యోబు అసమర్థతను కూడా దేవుడు చూపిస్తున్నాడు (వ 16,20,22,31,32,34). యోబుకు తెలివి లేకపోవడమే గాక దేవుడు చేసే అత్యల్పమైన పనిని చేయడం కూడా యోబు చేత కాదని అతడు తెలుసుకోవాలని కోరుతున్నాడు దేవుడు. యోబు చేసిన ఫిర్యాదులు సర్వజ్ఞానం, అమిత బలప్రభావాలు గల సృష్టికర్త, విశ్వాన్ని ఏలే సర్వాధికారి అయివున్న వానికి విరుద్ధంగా చేసినవి యోబు గ్రహించాలి. తన జ్ఞానాన్నీ బల ప్రభావాలనూ తన మార్గాలనూ ప్రశ్నించే ప్రతి వ్యక్తి బుద్ధిహీనతను కూడా ఈ అధ్యాయంలో దేవుడు బయట పెడుతున్నాడు. ఏమీ తెలియని మూర్ఖులూ ఏదీ చెయ్యలేని అసమర్థులూ దేవుని పనులన్నీ విమర్శించడానికి తెగించేవారు ఎంతమంది లేరు? అతి వైభవంగా కనిపిస్తున్న ఈ విశ్వాన్ని చూస్తూ కూడా దేవుని ఉనికినే కాదనే వారెంతమంది లేరు? నాస్తికులు ప్రదర్శించే అహంకారంతో కూడిన అజ్ఞానం ఎంత భయంకరమైనది! ప్రతి వ్యక్తీ నోటిమీద చెయ్యి వేసుకుని తన అజ్ఞానాన్ని ఒప్పుకోవలసిన ప్రశ్నలను దేవుడిక్కడ అడుగుతున్నాడు. ప్రకృతి మనకు వినయాన్ని నేర్పించాలి. అయ్యో! ఈ సృష్టి రహస్యాల్లో చాలా చిన్న భాగాన్ని గ్రహించి ఎంతమంది గర్వించి తమ తెలివితేటలను మించినది లేదని విర్రవీగుతున్నారో గదా.