Genesis - ఆదికాండము 40 | View All

1. అటుపిమ్మట ఐగుప్తురాజుయొక్క పానదాయకుడును భక్ష్యకారుడును తమ ప్రభువైన ఐగుప్తురాజు ఎడల తప్పుచేసిరి

1. ఆ తరువాత ఫరో సేవకులు ఇద్దరు ఫరోకు అపకారం చేసారు. ఆ సేవకుల్లో ఒకడు రొట్టెలు కాల్చేవాడు. మరొకడు ద్రాక్షా పాత్రలు అందించేవారి పెద్ద.

2. గనుక ఫరో పానదాయకుల అధిపతియు భక్ష్యకారుల అధిపతియునైన తన యిద్దరు ఉద్యోగస్థుల మీద కోపపడి

2. వంటల పెద్ద, ద్రాక్షా పాత్రల, పెద్ద మీద ఫరోకు కోపం వచ్చింది.

3. వారిని చెరసాలలో నుంచుటకై రాజసంరక్షక సేనాధిపతికి అప్పగించెను. అది యోసేపు బంధింపబడిన స్థలము.

3. కనుక వారిని కూడా యోసేపు ఉన్న చెరసాలలోనే వేయించాడు ఫరో రాజు సంరక్షకుల అధికారియైన పోతీఫరు ఈ చెరసాల అధికారి.

4. ఆ సేనాధిపతి వారిని యోసేపు వశము చేయగా అతడు వారికి ఉపచారము చేసెను. వారు కొన్నిదినములు కావలిలో నుండినతరువాత

4. ఈ ఇద్దరు ఖైదీలను యోసేపు బాధ్యతకు అప్పగించాడు అధికారి. ఆ ఇద్దరు మనుష్యులు కొన్నాళ్ల వరకు అలా జైల్లోనే ఉన్నారు.

5. వారిద్దరు, అనగా చెరసాలలో బంధింపబడిన ఐగుప్తురాజు యొక్క పానదాయకుడును, భక్ష్యకారుడును ఒక్కటే రాత్రియందు కలలు కనిరి; ఒక్కొక్కడు వేరు వేరు భావముల కల కనెను.

5. ఒక రాత్రి ఆ ఇద్దరు ఖైదీలకు కలలు వచ్చాయి. (ఆ ఇద్దరు ఖైదీలు ఈజిప్టు రాజు సేవకులు - ఒకడు రొట్టెలు కాల్చేవాడు, మరొకడు ద్రాక్షా పాత్రల పెద్ద). ఒక్కో ఖైదీకి ఒక్కో కల వచ్చింది. ఒక్కో కలకు ఒక్కో భావం ఉంది.

6. తెల్లవారినప్పుడు యోసేపు వారి యొద్దకు వచ్చి వారిని చూడగా వారు చింతా క్రాంతులై యుండిరి.

6. మర్నాడు ఉదయం యోసేపు వాళ్ల దగ్గరకు వెళ్లాడు. ఆ ఇద్దరు మనుష్యులు ఏదో చింతిస్తున్నట్టు యోసేపు గమనించాడు.

7. అతడుఎందుచేత నేడు మీ ముఖములు చిన్నబోయి యున్నవని తన యజమానుని యింట తనతో కావలి యందున్న ఫరో ఉద్యోగస్థుల నడిగెను.

7. “ఏమిటి, ఈ వేళ మీరు చాలా చింతిస్తున్నట్టు కనబడుతున్నారు?” అని వారిని అడిగాడు యోసేపు.

8. అందుకు వారుమేము కలలు కంటిమి; వాటి భావము చెప్పగలవారెవరును లేరని అతనితో ననగా యోసేపు వారిని చూచిభావములు చెప్పుట దేవుని అధీనమే గదా; మీరు దయచేసి ఆ కలలు నాకు వివరించి చెప్పుడనెను.

8. “రాత్రి మాకు కలలు వచ్చాయి కాని మేము కన్న కల మాకు అర్థం కాలేదు. ఆ కలలు ఏమిటో, వాటి భావం ఏమిటో మాకు వివరించే వాళ్లెవరూ లేరు” అని వాళ్లిద్దరు జవాబిచ్చారు. యోసేపు, “కలలను తెలిసికొని, వాటి భావం చెప్పగలవాడు దేవుడు మాత్రమే కనుక దయచేసి మీ కలలు నాకు చెప్పండి” అని వారితో అన్నాడు.

9. అప్పుడు పానదాయకుల అధిపతి యోసేపును చూచినా కలలో ఒక ద్రాక్షావల్లి నా యెదుట ఉండెను;

9. కనుక ద్రాక్షా పాత్రల సేవకుడు యోసేపుతో తన కల చెప్పాడు. ఆ సేవకుడు ఇలా చెప్పాడు: “నా కలలో ఒక ద్రాక్షావల్లి కనబడింది.

10. ఆ ద్రాక్షావల్లికి మూడు తీగెలుండెను, అది చిగిరించినట్టు ఉండెను; దాని పువ్వులు వికసించెను; దాని గెలలు పండి ద్రాక్షఫలములాయెను.

10. ఆ ద్రాక్షావల్లికి మూడు తీగెలున్నాయి. నేను చూస్తుండగా ఆ తీగెలకు పూలు పూసి, ద్రాక్షాగెలలు అయ్యాయి.

11. మరియఫరో గిన్నె నా చేతిలో ఉండెను; ఆ ద్రాక్షఫలములు నేను పట్టుకొని ఫరో గిన్నెలో వాటిని పిండి ఆ గిన్నె ఫరో చేతికిచ్చితినని తన కలను అతనితో వివరించి చెప్పెను.

11. నేను ఫరో పాత్ర పట్టుకొని ఉన్నాను. కనుక నేను ఆ ద్రాక్షాలను తీసుకొని ఆ పాత్రలో వాటి రసం పిండాను. అప్పుడు ఆ పాత్ర నేను ఫరోకు ఇచ్చాను.”

12. అప్పుడు యోసేపు-దాని భావమిదే; ఆ మూడు తీగెలు మూడు దినములు;

12. అప్పుడు యోసేపు అన్నాడు: “ఆ కలను నీకు నేను వివరిస్తాను. మూడు కొమ్మలంటే మూడు రోజులు.

13. ఇంక మూడు దినములలోగా ఫరో నీ తలను పైకెత్తి నీ ఉద్యోగము నీకు మరల ఇప్పించును. నీవు అతనికి పానదాయకుడవై యున్ననాటి మర్యాద చొప్పున ఫరో గిన్నెను అతని చేతికప్పగించెదవు

13. మూడు రోజులు గతించక ముందే ఫరో నిన్ను క్షమించి, నిన్ను మళ్లీ నీ పని చేసుకోనిస్తాడు. ఇది వరకు నీవు ఫరో దగ్గర పని చేసిన పని నీవు మళ్లీ చేస్తావు.

14. కాబట్టి నీకు క్షేమము కలిగినప్పుడు నన్ను జ్ఞాపకము చేసికొని నాయందు కరుణించి ఫరోతో నన్నుగూర్చి మాటలాడి యీ యింటిలోనుండి నన్ను బయటికి రప్పించుము.

14. నీకు విడుదల అయింతర్వాత నన్ను జ్ఞాపకం చేసుకో. నా మీద దయ ఉంచి, నాకు సహాయం చేయి. నాకుగూడ ఈ చెరసాలలో నుంచి విముక్తి కలిగేటట్టు నా గురించి ఫరోతో చెప్పు.

15. ఏలయనగా నేను హెబ్రీయుల దేశములోనుండి దొంగిలబడితిని, అది నిశ్చయము. మరియు ఈ చెరసాలలో నన్ను వేయుటకు ఇక్కడ సహా నేనేమియు చేయలేదని అతనితో చెప్పెను.

15. నన్ను అన్యాయంగా బలవంతంగా నా యింటినుండి నా ప్రజలైన హీబ్రూలనుండి తీసుకొనివచ్చారు. నేనేమి తప్పు చేయలేదు. అందుచేత నేను ఈ చెరసాలలో ఉండకూడదు.”

16. అతడు తెలిపిన భావము మంచిదని భక్ష్యకారుల అధిపతి చూచి అతనితో నిట్లనెను-నేనును కల కంటిని; ఇదిగో తెల్లని పిండివంటలు గల మూడు గంపలు నా తలమీద ఉండెను.

16. మరో సేవకుని కల బాగున్నట్టు రొట్టెలు కాల్చేవాడికి తోచింది. వాడు యోసేపుతో అన్నాడు, “నాకూ ఒక కల వచ్చింది. నా తలమీద రొట్టెల బుట్టలు మూడు ఉన్నట్టు నాకు కనబడింది.

17. మీదిగంపలో ఫరో నిమిత్తము సమస్తవిధములైన పిండివంటలు ఉండెను. పక్షులు నా తలమీదనున్న ఆ గంపలోనుండి వాటిని తీసికొని తినుచుండెను.

17. పై బుట్టలో అన్ని రకాల కాల్చిన ఆహారాలు ఉన్నాయి. ఈ భోజనం రాజుగారి కోసం. కాని పక్షులు ఈ భోజనాన్ని తినేస్తున్నాయి.”

18. అందుకు యోసేపు-దాని భావమిదే; ఆ మూడు గంపలు మూడు దినములు

18. యోసేపు జవాబిచ్చాడు: “ఈ కల అర్థం ఏమిటో నీకు నేను చెబతాను. మూడు బుట్టలు అంటే మూడు రోజులు.

19. ఇంక మూడు దినముల లోగా ఫరో నీ మీదనుండి నీ తలను పైకెత్తి మ్రానుమీద నిన్ను వ్రేలాడదీయించును. అప్పుడు పక్షులు నీ మీద నుండి నీ మాంసమును తినివేయునని ఉత్తర మిచ్చెను.

19. మూడు రోజులు గడవక ముందే రాజుగారు నిన్ను ఈ చెరసాలలోనుంచి విడుదల చేస్తారు. తర్వాత రాజుగారు నీ తల నరికేస్తాడు, నీ శరీరాన్ని ఒక స్తంభానికి వేలాడదీస్తాడు, పక్షులు నీ శరీరాన్ని తినివేస్తాయి.”

20. మూడవ దినమందు జరిగినదేమనగా, ఆ దినము ఫరో జన్మదినము గనుక అతడు తన సేవకులకందరికి విందు చేయించి వారి నడుమ పానదాయకుల అధిపతి తలను భక్ష్యకారుల అధిపతి తలను పైకెత్తి

20. మూడు రోజుల తర్వాత రాజుగారి పుట్టిన రోజు వచ్చింది. ఫరో తన సేవకులందరికీ ఒక విందు చేసాడు. ఆ విందులో ఫరో తన రొట్టెలు కాల్చేవాడిని, ద్రాక్షా పాత్రల సేవకుణ్ణి చెరసాలలోనుంచి బయటకు రప్పించాడు.

21. పానదాయకుల అధిపతి ఉద్యోగము మరల అతనికిచ్చెను గనుక అతడు ఫరోచేతికి గిన్నె నిచ్చెను.

21. ద్రాక్షాపాత్రల సేవకుడ్ని ఫరో విడుదల చేసాడు. అతని ఉద్యోగం మరల ఫరో అతనికి ఇచ్చాడు. ద్రాక్షా పాత్రల సేవకుడు ద్రాక్షారసపు పాత్ర ఒకటి ఫరో చేతికి అందించాడు.

22. మరియయోసేపు వారికి తెలిపిన భావముచొప్పున భక్ష్యకారుల అధిపతిని వ్రేలాడదీయించెను.

22. కానీ ఫరో రొట్టెలు కాల్చే వాడిని చంపేసాడు. ఎలా జరుగుతుందని యోసేపు చెప్పాడో అంతా అలాగే జరిగింది.

23. అయితే పానదాయకుల అధిపతి యోసేపును జ్ఞాపకము చేసికొనక అతని మరచిపోయెను.

23. అయితే ద్రాక్షా పాత్రల సేవకుడు యోసేపుకు సహాయం చెయ్యటం మరచిపోయాడు. యోసేపు విషయం ఫరోతో అతడేమీ చెప్పలేదు. ద్రాక్షాపాత్రల సేవకుడు యోసేపును గూర్చి మర్చిపోయాడు.Shortcut Links
ఆదికాండము - Genesis : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |