Samuel II - 2 సమూయేలు 14 | View All

1. రాజు అబ్షాలోముమీద ప్రాణము పెట్టుకొని యున్నాడని2 సెరూయా కుమారుడైన యోవాబు గ్రహించి

1. అబ్షాలోమును గూర్చి దావీదు రాజు మిక్కిలి బెంగపెట్టు కున్నాడని సెరూయా కుమారుడైన యోవాబు గ్రహించాడు.

2. తెకోవనుండి యుక్తిగల యొక స్త్రీని పిలువ నంపించిఏడ్చుచున్న దానవైనట్టు నటించి దుఃఖవస్త్రములు ధరించుకొని తైలము పూసికొనక బహు కాలము దుఃఖపడిన దానివలెనుండి

2. యోవాబు తన దూతలను తెకోవకు పంపి, అక్కడి నుండి ఒక నేర్పరియైన స్త్రీని తీసుకొని రమ్మని చెప్పాడు. ఆ స్త్రీతో యోవాబు ఇలా అన్నాడు: “దయచేసి నీవు చాలా దుఃఖంలో ఉన్నట్లు నటించు. విషాదసూ చకమైన బట్టలు వేసుకో, అలంకరణ చేసుకోవద్దు. చనిపోయిన, నీకు ప్రియమైన ఒక వ్యక్తి కోసం చాలా కాలంగా విలపిస్తున్నట్లు ప్రవర్తించు.

3. నీవు రాజునొద్దకు వచ్చి యీ ప్రకారము మనవి చేయవలెనని దానికి బోధించెను.

3. నేను ఇప్పుడు నీకు చెప్పే మాటలను నీవు రాజు వద్దకు వెళ్లి చెప్పు.” ఈ విధంగా ఆ యుక్తిగల స్త్రీ తో మాట్లాడి, ఆమె రాజుతో ఏమి చెప్పాలో యోవాబు ఆమెకు వివరించాడు.

4. కాగా తెకోవ ఊరి స్త్రీ రాజునొద్దకువచ్చి సాగిలపడి సమస్కారము చేసిరాజా రక్షించు మనగా

4. తరువాత తెకోవ నుండి వచ్చిన స్త్రీ రాజు వద్దకు వెళ్లి మాట్లాడింది. ఆమె రాజు ముందు ప్రణమిల్లింది. ఆమె ముఖం నేలకు తాకింది. వంగి నమస్కరించి, “రాజా, నాకు సహాయం చేయండి!” అని ప్రాధేయ పడింది.

5. రాజునీకేమి కష్టము వచ్చెనని అడిగెను. అందుకు ఆమెనేను నిజముగా విధవరాలను, నా పెనిమిటి చనిపోయెను;

5. “ఏమిటి నీ సమస్య?” అని దావీదు రాజు ప్రశ్నించాడు. ఆ స్త్రీ యిలా చెప్పింది: “నేనొక విధవ స్త్రీని! నా భర్త చినిపోయాడు.

6. నీ దాసినైన నాకు ఇద్దరు కుమారులు ఉండిరి, వారు పొలములో పెనుగు లాడుచుండగా విడిపించు వాడెవడును లేకపోయినందున వారిలో నొకడు రెండవవాని కొట్టి చంపెను.

6. నాకు ఇద్దరు కుమారులున్నారు. వారిద్దరూ పొలాల్లోకి పోయి దెబ్బలాటకు దిగారు. వాళ్లను నివారించటానికి ఒక్కడు కూడా లేక పోయాడు. ఒక కొడుకు, ఇంకొక కొడుకును చంపివేశాడు.

7. కాబట్టి నా యింటివారందరును నీ దాసినైన నామీదికి లేచితన సహోదరుని చంపినవాని అప్పగించుము; తన సహోదరుని ప్రాణము తీసినందుకై మేము వానిని చంపి హక్కు దారుని నాశనము చేతుమనుచున్నారు. ఈలాగున వారు నా పెనిమిటికి భూమిమీద పేరైనను శేషమైనను లేకుండ మిగిలిన నిప్పురవను ఆర్పివేయబోవు చున్నారని రాజుతో చెప్పగా

7. ఇప్పుడు కుటుంబమంతా నామీద కత్తిగట్టారు. హత్యకు పాల్పడిన కొడుకును తెమ్మని ఒత్తిడి తెస్తున్నారు. తన సోదరుని చంపిన కారణంగా వారంతా అతనిని చంపుతామంటున్నారు. నా కొడుకును చంపనిస్తే, తన తండ్రికి ఏకైక వారసుడైన వాడు లేకుండా పోతాడు! నా కుమారుడు అగ్నిలో చివరి నిప్పుకణంలాంటివాడు. ఇప్పుడు ఆ చివరి నిప్పుకణం ఆరిపోబోతూవుంది! దానితో మరణించిన నా భర్త పేరు, ఆస్తి నేలపాలవుతాయి.”

8. రాజునీవు నీ యింటికి పొమ్ము, నిన్నుగురించి ఆజ్ఞ ఇత్తునని ఆమెతో చెప్పెను.

8. ఇది విన్న రాజు, “ఇక నీవు ఇంటికి వెళ్లు. నీ విషయాల పట్ల నేను శ్రద్ధ తీసుకుంటాను” అని ఆమెతో అన్నాడు.

9. అందుకు తెకోవ ఊరి స్త్రీనా యేలినవాడా రాజా, దోషము నామీదను నాతండ్రి ఇంటివారి మీదను నిలుచునుగాక, రాజునకును రాజు సింహా సనమునకును దోషము తగులకుండునుగాక అని రాజుతో అనగా

9. తెకోవ స్త్రీ రాజుతో, “ఈ విషయంలో వచ్చే పరిణామాలకు, పర్యవసానానికి నిందంతా నామీదే పడుగాక! నా ప్రభువైన రాజా! నీవు, నీ సింహాసనం ఈ విషయంలో ఏదోషమూ ఎరుగరు!” అని చెప్పింది.

10. రాజుఎవడైనను దీనినిగూర్చి నిన్నేమైన అనినయెడల వానిని నాయొద్దకు తోడుకొనిరమ్ము; వాడికను నిన్ను ముట్టక యుండునని ఆమెతో చెప్పెను.

10. “నిన్ను గురుంచి ఎవరైనా దీనిగూర్చి నిన్నేమైన అనినయెడల నా వద్దకు తీసుకొనిరా. వాడు మరల నిన్ను ఏమీ అనడు” అని దావీదు రాజు అన్నాడు.

11. అప్పుడు ఆమెరాజవైన నీవు నీ దేవుడైన యెహోవాను స్మరించి హత్యకు ప్రతిహత్య చేయువారు నా కుమారుని నశింపజేయకుండ ఇకను నాశనము చేయుట మాన్పించుమని మనవిచేయగా రాజుయెహోవా జీవము తోడు నీ కుమారుని తల వెండ్రుకలలో ఒకటైనను నేల రాలకుండుననెను.
అపో. కార్యములు 27:34

11. అది విన్న ఆ స్త్రీ రాజును ఇలా వేడుకున్నది: “దయచేసి నీ దేవుడైన యెహోవాను ప్రార్థించు. హంతకులను శిక్షించాలని చూసే ఆ ప్రజలు నా కుమారునికి కీడుచేయకుండా దేవుడు నివారించగలందులకు ఆయనను ప్రార్థించు.” దావీదు ఆమెకు ఇలా అభయమిచ్చాడు:”యెహోవా జీవము తోడుగా ఎవ్వడూ నీ కుమారునికి హాని చేయలేడు. నీ కుమారుని తలలోని ఒక్క వెంట్రుక కూడా కింద రాలదు.”

12. అప్పుడు ఆ స్త్రీనా యేలినవాడవగు నీతో ఇంకొక మాటచెప్పుకొనుట నీ దాసినగు నాకు దయచేసి సెలవిమ్మని మనవిచేయగా రాజుచెప్పుమనెను.

12. ఆ స్త్రీ, “నా ప్రభువైన రాజా! నన్నింకా కొన్ని విషయాలు చెప్పనీయండి” అని అన్నది. చెప్పమన్నాడు రాజు.

13. అందుకు ఆ స్త్రీదేవుని జనులైనవారికి విరోధముగా నీ వెందుకు దీనిని తలపెట్టియున్నావు? రాజు ఆ మాట సెల విచ్చుటచేత తాను వెళ్లగొట్టిన తనవాని రానియ్యక తానే దోషియగుచున్నాడు.

13. ఆ స్త్రీ ఇలా అన్నది: “దేవుని ప్రజలకు వ్యతిరేకంగా ఇవన్నీ నీవెందుకు చేస్తున్నావు? అవును. ఇవన్నీ చేస్తూ నీవు దోషివని బహిర్గతం చేసుకుంటున్నావు! ఎందువల్లననగా నీవు నీయింటి నుండి పంపివేసిన నీ కుమారుని తిరిగి తీసుకొని రాలేదు.

14. మనమందరమును చనిపోదుము గదా, నేలను ఒలికినమీదట మరల ఎత్తలేని నీటివలె ఉన్నాము; దేవుడు ప్రాణముతీయక తోలివేయబడిన వాడు తనకు దూరస్థుడు కాకయుండుటకు సాధనములు కల్పించుచున్నాడు.

14. మనమంతా ఏదో ఒక రోజు చనిపోవటమనేది సత్యం. మనమంతా నేల మీద ఒలికిన నీరులాంటివారం. ఈ ఒలికిన నీటిని మట్టిలో నుండి తిరిగి తీయటం ఎవ్వరికీ సాధ్యం కాని పని. కాని దేవుడు ప్రాణాన్ని తీసుకొనడు. ఇండ్లనుండి తరిమి వేయబడిన వారికి దేవుడు ఒక పథకం తయారుచేసి ఉంచుతాడు. అంటే వారు ఆయన నుండి బలవంతంగా దూరం చేయబడలేదు!

15. జనులు నన్ను భయపెట్టిరి గనుక నేను దీనిని గూర్చి నా యేలినవాడవగు నీతో మాటలాడ వచ్చితిని. కాబట్టి నీ దాసురాలనగు నేనురాజు తన దాసినగు నా మనవి చొప్పున చేయు నేమో

15. నా ప్రభువైన రాజా! ఈ మాటలు నీకు చెప్పటానికి నేను వచ్చాను. కారణమేమంటే, ప్రజలు నన్ను భయపెట్టారు! నేను వాళ్లతో నన్ను పోయి రాజుతో మాట్లాడనీయమన్నాను. బహుశః రాజు నా విన్నపం ఆలకింపవచ్చునని అన్నాను.

16. రాజు నా మనవి అంగీకరించి దేవుని స్వాస్థ్యము అనుభవింపకుండ నన్నును నా కుమారునిని నాశనము చేయదలచిన వాని చేతిలోనుండి తన దాసినగు నన్ను విడిపించునేమో అనుకొంటిని.

16. రాజు వింటాడు. విని నన్ను, నా కుమారుణ్ణి చంపజూస్తున్న వారి నుండి రక్షణ కల్పిస్తాడనీ; దేవుడు ప్రసాదించిన ఆస్తిని అనుభవించకుండ చేయజూస్తున్న వారి నుంచి మమ్మల్ని రక్షిస్తాడనీ అనుకున్నాను.

17. మరియు నీ దేవుడైన యెహోవా నీకు తోడై యున్నాడు గనుక నా యేలినవాడవును రాజవునగు నీవు దేవుని దూతవంటివాడవై మంచి చెడ్డలన్నియు విచారింప చాలియున్నావు; కాబట్టి నీ దాసినగు నేను నా యేలినవాడగు రాజు సెలవిచ్చిన మాట సమాధానకర మగునని అనుకొంటిననెను.

17. నా ప్రభువైన నా రాజు మాటలు మనశ్శాంతినిస్తాయని నాకు తెలుసు. ఎందువల్లనంటే నీవు దేవుని నుండి వచ్చిన దూతలాంటివాడవు. ఏది మంచిదో, ఏది చెడ్డదో నీకు తెలుసు. దేవుడు సదా నీతో వుండు గాక!”

18. రాజునేను నిన్ను అడుగు సంగతి నీ వెంతమాత్రమును మరుగు చేయవద్దని ఆ స్త్రీతో అనగా ఆమెనా యేలినవాడవగు నీవు సెలవిమ్మనెను.

18. అది విని ఆశ్చర్యపడిన రాజైన దావీదు, “నేనొక ప్రశ్న అడుగుతాను. నీవు సమాధనం చెప్పాలి” అన్నాడు. ఆ స్త్రీ, “నా ప్రభువైన రాజా దయచేసి మీ ప్రశ్న అడగండి!” అన్నది.

19. అంతట రాజుయోవాబు నీకు బోధించెనా అని ఆమె నడిగినందుకు ఆమె యిట్లనెనునా యేలినవాడవైన రాజా, నీ ప్రాణముతోడు, చెప్పినదానిని తప్పక గ్రహించుటకు నా యేలిన వాడవును రాజవునగు నీవంటివాడొకడును లేడు; నీ సేవకుడగు యోవాబు నాకు బోధించి యీ మాటలన్నిటిని నీ దాసినగు నాకు నేర్పెను

19. “విషయాలన్నీ మాట్లాడమని యోవాబు నీతో చెప్పాడా?” అని రాజు అడిగాడు. ఆ స్త్రీ ఇలా అన్నది: “నీ ప్రమాణంగా, నా ప్రభువైన రాజా, నీవు నిజం చెప్పావు. నీ సేవకుడైన యోవాబు ఇవన్నీ చెప్పమని నాతో అన్నాడు.

20. సంగతిని రాజుతో మరుగు మాటలతో మనవి చేయుటకు నీ సేవకుడగు యోవాబు ఏర్పాటు చేసెను. ఈ లోకమందు సమస్తమును ఎరుగుటయందు నా యేలినవాడవగు నీవు దేవ దూతల జ్ఞానమువంటి జ్ఞానము గలవాడవు.

20. యోవాబు ఇలా ఎందుకు చేశాడంటే నీవు పరిస్థితులు నిష్పక్షపాతంగా, రాగ ద్వేషాలు లేకుండా అవగాహన చేసుకొని యుక్తమైన నిర్ణయం తీసుకుంటావని. నా ప్రభువా, నీవు దేవ దూతలా తెలివిగలవాడవు. ఈ భూమిమీద జరిగేదంతా నీకు తెలుసు.”

21. అప్పుడు రాజు యోవాబుతో ఈలాగున సెలవిచ్చెను. ఆలకించుము, నీవు మనవి చేసినదానిని నేను ఒప్పు కొనుచున్నాను.

21. రాజు యోవాబుతో ఇలా అన్నాడు: “చూడండి. నేను మాట ఇచ్చిన విధంగా చేస్తాను. యుకుడైన అబ్షాలోమును దయచేసి తీసుకొని రండి.”

22. తరువాత¸యౌవనుడగు అబ్షాలోమును రప్పింపుమని అతడు సెలవియ్యగా యోవాబు సాష్టాంగ నమస్కారము చేసి రాజును స్తుతించి రాజవగు నీవు నీ దాసుడనైన నా మనవి అంగీకరించినందున నా యేలిన వాడవగు నీవలన నేను అనుగ్రహము నొందితినని నాకు తెలిసెనని చెప్పి లేచి గెషూరునకు పోయి

22. యోవాబు తన ముఖం నేలనుతాకి సాష్టాంగపడి నమస్కరించాడు. రాజైన దావీదుకు ఆశీర్వచనం పలికి, “ఈ రోజు నాపట్ల మీరు ప్రసన్నులైయున్నారని నాకు తెలుసు! ఎందువల్లనంటే నేను అడిగినదంతా నీవు చేశావు!” అని అన్నాడు.

23. అబ్షాలోమును యెరూషలేమునకు తోడుకొని వచ్చెను.

23. యోవాబు లేచి గెషూరుకు వెళ్లి అబ్షాలోమును యెరూషలేముకు తీసుకొని వచ్చాడు.

24. అయితే రాజు అతడు నా దర్శనము చేయక తన ఇంటికి పోవలెనని ఉత్తరవు చేయగా అబ్షాలోము రాజదర్శనము చేయక తన ఇంటికి పోయెను.

24. అయితే దావీదు రాజు మాత్రం, “అబ్షాలోము తప్పక తన స్వంత ఇంటికి వెళ్లిపోవాలి. అతడు నన్ను చూడటానికి రూకూడదు” అని అన్నాడు. కావున అబ్షాలోము తన స్వంత ఇంటికి వెళ్లిపోయాడు. అబ్షాలోము రాజును చూడటానికి వెళ్లలేక పోయాడు.

25. ఇశ్రాయేలీయులందరిలో అబ్షాలోమంత సౌందర్యము గలవాడు ఒకడును లేడు; అరికాలు మొదలుకొని తలవరకు ఏ లోపమును అతనియందు లేకపోయెను.

25. అబ్షాలోము అందంలో అందరి ప్రశంసలూ పొందిన వాడు. అబ్షాలోమంత అందగాడు ఇశ్రాయేలంతటిలో మరొకడు లేడు. అరికాలు నుండి నడినెత్తివరకు అతనిలో రవ్వంత కూడా లోపం లేదు.

26. తన తల వెండ్రుకలు భారముగా నున్నందున ఏటేట అతడు వాటిని కత్తిరించుచు వచ్చెను; కత్తిరించునప్పుడెల్ల వాటి యెత్తు రాజు తూనికనుబట్టి రెండువందల తులములాయెను.

26. ప్రతి సంవత్సరాంతానా అబ్షాలోము తన తల వెండ్రుకలు కత్తిరించి తూచేవాడు. తూకం ప్రకారం రెండు వందల తులముల బరువు ఉండేవి.

27. అబ్షాలోమునకు ముగ్గురు కుమారులును తామారు అనునొక కుమార్తెయు పుట్టిరి; ఆమె బహు సౌందర్యవతి.

27. అబ్షాలోముకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. కుమార్తె పేరు తామారు. తామారు సౌందర్యవతి.

28. అబ్షాలోము రెండు నిండు సంవత్సరములు యెరూషలే ములోనుండియు రాజదర్శనము చేయక యుండగా

28. అబ్షాలోము యెరూషలేములో రెండు సంవత్సరాలున్నాడు. అయినా అతనికి రాజదర్శనం నిరాకరింపబడింది.

29. యోవాబును రాజునొద్దకు పంపించుటకై అబ్షాలోము అతనిని పిలువనంపినప్పుడు యోవాబు రానొల్లక యుండెను. రెండవమారు అతని పిలువ నంపినప్పుడు అతడు రానొల్లక పోగా

29. యోవాబు వద్దకు అబ్షాలోము దూతలను పంపాడు. ఈ దూతలు అబ్షాలోమును రాజు వద్దకు పంపమని అడిగారు. కాని యోవాబు అబ్షాలోము వద్దకు రాకపోయెను. రెండవసారి మరొక దూతను అబ్షాలోము పంపాడు. అయినా యోవాబు రావటానికి నిరాకరించాడు.

30. అబ్షాలోము తన పనివారిని పిలిచియోవాబు పొలము నా పొలముదగ్గర నున్నది గదా, దానిలో యవల చేలు ఉన్నవి; మీరు పోయి వాటిని తగులబెట్టుడని వారితో చెప్పెను. అబ్షాలోము పనివారు ఆ చేలు తగుల బెట్టగా

30. దానితో అబ్షాలోము తన సేవకులను పిలిచి ఇలా అన్నాడు: “చూడండి; యోవాబు పొలం నా పొలానికి పక్కనే వున్నది. తన పొలంలో యవల ధాన్యం పండివుంది. వెళ్లి ఆ యవలధాన్యాన్ని తగుల బెట్టండి.” ఆ మాట మీద అబ్షాలోము సేవకులు వెళ్లి యోవాబు పొలంలో పంటకు నిప్పుపెట్టారు.

31. యావాబు చూచి లేచి అబ్షాలోము ఇంటికి వచ్చినీ పనివారు నా చేలు తగులబెట్టిరేమని అడుగగా

31. యోవాబు లేచి అబ్షాలోము ఇంటికి వెళ్లి, “నీ సేవకులు నా పంటను ఎందుకు తగులబెట్టారు” అని అడిగాడు.

32. అబ్షాలోము యోవాబుతో ఇట్లనెనుగెషూరునుండి నేను వచ్చిన ఫలమేమి? నేనచ్చటనే యుండుట మేలని నీద్వారా రాజుతో చెప్పుకొనుటకై రాజునొద్దకు నిన్ను పంపవలెనని నేను నిన్ను పిలిచితిని; రాజదర్శనము నేను చేయవలెను; నాయందు దోషము కనబడినయెడల రాజు నాకు మరణశిక్ష విధింపవచ్చును.

32. యోవాబుతో అబ్షాలోము ఇలా అన్నాడు: “నీకు నేను వర్తమానం పంపాను. ఇక్కడికి నిన్ను రమ్మన్నాను. నేను నిన్ను రాజు వద్దకు పంపాలని అనుకున్నాను గెషూరు నుండి నన్ను ఆయన ఎందుకు రప్పించాడో నిన్ను పంపి అడిగించాలనుకున్నాను. నేను ఆయనను చూడలేను. కావున ఈ పరిస్థితుల్లో నేను గెషూరుకు పోయి అక్కడవుండటం మంచిది! ఇప్పుడు నాకు రాజదర్శనం ఏర్పాటు చేయుము. నేను పాపం చేస్తే ఆయన నన్ను చంపవచ్చు!”

33. అంతట యోవాబు రాజునొద్దకు వచ్చి ఆ సమాచారము తెలుపగా, రాజు అబ్షాలోమును పిలువనంపించెను. అతడు రాజునొద్దకు వచ్చి రాజసన్నిధిని సాష్టాంగ నమస్కారము చేయగా రాజు అబ్షాలోమును ముద్దుపెట్టుకొనెను.

33. అప్పుడు యోవాబు రాజు వద్దకు వచ్చి అబ్షాలోము అన్న మాటలన్నీ చెప్పాడు. రాజు అబ్షాలోమును పిలిపించగా, అబ్షాలోము వచ్చాడు. అబ్షాలోము రాజు ముందు సాష్టాంగపడి నమస్కరించాడు. అప్పుడు రాజు అబ్షాలోమును ముద్దు పెట్టుకున్నాడు.Shortcut Links
2 సమూయేలు - 2 Samuel : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |