Mark - మార్కు సువార్త 16 | View All

1. విశ్రాంతిదినము గడచిపోగానే మగ్దలేనే మరియయు యాకోబు తల్లియైన మరియయు సలోమేయు వచ్చి, ఆయనకు పూయవలెనని సుగంధద్రవ్యములు కొనిరి.

మత్తయి 28:1-8. మృత దేహాన్ని సమాధికోసం సిద్ధం చేసే ఆచారం ఇది. యేసు తిరిగి సజీవంగా లేస్తాడని ఈ స్త్రీలు నమ్మినట్టు లేదు.

2. వారు ఆదివారమున పెందలకడ (లేచి, బయలుదేరి) సూర్యోదయమైనప్పుడు సమాధియొద్దకు వచ్చుచుండగా,

3. సమాధి ద్వారమునుండి మనకొరకు ఆ రాయి యెవడు పొర్లించునని ఒకరితో ఒకరు చెప్పుకొనుచుండిరి.

4. వారు వచ్చి కన్నులెత్తిచూడగా, రాయి పొర్లింపబడి యుండుట చూచిరి. ఆ రాయి యెంతో పెద్దది.

5. అప్పుడు వారు సమాధిలో ప్రవేశించి, తెల్లని నిలువుటంగీ ధరించు కొనియున్న యొక పడుచువాడు కుడివైపున కూర్చుండుట చూచి మిగుల కలవరపడిరి.

ఇతడు మనిషి ఆకారంలో కనిపించే దేవదూత (మత్తయి 28:2). ఆదికాండము 16:7 దగ్గర దేవదూతల గురించి నోట్.

6. అందుకతడు కలవరపడకుడి సిలువ వేయబడిన నజరేయుడగు యేసును మీరు వెదకుచున్నారు; ఆయన లేచియున్నాడు, ఇక్కడ లేడు; వారు ఆయనను ఉంచిన స్థలము చూడుడి.

7. మీరు వెళ్లి ఆయన మీకంటె ముందుగా గలిలయలోనికి వెళ్లుచున్నా డనియు, ఆయన మీతో చెప్పినట్టు అక్కడ మీరు ఆయనను చూతురనియు ఆయన శిష్యులతోను పేతురు తోను చెప్పుడనెను.

తానెవరో తెలియదన్న పేతురుకు యేసుప్రభువు ప్రత్యేకమైన సందేశం పంపుతున్నాడు. అతడు నిరాశ చెంది, తనను ఇక శిష్యుడుగా ఎంచడం జరగదేమోనని కృంగిపోకూడదు. అతి హీనంగా పాపం చేసిన వారిపట్ల ప్రభువు కొన్ని సార్లు ఎక్కువ ప్రేమగా, దయగా వ్యవహరించాడు.

8. వారు బయటకు వచ్చి, విస్మయము నొంది వణకుచు సమాధియొద్దనుండి పారిపోయిరి; వారు భయపడినందున ఎవనితో ఏమియు చెప్ప లేదు.

అంటే శిష్యులదగ్గరికి వచ్చేవరకు వారు ఎవరితోనూ మాట్లాడలేదన్నమాట (మత్తయి 28:8; లూకా 24:9, లూకా 24:19).

9. ఆదివారము తెల్లవారినప్పుడు యేసు లేచి, తాను ఏడు దయ్యములను వెళ్లగొట్టిన మగ్దలేనే మరియకు మొదట కనబడెను.

ఈ వచనాలు మార్కు శుభవార్తలోని భాగం కాదని, వేరొకరు వీటిని తరువాత కలిపారని కొందరు పండితులన్నారు. కొన్ని ప్రాచీన వ్రాత ప్రతుల్లో ఈ వచనాలు లేవన్న సంగతి నిజమే. అయితే మరికొన్ని ప్రతుల్లో ఈ వచనాలు ఉన్నాయి. అంతేగాక మార్కు మొదటగా రాసిన ప్రతిలో ఈ వచనాలు లేవనడానికి ఆధారం లేదు. మార్కు ఈ ముగింపు వచనాలు రాసినా రాయకపోయినా, వేరొకరు రాసినా దేవుని ఆత్మే వారిని అలా ప్రేరేపించాడనీ, వీటిని కూడా దేవుని అఖండమైన వాక్కుగా పరిగణించవలసిందనీ ఈ నోట్స్ రచయిత నమ్మకం. యోహాను 20:11-18; లూకా 8:2.

10. ఆయనతో ఉండినవారు దుఃఖపడి యేడ్చు చుండగా ఆమె వెళ్లి ఆ సంగతి వారికి తెలియ జేసెను గాని,

11. ఆయన బ్రదికియున్నాడనియు ఆమెకు కనబడె ననియు వారు విని నమ్మకపోయిరి.

ఈ సాక్ష్యంతో పని లేకుండానే వీరు క్రీస్తు సజీవంగా లేచాడని నమ్మవలసింది. తాను అలా లేస్తానని క్రీస్తు తానే వారితో చెప్పాడు (మార్కు 9:31; మత్తయి 16:21; మత్తయి 17:22-23). అయితే ఇతర సాక్షులు వచ్చి చెప్పినప్పటికీ ఇదే అపనమ్మకంలో వారు కొనసాగారు (వ 12,13. లూకా 24:13-32 చూడండి). దీనిబట్టి వీరు మూఢంగా అవివేకంగా దేన్ని పడితే దాన్ని సాక్ష్యాధారాలు లేకుండా నమ్మే అమాయకులు కారని అర్థం అవుతున్నది.

12. ఆ తరువాత వారిలో ఇద్దరు ఒక పల్లెటూరికి నడిచి పోవుచుండగా, ఆయన మారు రూపముగలవాడై వారికి ప్రత్యక్షమాయెను.

13. వారు వెళ్లి తక్కిన వారికి ఆ సంగతి తెలియజేసిరి గాని, వారు వీరి మాటనైనను నమ్మక పోయిరి.

14. పిమ్మట పదునొకండుమంది శిష్యులు భోజనమునకు కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై, తాను లేచిన తరువాత తన్ను చూచినవారి మాట నమ్మనందున వారి అపనమ్మిక నిమిత్తమును హృదయకాఠిన్యము నిమిత్తమును వారిని గద్దించెను.

పదకొండు మంది అంటే యూదా ఇస్కరియోతు మినహా మిగిలిన ప్రధాన శిష్యులు (మత్తయి 27:5). ఈ శిష్యులు కూడా మనలాగే రక్తమాంసాలున్నవారనీ, మనలో ఉండే తప్పులు వారిలో ఉన్నాయనీ, మనందరిలాగానే వారికీ అపనమ్మకంలో పడే అవకాశం ఉందనీ గ్రహించండి. మనందరిలాగానే వారు కూడా ప్రభువు మందలింపుకు పాత్రులు.

15. మరియు మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి.

శుభవార్త ఏమిటో 1 కోరింథీయులకు 15:1-8 లో వివరణ ఉంది. దీన్ని భూమి అంతటా ప్రకటించాలని క్రీస్తు కోరాడు. మత్తయి 28:18-20; లూకా 24:47-48; యోహాను 20:21; అపో. కార్యములు 1:8. యేసు అందరికోసమూ చనిపోయాడు (2 కోరింథీయులకు 5:14-15; 1 తిమోతికి 2:6; 1 యోహాను 2:2). కాబట్టి ఈ సంగతి అందరూ వినాలని కోరుతున్నాడు. ఈ శుభవార్తను లోకమంతా వినేలా చూచేందుకు తన చేతనైనది చేసేందుకు ప్రతి విశ్వాసికీ బాధ్యత ఉంది.

16. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును; నమ్మని వానికి శిక్ష విధింపబడును.

బాప్తిసం గురించి నోట్ మత్తయి 3:6. రక్షణ, పాపవిముక్తి విశ్వాసం మూలంగానే (యోహాను 3:16; యోహాను 5:24; యోహాను 6:47; అపో. కార్యములు 16:31; రోమీయులకు 1:17; రోమీయులకు 3:22, రోమీయులకు 3:25; గలతియులకు 2:16; ఎఫెసీయులకు 2:8-9). విశ్వాసం తప్ప మరి దేనికీ అందులో పాత్ర లేదు. రక్షణ కలగడానికి బాప్తిసం అవసరం లేదు. అయితే యేసుప్రభువును ప్రభువుగా రక్షకుడుగా నమ్మినవారు బాప్తిసం తీసుకొని తమ నమ్మకాన్ని బహిరంగంగా ఒప్పుకోవాలి. ఒక వ్యక్తి తాను క్రీస్తును నమ్ముకున్నానని చెప్పి, బాప్తిసాన్ని పొందేందుకు నిరాకరిస్తే అతని నమ్మకాన్ని సందేహించేందుకు మనకు న్యాయమైన కారణం ఉంది. “బాప్తిసం పొందని వ్యక్తికి”- శిక్షావిధి కలుగుతుంది అనలేదు యేసు. ఇది గమనించండి. నమ్మనివ్యక్తికి శిక్షావిధి కలుగుతుందనే చెప్పాడు. యోహాను 3:17-18 పోల్చి చూడండి. ఇక్కడ “శిక్షావిధి” అంటే నరకం.

17. నమ్మినవారి వలన ఈ సూచకక్రియలు కనబడును; ఏవనగా, నా నామమున దయ్యములను వెళ్లగొట్టుదురు; క్రొత్త భాషలు మాటలాడు దురు,

అంటే ఈ సూచనలన్నీ ప్రతి విశ్వాసినీ అనుసరిస్తాయని కాదు. మొత్తంగా విశ్వాసుల గుంపుతో బాటు ఈ సూచనలుంటాయని అర్థం. “దయ్యాలను వెళ్ళగొట్టడం” గురించి అపో. కార్యములు 5:16; అపో. కార్యములు 8:7; అపో. కార్యములు 16:18; అపో. కార్యములు 19:13-16 చూడండి. “కొత్త భాషలు మాట్లాడ్డం” గురించి అపో. కార్యములు 2:4; అపో. కార్యములు 10:46; అపో. కార్యములు 19:6; 1 కోరింథీయులకు 12:10, 1 కోరింథీయులకు 12:28, 1 కోరింథీయులకు 12:30; 1 కోరింథీయులకు 13:1; 1 కోరింథీయులకు 14:2-39 చూడండి. “పాములను” గురించి లూకా 10:19; అపో. కార్యములు 28:3-5 (అలాగని ఎవరైనా తనకున్న విశ్వాసాన్ని ప్రదర్శించేందుకు పాముల్ని పట్టుకోవాలని కాదు. మత్తయి 4:6-7 పోల్చి చూడండి). ఎవరూ విషం తాగినట్టు క్రొత్త ఒడంబడిక గ్రంథం మొత్తంలో ఎక్కడా రాసి లేదు. అలాగని బైబిలులో రాయబడకుండా ఉన్న సందర్భాలు లేవని కాదు. రోగుల్ని బాగుచేయడం గురించి అపో. కార్యములు 28:8-9; యాకోబు 5:14-15 చూడండి. మనుషులు తమ శక్తుల్ని ప్రదర్శించాలని, తాము భక్తిపరులుగా ఇతరులకు కనిపించాలనీ ఈ సూచనలు ఇవ్వబడలేదని మనం గ్రహించాలి.

18. పాములను ఎత్తి పట్టుకొందురు, మరణకరమైనదేది త్రాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పెను.

19. ఈలాగు ప్రభువైన యేసు వారితో మాటలాడిన తరువాత పరలోకమునకు చేర్చుకొనబడి, దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడయ్యెను.
2 రాజులు 2:11, కీర్తనల గ్రంథము 47:5, కీర్తనల గ్రంథము 110:1

లూకా 24:50-51; అపో. కార్యములు 1:9-11; కీర్తనల గ్రంథము 110:1. కుడి వైపు అంటే గౌరవ, అధికార స్థానం. మత్తయి 28:18; ఫిలిప్పీయులకు 2:9 పోల్చి చూడండి.

20. వారు బయలుదేరి వాక్యమంతట ప్రకటించిరి. ప్రభువు వారికి సహకారుడైయుండి, వెనువెంట జరుగుచువచ్చిన సూచక క్రియలవలన వాక్యమును స్థిరపరచుచుండెను. ఆమేన్‌.Shortcut Links
మార్కు - Mark : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |