John I - 1 యోహాను 1 | View All

1. జీవవాక్యమునుగూర్చినది, ఆదినుండి ఏది యుండెనో, మేమేది వింటిమో, కన్నులార ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో, అది మీకు తెలియజేయుచున్నాము.

“ఆది”– ఆదికాండము 1:1; యోహాను 1:1. “జీవ వాక్కు”– క్రీస్తే ఆ వాక్కు, మానవాళికి దేవుని సంపూర్ణమైన దివ్యవార్త, సత్యప్రకాశం. ఆయనే శాశ్వత జీవం (1 యోహాను 5:20; యోహాను 1:4; యోహాను 5:26; యోహాను 14:6). ప్రజలకు శాశ్వత జీవం తేవాలనే ఆయన వచ్చాడు (యోహాను 10:10; యోహాను 6:51). ఆయన పలికిన పలుకులు కూడా జీవమే (యోహాను 6:63). ఆయన శుభవార్త ఆధ్యాత్మిక జీవాన్ని కలిగిస్తున్నది (రోమీయులకు 5:21; రోమీయులకు 6:23). “మేము”– క్రీస్తు ఎన్నుకున్న ప్రథమ శిష్యులందరి గురించీ యోహాను మాట్లాడుతున్నాడు. యేసు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన వారికి వ్యక్తిగతంగా తెలుసు. ఆయన ఉపదేశాలు విన్నారు. ఆయన చేసినవి చూశారు. 2 పేతురు 1:16; యోహాను 15:21; అపో. కార్యములు 4:20 పోల్చి చూడండి. “తాకినదీ”– లూకా 24:39; యోహాను 20:27. ఇది క్రీస్తు మరణంనుంచి సజీవంగా లేచిన తరువాత.

2. ఆ జీవము ప్రత్యక్షమాయెను; తండ్రియొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్యజీవమును మేము చూచి, ఆ జీవ మునుగూర్చి సాక్ష్యమిచ్చుచు, దానిని మీకు తెలియ పరచుచున్నాము.

“తండ్రిదగ్గర”– యోహాను 1:2; యోహాను 17:5. క్రీస్తు తండ్రి కాదు. తండ్రితో బాటు ఒకే దేవత్వంలోని వ్యక్తి. యోహాను 17:1, యోహాను 175; 1 కోరింథీయులకు 8:5-6; 2 యోహాను 1:3 నోట్స్ చూడండి. “ప్రత్యక్షమైన”– క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడే శాశ్వత జీవం కూడా ప్రత్యక్షమైంది (యోహాను 1:14; 2 తిమోతికి 1:10). “శాశ్వత జీవాన్ని”– 1 యోహాను 5:11-12; యోహాను 3:16.

3. మాతోకూడ మీకును సహవాసము కలుగునట్లు మేము చూచినదానిని వినినదానిని మీకును తెలియజేయుచున్నాము. మన సహవాసమైతే తండ్రితో కూడను ఆయన కుమారుడైన యేసుక్రీస్తు తోకూడను ఉన్నది.

“సహవాసం”– అపో. కార్యములు 2:42; 1 కోరింథీయులకు 1:9; 2 కోరింథీయులకు 13:14; ఫిలిప్పీయులకు 3:10. గ్రీకు పదానికి అర్థం “కలిసి పంచుకోవడం”. క్రీస్తు సత్యాన్ని ప్రకటించడానికి యోహానుకు తగిన కారణాలే ఉన్నాయి. వాటిలో ఇదొక కారణం. ఇంకా కొన్ని వ 4; 1 యోహాను 2:1, 1 యోహాను 2:12-14, 1 యోహాను 2:21; 1 యోహాను 5:13 లో కనిపిస్తున్నాయి. “చూచినదీ”– ఈ మూడు వచనాల్లో ఈ మాట చెప్పడం ఇది మూడో సారి. తానూ ఇతర రాయబారులూ ఎక్కడెక్కడో సేకరించిన సమాచారాన్ని, లేక కల్పించిన కథలను ఇతరులకు అందించడం లేదని యోహాను గట్టిగా నొక్కి చెప్తున్నాడు. వారు వ్యక్తిగతంగా యేసును చూశారు, ఆయన మాటలు విన్నారు కాబట్టి వారు మాట్లాడేదేమిటో వారికి బాగా తెలుసు. “తండ్రితో...కుమారుడైన”– దేవత్వంలో ఈ ఇద్దరిని యోహాను వేరుగా చెప్తున్నాడు (త్రిత్వం గురించి నోట్ మత్తయి 3:16-17), కానీ వారెంత ఏకమంటే ఒకరితో సహవాసం అంటే వేరొకరితో సహవాసం ఉన్నట్టే (క్రీస్తు దేవత్వం గురించి ఇతర రిఫరెన్సులు ఫిలిప్పీయులకు 2:6; లూకా 2:11 నోట్స్ చూడండి). దేవునితో సహవాసమంటే ఆయన్నెరిగి ఉండడం (యోహాను 17:3), ఆయన ఆనందంలో, శాంతిలో, తలంపుల్లో, భూమిపై ఆయన పనిలో భాగం పంచుకోవడమే. క్రీస్తు విశ్వాసులు మాత్రమే దేవుణ్ణెరిగినవారు, ఆయనతో సహవాసం ఉన్నవారు. వేరెవరికీ నిజమైన జ్ఞానప్రకాశాలు, ఆధ్యాత్మిక జీవం లేవు (1 యోహాను 5:11-12).

4. మన సంతోషము పరిపూర్ణమవుటకై మేమీ సంగతులను వ్రాయుచున్నాము.

“ఆనందం”– లూకా 2:10; యోహాను 15:11; యోహాను 16:22, యోహాను 16:24; యోహాను 17:13; రోమీయులకు 14:17; గలతియులకు 5:22. సత్యాన్ని హృదయంలోకి స్వీకరించి జీవితంలో అనుసరించినందువల్ల కలిగే ఫలితమే ఆనందం. అందువల్ల తాను క్రీస్తునుంచి నేర్చుకున్న సత్యాన్ని యోహాను వారికి రాస్తున్నాడు. క్రీస్తును గురించి పూర్తిగా ఎరిగి, ఆయనకు పూర్తిగా లోబడితే పూర్తి ఆనందం ఉంటుంది.

5. మేమాయనవలన విని మీకు ప్రకటించు వర్తమాన మేమనగా దేవుడు వెలుగై యున్నాడు; ఆయనయందు చీకటి ఎంతమాత్రమును లేదు.

“దేవుడు వెలుగు”– మనం కంటితో చూచే వెలుగు కాదు, ఆధ్యాత్మికమైన వెలుగు. క్రొత్త ఒడంబడికలో చీకటి పాపానికీ, ఆధ్యాత్మిక విషయాలను ఎరిగి ఉండకపోవడానికీ సూచన. వెలుగు పవిత్రతకూ సత్యానికీ సూచనే – మత్తయి 4:16; లూకా 2:32; యోహాను 1:4-5; యోహాను 3:19-20; యోహాను 8:12; యోహాను 11:10; యోహాను 12:36, యోహాను 12:46; అపో. కార్యములు 26:18; రోమీయులకు 13:12; 2 కోరింథీయులకు 4:4-6; ఎఫెసీయులకు 5:8-9, ఎఫెసీయులకు 5:13-14; 1 తిమోతికి 6:16. “చీకటి...లేదు”– లోకంలో చాలా దుర్మార్గత ఉంది గానీ దేవునిలో మాత్రం ఏమీ లేదు. దాన్ని ఆయన సృష్టించలేదు. అది ఏ ఆకారంలో ఉన్నా ఆయన దాన్ని సహించలేడు. ఆయన కేవలం పవిత్రుడు, దివ్యమైన పరిశుద్ధత గలవాడు (లేవీయకాండము 20:7; యెషయా 6:3).

6. ఆయనతోకూడ సహవాసముగలవారమని చెప్పుకొని చీకటిలో నడిచినయెడల మనమబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము.

“చెప్పుకొని”– పాపంలో, తప్పులో జీవిస్తూ పవిత్రతతో సత్యంతో సహవాసం కలిగి ఉండడం అసాధ్యం. పాపాన్ని కోరుకోవడమంటే దేవుణ్ణి త్రోసిపుచ్చడమే. ఆయన్ను త్రోసివుచ్చితే దేనిలోనైనా ఆయనతో ఏ విధంగా పాలు పంచుకోగలం? 2 కోరింథీయులకు 6:14 చూడండి. విచారకరమైన సంగతేమిటంటే దేవుణ్ణెరుగని అనేకమంది తమకు దేవుడు తెలుసని చెప్పుకుంటారు. తమ జీవిత విధానాల మూలంగా దేవుడు తమకు తెలియదని కనపరచుకొంటూ ఉంటారు (తీతుకు 1:16). “అబద్ధమాడుతున్నాం”– అలాంటివారు మోసపోయినవారు. లేదా ఇతరులను మోసం చేయజూస్తున్నారు. ఎలా చూచుకున్నా వారు చెప్పుకునే మాటలు అబద్ధమే. “సత్యం ఆచరణలో”– ఊరికే సత్యాన్ని వినడం, లేదా శ్రద్ధగా పఠించడం సరిపోదు. మనం దాని ప్రకారం బ్రతకాలి.

7. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచినయెడల. మనము అన్యోన్యసహవాసము గలవారమై యుందుము; అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపమునుండి మనలను పవిత్రులనుగా చేయును.
యెషయా 2:5

వెలుగులో నడుస్తూ ఉండడమంటే ఏమిటి? తన ఈ లేఖలో యోహాను దీనికి అర్థం చెప్తున్నాడు. పాపాంధకారంలో, అజ్ఞానంలో, తప్పులో నడవడానికి ఇది వ్యతిరేకం. అంటే పాపాన్ని, దేవుని వాక్కుకు వ్యతిరేకం అయిన ప్రతిదాన్నీ నిరాకరించి, ఆయన వాక్కు మనకు చెప్పినదాన్ని ఆచరణలో పెట్టడమే. దేవునికి సుముఖంగా ఉంటూ, మనం ఏమిటో, మనం చేసినదేమిటో ఏదీ దాచకుండా ఉండడమే. వెలుగులో నడవాలంటే ముందు మనకు వెలుగు కావాలి. అందులోకి మనల్ని తెచ్చే పని దేవునిదే – 1 పేతురు 2:9; కొలొస్సయులకు 1:12-13. వెలుగు రాజ్యంలో ఉన్న మనకు ఆ విధంగా నడుచుకోవలసిన బాధ్యత ఉంది (1 యోహాను 2:6). “సహవాసం”– వెలుగులో నడుస్తున్న విశ్వాసుల మధ్య మాత్రమే నిజమైన క్రైస్తవ సహవాసం ఉంటుంది. పాపం, తప్పుడు ఉద్దేశం సహవాసాన్ని చంపేస్తాయి. “యేసు రక్తం...శుద్ధి చేస్తుంది”– విశ్వాసులు కొన్ని సార్లు తలంపుల్లో మాటల్లో చేతల్లో పాపాలు చేస్తారు (1 యోహాను 2:1; యాకోబు 3:2; గలతియులకు 2:11-13; గలతియులకు 5:17; రోమీయులకు 7:18; 1 రాజులు 8:46; మొ।।). వారు వెలుగులో నడుచుకొంటూ ఉంటే దేవుడు వారి పాపాలను క్షమించి, వాటిని కడిగివేసి, అవి అసలు జరగలేనంత శుభ్రంగా తుడిచివేస్తాడు. సిలువపై క్రీస్తు చేసిన బలి అర్పణ ఆధారంగా ఆయన ఇది చేస్తాడు (1 యోహాను 2:2). వారు ఈ భూమిపై ఉన్నంత కాలం ఇది అలా జరుగుతూనే ఉంటుంది.

8. మనము పాపములేనివారమని చెప్పుకొనిన యెడల, మనలను మనమే మోసపుచ్చుకొందుము; మరియు మనలో సత్య ముండదు.

క్రీస్తు రక్తం మనల్ని ప్రతి పాపం నుంచీ శుద్ధి చేస్తుంది అంటే మనం పాపం లేనివారం అవుతామా? అంటే మనలో భ్రష్ట స్వభావం లేకుండా పోతుందా? అలా కాదు. ఎవరైనా అలా జరగుతుందని పొరపాటున అనుకుంటారేమోనని యోహాను వెనువెంటనే దీన్ని స్పష్టం చేస్తున్నాడు. ఏ విశ్వాసీ పాపం లేనివాడు కాదు. మత్తయి 6:12; మత్తయి 7:11; రోమీయులకు 7:14-25; రోమీయులకు 8:12; గలతియులకు 5:16-17; 1 తిమోతికి 1:15; యాకోబు 3:2 చూడండి. ఈ లోకంలో యేసు రక్తం మన పాపాలనుంచి మనల్ని శుద్ధి చేసే అవసరం లేనంతగా మనం ఎప్పటికీ అయిపోము. మనం నాలో పాపం లేదు అనుకుంటే మనల్ని మనమే “మోసపుచ్చుకొంటున్నాం”. అంటే మనకు మనమే తప్పుదారి పట్టించుకుంటున్నాం. నిజం కాని దాన్ని నిజమని మనల్ని నమ్మించుకుంటున్నాం. దీనికి మనమే బాధ్యులం కాబట్టి ఆ దోషం మనదే. మనం పాపం లేనివారమని అనుకోవడం అలా ఆలోచించడానికి మనం చేసే స్వంత ప్రయత్నాలే కారణం గానీ దేవుని వాక్కు కాదు. “మనలో సత్యం ఉండదు”– మనలో ఏ ఇతర సత్యమన్నా ఉండనీయండి, పాపం గురించి, పాపాల శుద్ధి గురించిన సత్యం మాత్రం మనలో ఉండదు (మనలో పాపం లేదని అనుకుంటే). అలాంటి స్థితిలో మనం సత్యాన్ని ఎదుర్కోవడం లేదు గాని దానినుంచి తప్పించుకు పోతున్నామన్నమాట. పాపాన్ని మరో పేరుతో పిలుస్తూ, అది పాపం కాదని అనుకుంటున్నామన్న మాట. ఈ విధంగా మన హృదయాల్లో సత్యం స్థానంలో అసత్యం చొరబడుతుంది. విశ్వాసులందరూ పరిపూర్ణులుగా ఉండేందుకు చూడాలి గాని ఈ లోకంలో ఎవరూ దాన్ని అందుకోలేరు – ఫిలిప్పీయులకు 3:12. అసలు పాపమనేది లేకుండా జీవించడానికి ప్రయత్నించాలి (1 యోహాను 2:1) కానీ అది కూడా మనం సాధించగల పని కాదు. తెలిసి తెలిసి పాపం చెయ్యకపోయినా తెలియకుండా అయినా చేస్తాం (లేవీయకాండము 4:1-2 పోల్చి చూడండి). ఉద్దేశ పూర్వకంగా మనం పాపం చేయకపోయినా, చెయ్యవలసినవి చెయ్యకుండా వదిలివేయడం వల్ల పాపం చేస్తున్నాం (సంఖ్యాకాండము 32:23; ద్వితీయోపదేశకాండము 23:3-4; మత్తయి 25:24-27, మత్తయి 25:41-46; 1 తిమోతికి 5:8).

9. మన పాపములను మనము ఒప్పుకొనిన యెడల, ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతినుండి మనలను పవిత్రులనుగా చేయును.
కీర్తనల గ్రంథము 32:5, సామెతలు 28:13

“మన”– యోహాను విశ్వాసులకు రాస్తున్నాడు (1 యోహాను 2:1, 1 యోహాను 2:12-14). ఇప్పుడు చెప్తున్నదానిలో తనను కూడా వారితో కలుపుకుంటున్నాడు. విశ్వాసులంతా తమ పాపాలు ఒప్పుకోవలసిన అవసరత గురించి అతనికి తెలుసు – మత్తయి 6:12; లూకా 11:4. “ఒప్పుకుంటే”– ఇలా అనువదించిన గ్రీకు పదానికి వేరొకడు ఏదో ఒక సంగతి గురించి చెప్పినదాన్ని చెప్పడం, సమ్మతించడం, తనపై వచ్చిన నేరారోపణను అంగీకరించడం అని అర్థాలున్నాయి. పాపాలను ఒప్పుకోవడమంటే దేవుడు వాటి గురించి చెప్తున్నదాన్నే మనమూ చెప్పడం, సమ్మతించడం. పొరపాట్లు, లేక తప్పు నిర్ణయాలు వంటి వేరే పేర్లు వాటికి పెట్టకూడదు. ఏ విధంగానైనా దేవుని పరిపూర్ణ నీతిన్యాయాలకూ పవిత్రతకూ వ్యతిరేకంగా మనసులో, మాటలో, క్రియలో ఉండేది ఏదైనా పాపమే. చేయవలసినది ఏదైనా చేయకుండా వదిలేయడం కూడా పాపమే. పాపం చేయడం మనల్ని దోషులుగా చేస్తుంది, అప్పుడు మనకు క్షమాపణ అవసరమౌతుంది. అందువల్ల మనం దేవునితో సమ్మతించి మన పాపాలను వాటికి తగిన పేర్లతో గుర్తించి దేవుణ్ణి క్షమాపణ కోరాలి. మన పాపాలను ఒప్పుకోవడం, వెలుగులో నడుచుకోవడం కలిసి ఉంటాయి. వెలుగు మన పాపాలను బయట పెడతుంది (ఎఫెసీయులకు 5:13-14). అవి అలా బయట పడినప్పుడు వాటిని మనం ఒప్పుకొని విడిచి పెట్టాలి. క్షమించగలిగినవాడు దేవుడే గనుక ఆయనవద్దే పాపాలు ఒప్పుకోవాలి. “శుద్ధి చేస్తాడు”– వ 7. దేవుడు మన పాపాలు క్షమిస్తాడు, శాశ్వతంగా వాటిని తుడిచి పెట్టేస్తాడు, సమస్తమైన అన్యాయాన్నీ చెడుతనాన్నీ మన అంతర్వాణినుంచి కడిగివేస్తాడు (హెబ్రీయులకు 9:14). “నమ్మతగినవాడు”– కీర్తనల గ్రంథము 33:4; కీర్తనల గ్రంథము 111:7-8; కీర్తనల గ్రంథము 145:13; కీర్తనల గ్రంథము 146:6; 1 కోరింథీయులకు 1:9; 2 తిమోతికి 2:13; హెబ్రీయులకు 10:23; హెబ్రీయులకు 11:11; 1 పేతురు 4:19. దేవుడెప్పుడూ తన మాటకు విశ్వసనీయంగా ఉంటాడు. మనుషులను రక్షించాలన్న తన ఏర్పాటుకూ, తన స్వభావానికీ విశ్వసనీయంగా ఉంటాడు. ఆయన క్షమించే దేవుడు – నిర్గమకాండము 34:7; సంఖ్యాకాండము 14:18; నెహెమ్యా 9:17; కీర్తనల గ్రంథము 86:5; కీర్తనల గ్రంథము 99:8; కీర్తనల గ్రంథము 103:3; దానియేలు 9:9; మీకా 7:18; మత్తయి 6:15; మత్తయి 9:2; రోమీయులకు 4:7-8; హెబ్రీయులకు 8:12; యాకోబు 5:12. మనుషుల పాపాలను క్షమించేలా ఆయన తన స్వంత కుమారుణ్ణి వారికోసం పరిహార బలిగా మరణించేందుకు పంపించాడని ఆయన వాక్కు (బైబిలు) చెప్తున్నది – యోహాను 1:29; యోహాను 3:14-16. అందువల్ల మనం పశ్చాత్తాపపడి నిజంగా క్షమాపణను, పాపాలనుంచి శుద్ధిని ఆశిస్తే ఆయన తప్పక క్షమిస్తాడన్నదాన్లో సందేహం లేదు. “న్యాయవంతుడు”– ద్వితీయోపదేశకాండము 32:4; కీర్తనల గ్రంథము 9:16; కీర్తనల గ్రంథము 36:6; కీర్తనల గ్రంథము 89:14; కీర్తనల గ్రంథము 111:7. న్యాయం ఆధారంగా ఆయన మన పాపాలు క్షమిస్తాడు. క్రీస్తు మన పాపాలకు పరిహారం చెల్లించాడు. అందువల్ల మనం పశ్చాత్తాపపడి, వాటిని ఒప్పుకుంటే న్యాయంగా దేవుడు క్షమించగలడు. 1 యోహాను 2:2; రోమీయులకు 3:25-26 చూడండి.

10. మనము పాపము చేయలేదని చెప్పుకొనినయెడల, ఆయనను అబద్ధికునిగా చేయువార మగుదుము; మరియు ఆయన వాక్యము మనలో ఉండదు.

వ 8 వర్తమాన కాలం గురించి చెప్తున్నది. ఈ వచనం భూతకాలం గురించి చెప్తున్నది. అందరూ పాపం చేశారని దేవుడు చెప్పాడు (రోమీయులకు 3:9-23). చెయ్యలేదని మనం అంటే దేవుని వాక్కు తప్పనీ, బైబిల్లోని దేవుడు అబద్ధం ఆడుతున్నాడనీ చెప్తున్నామన్నమాట. అలాంటప్పుడు బైబిల్లోని ఏ భాగానికి మనలో సరైన స్థానం లేనట్టే.Shortcut Links
1 యోహాను - 1 John : 1 | 2 | 3 | 4 | 5 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |