవానిగాను శ్రమనొందినవానిగాను మనమతనిని ఎంచితివిు.
మత్తయి 8:17, 1 పేతురు 2:24

“భరించాడు”– మత్తయి 8:17లో దీని అర్థం ఇతరులను బాగుచేసే ఆయన సేవ అని తెలుస్తున్నది. అలాగైతే మన రోగాలను ఆయన బాగుచేశాడని రాసి ఉండాలి కదా. అంటే కేవలం బాగు చెయ్యడమే కాక మరింకేదో చేశాడని అర్థం కావచ్చు. వాటిని ఒక బరువులా ఆయన అనుభవించాడు. బాధపడుతున్నవారి నొప్పిని ఆయన కూడా చవి చూశాడు. మత్తయి 9:36 చూడండి. జాలి పడడమంటే బాధపడేవారి బాధను పంచుకోవడమని అర్థం. యేసు అనుభవించిన బాధలన్నీ మన ప్రతినిధిగా మనకు బదులుగా అనుభవించాడని గుర్తుంచుకుందాం. ఆయన మన స్థానంలో వాటిని భరించాడు (యెషయా 63:9 చూడండి. 2 కోరింథీయులకు 11:28-29 లో పౌలు మాటలను పోల్చి చూడండి). “దేవుడు...బాధించాడని”– క్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు ధన సమృద్ధి దేవుని అనుగ్రహానికి గుర్తు అని అనేకమంది యూదులు భావించారు. ఈ వచనాలన్నిటిని బట్టి చూస్తే క్రీస్తు పేదరికం, దుఃఖం, బాధలు దేవుడు ఆయనకు విధించిన శిక్షగా వారు అర్థం చేసుకున్నారని చెప్పవచ్చు.

5. మన యతిక్రమక్రియలనుబట్టి అతడు గాయపరచ బడెను మన దోషములనుబట్టి నలుగగొట్టబడెను మన సమాధానార్థమైన శిక్ష అతనిమీద పడెను అతడు పొందిన దెబ్బలచేత మనకు స్వస్థత కలుగు చున్నది.
మత్తయి 26:67, లూకా 24:46, రోమీయులకు 4:25, 1 పేతురు 2:24, అపో. కార్యములు 10:43

“గాయపడ్డాడు”– కీర్తనల గ్రంథము 22:16; యోహాను 19:18, యోహాను 19:34; జెకర్యా 12:10. ఇక్కడ వాడిన హీబ్రూ పదానికి అర్థం పదునైన పరికరం వల్ల గాయాలు పొందడం. ఇక్కడ కూడా యేసు పొందిన వేదనలన్నీ మనకు బదులుగా మన స్థానంలో ఆయన అనుభవించాడని నొక్కి చెప్పడం కనిపిస్తుంది. మనం భరించవలసినదాన్ని ఆయన భరించాడు. ఆయన గాయపడడానికీ, దెబ్బలు తినడానికీ కారణం మన పాపాలే. నలగ్గొట్టడం అనే పదం లోకమంతటి పాపాల భారం ఆయన మీద పడ్డాయని సూచిస్తూ ఉంది (యోహాను 1:29; 2 కోరింథీయులకు 5:21; 1 పేతురు 2:24). “శిక్ష”– మనకు శాంతి కలిగించే శిక్ష అంటే, మన పాపాలను తీసివేసే శిక్ష అని అర్థం. మనం దేవునితో సఖ్యపడేందుకు మార్గాన్ని తెరిచిన శిక్ష ఇది. పాపులనుండి పాపం తొలిగిపోయేంతవరకు వారికి దేవునితో సమాధానం గాని, వారిలో దేవుని శాంతి గాని ఉండవు. మన పాపాలకు న్యాయంగా చెందవలసిన శిక్షను యేసుప్రభువు భరించాడు. మన స్థానంలో దేవుడు ఆయన్ను శిక్షించాడు. మనకు దేవునితో సఖ్యత కలగడం, శాంతి చేకూరడమే ఇందులోని ఉద్దేశం (2 కోరింథీయులకు 5:18-21; ఎఫెసీయులకు 2:13-18; 1 పేతురు 3:18). “ఆరోగ్యం”– ఇందులో క్షమాపణ ఉంది. అయితే ఇది క్షమాపణను మించినది – పాపాల విషయంలో చనిపోయి నీతిన్యాయాల విషయంలో బ్రతకడం, మంచి కాపరిదగ్గర చేరి ఆయన చూపే దారిలో జీవితం సాగించడం అని కూడా అర్థమిస్తుంది (1 పేతురు 2:24-25). చివరికి పాపరహితులుగా యేసుప్రభువులాగా లోపంలేనివారుగా మారడం జరుగుతుంది అని కూడా ఈ పదంలో ఉంది (రోమీయులకు 8:29; 1 కోరింథీయులకు 15:49; 2 కోరింథీయులకు 3:18; ఫిలిప్పీయులకు 3:21; 1 యోహాను 3:2). యేసుప్రభువు గాయాలవల్లే ఇదంతా సాధ్యపడింది.

6. మనమందరము గొఱ్ఱెలవలె త్రోవ తప్పిపోతివిు మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను యెహోవా మన యందరి దోషమును అతనిమీద మోపెను.
1 పేతురు 2:25, యోహాను 1:29, అపో. కార్యములు 10:43

దేవుని నుంచి దూరంగా తొలగిపోయి ఇష్టం వచ్చిన దారికి మళ్ళడమే అన్ని పాపాలకూ మూల పాపం. ఆదాము మొదలు మనుషులంతా ఈ పాపం చేసినవారే – ఆదికాండము 3:6 (రోమీయులకు 5:12); కీర్తనల గ్రంథము 58:3; కీర్తనల గ్రంథము 95:10; కీర్తనల గ్రంథము 119:67, కీర్తనల గ్రంథము 119:176; యిర్మియా 2:13; రోమీయులకు 3:12; 1 పేతురు 2:25. త్రోవ తప్పిపోవడం అపరాధం అని తరువాతి వాక్యంలో రాసి ఉంది. మన అపరాధాలన్నీ, ఇలా త్రోవ తప్పిపోవడంతో సహా క్రీస్తు మీద పడ్డాయి (లేవీయకాండము 16:20, లేవీయకాండము 16:22 పోల్చి చూడండి).

7. అతడు దౌర్జన్యము నొందెను బాధింపబడినను అతడు నోరు తెరవలేదు వధకు తేబడు గొఱ్ఱపిల్లయు బొచ్చు కత్తిరించువానియెదుట గొఱ్ఱయు మౌనముగా నుండునట్లు అతడు నోరు తెరువలేదు.
మత్తయి 26:63, మత్తయి 27:12-14, మార్కు 14:60-61, మార్కు 15:4-5, యోహాను 1:36, 1 కోరింథీయులకు 5:7, 1 పేతురు 2:23, ప్రకటన గ్రంథం 5:6-12, ప్రకటన గ్రంథం 13:8, అపో. కార్యములు 8:32-33, యోహాను 1:29

3-6 వచనాలు క్రీస్తు పడ్డ బాధలను వర్ణిస్తున్నాయి. ఈ వచనంలో ఆయన ఆ బాధలను ఎంత సహనంతో భరించాడో తెలుస్తున్నది. ఆయన సణగలేదు. అన్యాయమని అరవలేదు. తనను తాను సమర్థించుకునేందుకు ప్రయత్నించలేదు (మత్తయి 27:12-14; మార్కు 14:60-61; మార్కు 15:5; లూకా 20:8-9; యోహాను 19:8-10; 1 పేతురు 2:21-23). “గొర్రెపిల్ల”– నిర్గమకాండము 12:3-7; లేవీయకాండము 1:10-13; యోహాను 1:29, యోహాను 1:36; ప్రకటన గ్రంథం 5:6, ప్రకటన గ్రంథం 5:12.

8. అన్యాయపు తీర్పునొందినవాడై అతడు కొనిపోబడెను అతడు నా జనుల యతిక్రమమునుబట్టి మొత్తబడెను గదా. సజీవుల భూమిలోనుండి అతడు కొట్టివేయబడెను అయినను అతని తరమువారిలో ఈ సంగతి ఆలో చించినవారెవరు?
1 కోరింథీయులకు 15:3, అపో. కార్యములు 8:32-33

“కొట్టడం జరిగింది”– ఈ అధ్యాయంలో క్రీస్తు బాధల్ని, మరణాన్ని వర్ణించే పదాలన్నిటినీ చూడండి. ‘కొట్టాడనీ’, ‘మొత్తి బాధించాడనీ’ (వ 4), ‘గాయపడ్డాడు’, ‘నలగ్గొట్టడం’, ‘శిక్ష’, ‘దెబ్బలు’ (వ 5), ‘దౌర్జన్యానికి గురి అయ్యాడు’ (వ 7), ‘హతం అయ్యాడు’.

9. అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను ధనవంతునియొద్ద అతడు ఉంచబడెను నిశ్చయముగా అతడు అన్యాయమేమియు చేయలేదు అతని నోట ఏ కపటమును లేదు.
మత్తయి 26:24, 1 పేతురు 2:22, 1,Joh,3,5, ప్రకటన గ్రంథం 14:5, 1 కోరింథీయులకు 15:3

“సమాధి”– క్రీస్తు మృతదేహానికి కూడా నేరస్థుల దేహాలకు చేసినట్టే చెయ్యాలని, అంటే అన్నిటినీ కలిపి ఒకే గుంటలో పూడ్చి పెట్టాలని ఆయన శత్రువుల కోరిక అని చెప్పవచ్చు. అయితే యేసు మృతదేహాన్ని ఒక ధనికుని సమాధిలో ఉంచాలని మరో నిర్ణయం జరిగిపోయింది. (మత్తయి 27:57-60 చూడండి). “దౌర్జన్యం...మోసం చేయలేదు”– ఈ మాటలు యేసు ప్రభువు పవిత్ర, సాత్విక, పాపరహిత స్వభావాన్ని సూచిస్తాయి. ఆయన్ను తప్పించి ఈ లోకంలో పుట్టిన ప్రతి వ్యక్తి నోటా కనీసం కొంచెమైనా మోసం ఉంది (కీర్తనల గ్రంథము 12:2; యిర్మియా 9:7-8; యిర్మియా 17:9; రోమీయులకు 3:13; మొ।।).

10. అతని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను. అతడు తన్నుతానే అపరాధపరిహారార్థబలిచేయగా అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశము అతనివలన సఫలమగును.

యేసుప్రభువును హింసించి చంపినవారు దేవుని చేతిలో సాధనాలన్న సత్యాన్ని ఈ వచనం ద్వారా గమనించగలం. ఆయన్ను బాధలు పెట్టి చంపినది మనుషులే. అయితే వారి మూలంగా దేవుడే తన ఉద్దేశాలను సఫలం చేసుకొంటున్నాడు. అపో. కార్యములు 2:23; అపో. కార్యములు 4:27-28 మొ।। చూడండి. మానవుల పాపాలకోసం క్రీస్తును అపరాధాలకోసమైన బలిగా చేసేందుకు దేవుడు దుష్టులైన మనుషులను వాడుకొన్నాడు (లేవీయకాండము 5:14-15; రోమీయులకు 3:25; రోమీయులకు 8:3; 2 కోరింథీయులకు 5:21; హెబ్రీయులకు 9:12-14; హెబ్రీయులకు 10:14; 1 యోహాను 2:2, 1 యోహాను 2:4, 1 యోహాను 2:10). అయితే క్రీస్తు దీనంతటికీ తల వంచడంలో పరిపూర్ణ సమ్మతితో తన తండ్రి సంకల్పాన్ని అన్నిటికంటే పైగా ఎంచాడు (మత్తయి 26:39; యోహాను 10:17-18; హెబ్రీయులకు 10:5-7). “చిరంజీవి”– ఆయన్ను వధించి సమాధి చేశారని చెప్పిన వెంటనే ఆయన దీర్ఘాయుష్మంతుడు అయ్యాడని చెప్పడం ఎలా సరిపోతుంది? దీనికి జవాబు ఆయన మరణం నుంచి సజీవంగా లేవడంలో ఉంది. ఆ విధంగా ఆయన దీర్ఘాయుష్మంతుడు అయ్యాడు (ప్రకటన గ్రంథం 1:18; ప్రకటన గ్రంథం 9:7; కీర్తనల గ్రంథము 45:6; కీర్తనల గ్రంథము 72:5; హెబ్రీయులకు 1:10-12; హెబ్రీయులకు 13:8). ఆయన తన సంతానాన్ని చూడడం ఎలానో ఇక్కడ అర్థమౌతున్నది. అంటే తన ఆత్మమూలంగా పుట్టిన ఆధ్యాత్మిక సంతతి అన్మమాట. ఆయన అపరాధాల కోసమైన బలి అయ్యాడు కాబట్టే ఆయనకు సంతానం ఉంది. “సఫలం”– ఆయన భూమిపై ఉన్నప్పుడు దేవుని సంకల్పాన్ని సంపూర్ణంగా నెరవేర్చాడు (యోహాను 17:4). ఆయనిప్పుడు పరలోకంలో ఉండి తండ్రి సంకల్పాన్ని సంపూర్ణంగా నెరవేరుస్తున్నాడు (ఎఫెసీయులకు 1:9-10; యెషయా 42:1-4; అపో. కార్యములు 1:2; అపో. కార్యములు 2:33; మత్తయి 28:18; యోహాను 17:2; కొలొస్సయులకు 1:29). దేవుని సంకల్పం నెరవేర్చడానికి ఆయనకంటే మంచి సాధనం వేరొకటి ఉండబోదు. దేవుడు తనకు నియమించిన దానంతటినీ తానీ లోకంలో ఉన్నప్పుడు నెరవేర్చినట్టే విజయవంతంగా పూర్తి చేస్తాడు.

11. అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తినొందును. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి నకున్న అనుభవజ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయును.
రోమీయులకు 5:19

ఈ వచనంలోనూ దీని తరువాతి వచనాల్లోనూ యెహోవాయే “అభిషిక్తుణ్ణి” గురించి మాట్లాడుతున్నాడు. క్రీస్తు పడిన బాధలవల్ల కలిగే ఫలితం మహత్తరమైనది. ఆయన ఎంత మేరకు ఆశించాడో అంత మేరకు సంతృప్తి చెందుతాడు. దేవునికి మహిమ, అశేష ప్రజానీకానికి శాశ్వత రక్షణ, ఆనందోత్సవాలే ఆ ఫలితాలు (ఈ వచనం మిగతా భాగాన్ని బట్టి ఇలా అర్థం చేసుకోవచ్చు). “సేవకుడు”– యెషయా 42:1-7 మొ।।. ఆయన నీతి న్యాయాల గురించీ ఇక్కడ ప్రత్యేకంగా రాసి ఉంది. ఎందుకంటే ఆయన నీతి న్యాయాలు గలవాడు గనుకనే న్యాయంగా మనుషుల పాపాలను భరించాడు గనుకనే వారి పాపాలకు సరిపోయిన పూర్తి అపరాధ పరిహారం చెల్లించాడు గనుకనే ఇతరులకు తన నీతిన్యాయాలను ఇవ్వగలుగుతున్నాడు. “చాలామంది”– అందరూ కాదు. ఆయనలో నమ్మకముంచిన వారు మాత్రమే. అలా చూసు కున్నా భూమిపై అన్ని దేశాలనుండి లెక్కలేనంత మంది జనసమూహం అవుతారు – ప్రకటన గ్రంథం 7:9-10. “తన జ్ఞానం”– బహుశా దీనికి అర్థం యోహాను 17:3 లో లాగా ప్రజలకు ఆయన గురించి కలిగే జ్ఞానం అనుకోవచ్చు. ఆయన్ను గురించి నేర్చుకోవడం, ఆయనలో నమ్మకం ఉంచడం, ఆయన సన్నిధిని అనుభవించడం ఈ జ్ఞానానికి మూలం. లేక అభిషిక్తునికి నిజ దేవుణ్ణి గురించి, ప్రజల గురించి, వారికోసం తాను చేసిన బలిని గురించి ఉన్న జ్ఞానం అని కూడా అర్థం కావచ్చు. “నిర్దోషులుగా”– రోమీయులకు 3:24, రోమీయులకు 3:26, రోమీయులకు 3:28; రోమీయులకు 4:25; రోమీయులకు 5:1; రోమీయులకు 10:10; 1 కోరింథీయులకు 6:11; గలతియులకు 2:16; తీతుకు 3:7 నోట్స్ చూడండి.

12. కావున గొప్పవారితో నేనతనికి పాలు పంచిపెట్టెదను ఘనులతో కలిసి అతడు కొల్లసొమ్ము విభాగించుకొనును. ఏలయనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను అతిక్రమము చేయువారిలో ఎంచబడినవాడాయెను అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసినవారినిగూర్చి విజ్ఞాపనముచేసెను
మత్తయి 27:38, మార్కు 15:28, లూకా 22:37, లూకా 23:33-34, రోమీయులకు 4:25, హెబ్రీయులకు 9:28, 1 పేతురు 2:24

బలాఢ్యులతో గొప్పవారితో రాబడి విభాగించుకోవడం ఒక యుద్ధాన్నీ, విజయాన్నీ, చేజిక్కించుకొన్న కొల్లసొమ్మునూ సూచిస్తూ ఉంది. ఇంతకు ముందు వచనాలు ఒక యుద్ధాన్ని తెలియజేస్తున్నాయని ఈ వచనాన్ని బట్టి తెలుస్తున్నది. తన బాధల్లో, మరణంలో అభిషిక్తుడు తన ప్రజల పక్షాన వారి శత్రువుతో (సైతాను, వాడి అనుచరులతో) పోరాడుతున్నాడు. కొలొస్సయులకు 2:15; హెబ్రీయులకు 2:14-15 మొ।। పోల్చి చూడండి. గొప్పవారు, బలాఢ్యులు అంటే ఆయన సంతానం (వ 10), ఆయన నిర్దోషులుగా ఎంచినవారు (వ 11), యెషయా 52:15 లో ఉన్నట్టు అనేక జనాలు, బలాఢ్యుల గురించి. మత్తయి 11:12 పోల్చి చూడండి. ఆయన వారిని అలా చేస్తాడు కాబట్టి వారు గొప్పవారు, బలాఢ్యులు అవుతారు. “రాబడి”– ఇదేమిటి? విముక్తి పొంది తిరిగి నూతనంగా అయిన భూమి, దానిలో ఉండేవన్నీ. “విభాగించుకొంటారు”– రోమీయులకు 8:17 చూడండి. “చనిపోయాడు”– పంచుకునేందుకు రాబడి ఉండడం, ఆయన ఇతరులతో కలిసి దాన్ని పంచుకోవడం వీటన్నిటికీ ఉన్న ఏకైక కారణం ఇదే. “అక్రమకారుల్లో”– మార్కు 15:28. “భరిస్తూ”– 5,6,8,10,11 వచనాల్లో ఇదే వేరువేరు పదాల్లో రాసి ఉంది. “విన్నపం చేశాడు”– సిలువకు ముందు (యోహాను 17:6), సిలువ పైనా (లూకా 23:34), ఈ యుగమంతటిలోనూ (రోమీయులకు 8:34; హెబ్రీయులకు 7:25; 1 యోహాను 2:1). క్రీస్తు పనుల్లో ఇదొకటి. ఇలా విన్నపం చెయ్యడం ద్వారా తన ప్రజలు తనతో కలిసి రాబడి పంచుకునే సంగతిని ఖాయం చేస్తున్నాడు. అయితే ఇక్కడ విన్నపం అంటే ప్రధానంగా సిలువపై ఆయన చేసిన దానికి సంబంధించినదై ఉండవచ్చు.Shortcut Links
యెషయా - Isaiah : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |