Isaiah - యెషయా 2 | View All

1. యూదాను గూర్చియు యెరూషలేమును గూర్చియు ఆమోజు కుమారుడైన యెషయాకు దర్శనమువలన కలిగిన దేవోక్తి

ఈ భాగాన్నీ, యెషయా గ్రంథంలోని మరి కొన్ని భాగాలనూ (అంటే యెషయా 9:7; యెషయా 11:1-16; యెషయా 12:1-6; యెషయా 24:21-23; యెషయా 32:1-5; యెషయా 35:1-10; యెషయా 40:1-11; యెషయా 54:1-17; యెషయా 60:1-22; యెషయా 62:1-12; యెషయా 65:8-10, యెషయా 65:17-25; యెషయా 66:7-13, యెషయా 66:19-21) ఈ క్రింద చెప్పిన పద్ధతుల్లో ఒక పద్ధతిని అనుసరించి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి – (1) ఇంతకుముందు గానీ ఇకమీదట గానీ ఇవి నెరవేరడం జరగలేదు, జరగదు; (2) ఇస్రాయేల్ గత చరిత్రలో ఇవి నెరవేరాయి; (3) ప్రస్తుతం ఈ క్రైస్తవ సంఘ యుగంలో ఇవి కనీసం కొంతవరకైనా నెరవేరుతున్నాయి; వీటి నెరవేర్పు రాబోయే అనంత యుగాల్లో పూర్తి అవుతుంది; (4) ఈ లోకాంతం తరువాత అనంత యుగాల్లోనే ఇవి నెరవేరుతాయి; (5) భూమి పైన క్రీస్తు అక్షరాలా రాజ్య పరిపాలన సమయంలో ఇవి కనీసం కొంతవరకైనా నెరవేరుతాయి (వెయ్యేళ్ళ పరిపాలన – ప్రకటన గ్రంథం 20:4-6 చూడండి); (6) ఆత్మ సంబంధంగా ఈ సంఘ యుగంలో కొంతవరకు ఇవి నెరవేరుతున్నాయి; అక్షరార్థంగా ఇవి వెయ్యేళ్ళ పరిపాలన సమయంలో నెరవేరుతాయి; ఆ తరువాత రాబోయే అనంత యుగాల్లో వీటి శాశ్వత నెరవేర్పు ఉంటుంది (యెషయా 60:1-22 నోట్ చూడండి). యెషయా దేవుని ఆత్మావేశంతో రాస్తున్నాడు కాబట్టి మొదటి పద్ధతి (1) పనికి రాదు. ఎన్నడూ జరగబోని సంగతులు జరుగుతాయని దేవుడు చెప్పేవాడు కాడు, రాయించేవాడు కాడు మత్తయి 5:17-18; తీతుకు 1:2). రెండో పద్ధతి (2) చాలా సందేహాస్పదమైనది. దాన్ని నిలబెట్టాలంటే మాటల స్పష్టమైన అర్థాలను విడిచిపెట్టాలి. ఈ సంగతులు ఇస్రాయేల్ చరిత్రలో ఎన్నడూ నెరవేరలేదు. మూడో పద్ధతి (3) సరైనదని అనేకమంది పండితులు చెప్పారు, కానీ ఈ నోట్స్ రచయిత అభిప్రాయం ఏమంటే దాన్ని నిలబెట్టాలంటే ఈ భవిష్యత్ వాక్కుల్లోని కొన్ని వివరాలను చూచీ చూడనట్టుగా దాటిపోవాలి, కొన్ని స్పష్టమైన మాటలను విడిచిపెట్టాలి. నాలుగో పద్ధతిని (4) కూడా నిలబెట్టడం కష్టతరం. ఈ వాక్కుల్లోని కొన్ని సంగతులు అనంత యుగాల్లో ఉంటాయని అనుకోవడం వీలుపడదు. చివరి రెండు పద్ధతులు (5,6) సరైనవని అనుకోవడానికి ఎక్కువ అవకాశం ఉందని ఈ రచయిత అభిప్రాయం. ఈ వాక్కుల్లో కొన్ని సంగతులు అక్షరాలా వెయ్యేళ్ళ పరిపాలనలకు సరిపోతాయి గానీ మరే కాలానికీ యుగానికీ కాదని అతని గట్టి నమ్మకం. “చూచిన విషయం”– యెషయా 1:1; యెషయా 6:1 లో లాగా ఈ సంగతులను దేవుడు యెషయాకు వెల్లడి చేశాడు గనుక అతడు చూశాడు. ప్రవక్తల గ్రంథాల్లో తరచుగా దేవుడు కలలనూ దర్శనాలనూ చూపిస్తూ వివరాలను ఇవ్వడం కనిపిస్తున్నది (ఉదా।। యిర్మియా 1:11-16; యిర్మియా 24:1-10; యెహెఙ్కేలు 1:1; యెహెఙ్కేలు 10:1; దానియేలు 7:1; దానియేలు 8:1; జెకర్యా 1:8; జెకర్యా 3:1; జెకర్యా 5:1). తరువాతి వచనాల్లో (2-4) కేవలం దేవుడిచ్చిన భవిష్యద్వాక్కులే ఉన్నాయి. ఈ వచనాలు యెషయా గ్రంథంలో ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని గురించి చెప్తున్నాయి – దేవుని రాజ్యాన్ని సంపూర్ణంగా స్థాపించడం. 2-4 వచనాల్లో దాని స్థాపనం కనిపిస్తున్నది, 6-21 వచనాల్లో అందుకు దారి తీసిన పరిస్థితులను చూడవచ్చు. ఈ వచనాలు యూదా దేశానికీ జెరుసలం నగరానికీ సంబంధించినవని గమనించండి. అంతేగాక వీటిని అక్షరార్థంగా తీసుకోకూడదు అనే సూచన కూడా ఏమీ లేదు.

2. అంత్యదినములలో పర్వతములపైన యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటె ఎత్తుగా ఎత్తబడును ప్రవాహము వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చెదరు

వ 2-4 కొద్ది మార్పులతో మీకా 4:1-3 లో ఉన్నాయి. “చివరి రోజులు”– ఈ మాటలకు అర్థం అస్పష్టం. “ఎప్పుడో, రాబోయే భవిష్యత్తులో” అని దీనికి మామూలుగా అర్థం చెప్పుకోవచ్చు. బైబిల్లో ఒక్కోసారి ఈ మాటకు ఈ సంఘ యుగం అని అర్థం వస్తుంది (అపో. కార్యములు 2:17; హెబ్రీయులకు 1:2; 1 పేతురు 1:20; 1 యోహాను 2:18 పోల్చి చూడండి). ఈ మాటను ఈ విధంగా ఉపయోగించినప్పుడు వచ్చే అర్థమేమిటంటే యేసుప్రభువు పరలోకం నుండి తిరిగి రాకముందు సంఘ యుగమే ఆఖరుది. క్రీస్తు తిరిగి రావడం, తద్వారా కలిగే ఫలితాలు ఇవన్నీ చివరి రోజుల్లో ఇమిడి ఉండవచ్చు. చివరి రోజుల అంతంలో ఆయన రాకడ ఉంటుంది. ఇక్కడ యెషయా గ్రంథంలోని ఈ మాటలను “దినాల అంతంలో” అని అనువదించవచ్చు. “పర్వతం”– అంటే సీయోను పర్వతం (యెషయా 11:9; యెషయా 27:13; యెషయా 56:7; యెషయా 57:13; యెషయా 65:25; యెషయా 66:20). ఇది జెరుసలం నగరాన్ని సూచిస్తున్నది (వ 3). “ప్రధానమైనదిగా”– ఈ ప్రవచనాన్ని మనం ఏ మాత్రం అక్షరార్థంగా తీసుకుంటే ఇది నెరవేరే రోజుల్లో జెరుసలం, ఇస్రాయేల్‌దేశం ప్రపంచంలో రాజకీయంగా లేక అధికార సంబంధంగా ఉన్నత స్థితిలో ఉంటుందని అర్థం చేసుకోవలసి ఉంది. “అన్ని దేశాలు”– కీర్తనల గ్రంథము 102:15; కీర్తనల గ్రంథము 117:1; యిర్మియా 3:17; యిర్మియా 16:19; జెకర్యా 14:16; ప్రకటన గ్రంథం 21:26. వారంతా అక్కడికి వెళ్ళడానికి కారణం తరువాతి వచనంలో ఉంది.

3. ఆ కాలమున సీయోనులోనుండి ధర్మశాస్త్రము యెరూషలేములోనుండి యెహోవా వాక్కు బయలు వెళ్లును. జనములు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు యెహోవా పర్వతమునకు మనము వెళ్లుదము రండి ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును మనము ఆయన త్రోవలలో నడుతము అని చెప్పుకొందురు.
యోహాను 4:22

చిట్టచివరికి ప్రపంచ దేశాలన్నీ ఇస్రాయేల్‌వారి దేవుడే ఏకైక నిజ దేవుడని తెలుసుకుని ఆయన మార్గాలను నేర్చుకోగోరతారు. దేవుడు ఉపదేశకుడుగా ఈ రిఫరెన్సులు చూడండి: కీర్తనల గ్రంథము 25:4; కీర్తనల గ్రంథము 71:17; కీర్తనల గ్రంథము 94:10, కీర్తనల గ్రంథము 94:12; కీర్తనల గ్రంథము 119:102; యెషయా 54:13; మత్తయి 5:2; మార్కు 6:34; యోహాను 6:45; యోహాను 14:26. “యాకోబు యొక్క దేవుడు” గురించి నోట్ కీర్తనల గ్రంథము 146:5.

4. ఆయన మధ్యవర్తియై అన్యజనులకు న్యాయము తీర్చును అనేక జనములకు తీర్పుతీర్చును వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను తమ యీటెలను మచ్చుకత్తులుగాను సాగగొట్టుదురు జనముమీదికి జనము ఖడ్గమెత్తక యుండును యుద్ధముచేయ నేర్చుకొనుట ఇక మానివేయును.
యోహాను 16:8-11, అపో. కార్యములు 17:31, ప్రకటన గ్రంథం 19:11

“న్యాయం తీరుస్తాడు”– యెషయా 11:4; కీర్తనల గ్రంథము 96:13; కీర్తనల గ్రంథము 98:9. దేవుడు తానే ప్రపంచ దేశాలకు న్యాయమూర్తిగా ఉన్నప్పుడు లోపరహితమైన న్యాయం నెలకొని ఉంటుంది. ఈ సంపూర్ణ న్యాయానికి ఫలితం ప్రపంచ శాంతి (యెషయా 32:17).

5. యాకోబు వంశస్థులారా, రండి మనము యెహోవా వెలుగులో నడుచుకొందము.
1,Joh,1,7

6. యాకోబు వంశమగు ఈ జనము తూర్పున నుండిన జనుల సంప్రదాయములతో నిండుకొనియున్నారు వారు ఫిలిష్తీయులవలెమంత్ర ప్రయోగము చేయుదురు అన్యులతో సహవాసము చేయుదురు గనుక నీవు వారిని విసర్జించి యున్నావు.

7. వారి దేశము వెండి బంగారములతో నిండియున్నది వారి ఆస్తి సంపాద్యమునకు మితిలేదు వారి దేశము గుఱ్ఱములతో నిండియున్నది వారి రథములకు మితిలేదు.

8. వారి దేశము విగ్రహములతో నిండియున్నది వారు తమ చేతిపనికి తాము వ్రేళ్లతో చేసిన దానికి నమస్కారము చేయుదురు

9. అల్పులు అణగద్రొక్కబడుదురు ఘనులు తగ్గింప బడు దురు కాబట్టి వారిని క్షమింపకుము.

ఏకైక నిజ దేవునికి విగ్రహపూజ అసహ్యం. దీని మూలంగా మనుషులు హీనస్థితికి దిగజారి వారి పాపాలలో నశించిపోతారు (వ 20,21; యెషయా 13:11; యెషయా 45:16; లేవీయకాండము 26:30; యిర్మియా 7:5-6; యెహెఙ్కేలు 6:4; 1 కోరింథీయులకు 6:9; ప్రకటన గ్రంథం 21:8; ప్రకటన గ్రంథం 22:15).

10. యెహోవా భీకరసన్నిధినుండియు ఆయన ప్రభావ మహాత్మ్యమునుండియు బండ బీటలోనికి దూరుము మంటిలో దాగి యుండుము.
ప్రకటన గ్రంథం 6:15, 2 థెస్సలొనీకయులకు 1:9

ఈ వచనాలన్నీ 12వ వచనంలో చెప్పినట్టుగా ఒక “రోజు”కు సంబంధించినవి. ఈ “రోజు” అంటే యెహోవా నియమించిన ఒక కాలం. ఆ కాలంలో జరిగే సంఘటనల వర్ణనను బట్టి చూస్తే ఇది “ప్రభువు దినం” లేక “యెహోవా దినం” అని అర్థమౌతున్నది. ఈ దినం గురించి యెషయా 13:6-13; యోవేలు 1:15; 1 థెస్సలొనీకయులకు 5:2; 2 పేతురు 3:10; ప్రకటన గ్రంథం 6:15-17 చూడండి. వ 19,21; ప్రకటన గ్రంథం 6:15, ప్రకటన గ్రంథం 6:17. దేవుడు తన వైభవంతో లేచి ప్రపంచానికి తీర్పు తీర్చేటప్పుడు పాపాత్ములైన మనుషులకు ఏ దిక్కూ ఉండదు.

11. నరుల అహంకారదృష్టి తగ్గింపబడును మనుష్యుల గర్వము అణగద్రొక్కబడును ఆ దినమున యెహోవా మాత్రమే ఘనత వహించును.
2 థెస్సలొనీకయులకు 1:9

అహంకారం, లేదా ఇలాంటి అర్థాన్నే ఇచ్చే పదాలు ఈ వచనాల్లో 8 సార్లు కనిపిస్తున్నాయి. మనిషికుండే గర్వం దేవునికి అసహ్యకరం (సామెతలు 6:16-17; సామెతలు 21:4; కీర్తనల గ్రంథము 18:27; కీర్తనల గ్రంథము 101:5; యాకోబు 4:6). దాన్ని భూమిమీద లేకుండా తుడిచి పెట్టెయ్యాలని దేవుని దృఢ సంకల్పం. యెహోవా దినం ముఖ్యంగా గర్విష్ఠుల మదం అణిగిస్తుంది. వారు గర్వపడే వాటన్నిటినీ నాశనం చేసేస్తుంది.

12. అహంకారాతిశయముగల ప్రతిదానికిని ఔన్నత్యము గల ప్రతిదానికిని విమర్శించు దినమొకటి సైన్యములకధిపతియగు యెహోవా నియమించియున్నాడు అవి అణగద్రొక్కబడును.

13. ఔన్నత్యము కలిగి అతిశయించు లెబానోను దేవదారు వృక్షములకన్నిటికిని బాషాను సిందూర వృక్షములకన్నిటికిని

14. ఉన్నతపర్వతములకన్నిటికిని ఎత్తయిన మెట్లకన్నిటికిని

15. ఉన్నతమైన ప్రతిగోపురమునకును బురుజులుగల ప్రతి కోటకును

16. తర్షీషు ఓడలకన్నిటికిని రమ్యమైన విచిత్ర వస్తువుల కన్నిటికిని ఆ దినము నియమింపబడియున్నది.

17. అప్పుడు నరుల అహంకారము అణగద్రొక్కబడును మనుష్యుల గర్వము తగ్గింపబడును ఆ దినమున యెహోవామాత్రమే ఘనత వహించును.

18. విగ్రహములు బొత్తిగా నశించిపోవును.

నిజ దేవుణ్ణి, ఆయన వాక్కును మనిషి తన అహంకారం కొద్దీ ఎదిరించినందువల్లే విగ్రహాలు ఉనికిలోకి వచ్చాయి. మనిషిలోని గర్వం అణిగి, లేకుండా పోయినప్పుడు విగ్రహాలు ఉండవు.

19. యెహోవా భూమిని గజగజ వణకింప లేచునప్పుడు ఆయన భీకర సన్నిధినుండియు ఆయన ప్రభావ మాహాత్మ్యమునుండియు మనుష్యులు కొండల గుహలలో దూరుదురు నేల బొరియలలో దూరుదురు.
2 థెస్సలొనీకయులకు 1:9

ఈ యుగాంతంలో దేవుడు భూమినంతటినీ వణికిస్తాడు – (యెషయా 24:19-20; హెబ్రీయులకు 12:26-29; ప్రకటన గ్రంథం 6:14; ప్రకటన గ్రంథం 16:17-20).

20. ఆ దినమున యెహోవా భూమిని గజగజ వణకింప లేచునప్పుడు ఆయన భీకర సన్నిధినుండియు ఆయన ప్రభావ మాహాత్మ్యమునుండియు కొండల గుహలలోను బండబీటలలోను

తమ విగ్రహాలెంత పనికిమాలినవో చిట్టచివరకు మనుషులు గ్రహిస్తారు. నిజ దేవుని విశ్వాసులకు అంతకు ముందునుంచీ తెలిసి ఉన్న సత్యాన్ని వారూ గుర్తిస్తారు – కీర్తనల గ్రంథము 115:2-8.

21. దూరవలెనన్న ఆశతో నరులు తాము పూజించుటకై చేయించుకొనిన వెండి విగ్రహములను సువర్ణ విగ్రహ ములను ఎలుకలకును గబ్బిలములకును పారవేయుదురు.
2 థెస్సలొనీకయులకు 1:9

గర్విష్ఠులు, అహంభావులు దేవుణ్ణి ఎదిరించడం మానుకుని, ఆయన కోపానికి తాళలేక దాక్కొనే చోట్లు వెతుక్కుంటూ పరుగులెత్తే కాలం ఒకటి రాబోతుంది.

22. తన నాసికారంధ్రములలో ప్రాణముకలిగిన నరుని లక్ష్యపెట్టకుము; వానిని ఏవిషయములో ఎన్నిక చేయవచ్చును?

పై సత్యాన్ని బట్టి ఆలోచిస్తే మనుషుల్లో అక్కడక్కడా నమ్మకమైన వ్యక్తులు ఉన్నప్పటికీ అసలు మనిషి అనేవాడిపై నమ్మకం పెట్టుకోవడం వెర్రితనం అని తెలుస్తున్నది (కీర్తనల గ్రంథము 118:8; కీర్తనల గ్రంథము 146:3; యిర్మియా 17:5). యెషయా 1వ అధ్యాయం; యెషయా 2:6-9 వచనాలు మానవజాతి ఎలాంటిదో తెలియజేస్తున్నాయి. యెషయా 2:10-21 లో మానవాళికి ఏ గతి పట్టనున్నదో తెలుస్తున్నది. అలాంటప్పుడు మనుషుల్ని నమ్ముకోవచ్చా? ముమ్మాటికీ అది తగదు.Shortcut Links
యెషయా - Isaiah : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |