Jeremiah - యిర్మియా 1 | View All

1. బెన్యామీనుదేశమందలి అనాతోతులో కాపురమున్న యాజకులలో ఒకడై, హిల్కీయా కుమారుడైన యిర్మీయా వాక్యములు

అనాతోతు జెరుసలంకు దాదాపు 5 కిలోమీటర్ల ఉత్తరాన ఉన్న గ్రామం. ఇది ఇస్రాయేల్ యాజుల కోసం ప్రత్యేకించిన ఊరు (యెహోషువ 21:18; 1 రాజులు 2:26).

2. ఆమోను కుమారుడైన యోషీయా యూదాకు రాజై యుండగా అతని యేలుబడి పదుమూడవ సంవత్సరమున యెహోవా వాక్కు యిర్మీయాకు ప్రత్యక్ష మాయెను.

“యెహోవానుంచి వాక్కు...వచ్చింది”– ఈ మాటలు ప్రవక్తల గ్రంథాల్లో తరచుగా కనిపిస్తూ ఉంటాయి (యెహెఙ్కేలు 1:3; యోనా 1:1; హగ్గయి 1:1; జెకర్యా 1:1; మొ।।). దేవుడు నేరుగా వెల్లడి చేసిన విషయం అని దీని అర్థం. దేవుడు తమకు ఏ మాటలనైతే ఇచ్చాడో సరిగ్గా అదే మాటలను ప్రవక్తలు పలికారు, రాశారు – వ 9; 2 పేతురు 1:21.

3. మరియయోషీయా కుమారుడగు యెహోయాకీము యూదాకు రాజైయుండగాను, యోషీయా కుమారుడగు సిద్కియా యూదాకు రాజై యుండగాను, అతని యేలుబడి పదునొకండవ సంవత్సరాంతమువరకును, అనగా ఆ సంవత్సరమున అయిదవ నెలలో యెరూషలేము చెరదీసికొని పోబడు వరకును ఆ వాక్కు ప్రత్యక్షమగు చుండెను.

రెండు, మూడు వచనాల మధ్య ఉన్న కాలపరిమితి 40 ఏళ్ళు. క్రీస్తు పూర్వం 626–586 మధ్య కాలం. అటు తరువాత కూడా యిర్మీయా మరి కొన్ని సంవత్సరాలు దేవునిమూలంగా పలుకుతూనే వచ్చాడు. ఇక్కడ కనిపిస్తున్న రాజుల్లో యోషీయా ఒక్కడే మంచి రాజు. ఈ సంవత్సరాలలో జరిగిన చరిత్ర 2 రాజులు 22-25 అధ్యాయాల్లోను, 2 దిన 34-36 అధ్యాయాల్లోనూ క్లుప్తంగా రాసినది.

4. యెహోవావాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను

5. గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్నెరిగితిని, నీవు గర్భమునుండి బయలుపడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితిని.
గలతియులకు 1:15

“రూపొందించే ముందే”– కీర్తనల గ్రంథము 139:13; కీర్తనల గ్రంథము 119:73; యెషయా 44:24; యెషయా 49:5. “ఎరిగి ఎన్నుకున్నాను”– కీర్తనల గ్రంథము 139:16; రోమీయులకు 8:29; రోమీయులకు 11:2; 1 పేతురు 1:2. “ప్రత్యేకించుకొన్నాను”– యెషయా 49:1, యెషయా 49:5; లూకా 1:13-15; గలతియులకు 1:15. “నియమించాను”– తన ప్రజల్లో ప్రతి ఒక్కరికీ తగిన స్థలాన్నీ, పనినీ దేవుడు నిర్ణయించాడు (రోమీయులకు 12:3-8; 1 కోరింథీయులకు 12:27-31). మనం ఏమి చేసినా దేవుడు మనలను ఆ పనికి నియమించాడన్నది గ్రహించి చెయ్యాలి. మనం ఉనికిలోకి రాకముందే మన విషయమంతా దేవునికి తెలుసు. ఆది 20:7లో “ప్రవక్త” గురించి నోట్స్ చూడండి. యిర్మీయా విషయంలో దేవునికి చాలా ఉన్నతమైన ఉద్దేశం ఉంది. అతడు కేవలం ఇస్రాయేల్ వారికి మాత్రమే కాదు, లోక జాతులకు కూడా ప్రవక్తే – వ 10; యిర్మియా 25:15-26; 46—51 అధ్యాయాలు.

6. అందుకు అయ్యో ప్రభువగు యెహోవా, చిత్తగించుము నేను బాలుడనే; మాటలాడుటకు నాకు శక్తి చాలదని నేననగా

యిర్మీయా ఇచ్చిన జవాబు మోషే ఇచ్చిన జవాబులాంటిది. యెషయా ఇచ్చిన జవాబులాంటిది కాదు (యెషయా 6:8). యిర్మీయా తాను దేవుని పక్షంగా మాట్లాడడానికి సమర్థుణ్ణి అనుకోలేదు. ఆ బాధ్యత ఏదో విధంగా తొలగిపోతే సంతోషించేవాడు.

7. యెహోవా నాకీలాగు సెలవిచ్చెను-నేను బాలుడననవద్దు; నేను నిన్ను పంపువారందరియొద్దకు నీవు పోవలెను, నీకాజ్ఞాపించిన సంగతులన్నియు చెప్ప వలెను.
అపో. కార్యములు 26:17

దేవుడు ఒక వ్యక్తిని ఒక పని నిమిత్తం నియమించి నప్పుడు, దాన్ని తప్పించుకునేందుకు అతడు చెప్పే సాకులను దేవుడంగీకరించడు. నిర్గమకాండము 3:10-13; నిర్గమకాండము 4:1, నిర్గమకాండము 4:10-17 పోల్చి చూడండి.

8. వారికి భయపడకుము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడైయున్నాను; ఇదే యెహోవా వాక్కు.
అపో. కార్యములు 18:9-10

9. అప్పుడు యెహోవా చేయి చాపి నా నోరుముట్టి యీలాగు సెలవిచ్చెను ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచియున్నాను.

నిర్గమకాండము 4:12; సంఖ్యాకాండము 22:38; సంఖ్యాకాండము 23:5, సంఖ్యాకాండము 23:12, సంఖ్యాకాండము 23:16; ద్వితీయోపదేశకాండము 18:18; యెషయా 51:16. ఈ విధంగా బైబిలు వ్రాసిన ప్రవక్తలు దేవుడు చెప్పిన మాటలను ఎలాంటి పొరపాటు లేకుండా సరిగ్గా అదే పలుకులను పలకగలిగారు. దేవుని ఆత్మమూలంగా దేవుని మాటలను పలికారు (2 తిమోతికి 3:16; 2 పేతురు 1:21).

10. పెల్లగించుటకును విరుగగొట్టుటకును, నశింపజేయుటకును పడద్రోయుటకును, కట్టుటకును నాటుటకును నేను ఈ దినమున జనముల మీదను రాజ్యములమీదను నిన్ను నియమించియున్నాను.
ప్రకటన గ్రంథం 10:11

యిర్మీయా ద్వారా దేవుడు పంపిన వాక్కే జనాల మధ్య, రాజ్యాల మధ్య ఈ సంగతులను జరిగిస్తుంది. యెషయా 55:10-11 చూడండి. దేవుని ఆత్మ ద్వారా యిర్మీయా పలికిన పలుకులు రెండు విధాలైన ఫలితాలను సాధిస్తాయి – వాటిలో నాశనం చేసే శక్తి ఉంది, నిర్మించే శక్తి ఉంది. దేవుని వాక్కును వినేవారి స్థితిని బట్టి, దానికి వారు చూపే వైఖరిని బట్టి ఈ రెండు ఫలితాల్లో ఏదో ఒక రకమైన ఫలితం తప్పక ఉండి తీరుతుంది. కొన్నిసార్లు మంచితనం వర్ధిల్లాలంటే చెడుతనాన్ని నాశనం చేయక తప్పదు.

11. మరియయెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యిర్మీయా, నీకేమి కనబడుచున్నదని సెలవిచ్చెను. అందుకుబాదముచెట్టు చువ్వ కనబడుచున్నదని నేననగా

దేవుడు తన ప్రవక్తలకు తన సందేశాన్ని ఇచ్చేందుకు ఉదాహరణ పూర్వకమైన పద్ధతిని కొన్ని సార్లు ఎన్నుకొన్నాడు (వ 13; ఆమోసు 7:8; ఆమోసు 8:2; జెకర్యా 4:2; జెకర్యా 5:2). ఇక్కడి వచనాల్లో కనిపించే రెండు ఉదాహరణలు యిర్మీయా గ్రంథంలోని ఉపదేశాలన్నిటికీ పట్టు కొమ్మల్లాంటివి. హీబ్రూలో “బాదం చెట్టు”కూ “శ్రద్ధ వహించడానికీ” ఉపయోగించే మాటలు దాదాపు ఒకే విధంగా ఉంటాయి (షాకేద్, షోకేద్‌). చిగురించిన అహరోను కర్ర బాదం కర్రే. సంఖ్యాకాండము 17:1-13 చూడండి.

12. యెహోవా నీవు బాగుగా కనిపెట్టితివి; నేను చెప్పిన వాక్యమును నెరవేర్చుటకు నేను ఆతుర పడుచున్నాననెను.

ఇస్రాయేల్‌కు నమ్మకం లేకపోయినా, ప్రపంచ ప్రజలకూ జాతులకూ దేవుడంటే ఎవరో తెలియకపోయినా దేవుడు మాత్రం తన మాటను నిలబెట్టుకుంటాడు. అలా చెయ్యడేమోనని యిర్మీయా భయపడకూడదు. యిర్మీయాను ప్రవక్తగా నియమించిన తరువాత దేవుడు అతనికిచ్చిన మొట్టమొదటి సందేశం ఇదే. యిర్మీయాలాగే అన్ని కాలాల్లోనూ తన సేవకులందరూ దీన్ని నిశ్చయంగా తెలుసుకుని ఉండాలని దేవుని కోరిక.

13. రెండవమారు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై-నీకేమి కనబడుచున్నదని సెలవియ్యగా నేనుమసలుచున్న బాన నాకు కనబడుచున్నది; దాని ముఖము ఉత్తర దిక్కునకు తిరిగియున్నదంటిని.

రెండో సందేశం ఇస్రాయేల్ వినాశనానికి సంబంధించినది. ఉత్తర దిశనుండి కొన్ని జాతులవారు సలసల మరిగే నీటిలాగా ఉద్రేకంగా వస్తారు. దేశాన్ని ముంచెత్తుతారు (యిర్మియా 4:6; యిర్మియా 6:1). యిర్మీయా జీవితకాలానికి సంబంధించినంతవరకు బబులోను, దాని మిత్రరాజ్యాలు యూదాను దండెత్తి ఓడించడం ద్వారా ఇది నెరవేరింది. యిర్మీయా 39 అధ్యాయం; 2 రాజులు 24—25; 2 దిన 36 అధ్యాయం చూడండి. బహుశా ఇంతకంటే సంపూర్ణమైన నెరవేర్పు ఈ యుగాంతంలో వస్తుంది (యెహె 38—39; జెకర్యా 12 అధ్యాయాలు).

14. అందుకు యెహోవా ఈలాగు సెలవిచ్చెను ఉత్తర దిక్కునుండి కీడు బయలుదేరి యీ దేశనివాసులందరిమీదికి వచ్చును.

15. ఇదిగో నేను ఉత్తరదిక్కున నున్న రాజ్యముల సర్వవంశస్థు లను పిలిచెదను, వారు వచ్చి ప్రతివాడును యెరూషలేము గుమ్మములలోను, యెరూషలేము చుట్టునున్న ప్రాకారములన్నిటికి ఎదురుగాను, యూదాపట్టణములన్నిటికి ఎదురు గాను తమ సింహాసనములను స్థాపింతురు.

16. అప్పుడు యెరూషలేము వారు నన్ను విడిచి అన్యదేవతలకు ధూపము వేసి, తమ చేతులు రూపించిన వాటికి నమస్కరించుట యను తమ చెడుతనమంతటినిబట్టి నేను వారిని గూర్చిన నా తీర్పులు ప్రకటింతును.

దేవుని తీర్పుకు గల కారణాలు తేటతెల్లమే. ఇస్రాయేల్ వారు ధర్మశాస్త్రంలోని అతి ముఖ్యమైన ఆజ్ఞను పదేపదే అతిక్రమించారు. సృష్టికర్తను విడిచి తాము చేతులతో చేసుకున్న వాటిని ఆరాధించారు (నిర్గమకాండము 20:1-6; లేవీయకాండము 26:14-39; ద్వితీయోపదేశకాండము 27:14-26 చూడండి).

17. కాబట్టి నీవు నడుముకట్టు కొని నిలువబడి నేను నీకాజ్ఞాపించునదంతయు వారికి ప్రకటనచేయుము; భయపడకుము లేదా నేను వారి యెదుట నీకు భయము పుట్టింతును.
లూకా 12:35

దేవుని పక్షంగా మాట్లాడేవాడి ప్రధాన కర్తవ్యం ఇది – మనుషులకు భయపడకుండా ఆయన వాక్కును ఉన్నదున్నట్టు ప్రకటించడం. పవిత్రాత్మ సంపూర్ణత ఉంటే ఇది సాధ్యం (అపో. కార్యములు 4:31). మనం ఎన్నుకోవలసినది ఇది – దేవునికి భయపడాలా మనుషులకా? (మత్తయి 10:28; యెషయా 8:12-13).

18. యూదా రాజుల యొద్దకు గాని ప్రధానులయొద్దకు గాని యాజకులయొద్దకు గాని దేశనివాసులయొద్దకు గాని, యీ దేశమంతటిలో నీవెక్కడికి పోయినను, ప్రాకారముగల పట్టణముగాను ఇనుపస్తంభముగాను ఇత్తడి గోడలు గాను నీవుండునట్లు ఈ దినమున నిన్ను నియమించియున్నాను.

వ 8. అంతా యిర్మీయాకు వ్యతిరేకులౌతారు. పాలకులు, ప్రజలు, మతాధికారులు (అతనికి బాసటగా నిలువ వలసినవారే). అంతా ఎదురు తిరుగుతారు. అతడు ప్రపంచమంతటికీ ఎదురు నిలిచి ఒంటరిగా పోరాడాలి. అయితే తరువాత రోమీయులకు 8:31 లో లిఖితమయ్యే సత్యాన్ని యిర్మీయా తెలుసుకోవాలి (కీర్తనల గ్రంథము 118:6; హెబ్రీయులకు 13:6).

19. వారు నీతో యుద్ధము చేతురు గాని నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై యున్నందున వారు నీపైని విజయము పొంద జాలరు; ఇదే యెహోవా వాక్కు.Shortcut Links
యిర్మియా - Jeremiah : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |