క్రీస్తు విశ్వాసులు తమ రక్షణను గురించి సందేహంలో ఉండాలని దేవుడు కోరడం లేదు. వారికి శాశ్వత జీవం ఉంది. ఉందని వారు తెలుసుకుని ఉండాలి. దేవుడు యోహానుచేత ఈ లేఖ రాయించిన కారణాల్లో ఇదొకటి. తమకు పాపవిముక్తి, రక్షణ ఉన్నాయని విశ్వాసులు ఎలా తెలుసుకోగలరు? అందుకు రుజువులు ఏమిటి? యోహాను చెప్తున్న సూచనలు ఏమిటి? రక్షణ నిశ్చయత ఎలా కలుగుతుంది?
తన వాక్కులో దేవుడిచ్చిన సాక్ష్యం వల్లా (వ 9,11).
దేవుని వాగ్దానాలపై నమ్మకం ఉంచడంవల్లా, దేవుని ఆత్మ మన మనసుల్లో చెప్తున్న సాక్ష్యం వల్లా (వ 10; 1 యోహాను 3:24),
పాపాలకు క్షమాపణ కలిగిందన్న వాగ్దానంపై ఆధారపడడంవల్లా (1 యోహాను 1:7-9).
దేవునికి విధేయతను చూపుతున్నామనే రుజువువల్లా (1 యోహాను 2:5; 1 యోహాను 5:2),
నీతి నిజాయితీలలో జీవిస్తున్నామన్న సాక్ష్యం వల్లా (1 యోహాను 2:29; 1 యోహాను 3:6, 1 యోహాను 3:10),
మన జీవితాల్లో కనిపించిన ప్రేమ ఫలం వల్లా (1 యోహాను 3:14, 1 యోహాను 3:18-19; 1 యోహాను 4:12).
విశ్వాసుల్లో నిశ్చయత కలిగించే సత్యాలు కొన్నింటిని కూడా యోహాను ఇస్తున్నాడు (1 యోహాను 4:15; 1 యోహాను 5:1). పాపవిముక్తి, రక్షణ ఉందన్న సంపూర్ణ నిశ్చయత మూడింటిపై ఆధారపడి ఉంది. అవేవంటే దేవుని వ్రాత పూర్వకమైన వాక్కు, విశ్వాసుల అంతరంగంలోని అనుభవం, వారు జీవిస్తున్న, ప్రేమిస్తున్న విధానం.