Romans - రోమీయులకు 10 | View All

1. సహోదరులారా, ఇశ్రాయేలీయులు రక్షణపొందవలెనని నా హృదయాభిలాషయు, వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థనయునై యున్నవి.

2. వారు దేవుని యందు ఆసక్తిగలవారని వారినిగూర్చి సాక్ష్యమిచ్చు చున్నాను; అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు.

మొత్తంమీద యూదులు నాస్తికులు కాదు, ఎవర్నీ లెక్కచేయని పాపులు కారు (రోమీయులకు 2:17-20). వారి మతాసక్తిని చూచి పౌలు చలించి వారిని జాలి తలిచాడు. ఆధ్యాత్మిక జ్ఞానం, అవగాహనల మీద ఆధారపడకుండా తనను తప్పుదారి పట్టించిన ఒకప్పటి తన తీవ్రమైన మతాసక్తి అతనికింకా గుర్తుంది (అపో. కార్యములు 8:1-3; అపో. కార్యములు 9:1-2; అపో. కార్యములు 22:3-4; అపో. కార్యములు 26:9-11; ఫిలిప్పీయులకు 3:6). మతంలో వారికి తీవ్రమైన ఆసక్తి ఉంది గాని వారు నశించిన స్థితిలో ఉన్నారు. దేవుని విషయంలో తీవ్ర ఆసక్తి ఉన్నవారంతా ఏ దేవుని విషయంలో వారికాసక్తి ఉన్నదో ఆయన వారికి తెలుసని గానీ ఆయనకు వారు ఇష్టులని గానీ తప్పనిసరిగా అనుకోనవసరం లేదు. అనేకమంది ఇతర ప్రజల్లాగే యూదులు కూడా దేవుడు తనను నమ్మినవారికి ఉచితంగా నీతిన్యాయాలను ఇస్తాడన్న సంగతి అర్థం చేసుకోలేదు (రోమీయులకు 3:24; రోమీయులకు 4:4-5, రోమీయులకు 4:13). తమ పాత క్రియల సహాయంతో దాన్ని సంపాదించు కోవాలనుకున్నారు. దేవుడు తమ సొంత లేఖనాల్లో తమకు వెల్లడి చేసిన సత్యాన్ని వారు నేర్చుకోలేదు. అందువల్ల దేవుని నీతిన్యాయాల మార్గానికి అంటే క్రీస్తుపై నమ్మకం అనే మార్గానికి వారు లోబడలేదు. ఏ మాత్రమైనా మతాసక్తి ఉంటే ఎవరైనా సహజంగా ఏమి చేస్తారో వారూ అదే చేశారు – తమ సొంత నీతిన్యాయాల్ని స్థాపించుకోవాలని చూశారు, తమ సొంత ప్రయత్నాలవల్ల నిర్దోషులు కావాలని చూశారు.

3. ఏలయనగా వారు దేవుని నీతినెరుగక తమ స్వనీతిని స్థాపింప బూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు.

4. విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తియై యున్నాడు.

5. ధర్మశాస్త్ర మూలమగు నీతిని నెర వేర్చువాడు దానివలననే జీవించునని మోషే వ్రాయుచున్నాడు.
లేవీయకాండము 18:5

6. అయితే విశ్వాసమూలమగు నీతి యీలాగు చెప్పుచున్నది ఎవడు పరలోకములోనికి ఎక్కి పోవును? అనగా క్రీస్తును క్రిందికి తెచ్చుటకు;
ద్వితీయోపదేశకాండము 9:4, ద్వితీయోపదేశకాండము 30:12-14

ద్వితీయోపదేశకాండము 30:12-14. మోషే మాటలను (దాదాపు క్రీ.శ. 1400 సంవత్సరాల క్రితం చెప్పినవి) క్రీస్తు శుభవార్తకు వర్తింపజేయడం ధర్మమేనా? ధర్మమే. మోషే పలుకుల్లోని నిజమైన ఆధ్యాత్మిక అర్థాన్ని పవిత్రాత్మ పౌలుకు విశదపరిచాడు.

7. లేక ఎవడు అగాధములోనికి దిగిపోవును? అనగా క్రీస్తును మృతులలోనుండి పైకి తెచ్చుటకు అని నీవు నీ హృదయములో అనుకొనవద్దు.

“అగాధం”– ఇక్కడ ఈ గ్రీకు పదానికి అర్థం చనిపోయిన వారుండే లోకం. ప్రకటన గ్రంథం 9:1-2, ప్రకటన గ్రంథం 9:11; ప్రకటన గ్రంథం 11:7; ప్రకటన గ్రంథం 17:8; ప్రకటన గ్రంథం 20:1, ప్రకటన గ్రంథం 20:3 చూడండి.

8. అదేమని చెప్పుచున్నది? వాక్యము నీయొద్దను, నీ నోటను నీ హృదయములోను ఉన్నది; అది మేము ప్రకటించు విశ్వాసవాక్యమే.

9. అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని, దేవుడు మృతులలోనుండి ఆయనను లేపెనని నీ హృదయ మందు విశ్వసించినయెడల, నీవు రక్షింపబడుదువు.

పౌలు ఉపదేశించిన “విశ్వాససంబంధమైన వాక్కు” ఇది (వ 8). క్రీస్తు పరలోకంనుంచి అంతకుముందే దిగివచ్చాడు. దేవుడు ఆయన్ను అంతకుముందే మరణ లోకంలోనుంచి సజీవంగా లేపాడు (రోమీయులకు 1:3-4; రోమీయులకు 4:24-25; రోమీయులకు 8:32, రోమీయులకు 8:34). ఇప్పుడిక దేవుడు ఉచితంగా ఇచ్చే నీతిన్యాయాలనూ నిర్దోషత్వాన్నీ స్వీకరించేందుకు మనుషులు చేయవలసినదల్లా క్రీస్తులో నమ్మకముంచి ఆయన్ను ఒప్పుకోవడమే. యేసు శారీరికంగా మరణంనుంచి సజీవంగా లేచాడని నమ్మడం పాపవిముక్తికి, రక్షణకు అవసరమని గమనించండి. రోమీయులకు 4:24-25; 1 కోరింథీయులకు 15:1-8 చూడండి. ఇది శుభవార్తలో ప్రాముఖ్యమైన మౌలిక సత్యం. అపొ కా గ్రంథంలో ఈ సత్యాన్ని ఎంత ప్రాముఖ్యంగా నొక్కి చెప్పడం జరిగిందో గమనించండి – రోమీయులకు 1:3; రోమీయులకు 2:24; మొ।।. ఈ సత్యాన్ని మనం నమ్మకపోతే దేవుడు తన కుమారుణ్ణి గురించి రాయించిన సంగతిని నమ్మడం లేదన్నమాట. క్రీస్తుపై నమ్మకం ఉంచడమంటే, మరణంనుంచి సజీవంగా లేచిన ఆయనమీద నమ్మకముంచడమే. అంతేగాక యేసు “ప్రభువు” అన్న నమ్మకం కూడా అవసరమే. యోహాను 8:24; అపో. కార్యములు 2:36; 1 కోరింథీయులకు 8:6; 1 కోరింథీయులకు 12:3; ఎఫెసీయులకు 4:5 చూడండి. యేసు అనేకమంది ప్రభువుల్లో ఒక ప్రభువు కాదు, ఉన్న ఒకే ఒక ప్రభువు ఆయనే. పూర్తి అధికారం ఉన్నవాడు, అందరికీ యజమాని, స్వంతదారుడు క్రీస్తేనని పౌలు ఉద్దేశం. యేసే ప్రభువు అని చెప్పడమంటే ఆయన పాత ఒడంబడిక గ్రంథంలోని యెహోవాదేవుని అవతారమని చెప్పడమే (వ 13; లూకా 2:11; యోహాను 8:24, యోహాను 8:58. నిర్గమకాండము 3:14-15 నోట్స్ చూడండి). ఒప్పుకోవడం అన్నది దేవునికి మనపై జాలి కలిగించి, మనల్ని రక్షించేలా చేసే మంచి పని కాదు. పాపవిముక్తి పొందేందుకు మనుషులకు ఉండవలసిన నమ్మకానికి జోడించవలసిన మరో అంశం కాదది. ఆ నమ్మకం వాస్తవమైనది అనేందుకు అది సాక్ష్యాధారం, రుజువు. హృదయంలో పని చేస్తున్న నమ్మకం నోటితో క్రీస్తును ఒప్పుకునేలా చేస్తుంది. మత్తయి 10:32-33 కూడా చూడండి. క్రీస్తును ఒప్పుకొనేందుకు సిగ్గు, భయం ఉన్నవారి నమ్మకం గురించి మనమెప్పుడూ సందేహంతో ఉండాలి. ఒప్పుకోవడం లేకుండా ఉన్న నమ్మకం లోపంతో కూడినది. నమ్మకం లేకుండా ఒప్పుకోవడం వ్యర్థమైనది. ఒక విశ్వాసి మనస్ఫూర్తిగా “యేసే ప్రభువు” అని చెప్పడం యేసును అతడు తన జీవితానికి ప్రభువుగా స్వీకరించి ఆయనకు లోబడాలన్న సమ్మతికి గుర్తు (రోమీయులకు 14:9; మత్తయి 7:21; యోహాను 3:36; అపో. కార్యములు 5:32; యోహాను 2:3-4; యోహాను 3:24; హెబ్రీయులకు 5:9 చూడండి). అపో. కార్యములు 22:10 నోట్ చూడండి. ఒక విశ్వాసి యేసు ప్రభువే గానీ నా ప్రభువు కాదు అని అనగలగడం ఎలా సాధ్యం! మనుషులు క్రీస్తు చెంతకు వచ్చినప్పుడు వారు పశ్చాత్తాప పడవలసిన విషయాల్లో ఒకటి తమ జీవితాలకు తామే యజమానులుగా ఉండాలన్న మనస్తత్వం, క్రీస్తు ప్రభుత్వానికి లోబడని ధోరణి. అది పాపం. నిర్దోషత్వాన్ని, నీతిన్యాయాలను గురించి ఈ లేఖలో పౌలు చెప్పినది చాలావరకు వ 10లో ముగింపుకు వస్తున్నది. పౌలు దేవుని ఆత్మావేశం మూలంగా తెలియజేసినది ఏమంటే, మనుషులకు నిర్దోషత్వం ఏ మాత్రం లేదు (రోమీయులకు 1:18-32) దేవుడు దాన్ని మనుషులకు ఇచ్చే విధానం వారికి తెలియదు (వ 2) తెలియదు కాబట్టి తమ సొంతగా నిర్దోషత్వాన్ని స్థాపించుకునే ప్రయత్నం వారు చేస్తారు (వ 3) అది అసాధ్యం (రోమీయులకు 3:20, రోమీయులకు 3:28; రోమీయులకు 8:3) దేవుని దృష్టిలో నిర్దోషులు కావాలంటే ఏకైక మార్గం క్రీస్తు నిర్దోషత్వాన్ని కలిగి ఉండడమే (రోమీయులకు 3:22-26) ఆయనలో నమ్మకం మూలంగా మాత్రమే ఇది సాధ్యం (రోమీయులకు 1:16; రోమీయులకు 4:5; రోమీయులకు 5:1) ఆ విధంగా నిర్దోషులుగా తీర్చబడినవారు నీతిన్యాయాలతో కూడిన జీవితం ఆరంభిస్తారు (రోమీయులకు 6:17-18; రోమీయులకు 8:4).

10. ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును.

11. ఏమనగా, ఆయనయందు విశ్వాసముంచు వాడెవడును సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది.
యెషయా 28:16

12. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు; ఒక్క ప్రభువే అందరికి ప్రభువై యుండి, తనకు ప్రార్థనచేయువారందరియెడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై యున్నాడు.

“భేదం లేదు”– రోమీయులకు 3:22-23, రోమీయులకు 3:29-30. ప్రభువొక్కడే – యేసు ప్రభువు. ఆయన గుణ స్వభావాలెలాంటివో ఇక్కడ చూడండి. తన దగ్గరికి వచ్చేవారిని దీవించడం ఆయనకెంతో ఇష్టం. ఆధ్యాత్మికమైన విషయాల్లో వారంతా భాగ్యవంతులుగా ఉండాలని ఆయన కోరిక. రోమీయులకు 5:21; 2 కోరింథీయులకు 8:9; 1 తిమోతికి 1:13-14 పోల్చి చూడండి.

13. ఎందుకనగా ప్రభువు నామమునుబట్టి ప్రార్థనచేయు వాడెవడోవాడు రక్షింపబడును.
యోవేలు 2:32

పౌలు ఇక్కడ యోవేలు 2:32 ను ఎత్తి రాస్తున్నాడు. ఇక్కడ ప్రభువు అని ఉన్న పదం హీబ్రూలో యెహోవా. పౌలు ఇక్కడ యేసుప్రభువును గురించి మాట్లాడుతున్నాడు (వ 9). యేసు యెహోవా అవతారమనడానికి ఇది మరో రుజువు. లూకా 2:11 నోట్స్‌లో దీని గురించి మరి కొన్ని రిఫరెన్సులు చూడండి. ఇక్కడ ప్రభువు పేర ప్రార్థన చేయడమంటే ఆయనపై నమ్మకం ఉంచడమే (వ 14). ఈ వచనంలో దేవుడు కృపను, పాపవిముక్తిని అందరికీ ఇవ్వజూపిన సంగతిని గమనించండి. పాపవిముక్తి గురించి నోట్ రోమీయులకు 1:16.

14. వారు విశ్వసింపనివానికి ఎట్లు ప్రార్థన చేయుదురు? విననివానిని ఎట్లు విశ్వసించుదురు? ప్రకటించువాడు లేకుండ వారెట్లు విందురు?

మనుషులను విముక్తుల్ని చేసి వారిని నిర్దోషులుగా తీర్చే శుభవార్తను గురించి వివరించడం పౌలు ముగించాడు. ఇది నిజంగా శుభవార్తే. కానీ మనుషులు దాన్ని విని, నమ్మకం ఉంచకపోతే మంచి వార్త వల్ల మంచి ఏముంది? కాబట్టి శుభవార్తను ప్రకటించడంలోనూ దేవుడు తన సేవకుల్ని పంపడంలోనూ ఉన్న ప్రాముఖ్యతను అతడు నొక్కి చెప్తున్నాడు. అపో. కార్యములు 1:8; యోహాను 20:21; లూకా 24:46-47; మార్కు 16:15; మత్తయి 28:18-20 చూడండి.

15. ప్రకటించువారు పంపబడని యెడల ఎట్లు ప్రకటించుదురు? ఇందు విషయమై ఉత్తమమైనవాటినిగూర్చిన సువార్త ప్రకటించువారిపాదములెంతో సుందరమైనవి అని వ్రాయబడి యున్నది
యెషయా 52:7, నహూము 1:15

యెషయా 52:7. ఆ పాదాలు శుభవార్త ప్రకటనకోసం అనేక మైళ్ళ నడకమూలంగా గరుకుగా, పగుళ్ళతో, కొట్టుకుపోయి, మురికిగా వికారంగా ఉండవచ్చు. కానీ దేవుని దృష్టిలో అవి లోకమంతటిలోకీ అతి సుందరమైన పాదాలు. ఎందుకంటే అవి అత్యద్భుతమైన, ప్రాముఖ్యమైన పనిమీద వెళ్తున్నాయి.

16. అయినను అందరు సువార్తకు లోబడలేదు ప్రభువా, మేము తెలియజేసిన సమాచారమెవడు నమ్మెను అని యెషయా చెప్పుచున్నాడు గదా?
యెషయా 53:1

ఇస్రాయేల్ జాతి క్రీస్తును నిరాకరించేందుకూ దేవుడు వారిని నిరాకరించేందుకూ కారణం వారిలోనే ఉందని ఇక్కడ పౌలు చూపుతున్నాడు. వారి నిరాకరణకు కారణం ఏదో రహస్యమైన దైవ నిర్ణయమని వారు చెప్పలేరు. ఇస్రాయేల్‌వారి పాపమూ, వారిని తిరస్కరించడం లోని కారణమూ ఇదే. క్రీస్తు వచ్చినప్పుడు వారు ఆయన్ను స్వీకరించలేదు (యోహాను 1:11). ఇది వారి లేఖనాలకు అనుగుణంగానే జరిగింది – యెషయా 53:1.

17. కాగా వినుట వలన విశ్వాసము కలుగును; వినుట క్రీస్తును గూర్చిన మాటవలన కలుగును.

వ 14. మనుషులకు నమ్మకం ఎలా కలుగుతుందో చూడండి.

18. అయినను నేను చెప్పునదేమనగా, వారు వినలేదా? విన్నారు గదా? వారి స్వరము భూలోకమందంతటికిని, వారిమాటలు భూదిగంతములవరకును బయలువెళ్లెను.
కీర్తనల గ్రంథము 19:4

యూదులు శుభవార్త వినలేదని దేవుడు వారి పాపాలను క్షమించగలడా? ఎంత మాత్రం కాదు. వారు విన్నారు. కీర్తనల గ్రంథము 19:4 ప్రకృతి ఇస్తున్న సాక్ష్యం గురించి చెప్తున్నది. క్రీస్తు మరణ పునర్జీవితాలకూ, తాను ఈ లేఖ రాస్తున్న సమయానికీ మధ్య కాలంలో శుభవార్త ప్రకృతి ఇస్తున్న సాక్ష్యం లాగానే అన్ని చోట్లా యూదులందరికీ వినిపించిందని ఇక్కడ పౌలు ఉద్దేశమై ఉన్నట్టుంది. అపో. కార్యములు 1:8; అపో. కార్యములు 2:36; అపో. కార్యములు 13:14-16; అపో. కార్యములు 17:1-2, అపో. కార్యములు 17:16; అపో. కార్యములు 18:5; అపో. కార్యములు 19:8 చూడండి.

19. మరియు నేను చెప్పునదేమనగా ఇశ్రాయేలునకు తెలియకుండెనా? జనము కానివారివలన మీకు రోషము పుట్టించెదను, అవివేకమైన జనమువలన మీకు ఆగ్రహము కలుగ జేతును. అని మొదట మోషే చెప్పుచున్నాడు.
ద్వితీయోపదేశకాండము 32:21

యూదులు శుభవార్తను అర్థం చేసుకోలేదని వారు దాన్ని తృణీకరించడంలోని పాపాన్ని దేవుడు చూచీ చూడనట్టు ఉండగలడా? ఎంత మాత్రం కాదు. శుభవార్తను స్వీకరించిన ఇతర ప్రజలకన్నా యూదులు చాలా ఎక్కువగా అర్థం చేసుకున్నారని చూపించడానికి పాత ఒడంబడిక గ్రంథంలోని మూడు వచనాలను ఎత్తి రాస్తున్నాడు పౌలు. ద్వితీయోపదేశకాండము 32:21. ఏమీ తెలియని జనానికీ (ఇతర ప్రజలకూ), కనీసం కొంత తెలిసిన యూదులకూ మధ్య ఉన్న తేడా ఇక్కడ చెప్తున్నాడు.

20. మరియయెషయా తెగించి నన్ను వెదకనివారికి నేను దొరకితిని; నన్ను విచారింపనివారికి ప్రత్యక్షమైతిని అని చెప్పుచున్నాడు.
యెషయా 65:1-2

యెషయా 65:1-2. ఇతర జనాలకు నిజ దేవుణ్ణి వెదికేందుకు కావలసిన కనీసమైన గ్రహింపైనా లేదు. ఇస్రాయేల్‌కు ఆ జ్ఞానం ఉంది గానీ వారు దేవుణ్ణి కనుగొనలేదు. దీనికి కారణం ఇస్రాయేల్‌వారి మొండి అవిధేయత. దేవుడు ప్రేమపూర్వకంగా తన చేతులు చాపి తన ప్రజల ఎదుట నిలుచుండి వారికి గొప్ప మేళ్ళను ఇవ్వజూపుతూ సహనంతో, జాలితో వారి పాపవిముక్తిని ఆశిస్తూ ఉన్న చిత్రం ఇక్కడ కనిపిస్తూ ఉంది. మత్తయి 23:37; న్యాయాధిపతులు 2:10-19; హోషేయ 11:8 పోల్చి చూడండి.

21. ఇశ్రాయేలు విషయమైతే అవిధేయులై యెదురాడు ప్రజలకు నేను దినమంతయు నా చేతులు చాచితిని అని చెప్పుచున్నాడు.
యెషయా 65:1-2Shortcut Links
రోమీయులకు - Romans : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |