Colossians - కొలస్సయులకు 1 | View All

1. కొలొస్సయిలో ఉన్న పరిశుద్ధులకు, అనగా క్రీస్తు నందు విశ్వాసులైన సహోదరులకు.

రోమీయులకు 1:1, రోమీయులకు 1:3. ఎఫెసు పట్టణానికి 160 కి.మీ. తూర్పున ఉన్న ఏ ప్రాధాన్యతా లేని చిన్న ఊరు కొలస్సయి. ఇప్పుడు ఈ ప్రాంతమంతా టర్కీ దేశంలో ఉంది. కొలస్సయి లవొదికయకు దగ్గరగా ఉంది.

2. దేవుని చిత్తమువలన క్రీస్తుయేసు అపొస్తలుడైన పౌలును సహోదరుడైన తిమోతియును శుభమనిచెప్పి వ్రాయునది. మన తండ్రియైన దేవుని నుండి కృపయు సమాధానమును మీకు కలుగును గాక.

“తిమోతి”– ఫిలిప్పీయులకు 1:1.

3. పరలోకమందు మీకొరకు ఉంచబడిన నిరీక్షణనుబట్టి, క్రీస్తుయేసునందు మీకు కలిగియున్న విశ్వాసమును గూర్చియు, పరిశుద్ధులందరిమీద మీకున్న ప్రేమను గూర్చియు, మేము విని యెల్లప్పుడు మీ నిమిత్తము ప్రార్థనచేయుచు,

4. మన ప్రభువగు యేసు క్రీస్తుయొక్క తండ్రియైన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము.

“మీ కోసం ఉంచబడ్డ”– 1 పేతురు 1:4. “ఆశాభావం”– అంటే విశ్వాసులకు ఇప్పుడు వారి హృదయాల్లో ఉన్న ఆశాభావం కాదు. ఒక రోజున తమకు కలుగబోయే వాస్తవికత ఇది. వ 27; తీతుకు 2:13 చూడండి.

5. మీయొద్దకు వచ్చిన సువార్త సత్యమునుగూర్చిన బోధవలన ఆ నిరీక్షణనుగూర్చి మీరు ఇంతకుముందు వింటిరి.

“శుభవార్త”– రోమీయులకు 1:16; 1 కోరింథీయులకు 15:1-8. “సత్యవాక్కు”– ఎఫెసీయులకు 1:13.

6. ఈ సువార్త సర్వలోకములో ఫలించుచు, వ్యాపించుచున్నట్టుగా మీరు దేవుని కృపనుగూర్చి విని సత్యముగా గ్రహించిన నాటనుండి మీలో సయితము ఫలించుచు వ్యాపించుచున్నది.

“వ్యాపిస్తూ”– శుభవార్త ఎప్పుడూ ఎండిపోని, చనిపోని ఒక ప్రాణివంటిది లేక ఒక చెట్టు వంటిది. అది పెరుగుతూనే ఉంటుంది. క్రీస్తు శుభవార్తను నాశనం చేయజూచేవారు అసాధ్యమైన పనిని తల పెడుతున్నారన్నమాట. “ఫలిస్తూ”– మత్తయి 13:8; మార్కు 4:26-29. ఈ శుభవార్త అంటే పాపవిముక్తి, రక్షణ కారకమైన దేవుని ప్రభావం (రోమీయులకు 1:16). దీన్ని స్పష్టంగా, ధైర్యంగా, నమ్మకంగా ప్రకటిస్తే ఫలితాన్ని ఇస్తుంది. “కృప”– యోహాను 1:14, యోహాను 1:16; రోమీయులకు 1:2; ఎఫెసీయులకు 2:8-9 నోట్స్. “గ్రహించిన”– గ్రహించడానికీ ఫలించడానికీ గల సంబంధాన్ని గమనించండి. మత్తయి 13:23 చూడండి.

7. ఎపఫ్రా అను మా ప్రియుడైన తోడిదాసునివలన మీరు ఈ సంగతులను నేర్చుకొంటిరి.

“ఎపఫ్రా”– కొలొస్సయులకు 4:12; ఫిలేమోనుకు 1:23. ఈ దైవదాసుని గురించి మనకు తెలిసిన సమాచారమంతా ఈ వచనాల్లోనే ఉంది.

8. అతడు మా విషయములో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు; అతడు ఆత్మయందలి మీ ప్రేమను మాకు తెలిపినవాడు.

“మీ విషయంలో”– పౌలు చెరసాలలో ఉన్నాడు – కొలొస్సయులకు 4:10. ఎపఫ్రా అతనికి సహాయంగా ఉన్నాడు. “సేవకుడు”– రోమీయులకు 1:3; రోమీయులకు 6:18, రోమీయులకు 6:22. ఇంతకన్నా ఎవరి గురించి అయినా సరే ఎక్కువ ఏమి చెప్పగలం – “అతడు క్రీస్తుకు నమ్మకమైన సేవకుడు”. “ఆత్మలోని మీ ప్రేమభావాన్ని”– రోమీయులకు 5:5. మనకు దేవుని ప్రేమ (గ్రీకు – ఆగాపే – నోట్ 1 కోరింథీయులకు 13:1) దేవుని ఆత్మ మూలంగానే కలుగుతుంది. భూమి మీదంతటా క్రీస్తు నిజ విశ్వాసుల్లో మాత్రమే ఇది కనిపిస్తుంది.

9. అందుచేత ఈ సంగతి వినిననాటనుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానక, మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకముగనులవారును,

“ప్రార్థన చేయడం”– విశ్వాసుల కోసం పౌలు చేసిన ప్రార్థనలకు ఇది మరో ఉదాహరణ – ఎఫెసీయులకు 1:17-19; ఎఫెసీయులకు 3:16-19; ఫిలిప్పీయులకు 1:9. ఏ ప్రార్థనలో కూడా అతడు దేవుణ్ణి భౌతికమైన విషయాలకోసం – డబ్బు, వస్తువులకోసం – అడగలేదు. జ్ఞానం, గ్రహింపు శక్తి, బలప్రభావాలు, ప్రేమ – ఇవే అన్నిటికంటే ప్రధానంగా వారికి ఉండాలని అతడి ఆశ. “సంపూర్ణ...తెలివి”– ఈ లేఖలోని ప్రధాన అంశాల్లో ఇదొకటి – వ 28; కొలొస్సయులకు 2:2-3; కొలొస్సయులకు 3:16. దేవుడు మాత్రమే ఇలాంటివి ఇవ్వగలడు – ఎఫెసీయులకు 1:17. విద్య గానీ వేదాంతం గానీ వీటిని ఇవ్వలేవు. దేవుణ్ణి గురించి, బైబిలును గురించి తెలుసుకుని ఉండడం మాత్రమే ఈ జ్ఞానం, తెలివి కాదు. అవి పరలోకంనుంచి అనుగ్రహించబడతాయి. అవి కావాలంటే పరలోకంలో ఉన్న దేవుణ్ణి మనం వెతకాలి. సామెతలు 2:1-6; 1 కోరింథీయులకు 1:20, 1 కోరింథీయులకు 1:25, 1 కోరింథీయులకు 1:30; 1 కోరింథీయులకు 2:10-14 పోల్చి చూడండి. “ఆయన సంకల్పం పూర్తిగా గ్రహించాలి”– రోమీయులకు 12:2. వారి జీవితాల్లో పౌలు చూడగోరిన ఇతర విషయాలు (వ 10) అన్నీ దీనిమీదే ఆధారపడి ఉన్నాయి కాబట్టి దీని గురించి ప్రార్థిస్తున్నాడు. దేవుని ఇష్టం ఏమిటో మనం తెలుసుకోకపోతే దాన్ని నెరవేర్చలేము.

10. ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించినవారునై, ప్రతి సత్కార్యములో సఫలులగుచు, దేవుని విషయమైన జ్ఞాన మందు అభివృద్ధి పొందుచు, అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు,

“ప్రభువుకు తగిన విధంగా”– ఎఫెసీయులకు 4:1; 1 థెస్సలొనీకయులకు 2:12. జ్ఞానం, తెలివి సంపాదించుకోవడమే గమ్యం కాదు. మనం జీవించవలసిన రీతిలో జీవించేలా అవి మనకు తోడ్పడాలి. “ఫలిస్తూ”– యోహాను 15:1-8. “దేవుణ్ణి తెలుసుకొంటూ”– దేవుని సంకల్పమేదో తెలుసుకోవడం మాత్రమే కాదు. దేవుణ్ణే తెలుసుకుంటూ ఉండాలి. ఫిలిప్పీయులకు 3:10; 2 పేతురు 3:18 చూడండి. “అన్ని విషయాలలో ప్రభువుకు”– 2 కోరింథీయులకు 5:9; గలతియులకు 1:10; 1 థెస్సలొనీకయులకు 2:4. మనల్ని మనం సంతోషపెట్టుకునేందుకు మాత్రమే జీవిస్తే ప్రభువుకు ఏ విధంగానూ సంతోషం కలిగించలేము. ఆయనకున్న మనస్తత్వమే మనలోనూ ఉండాలి – ఫిలిప్పీయులకు 2:5; యోహాను 8:29. మన చర్యలు మన ఇష్టాయిష్టాలపై ఆధారపడి ఉండకూడదు – మత్తయి 10:38-39.

11. ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలెననియు, ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనుపరచునట్లు ఆయన మహిమ శక్తినిబట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలెననియు,

“ఆనందంతో”– ఫిలిప్పీయులకు 1:4; ఫిలిప్పీయులకు 3:1; ఫిలిప్పీయులకు 4:4. “సహనం, ఓర్పు”– రోమీయులకు 8:25; 1 కోరింథీయులకు 13:4; 2 కోరింథీయులకు 1:6; గలతియులకు 5:22; ఎఫెసీయులకు 4:2; 1 థెస్సలొనీకయులకు 5:14; హెబ్రీయులకు 6:12; హెబ్రీయులకు 10:36; హెబ్రీయులకు 12:1; యాకోబు 5:10. “బలపడి”– ఫిలిప్పీయులకు 3:16; ఫిలిప్పీయులకు 4:13. దివ్య బలప్రభావాలు దేవునివే, విశ్వాసులకు నిజమైన ఆధ్యాత్మిక బలాన్ని ఇచ్చేది దేవుడే. ఈ బలప్రభావాలు వారికి ఉండాలని పౌలు ఎందుకు కోరుతున్నాడు? వారు అద్భుతాలు చేయగలగాలనా? వారు పేరుగాంచిన ఉపదేశకులు కావాలనా? కాదు, తమ పరీక్షలను తట్టుకుని నిలబడాలనీ, సహనం, ఆనందం వారికి కలగాలనీ, తమ చిన్న ఊరిలో తాము చేయగలిగినంత మేలు చేయగలగాలనీ, అది దేవునికి మహిమ తేవాలనీ. ఈ సంగతి బాగా గమనించి ఆలోచించండి. “కృతజ్ఞత”– ఇది ఈ లేఖలో మళ్ళీ మళ్ళీ కనిపించే అంశం – కొలొస్సయులకు 2:7; కొలొస్సయులకు 3:15, కొలొస్సయులకు 3:17; కొలొస్సయులకు 4:2. బైబిలంతటిలో కూడా పదే పదే ఇది కనిపిస్తుంటుంది (లేవీయకాండము 7:12-13; కీర్తనల గ్రంథము 7:17; కీర్తనల గ్రంథము 50:14-15; కీర్తనల గ్రంథము 56:12; కీర్తనల గ్రంథము 100:4; దానియేలు 6:10; మత్తయి 14:19; మత్తయి 26:27; ఎఫెసీయులకు 5:4, ఎఫెసీయులకు 5:20; ఫిలిప్పీయులకు 4:6; 1 థెస్సలొనీకయులకు 5:18).

12. తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమగుటకు మనలను పాత్రులనుగాచేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలెననియు దేవుని బతిమాలు చున్నాము.

“వెలుగులో”– యోహాను 1:4-9; యోహాను 8:12; యోహాను 12:46; 1 యోహాను 1:5, 1 యోహాను 1:7; 1 యోహాను 2:8. “వారసత్వం”– ఎఫెసీయులకు 1:14; 1 పేతురు 1:4. “తగినవారుగా చేశాడు”– తమంతట తాము అలా కాలేదు. ఏ వ్యక్తికైనా సరే ఇది కేవలం అసాధ్యం (రోమీయులకు 3:19-20; ఎఫెసీయులకు 2:1-3; యిర్మియా 13:23). కొత్తదైన ఆధ్యాత్మిక జన్మమూలంగా మనం దేవుని పిల్లలమైతేనే ఆయనతో వారసత్వానికి తగినవారం – యోహాను 1:12-13; యోహాను 3:3-8; రోమీయులకు 8:16-17; ఎఫెసీయులకు 2:4-10.

13. ఆయన మనలను అంధకారసంబంధమైన అధికారములోనుండి విడుదలచేసి, తాను ప్రేమించిన తన కుమారునియొక్క రాజ్యనివాసులనుగా చేసెను.

ఇక్కడ ఒకదానికొకటి పూర్తిగా వ్యతిరేకం అయిన రెండు రాజ్యాలు కనిపిస్తున్నాయి. ప్రతి వ్యక్తీ ఈ రెంటిలో ఏదో ఒక దాన్లో ఉన్నాడు. “చీకటి”– అపో. కార్యములు 26:18; లూకా 22:53; ఎఫెసీయులకు 6:12; యోహాను 3:19-20. చీకటి రాజ్యపాలకుడు సైతాను. వెలుగు రాజ్యానికి క్రీస్తు అధికారి (దేవుని రాజ్యం గురించి నోట్ మత్తయి 4:17). ఆయన మనుషులను రక్షించి సైతాను రాజ్యంలో నుంచి తన రాజ్యంలోకి తీసుకువస్తాడు. వారికి వెలుగును ఇవ్వడం ద్వారా తన అమిత శక్తితో వారిని వెలుగు సంతానంగా చేయడం ద్వారా ఈ విధంగా జరిగిస్తాడు (2 కోరింథీయులకు 4:4-6; ఎఫెసీయులకు 5:8). ప్రస్తుతం ప్రపంచమంతటా సాగుతున్న దేవుని పని ఇదే. “ప్రియ కుమారుడు”– మత్తయి 3:17.

14. ఆ కుమారునియందు మనకు విమోచనము, అనగా పాపక్షమాపణ కలుగుచున్నది.

15. ఆయన అదృశ్యదేవుని స్వరూపియై సర్వసృష్టికి ఆదిసంభూతుడై యున్నాడు.

“ఆయన”అంటే యేసుప్రభువు. “కనిపించని దేవుని...స్వరూపం”– దేవుడు ఆత్మ. మన కళ్ళతో ఆయన్ను చూడలేము – యోహాను 1:18; 1 తిమోతికి 1:17; 1 తిమోతికి 6:16; హెబ్రీయులకు 11:27. కానీ దేవుడు ఎలాంటివాడో క్రీస్తు వెల్లడి చేశాడు. మానవ రూపంలో అచ్చంగా దేవుని పోలిక ఉన్న వ్యక్తి ఆయన – కొలొస్సయులకు 2:9; యోహాను 1:1, యోహాను 1:14; యోహాను 14:9; 2 కోరింథీయులకు 4:4; హెబ్రీయులకు 1:3. “ప్రముఖుడు”– ఇక్కడున్న గ్రీకు పదం (ప్రోటొటొకొస్‌) ప్రముఖత్వాన్ని, ఆధిపత్యాన్ని సూచిస్తున్నది. పాత ఒడంబడిక గ్రంథంలో కనిపించిన సృష్టికర్త అయిన యెహోవా దేవుణ్ణి కూడా యూదులు ఈ మాటతో అభివర్ణించారు. ఇక్కడ పౌలు లోకానికంతటికీ ప్రభువు, ప్రముఖుడు క్రీస్తు అంటున్నాడు. అతని భావం నిజంగా ఇదేనని తరువాతి వచనాన్ని బట్టి అర్థం అవుతున్నది. లూకా 2:11; ఫిలిప్పీయులకు 2:6 నోట్స్.

16. ఏలయనగా ఆకాశమందున్నవియు భూమియందున్న వియు, దృశ్యమైనవిగాని, అదృశ్యమైనవిగాని, అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను, సర్వమును ఆయనయందు సృజింప బడెను, సర్వమును ఆయనద్వారాను ఆయననుబట్టియు సృజింపబడెను.
సామెతలు 16:4

“ఎందుకంటే”– క్రీస్తును ప్రముఖుడు అన్నది ఎందుకంటే సృష్టి అంతా ఉనికిలోకి వచ్చినది ఆయన మూలంగానే – యోహాను 1:3; 1 కోరింథీయులకు 8:6; హెబ్రీయులకు 1:2; ఆదికాండము 1:1. ఆయనే అన్నిటికీ సృష్టికర్త కాబట్టి ఆయన ఎవరిచేతా సృష్టించబడినవాడు కాదని స్పష్టంగా ఉంది. “సింహాసనాలైనా”– ప్రకటన గ్రంథం 4:4 పోల్చి చూడండి. “అధికారులైనా”– ఎఫెసీయులకు 1:21; ఎఫెసీయులకు 3:10. “ఆయనకోసం”– సృష్టంతా ఆయనకోసమే అని ఒకే ఒక నిజ దేవుని గురించి మాత్రమే చెప్పడానికి వీలవుతుంది. ఇదే గ్రీకు పదం రోమీయులకు 11:36 లో కనిపిస్తున్నది. ఈ మాట దేవుణ్ణి ఉద్దేశించి చెప్పబడింది. మరో పెద్ద దేవుడు సృష్టించిన చిన్న దేవుడు కాదు క్రీస్తు. ఆయనే దేవుడు.

17. ఆయన అన్నిటికంటె ముందుగా ఉన్న వాడు; ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు.
సామెతలు 8:22-25

“అన్నిటికీ పూర్వమున్నవాడు”– దేవుని కుమారుడైన క్రీస్తు సృష్టిలో ఒక భాగం కాదు. సృష్టికి ముందే ఆయన ఉన్నాడు, సృష్టిని కలుగజేశాడు. “అన్నిటికీ...స్థిరంగా”– హెబ్రీయులకు 1:3. సృష్టి అల్లకల్లోలమైపోకుండా చేసేవాడు క్రీస్తే. అది క్రమాన్ని అనుసరించేలా చేసేది ఆయన శక్తి. సృష్టిలోని భాగాలన్నిటినీ ఒక్కటిగా ఆయనే కలిపి ఉంచుతున్నాడు. దేవుని గురించి తప్పించి మరెవరి గురించయినా ఇలా చెప్పగలమా?

18. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు; ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము, ఆయన ఆదియైయుండి మృతులలోనుండి లేచుటలో ఆదిసంభూతుడాయెను.

“శరీరానికి”– రోమీయులకు 12:5; 1 కోరింథీయులకు 12:12-13. “సంఘానికి”– మత్తయి 16:18. “శిరస్సు”– ఎఫెసీయులకు 1:22-23. “ఆధిక్యత”– ఎఫెసీయులకు 1:22; ఫిలిప్పీయులకు 2:9-11. క్రీస్తుకే ఆధిక్యత కలగాలి. అలా తప్పక కలుగుతుంది. “ఆది”– ఇలా అనువదించిన గ్రీకు పదానికి “మూలాధారం” అనీ, “ప్రథముడైన వ్యక్తి” అనీ అర్థం వస్తున్నది. క్రైస్తవ సంఘం ఉనికిలోకి వచ్చింది. క్రీస్తు మూలంగానే, అందులో ఆయనకు ప్రథమ స్థానం ఉంది.

19. ఆయనయందు సర్వసంపూర్ణత నివసింపవలెననియు,

దేవుని సంపూర్ణత అంతా యేసు క్రీస్తు అనే ఈ మనిషిలో ఉంది – కొలొస్సయులకు 2:9; యోహాను 1:1, యోహాను 1:14.

20. ఆయన సిలువరక్తముచేత సంధిచేసి, ఆయనద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోక మందున్నవైనను, వాటినన్నిటిని ఆయనద్వారా తనతో సమాధానపరచుకొన వలెననియు తండ్రి అభీష్టమాయెను.

“సఖ్యపరచుకోవాలని”– లోకమంతా పాపంలో పడిపోయి దేవునికి దూరమైపోయింది (రోమీయులకు 3:19-20). మనుషుల పాపాలకు వ్యతిరేకంగా దేవుని కోపం మండుతూ ఉంది (రోమీయులకు 1:18). పరలోకానికీ భూమికీ మధ్య సమాధానం అంటూ లేకపోయింది. ఈ పరిస్థితుల్లో శాంతిని నెలకొల్పేందుకు దేవుడు క్రీస్తును పంపాడు. లోక పాపాలను తీసివేసేందుకు తానే రక్తబలి కావడం ద్వారా క్రీస్తు ఆ పనిని నెరవేర్చాడు – యోహాను 1:29; రోమీయులకు 5:10; 2 కోరింథీయులకు 5:19; ఎఫెసీయులకు 2:16.

21. మరియు గతకాల మందు దేవునికి దూరస్థులును, మీ దుష్‌క్రియలవలన మీ మనస్సులో విరోధభావముగలవారునై యుండిన మిమ్మును కూడ

“పరాయివారు”– ఎఫెసీయులకు 2:12; ఎఫెసీయులకు 4:18. “చెడు పనులు”– మనుషులను దేవునికి శత్రువులుగా చేసేది మనుషుల పాపాలే. “విరోధ భావం”– రోమీయులకు 5:10; యాకోబు 4:4. తాము దేవునికి విరోధులమని వారు అనుకోలేదు. కానీ వారి మనసుల్లోని తలంపులు, కోరికలు దేవునికి వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి వారాయనకు శత్రువులే. రోమీయులకు 8:5-8 చూడండి.

22. తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలువబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణమువలన ఇప్పుడు మిమ్మును సమాధానపరచెను.

23. పునాదిమీద కట్టబడినవారై స్థిరముగా ఉండి, మీరు విన్నట్టియు, ఆకాశముక్రింద ఉన్న సమస్తసృష్టికి ప్రకటింపబడినట్టియు ఈ సువార్తవలన కలుగు నిరీక్షణనుండి తొలగిపోక, విశ్వాసమందు నిలిచి యుండినయెడల ఇది మీకు కలుగును. పౌలను నేను ఆ సువార్తకు పరిచారకుడనైతిని.

“సుస్థిరంగా, దృఢంగా”– నిజ విశ్వాసం దృఢమైన పునాదిపై నిలిచి ఉంటుంది (1 కోరింథీయులకు 3:11; ఎఫెసీయులకు 2:20), విశ్వాసులను సుస్థిరంగా చేస్తుంది. “సాగిపోతూ ఉంటే”– కొందరు విశ్వాసులు తమ విశ్వాసంలో సాగిపోతూ ఉండరు అని పౌలు సూచించడం లేదు. నిజ విశ్వాసులు ఏమిటో, ఏమి చేస్తారో వివరిస్తున్నాడు. వారు విశ్వాసంలో సాగిపోవడమే వారు దేవునితో సఖ్య పడ్డారన్నదానికి రుజువు. 1 కోరింథీయులకు 15:2; హెబ్రీయులకు 3:6, హెబ్రీయులకు 3:14; హెబ్రీయులకు 10:38-39; యోహాను 10:27; లూకా 22:32; 1 యోహాను 2:19. “ఆకాశం క్రింద”– అంటే “సర్వ లోకానికీ”, లేక “భూమి కొనల వరకూ” (మార్కు 16:15; అపో. కార్యములు 13:47) అనే అర్థం కాదు. వారున్న భూభాగాల్లో శుభవార్త ప్రకటన ఎంత విస్తారంగా జరిగిందో పౌలు వారికి తెలియజేస్తున్నాడు.

24. ఇప్పుడు మీకొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు సంతోషించుచు, సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడినపాట్లలో కొదువైన వాటియందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను.

“మీకోసం...ఆనందిస్తూ”– కొలొస్సయులకు 4:10, కొలొస్సయులకు 4:18; 2 కోరింథీయులకు 15-6; ఎఫెసీయులకు 3:1, ఎఫెసీయులకు 3:13. సత్యాన్ని ప్రకటిస్తూ క్రీస్తుకోసం మనుషులను సంపాదిస్తూ, భూమిపై క్రీస్తు సంఘ స్థాపనకు కృషి చేసినందువల్లే పౌలుకు బాధలు దాపురించాయి. బాధలు తనకు హాయిగా ఉన్నాయని కాదు గానీ క్రీస్తుకోసం, ఇతరులకోసం తాను ఆ బాధల పాలవుతున్నందుకే అతనికి ఆనందం. దీన్ని ఒక విశేషావకాశంగా ఆధిక్యతగా పౌలు ఎంచాడు – ఫిలిప్పీయులకు 1:29; ఫిలిప్పీయులకు 3:10. 1 పేతురు 4:13-16 పోల్చి చూడండి. “తక్కువ పడినదాన్ని”– క్రీస్తు సిలువపై పడిన బాధల్లో ఏదన్నా లోటుందా? లోక పాపాలకోసం క్రీస్తు అనుభవించిన బాధలు పరిపూర్ణమైనవి, ఒక్క సారే మరెన్నడూ తిరిగి అనుభవించే అవసరం లేకుండా పూర్తి అయ్యాయి – యోహాను 19:30; హెబ్రీయులకు 10:10, హెబ్రీయులకు 10:14; 1 పేతురు 3:18. కానీ ఇప్పుడు క్రీస్తు తన సంఘాన్ని నిర్మిస్తున్నాడు (మత్తయి 16:18; ఎఫెసీయులకు 2:19-22). తన సేవకులకు తనతో కలిసి పని చేసే అవకాశాన్ని దయ చేస్తున్నాడు. ఈ పాపిష్ఠి లోకంలో ఇలా పని చేయడమంటే బాధలు, కష్టాలు, కడగండ్లు, హింసలను ఎదుర్కోవడమే. ఈ పని, ఈ బాధలు ఇంకా పూర్తి కాలేదు. అందుకే “తక్కువ పడినది” అంటున్నాడు పౌలు. సంఘం కోసం ఆయనతో కలిసి బాధలు అనుభవించే అపూర్వ విశేషవకాశాన్ని ఆయన తన సేవకులకు ఇచ్చాడు.

25. దేవుని వాక్యమును, అనగా యుగములలోను తరములలోను మరుగు చేయబడియున్న మర్మమును సంపూర్ణముగా ప్రక టించుటకు,

26. మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని యేర్పాటు ప్రకారము, నేను ఆ సంఘమునకు పరిచార కుడనైతిని.

27. అన్యజనులలో ఈ మర్మముయొక్క మహి మైశ్వర్యము ఎట్టిదో అది, అనగా మీ యందున్న క్రీస్తు, మహిమ నిరీక్షణయై యున్నాడను సంగతిని దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి యిప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరచెను.

“ఐశ్వర్యం”– ఎఫెసీయులకు 3:8. ఈ ఐశ్వర్యంతో పోల్చుకుంటే మనుషులు ఊహించి, కల్పించిన ప్రతి ఆలోచన విధానమూ దరిద్రమైనదే. “మీలో ఉన్న క్రీస్తు”– యోహాను 17:23; రోమీయులకు 8:9-10; 2 కోరింథీయులకు 13:5; ప్రకటన గ్రంథం 3:20. “మహిమ...ఆశాభావం”– రోమీయులకు 5:2; రోమీయులకు 8:18. క్రీస్తు మనలో లేకపోతే మనకు పాపవిముక్తి కలిగి దేవుని మహిమను చూస్తామని ఆశాభావం పెట్టుకోవడానికి మనకు సరైన కారణమేమీ ఉండదు.

28. ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయనయెదుట నిలువబెట్టవలెనని, సమస్తవిధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుష్యునికి బుద్ధిచెప్పుచు, ప్రతి మనుష్యునికి బోధించుచు, ఆయనను ప్రకటించుచున్నాము.

అపో. కార్యములు 20:20-24 పోల్చి చూడండి. “సర్వ జ్ఞానం”– దేవుడు అతనికిచ్చిన జ్ఞానం – 1 కోరింథీయులకు 1:30; 1 కోరింథీయులకు 2:7, 1 కోరింథీయులకు 2:10, 1 కోరింథీయులకు 2:12, 1 కోరింథీయులకు 2:16. తన జ్ఞానం గురించి పౌలు గొప్పలు చెప్పుకోవడం లేదు. వారికి సంపూర్ణ జ్ఞానం కలగాలని ప్రార్థిస్తున్నాడు – వ 9. అది వారికి కలగడం సాధ్యమేనని అతనికి తెలుసు, ఎందుకంటే అది అతనికి కలిగింది. ఇప్పుడు విశ్వాసులకు కూడా అది కలగవచ్చు – యాకోబు 1:5.

29. అందు నిమిత్తము నాలో బలముగా, కార్యసిద్ధికలుగజేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను.

పౌలుకైతే ఎఫెసీయులకు 3:20 కేవలం ఒక సిద్ధాంతం మాత్రమే కాదు. దేవుని బలప్రభావాలు పౌలులో పని చేస్తున్నప్పటికీ ఇదంతా అతనికి చాలా తేలికగా ఏమీ అనిపించడం లేదని గుర్తించాలి. అందుకు వ్యతిరేకంగా ఉంది – చాలా ప్రయాస, పోరాటం జరపవలసి వస్తున్నది (గ్రీకులో ఈ పదం కొలొస్సయులకు 4:12; లూకా 13:24; 1 కోరింథీయులకు 9:25 లో కూడా ఉంది).Shortcut Links
కొలొస్సయులకు - Colossians : 1 | 2 | 3 | 4 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |